ఈసారి కూడా నిరాశే!
ఇచ్చోడ: ఏళ్లుగా ఎదురుచూస్తున్న బోథ్ నియోజకవర్గ వాసులకు ఈ సారి కూడా నిరాశే మిగిలింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ పర్యటనకు విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో కుప్టి ప్రాజెక్టు ఊసెత్తక పోవడంతో ఈ ప్రాంత రైతుల ఆశలు సన్నగిల్లాయి. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రికి బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేశ్‌జాదవ్ కుప్టి ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని వేరువేరుగా వినతిపత్రాలు అందజేశారు. అనంతరం నిర్మల్ బహిరంగ సభలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ సైతం కుప్టి ప్రాజెక్ట్ విషయంలో సీఎం ప్రకటన చేయాలని కోరారు. దాదాపు గంటసేపు బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి కుప్టి విషయం ప్రస్తవించక పోవడంతో ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి బోథ్‌లో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుప్టి ప్రాజెక్ట్‌కు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. సీఎం హోదాలో మూడోసారి జిల్లాకు వచ్చిన ఆయన కుప్టి విషయం ప్రస్తవించకపోవడం గమనార్హం.


