రూ.3.5 కోట్లతో రిసార్ట్ అభివృద్ధి పర్యాటకుల సౌకర్యాలపై టూరిజం శాఖ ప్రత్యేక దృష్టి బోటింగ్, ఓపెన్ స్టేజ్, స్విమ్మింగ్‌పూల్‌కు ప్రతిపాదనలు
రూ.3.5 కోట్లతో రిసార్ట్ అభివృద్ధి పర్యాటకుల సౌకర్యాలపై టూరిజం శాఖ ప్రత్యేక దృష్టి బోటింగ్, ఓపెన్ స్టేజ్, స్విమ్మింగ్‌పూల్ కోసం ప్రతిపాదనలు
నేరడిగొండ: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రము ఖ పర్యాటక ప్రాంతం కుంటాల జలపాతానికి మరింత వన్నె తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా నిలిచిన ఈ జలపాతం ఇక మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. పర్యాటకులకు మె రుగైన వసతులు కల్పించడంతోపాటు, కుంటాల అందాలను మరింత పెంపొందించేలా పనులు కొనసాగుతున్నాయి. రిసార్ట్స్ అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి.
రూ.3.5 కోట్లతో పనులు..
రిసార్ట్స్ అభివృద్ధి పనులు రూ.3.5 కోట్లతో చేపట్టా రు. అదే సమయంలో ట్రైబల్ హట్స్ నిర్మాణం కూడా కొనసాగుతోంది. పర్యాటకుల సంఖ్యను, భ విష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బోటింగ్ పాయింట్, ఓపెన్ స్టేజ్, స్విమ్మింగ్ పూల్ వంటి అ దనపు సౌకర్యాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూ పొందిస్తున్నారు. దీంతో సందర్శకులకు ప్రకృతి అందాలతో పాటు వినోదం, విశ్రాంతి సౌకర్యాలు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి.
సందర్శించిన కలెక్టర్..
ఇటీవల కుంటాల ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా క లెక్టర్ రాజర్షి షా, రిసార్ట్స్ ప్రాంగణంలో అవసరమై న మౌలిక వసతులతోపాటు అదనపు సౌకర్యాల క ల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూ చించారు. పర్యాటకుల సంఖ్య, భవిష్యత్ అవసరా లను అంచనా వేసి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రిసార్ట్స్ అభివృద్ధి కేవలం భవన నిర్మాణాలకే పరిమితం కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఉండాలని, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, పార్కింగ్, విశ్రాంతి ప్ర దేశాలు, భద్రత తదితర అంశాలపై సమగ్ర ప్రణా ళికతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
కలెక్టర్ చొరవతో ప్రత్యేక వసతులు
కుంటాల జలపాతం అభివృద్ధికి కలెక్టర్ రాజర్షిషా ప్రత్యేక చొరవ చూపుతున్నారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. జలపాతాన్ని సందర్శించే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రిసార్ట్స్ ఏర్పాటు చేస్తున్నాం. పర్యాటకులకు మరిన్ని వసతులు అందుబాటులోకి తెస్తున్నాం. రెండు, మూడు నెలల్లో రిసార్ట్స్‌ను అందుబాటులోకి తెస్తాం.
– రవికుమార్, జిల్లా టూరిజం శాఖ అధికారి
పర్యాటక శాఖ ప్రత్యేక దృష్టి..
పర్యాటక ప్రాంత అభివృద్ధిపై టూరిజం శాఖ ప్ర త్యేక దృష్టి సారిస్తోంది. రిసార్ట్స్‌లో మౌలిక వసతులను మెరుగుపరచడంతోపాటు పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తోంది. బోటింగ్ పాయింట్ వద్ద పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాలకు తావులేకుండా చర్యలు చేపట్టనుంది. నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేసి త్వరగా సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. వర్షాకాలంలో ఇప్పటికే సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రిసార్ట్స్, ట్రైబల్ హట్స్, బోటింగ్, ఓపెన్ స్టేజ్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో స్థానిక చిరు వ్యాపారులు, హోటళ్లు, రవాణా రంగాలకు ఆదాయం పెరుగుతుంది.


