పీడీఎఫ్ కమిటీ అభిప్రాయ సేకరణ
చింతూరు: పోలవరం ముంపులో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో చేర్చిన చింతూరు గ్రామానికి చెందిన నిర్వాసితులు ఏ ప్రాంతాన్ని కోరుకుంటున్నారనే దానిపై పీడీఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో 21 క్లస్టర్లకు చెందిన 1,258 మంది గిరిజనేతర నిర్వాసితుల అభిప్రాయాన్ని సేకరించారు. అభిప్రాయ సేకరణ వివరాలను శనివారం స్థానిక సాపిడ్ సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు వెల్లడించారు. వీరిలో 901 మంది తూర్పు గోదావరి జిల్లా గోకవరం సమీపంలోని కృష్ణునిపాలెం ప్రాంతంలో తమకు పునరావాసం కల్పించాలంటూ అభిప్రాయం వ్యక్తం చేయగా, 351 మంది ఏలూరు జిల్లా తాడువాయి వెళ్లేందుకు సుముఖత వ్యక్తంచేశారు. అభిప్రాయ సేకరణ వివరాలను పోలవరం ఆర్‌అండ్‌ఆర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయా ప్రాంతాల్లో పునరావాసం కల్పించేలా చర్యలు చేపట్టాలని పీడీఎఫ్ కమిటీ సభ్యులు తీర్మానించారు. దీంతోపాటు ఆర్‌అండ్‌ఆర్ సొమ్ములు పెంచడంతో పాటు పునరావాస కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించేలా అధికారులకు విజ్ఞప్తి చేయాలని వారు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బొజ్జా పోతురాజు, పయ్యాల నాగేశ్వరరావు, అహ్మద్‌అలీ, గంగాధరప్రసాద్, ఆసిఫ్, రంజాన్, యాసీన్, జీవన్, ఈశ్వరాచారి, సుభానీ, రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు.


