ఏకలవ్యుడు... ప్రత్యక్షంగా గురువు ద్వారా నేర్చుకునే అవకాశం లేకపోవడంతో ప్రతిమ ముందు సాధన చేసి ఎదురులేని విలుకాడుగా నిలిచిన ఆదివాసీ బిడ్డ. ఆ పేరుతో ఏర్పాటు చేసిన పాఠశాలల్లో విద్యార్థులు కూడా గురువులు లేకుండానే గొప్పవాళ్లు కావాలని ప్రభుత్వం భావిస్తోందో ఏమో గాని విద్యా సంవత్సరం పూర్తవుతున్నా ఉపాధ్యాయులను నియమించలేదు. పలు పాఠశాలల్లో కొన్ని సబ్జెక్టులను బోధించకుండానే విద్యార్థులు పరీక్షలు రాయవలసి వస్తోంది. దీంతో ఎన్నో ఆశలతో ఈ పాఠశాలల్లో చేరిన గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పెదబయలు: జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలోని మండలాల్లో ఈ పాఠశాలలున్నాయి. గత ఏడాది ఇతర ప్రాంతాల నుంచి కొంత మంది ఉపాధ్యాయులను ఇక్కడ నియమించినా పూర్తిస్థాయిలో నియామకాలు చేపట్టలేదు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని పాడేరు, జి.మాడుగుల, కొయ్యూరు, చింతపల్లి, జీకే వీధి, అరకులోయ, పెదబయలు, హుకుంపేట, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాలకు సంబంధించి 11 ఏకలవ్య పాఠశాలలున్నాయి. ముంచంగిపుట్టు, జీకే వీధి, డుంబ్రిగుడ, చింతపల్లి మండలాల్లో పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసి ఇంటర్మీడియెట్ వరకూ నిర్వహిస్తుండగా, మిగతా మండలాల్లో ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకూ నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో 21 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో పెదబయలు మండలంలో ఆరు, ముంచంగిపుట్టు మండలంలో మూడు, ఇతర మండలాల్లో మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ గెస్ట్ టీచర్లను నియమించేందుకు గత ఏడాది అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో సుమారు 900 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 14న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరిపారు. అనంతరం మెరిట్ లిస్ట్ కూడా పెట్టి పోస్టులు భర్తీ చేయకుండా వదిలేశారు. దీంతో చాలా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో పలు సబ్జెక్టుల్లో బోధన జరగడం లేదు. ఉపాధ్యాయులు లేని సబ్జెక్టులను పాఠశాలల్లో ఇతర ఉపాధ్యాయులు అదనంగా తీసుకుని బోధిస్తున్నారు. దీంతో అరకొరగా బోధన జరుగుతోంది. కొన్ని పాఠశాలల్లో ఆయా సబ్జెక్టులను అసలు బోధించలేదు. పెదబయలు ఏకలవ్య పాఠశాలలో ఆరు టీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.తెలుగు, కంప్యూటర్, బయాలజీ, ఇంగ్లిష్ బోధించేందుకు టీచర్లు లేరు. ముంచంగిపుట్టు ఏకలవ్య పాఠశాలలో తెలు గు సబ్జెక్టులో రెండు (టీజీటీ –1, పీజీటీ–1) పోస్టులు, ఒక బయాలజీ (పీజీటీ)పోస్టు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం, కలెక్టర్,ఐటీడీఏ పీవో స్పందించి పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. మరో వైపు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఎన్నికల కోడ్ వల్ల భర్తీలో జాప్యం
పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో 11 ఈఎంఆర్‌ఎస్‌లకు సంబంధించి 21 ఉపా ధ్యాయ ఖాళీల భర్తీని ఎన్నికల కోడ్ వల్ల నిలిపివేయవలసి వచ్చింది. కోడ్ ముగిసిన తరువాత కలెక్టర్, ఐటీడీఏ పీవోలకు మళ్లీ మెరిట్ లిస్టు అందజేశాం. ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే పోస్టులు భర్తీ చేస్తాం.
–మూర్తి, గురుకుల నోడల్ ప్రిన్సిపాల్, పాడేరు.
పెదబయలు ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల


