
ఘనంగా వెంకన్న కల్యాణోత్సవం
అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. స్వామివారి ఆలయం నుంచి ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు నిర్వహించారు. నర్సింగరావు (బుజ్జి), బుజ్జి దంపతుల ఇంటివద్ద పెళ్లిమాటల ఘట్టం నిర్వహించారు. ఆలయ అర్చకుడు బాల గణేష్, కశింకోటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం, శ్రీ మారుతి విద్యాపీఠం ఆగమ పండిట్, అర్చక ఎగ్జామినర్ శ్రీమాన్ రేజేటి శ్రీరామచార్యులు (రాంబాబు) శాస్త్రోక్తంగా జరిపించారు. కల్యాణం తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ సమర్థి రఘునాథ్, ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పలరామ్, కార్యదర్శి అప్పు, కామేష్, ఆలయ కమిటి మాజీ ప్రతినిధులు కాపుగంటి కృష్ణారావు, ఎల్‌బీ వెంకటేశ్వరరావు, కొళ్లా రమేష్‌బాబు, దేవభక్తుల వెంకటరావు, చిట్టిబాబు, లకే బొంజుబాబు తదితరులు పాల్గొన్నారు.
శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామివారి..
ఎటపాక: చోడవరం తోటపల్లిలో వేంచేసియున్న శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి వారి కల్యాణం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక హోమాలు, పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామి వారిని కొలువుదీర్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సుండ్రుపుట్టులో వీరబ్రహ్మేంద్రస్వామి..
సాక్షి,పాడేరు: సుండ్రుపుట్టులోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో గోవిందమ్మ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి వారి కల్యాణోత్సవాన్ని విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాడేరు మోదకొండమ్మతల్లి ఆలయం తరఫున పట్టు వస్త్రాలను ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు తదితరులు ఉరేగింపుగా తీసుకువెళ్లి అందజేశారు. మధ్యాహ్నం అన్నసమరాదన నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో పాడేరు పురవీధుల్లో ఉరేగించారు.

ఘనంగా వెంకన్న కల్యాణోత్సవం

ఘనంగా వెంకన్న కల్యాణోత్సవం

ఘనంగా వెంకన్న కల్యాణోత్సవం