మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం
ఆదిలాబాద్‌టౌన్: మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మైనర్ డ్రైవింగ్ చేసిన వారి తల్లిదండ్రులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా మైనర్ల తల్లిదండ్రులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే 260 మైనర్ డ్రైవింగ్ చేసిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొదటి తప్పుగా భావించి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టా మని, పునరావృతం అయితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, సీఐలు సునిల్ కుమార్, నాగరాజు, ప్రణయ్‌కుమార్, ఫణిందర్ తదితరులు పాల్గొన్నారు.
రహదారి భద్రత పాటించాలి
ఆదిలాబాద్‌రూరల్: ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని బుర్కి గ్రామంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గ్రామస్తులకు దుప్పట్లు పంపిణీ చేసి మా ట్లాడారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. ఆదివాసీ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్‌రెడ్డి, రూరల్ సీఐ ఫణిందర్, ఎస్సై విష్ణు వర్ధన్, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం అధ్యక్షుడు ఎం రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ నగేష్, గ్రామ పటేల్ సోనేరావు, సిబ్బంది తదితరులున్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కార చర్యలు తీసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. మొత్తం 38 ఫిర్యాదులు అందగా, వాటిపై ఎస్పీ తక్షణమే స్పందించి సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, పాల్గొన్నారు.


