మారేడుమిల్లి: మండలంలోని దేవరపల్లి గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైకు చెట్టును ఢీకొని బాలిక మృతి చెందింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. రంపచోడవరం మండలం కాకవాడ పంచాయతీ రాకోట గ్రామానికి చెందిన నూకలేటి కామేశ్వర్‌రెడ్డి ఇద్దరు పిల్లలను, తన అక్కను బైక్‌పై ఎక్కించుకొని మారేడుమిల్లి మండలం జీఎం వలస గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మండలంలో దేవరపల్లి గ్రామం వద్ద బైక్ అదుపు తప్పి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న నూకలేటి హంసగీత (4) అక్కడిక్కడే మృతి చెందింది. ఇంకొక బాలిక నిఖిత వర్షిణి కుడి చేయి విరిగింది. జయకుమారికి స్వల్ప గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న కామేశ్వర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కామేశ్వరరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మారేడుమిల్లి పోలీసులు తెలిపారు.