ఆదిలాబాద్: తెలంగాణలో వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అసెంబ్లీలో తాను చేసిన విజ్ఞప్తి మేరకు రూ. 3 వేల కోట్ల బడ్జెట్ కేటాయించినప్పటికీ ఖర్చు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఈ నెల 30తో ఫసల్ బీమా కోసం దరఖాస్తు గడువు ముగియనున్న నేపథ్యంలో, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు బాసటగా నిలవాలని సూచించారు. లేనిపక్షంలో ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు రైతుయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో రైతులు రాందాస్, దయాకర్, బెన్సన్ రెడ్డి, సతీష్ యాదవ్, రాము, దినేష్ మాటోలియా, ఆకుల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.


