సిబ్బంది చేతివాటం ?
ఫేక్ ఇన్‌వాయిస్‌లు సృష్టిస్తున్న కొందరు నకిలీ వ్యాపారులకు కేంద్ర, రాష్ట్ర జీఎస్‌టీ కార్యాలయాల్లోని కొందరు దిగువ స్థాయి సిబ్బంది సహకారం అందుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫేక్ ఇన్‌వాయిస్‌లను పక్కాగా ఎలా తయారు చేయాలి..? వాటిని ఏ సమయంలో సమర్పిస్తే.. ఎవరికీ అనుమానం రాకుండా పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ జరగదు.. ఎలా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని సొంతం చేసుకోవచ్చు.. ఇలా.. సమగ్ర వివరాలతో స్కెచ్ వేస్తూ.. సక్రమంగా అమలయ్యేటట్లుగా ప్లాన్ చేస్తున్నారు. ఫైల్స్ తమ దగ్గర నుంచే వెళ్లేలా చూస్కోని ఎవరికీ అనుమానం రాకుండా ఇన్‌పుట్‌ని కొట్టేస్తూ.. చెరిసగం పంచేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సాక్షి, విశాఖపట్నం : నకిలీ ఇన్‌వాయిస్‌ల పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఫేక్ కంపెనీల పేరుతో పన్నుల చెల్లింపును ఎగవేసేలా వ్యూహాల్ని అమలు పరుస్తున్నారు. కొన్ని కంపెనీలు చిన్న చిన్న తప్పులతో దొరికిపోతుంటే.. చాలా మంది వ్యాపారులు మాత్రం దర్జాగా ఇన్‌పుట్ క్రెడిట్‌ని తమ ఖాతాల్లోకి జమ చేసుకుంటున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటిలిజెన్స్(డీజీజీఐ) విశాఖపట్నం జోనల్ యూనిట్ పరిధిలో దాదాపు 380కి పైగా నకిలీ కంపెనీల గుట్టు రట్టు చేసి రూ.300 కోట్లుకు పైగానే రికవరీ చేశారు. అయినా ఫేక్ కంపెనీలు నకిలీ ఇన్‌వాయిస్‌లతో రెచ్చిపోతున్నాయి.
ఖజానాకు చిల్లు!
ముఖ్యంగా స్టేట్ ట్యాక్స్ కార్యాలయంలోని కొందరు సిబ్బందితో పాటు సూర్యాబాగ్, సిరిపురం, ద్వారకానగర్, డాబాగార్డెన్స్, కురుపాం మార్కెట్, గాజువాక, అనకాపల్లి, చినవాల్తేరు సర్కిల్స్ పరిధిలో ఈ తరహా నకిలీ ఇన్‌వాయిస్‌లు ఎక్కువగా సృష్టించి.. ఇన్‌పుట్ క్రెడిట్ కుంభకోణంతో ఖజానాకు చిల్లు పెడుతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కంపెనీల్ని గుర్తిస్తున్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మాత్రం.. ఏదో ఒక రూపంలో.. మోసం చేస్తూనే ఉన్నారు. కేవలం వ్యాపారుల వైపు నుంచి మాత్రమే ఉన్నతాధికారులు దృష్టిసారిస్తుండటంతో.. ఇంటిదొంగలెవరూ పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఫేక్ కంపెనీలతో నకిలీ
ఇన్‌వాయిస్‌ల సృష్టి
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని సొంతం చేసుకునేందుకు వ్యాపారుల
కుయుక్తులు
విశాఖ డివిజన్ పరిధిలో రూ.కోట్లలో మోసాలు
సహకరిస్తున్న కొందరు జీఎస్టీ సిబ్బంది
‘ఇన్‌పుట్’ను చెరో సగం
పంచుకుంటున్న వైనం