● శాస్త్రోక్తంగా పంచాంగశ్రవణం ● వచ్చేనెల 8న వార్షిక కల్యాణోత్సవం ● ఆస్థానమండపం వరకు వచ్చిన సూర్యకిరణాలు
సింహాచలం : ఉగాది పర్వదిన వేళ సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి పెళ్లిరాట మహోత్సవాన్ని ఆదివారం కనులపండువగా నిర్వహించారు. వచ్చే నెల 8న స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని భక్తజన సందోహం మధ్య మధ్యాహ్నం 3.30 గంటల నుంచి పెళ్లి రాట కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని పెళ్లికుమారుడుగా అలంకరించి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో సహా ఆలయ ఆస్థాన మండపంలో వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, షోడశోపచార పూజలు నిర్వహించారు. తొలుత దేవస్థానం పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు పంచాగ పఠనం చేశారు. అనంతరం వార్షిక కల్యాణోత్సవం జరిగే ఉత్తరరాజగోపురం ఎదుట ప్రాంగణంలోను పెళ్లిరాటను శాస్త్రోక్తంగా వేశారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, దేవస్థానం పంచాంగ రచయిత తెన్నేటి శ్రీనివాసశర్మ, అర్చకులు, వేదపండితులు, పారాయణదారులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. దేవస్థానం ఈవో కె.సుబ్బారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అప్పన్న ఆదాయం–5, వ్యయం–2
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి ఆదాయం 5, వ్యయం 2గా పంచాంగం ప్రకారం ఆలయ పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు పేర్కొన్నారు. స్వాతి నక్షత్రం, తులారాశి వాడైన రశ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామివారికి విశ్వావసు నామ సంవత్సరంలో వ్యయం కంటే ఆదాయమే అధికమని పేర్కొన్నారు.
ఆస్థానమండపం వరకు సూర్యకిరణాలు
స్వామి మూలవిరాట్‌పై పడే సూర్యకిరణాలను చూసేందుకు వచ్చిన భక్తులకు ఈసారి నిరాశే ఎదురైంది. ఈఏడాది ఆస్థానమండపం వరకు సూర్యకిరణాలు వచ్చాయి. కానీ అప్పటికే ఉన్న భక్తులను నియంత్రించడంలో సిబ్బంది విఫలమవడం, వెంటనే మబ్బులు వచ్చేయడంతో మూలవిరాట్‌పై సూర్యకిరణాలను చూసే భాగ్యానికి భక్తులు నోచుకోలేదు.
నేత్రపర్వం అప్పన్న పెళ్లిరాట ఉత్సవం


