● వేడెక్కిన ‘పుర’ రాజకీయం ● టికెట్ ప్రయత్నాల్లో ఆశావహు
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు కావడంతో బల్దియా రాజకీ యం ఒక్కసారిగా వేడెక్కింది. రిజర్వేషన్ అనుకూలించిన అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని అనధికారికంగా ప్రచారం సైతం షురూ చేశారు. పార్టీల సింబల్ ఆధారంగా ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన రాజకీయ పార్టీల తరఫున టికెట్ దక్కించుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల ఎంపికపై దృష్టి సారించాయి. ఆయా వార్డుల్లో ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తూ ప్రజాబలం, సేవాగుణం, గెలి చే అవకాశాలున్న వారి ఎంపికకు కసరత్తు చేస్తున్నా యి. దీంతో షెడ్యూల్‌కు ముందే పుర రాజకీయం కాక పుట్టిస్తోంది.
సతి లేకుంటే పతి..
ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లు పలువురు మాజీ కౌన్సిలర్లకు నిరాశ మిగిల్చాయి. రిజర్వేషన్లు తారుమారు కావడంతో కొందరికి పోటీకి అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి వారిలో పలువురు పక్క వార్డుల నుంచి బరిలో దిగాలని భావిస్తున్నా రు. అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ప డ్డారు. మరి కొన్నిచోట్ల మహిళలకు రిజర్వు కావడంతో తమ సతులను పోటీ చేయించాలని పతులు యోచిస్తున్నారు. సామాజికవర్గం పరంగా రిజర్వేష న్ అనుకూలించక సతి, పతి ఇద్దరూ పోటీ చేసే అవకాశం లేనటువంటి వారు నిరాశలో మునిగిపోయా రు. ఆయావార్డుల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆ శావహులు అలాంటి మాజీ కౌన్సిలర్లను ఆశ్రయిస్తున్నారు. వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి తమకు అండగా నిలువాలని కోరుతూ వారిని ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు.
రాజకీయ పార్టీల దృష్టి
మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. హస్తం పార్టీలో ఎన్నికల జోష్ నెలకొంది. రెండు రోజులుగా ఆశావహుల నుంచి ఆ పార్టీ ముఖ్య నేతలు దరఖాస్తులు స్వీకరించారు. నేటితో గడువు ముగియనుండగా ఇప్పటికే సుమారు 200మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1:2 నిష్పత్తితో కూడిన జాబితాను అధిష్టానానికి పంపించనున్నారు. వారిపై పార్టీ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించనుంది. అలాగే బీజేపీ ఇటీవల ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించి శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చింది. దీంతో పలువురు ఆశావహులు పార్టీ కార్యాలయంలో తమ దరఖాస్తులు అందజేస్తున్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కూడా ఎన్నికలపై ప్రత్యేక దృషి సారించింది. ఆ పార్టీ తరఫున పోటీచేయాలని భావిస్తున్న వారు నేరుగా జిల్లా అధ్యక్షుడిని కలిసి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా మూడు పార్టీలు ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికే కీలకమైనందున గెలుపు గుర్రాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నాయి. ప్రజాబలం, ప్రజలతో మమేకమయ్యే తత్వం, సేవాభావం వంటి అంశాలతో పాటు ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నాయి. మరోవైపు పార్టీ టికెట్ దక్కితే ఒకే లేదంటే మరో పార్టీలోకి చేరడం, అదీ కుదరకుంటే ఇండిపెండెంట్‌గానైనా బరిలో నిలువాలని పలువురు భావిస్తున్నారు.
ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తున్న ఆశావహులు ఇప్పటికే వార్డుల్లో తమ పార్టీ ముఖ్యనేతలతో పాటు తమ ఫొటోతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. మద్దుతు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో పాటు వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం వంటి సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతూ ఫలానా వార్డు అభ్యర్థిని తానేనని చెప్పుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇది వరకు తాము చేసిన సామాజిక సేవ కార్యక్రమాలు, కాలనీల్లో చేపట్టిన పనులను అందులో పోస్ట్ చేస్తున్నారు. ఇలా నోటిఫికేషన్‌కు ముందే ఎన్నికల అనధికార ప్రచారం కొనసాగిస్తున్నారు.


