మొదలైన విభజన ప్రక్రియ
గెజిట్ నోటిఫికేషన్ జారీ
డిసెంబర్ 5న జనరల్ బాడీ సమావేశాలు
18 వరకు అభ్యంతరాల స్వీకరణ
జనవరి ఏడు నుంచి అమల్లోకి..
కై లాస్‌నగర్: జిల్లాకు కొత్తగా మంజూరైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్)ల పునర్విభజన ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా సహకార శాఖ అధికారి సత్యనారాయణ ప్రత్యేక షెడ్యూల్ ఖరారు చేస్తూ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయా సొసైటీల సీఈవోలకు వాటిని పంపించారు. నూతనంగా ఏర్పడిన మండలం ప్రతిపాదికగానే రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా విభజన ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నిర్ణయంతో నూతన సొసైటీల పరిధిలోని రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కొత్త సంఘాలేవంటే..
జిల్లాలోని భీంపూర్, గాదిగూడ, సిరికొండ, సాత్నా ల, సొనాల, భోరజ్ మండలాలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పీఏసీఎస్‌లను అక్కడ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా మండలాల్లోని రైతులు ఇప్పటికీ పాత సొసైటీల పరిధిలోనే సేవలు పొందాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారి ఇక్కట్లను గుర్తించిన ప్రభుత్వం సహకార సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేలా కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు చర్యలు చేపట్టాలని సహకార శాఖను ఆదేశిస్తూ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
షెడ్యూల్ ఇలా...
కొత్తగా మంజూరైన ఆరు సొసైటీలను విభజించేందుకు అవసరమైన షెడ్యూల్ ఖరారు చేస్తూ జిల్లా సహకార అధికారి సత్యనారాయణ నోటిఫికేషన్ జారీ చేశారు.ఈ ప్రకారం ఉమ్మడిగా ఉన్న ప్రస్తుత సొసైటీల్లో డిసెంబర్ 5న జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందించేందుకు డిసెంబర్ 18వరకు గడువు విధించా రు. అయితే మండలం యూనిట్‌గానే సొసైటీలను విభజిస్తున్నందున రైతుల నుంచి పూర్తిస్థాయిలో ఆమోదం లభించే అవకాశమున్నట్లుగా ఆ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఆయా సొసైటీల్లోని సభ్యుల నుంచి అందిన వివరాల ఆధారంగా తుది నివేదిక సిద్ధం చేసి కొత్త పీఏసీఎస్‌లను ఏర్పాటు చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ అనుకున్నట్లుగా సాగితే నూతన సంవత్సరం కానుకగా వచ్చే ఏడాది 7నుంచి ఇవి రైతులకు అందుబాటులోకి రానున్నాయి.
పునర్ వ్యవస్థీకరణ ఇలా...
తాంసి సొసైటీలో కొనసాగుతున్న భీంపూర్ మండలంలోని రైతలను విభజించి ప్రత్యేకంగా భీంపూర్ సొసైటీని ఏర్పాటు చేయనున్నారు. సాత్నాల మండల పరిధిలోని మేడిగూడ సొసైటీలోకి వచ్చే ఏడు గ్రామాలు, బేల సొసైటీలోని 14 గ్రామాలను కలిపి కొత్తగా సాత్నాల సొసైటీ ఏర్పాటు కానుంది. నార్నూర్ సొసైటీలో కొనసాగుతున్న రైతులను విభజించి గాదిగూడ, బోథ్ మండలంలోని రైతులను విభజించి సొనాల మండల సొసైటీలుగా కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఇచ్చోడ సొసైటీ పరిధిలోని ఏడు గ్రామాలు, ఇంద్రవెల్లి పీఏసీఎస్ పరిధిలోని 9 గ్రామాలను కలిపి కొత్తగా సిరికొండ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పడనుంది. అలాగే భోరజ్ మండలంలోని గూడ రాంపూర్‌లోని రెండు గ్రామాలు, జైనథ్ సొసైటీ పరిధిలోని 25 గ్రామాలను కలుపుకుని కొత్తగా భోరజ్ సొసైటీ ఏర్పాటు కానుంది. ఆయా సంఘాల్లోని ఆదాయం, అప్పులను సైతం సమానంగా విభజించనున్నారు. ఇలా కొత్త సంఘాల ఏర్పాటు, పాత వాటి పునర్‌వ్యవస్థీకరణ ద్వారా రైతులకు సేవలు మరింత మెరుగుపడనున్నాయి.


