ఆదిలాబాద్‌లో ‘హస్త’వ్యస్తం! | - | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌లో ‘హస్త’వ్యస్తం!

Aug 21 2026 3:03 AM | Updated on Aug 21 2026 3:03 AM

● కాంగ్రెస్‌ నేతల మధ్య వర్గ పోరు ● ‘కంది’పై డీసీసీ అధ్యక్షుడి ఫిర్యాదు ● శ్రీనివాస్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసులు ● ఏం జరుగుతుందోనని పార్టీలో చర్చ

సాక్షి, ఆదిలాబాద్‌: ‘ఉట్నూర్‌లో ఈనెల 17న నిర్వహించిన కాంగ్రెస్‌ పీఏసీ సమావేశంలో గందరగో ళం సృష్టించారు.. పార్టీ నాయకత్వంపై అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించా రు..’ ఇది కంది శ్రీనివాస్‌రెడ్డిపై డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్‌ తెలంగాణ డీఏసీకి ఇచ్చిన ఫిర్యాదు.

ఈ ఫిర్యాదు నేపథ్యంలో కాంగ్రెస్‌ తెలంగాణ క్రమశిక్షణ చర్యల కమిటీ నుంచి గురువారం పార్టీ ఆది లాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డికి షోకాజ్‌ నోటీస్‌ జారీ అయింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. అయితే, గ డువు సమీపిస్తుండడంతో అధిష్టానం తీసుకునే నిర్ణయంపై కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది.

నియమావళిపై పార్టీలో చర్చ

గొడవ చేసిన వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని నరేశ్‌ జాదవ్‌ అదేరోజు మీడియా ముందు పేర్కొన్నారు. ‘పీఏసీ సభ్యుల ఎంపిక నేను చేసింది కాదు.. ఏఐసీసీ సెక్రటరీ సచిన్‌ సావంత్‌, ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముందే గొడవకు దిగడం సరైంది కాదు.. బూతు పదజాలం పెద్దలే విన్నారు.. పీఏసీ సభ్యుల ఎంపిక తన చేతిలో లేదు.. సమావేశానికి ఎవరెవరిని పిలిచారో నాకు తెలియదు’ అని నరేశ్‌ జాదవ్‌ పేర్కొంటున్నారు. కాగా, పీఏసీ సభ్యుల ఎంపిక విధానం ఎలా ఉంటుంది.. పార్టీ నియమావళి ఎలా ఉంది.. అనేదానిపై కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ ఎలా ముందుకెళ్తుందనే దానిపై పార్టీలో ఆసక్తి పెరిగింది.

ఆసక్తికర పరిణామాలు

ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సంజీవరెడ్డి మధ్యలో గొడవ చోటు చేసుకుంటున్నప్పుడు.. పీఏసీ సభ్యులు గాని వారిని ఈ సమావేశానికి ఎవరు పిలిచారని అంటున్న సమయంలో.. ఓ ముఖ్య నేత కనుసైగలతో సంజీవరెడ్డి ఆ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రత్యర్థి వర్గం పరుష పదజాలం ఉపయోగించినప్పటికీ ఆయన ఎదురు దాడికి దిగకుండా ఆ ముఖ్య నేత సూచించినట్లు సమావేశ మందిరం నుంచి వెళ్లిపోవడం కార్యకర్తల దృష్టిని మరల్చలేకపోయింది. కంది వర్గంతో ప్రత్యర్థి వర్గం వ్యూహాత్మకంగా ఆ సమయంలో వ్యవహరించిందా? అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాాగా, పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని, అధిష్టానానిదే తుది నిర్ణయమని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌ జాదవ్‌ పేర్కొన్నారు.

ముదిరిన విభేదాలు

కాంగ్రెస్‌లో విభేదాలు మరింత ముదిరాయి. పీఏసీ సమావేశంలో ఇవి బహిర్గతమయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో, ముఖ్యంగా ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కార్యకర్తల మధ్య గందరగోళం కొనసాగుతోంది. కంది శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డి మధ్య ఇటీవలి కాలంలో గ్రూపు తగాదాలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలోనే పీఏసీ సమావేశంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయని కార్యకర్తలు చెప్పుకొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement