breaking news
workers lost
-
భారీ విస్ఫోటనం.. మాటలకందని విషాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం సంభవించింది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రం శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 11 మంది కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మృతులందరూ పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు. సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఉదయం బాణసంచా కేంద్రంలోని నాలుగు షెడ్లలో 60 మంది వరకూ కూలీలు మందు గుండు తయారీలో నిమగ్నమయ్యారు. సహజంగా ప్రతి రోజూ ఈ కేంద్రంలో 10–15 మంది పని చేస్తూంటారు. అయితే జగ్గంపేట మండలం మల్లిశాలలో జాతరకు భారీ ఆర్డర్ రావడంతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాణసంచాకు డిమాండ్ పెరిగింది. దీంతో 60 మందికి పైగా కూలీలతో పని చేయిస్తున్నారు. రాకెట్లు, జువ్వలు, సెర్చ్లైట్లు, మిడతల దండు, డిస్కో బుడ్లు, చిచ్చు బుడ్లు తయారు చేస్తున్నారు. పైగా మల్లిశాలలో జాతర కోసం సిద్ధమైన మందు గుండును కూడా ఇక్కడున్న గోడౌన్లోనే నిల్వ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అందరూ భోజనాలకు బయటకు వచ్చారు. 1.30 గంటలకంతా భోజనం ముగించుకున్న కూలీల్లో 30–40 మంది తిరిగి ఆ నాలుగు షెడ్లలోకి వెళ్లి పనిలో నిమగ్నం అయ్యారు. మరికొందరు బయటే సేద తీరారు. ఇంకొందరు సమీపంలోనే ఊరు ఉండటంతో భోజనానికి ఇంటికెళ్లి తిరిగి వస్తున్నారు. వేట్లపాలెం వద్ద జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలు పేద్ద శబ్దం.. ఎగిరిపడ్డ దేహాలుమధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నాలుగు షెడ్లలో ఉన్న బాణసంచా ఒకదాని తర్వాత మరొకటి పేలిపోవడంతో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి షెడ్లలో ఉన్న కూలీలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు 20–30 అడుగుల ఎత్తున ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కాలిపోయిన మృతదేహాలు తునాతునకలైపోయాయి. శరీరాలు గుర్తు పట్టలేని రీతిలో చిధ్రమైపోయాయి. కొందరి తలా, మొండెం, కాళ్లు, చేతులు వేర్వేరు ప్రాంతాల్లో, సమీపంలోని పంట కాలువలు, పచ్చని వరి పొలాల్లో దూరంగా పడ్డాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. సంఘటన ప్రాంతమంతా మృతులు, క్షతగాత్రుల బంధువుల ఆర్తనాదాలతో హృదయ విదారకరంగా మారింది. భీతావహ దృశ్యంపేలుడు ధాటికి ఘటన స్థలి ఎటుచూసినా మంటల్లో కాలిపోయిన కూలీల మృతదేహాలతో భయానక వాతావరణం కనిపించింది. ఆ సమయంలో పనిలో ఉన్నవారెవరు, ఎంత మంది మృతి చెందారు, ఎవరు మిగిలి ఉన్నారనేది తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. చుటు్టపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చారు. పేలుడు ధాటికి సంఘటన స్థలానికి రెండు కిలోమీటర్ల దూరాన సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డులో ఉన్న గూడపర్తిలోని ఇళ్లల్లో ఉన్న వారు భూకంపం వచ్చినట్టు భయపడి బయటకు పరుగులు తీశారు. ఇంటిపై ఉన్న ఇనుప రేకుల నుంచి సైతం శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. వేట్లపాలెం, గూడపర్తి, పెదబ్రహ్మదేవం, జి.మేడిపాడు గ్రామాలకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కాగా, మృతదేహాలను సేకరించేందుకు స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. కాలువలు, చేలల్లో గాలింపు చేపట్టి నుజ్జునుజ్జు అయిన శరీర భాగాలను సేకరించి ఒక చోటకు చేర్చారు. ఏది ఎవరి అవయవమో గుర్తించలేక కొన్నింటిని మూటలు కట్టారు. ఇలా అన్ని మృతదేహాలను, మూటలను అతి కష్టం మీద సామర్లకోట ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉండగా బాణసంచా నాణ్యత కోసం అధిక మోతాదులో సల్ఫర్, సూరేకారం కూరడం వల్లే ఒత్తిడికి గురై విస్ఫోటనం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.సూర్యశ్రీ ఫైర్వర్క్స్లో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది 11 మంది క్షతగాత్రులు వీరేసప్పా సత్య వెంకట లక్ష్మి, మోర్తా శ్రీను, కాతేటి శ్రీను, చిటికెల లక్ష్మి, దర్శిపర్తి రాజు, వేమగిరి లోవరాజు, వేమగిరి దావీదు, పల్లాపాటి వేద శ్రీను, దర్శిపాటి లోవరాజు, పెద్దాపురానికి చెందిన చాపల శామ్యూల్, వేట్లపాలేనికి చెందిన పచ్చిగళ్ల నూకరాజు తీవ్రంగా గాయపడ్డారు. 70 శాతం కాలిన గాయాలతో వీరు కాకినాడ జీజీహెచ్ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు .20 మంది మృతులు వీరేవేట్లపాలేనికి చెందిన గంధి మంగ (43), వల్లూరి రవి (35), కడింపల్లి కృపమ్మ, గంపల మంగ, గంపల నాగరాజు, బిక్కిన కరుణ సుబ్బారావు (45), సాధనాల సత్యవేణి (44), గొడతా నాని (26), సంకుమళ్ల రాఘవ (50), ఫైర్క్స్ యజమాని అర్జున్ తండ్రి అడబాల శ్రీనివాసరావు (55), దుర్గానగర్‌కు చెందిన తుంపల లోవ (38), నూకెళ్ల దేవి (45), జొన్నలదొడ్డికి చెందిన చింతల రమణ (60), గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని (44), గొడత మహేష్ (41), గొడత వీర వెంకట రమణ (48), కడింపల్లి ధనరాజు (55), కుమ్మరి వీధికి చెందిన దర్శిపాటి నాని (38), యేడిద సంపత్ కుమార్ (25), పెదబ్రహ్మదేవం గ్రామానికి చెందిన మాకర రాఘవమ్మ (55) మృతి చెందారు.ఫైరింజన్లు వెళ్లలేక... పెరిగిన ప్రమాద తీవ్రతసంఘటన స్థలానికి సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు నుంచి వెళ్లాలంటే సింగిల్ రోడ్డు. అది చాలా ఇరుకుగా ఉండటంతో ఆ సమయానికి అంబులెన్సులు చేరుకోలేకపోయాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. విస్ఫోటనం తీవ్ర స్థాయిలో ఉండటం, రెండు గంటల పాటు పేలుళ్లు కొనసాగడంతో స్థానికులు కూడా ఘటన స్థలి దగ్గరి వరకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. చివరకు ధైర్యం చేసి కొందరు స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండటంతో అక్కడకు ఫైరింజన్, అంబులెన్స్ వెళ్లే మార్గం కూడా లేదు. వరి పొలాలు బురద మయంగా ఉండటంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉండగా జీజీహెచ్‌లో క్షతగ్రాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అంతకు ముందు హోం మంత్రి అనిత సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనపై సామర్లకోట తహశీల్దార్ కొవ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్‌పై కేసు నమోదు చేశారు. శ్మశానంలా మారిన ప్రమాద స్థలం వద్ద గుమిగూడిన వేట్లపాలెం ప్రాంత ప్రజలు నా మనసును కలచివేసింది సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి, పలువురు మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా? లేదా? అన్నదానిపై పరిశీలన చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ‘ఎక్స్’లోనూ పోస్టు చేశారు. -
లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో పేలుడు
సియోల్: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో 22 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దేశరాజధాని సియోల్ దగ్గర్లోని హవాసియాంగ్ సిటీలో ఎరీసెల్ కంపెనీకి చెందిన లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీ ఉంది. సోమవారం ఉదయం 10.30గంటలపుడు 102 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో అక్కడి కొన్ని బ్యాటరీలు పేలాయి. దీంతో రెండో అంతస్తుల్లో మంటలంటుకుని ఫ్యాక్టరీలో దావానంలా వ్యాపించాయి. దీంతో 22 మంది అగి్నకి ఆహుతయ్యారు. వీరిలో 18 మంది చైనా కార్మికులు ఉన్నారు. తయారైన బ్యాటరీలను తనిఖీచేసి ప్యాక్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. అయితే పేలుడుకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఒకరి జాడ తెలీడంలేదు. ఘటనాస్థలిని ప్రధాని హాన్ డ్యూక్ సో సందర్శించారు. -
కూలీలను కబళించిన మృత్యువు
పామిడి (అనంతపురం): సద్ది కట్టుకుని ఆటోలో బయల్దేరిన పత్తి కూలీలను లారీ రూపంలో మృత్యువు కబళించింది. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని జాతీయ రహదారిపైకి వెళ్లే మలుపు వద్ద ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన దాదాపు వంద కుటుంబాలు వ్యవసాయ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరంతా సమీపంలోని పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో పత్తి తొలగింపు పనులకు వెళ్తుంటారు. శుక్రవారం వేకువజామున పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లి పొలాల్లో పత్తి తీసేందుకు కొప్పలకొండ నుంచి 14 మంది కూలీలు తమ గ్రామానికే చెందిన డ్రైవర్ నల్లబోతుల లక్ష్మీనారాయణ ఆటోలో బయలుదేరారు. ఆటో పామిడి పట్టణం మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకుంటుండగా.. హైదరాబాద్ వైపు నుంచి లారీ ఎదురుగా దూసుకొచ్చి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో కూలీలు గూడు చౌడమ్మ (32), గోసుల సుబ్బమ్మ (47), గోసుల సావిత్రి (37), మీనుగ నాగవేణి (47), గోసుల శంకరమ్మ (43) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కూలీలు రామలక్ష్మి, సుబ్బరాయుడు, లక్ష్మీదేవి, ఆదిలక్ష్మి, రమాదేవి, నాగవేణి, రేవంత్, జయమ్మతోపాటు ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ గాయాల పాలయ్యారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నల్లబోతుల నాగవేణి (23) మృతి చెందింది. ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ భార్య జయమ్మ (40) పరిస్థితి విషమంగా ఉంది. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరి సాంబశివారెడ్డి, ఆర్డీవో మధుసూదన్‌లు ఘటనా స్థలంలో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
డేటావిండ్ ఉద్యోగుల తొలగింపు: ఆందోళన
హైదరాబాద్: తక్కువ ధరల టాబ్లెట్ తయారీ సంస్థ డాటా విండ్ ఉద్యోగులపై వేటు వేసింది. ముఖ్యంగా అమ్మకాలు భారీగా పడిపోవడంతో డజన్లకొద్దీ ఉద్యోగులను తొలగించిందని ఉద్యోగులు ఆందోళకు దిగారు. ఉత్పత్తిలో 50శాతం కోత పెట్టిందని ఆరోపిస్తూ దాదాపు 200 మంది కార్మికులు లేబర్ కమిషన్‌ను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ పిటిషన్ ఇచ్చారని తెలంగాణా జాయింట్ కమిషనర్(లేబర్) చంద్ర శేఖరం పీటీఐకి చెప్పారు. తాము ఉద్యోగుల నుంచి పిటిషన్‌ను స్వీకరించామని సంస్థ వెర్షన్ వినడానికి త్వరలోనే వారిని పిలవనున్నామని చంద్రశేఖరం తెలిపారు. ఎంత మంది కార్మికులు అనేది స్పష్టతలేనప్పటికీ, అయితే వీరి సంఖ్య 200 కన్నా ఎక్కువ ఉంటుందని ఆయన అన్నారు అయితే ఈ వ్యవహారంపై కంపెనీని సంప్రదించినపుడు సంస్థ భిన్నంగా స్పందించింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు తమ ఆఫీసును ధ్వంసం చేశారని కంపెనీ ఆరోపించింది. విమానాశ్రయ విస్తరణలో భాగంగా జీఎంఆర్‌కు కొంత స్థలం అవసరమైందనీ, ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో ఒక కొత్త కార్యాలయాన్ని ప్రారంభించాలని తాము యోచిస్తున్నట్టు చెప్పినా వినలేదనీ, చాలామంది శంషాబాద్ చుట్టూ పక్కలేఉండడంతో ఆందోళన చెందారని చెప్పారు. ఈ తరలింపు ఇష్టంలేని కొందరు తమపై ఫిర్యాదు చేసినట్టు వివరించారు. అందుకే వారిని తొలగించినట్టు చెప్పారు. ఉత్పత్తి 50శాతం క్షీణించిందనీ, అయితే హైదరాబాద్‌ను ప్లాంట్ ను మూసివేయడంలేదని స్పష్టం చేసింది. హైదరాబాద్ ప్లాంట్ భాగాల ఎగుమతికోసం ఎదురుచూస్తుండగా, అమృత్సర్ ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉందని చెప్పింది. 2017 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల్లో అమ్మకాలు గణనీయంగా తగ్గాయని డాటావిండ్ సీఈవో సునీత్ సింగ్ తులి మార్కెట్ ఫైలింగ్ లో పేర్కొన్నారు. కాగా హైదరాబాద్‌లో 100 కోట్ల రూపాయల పెట్టుబడులతో మొదలైన డేటావిండ్ సంస్థ మొదటి సంవత్సరంలో రెండు మిలియన్ యూనిట్లు (టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు) ఉత్పత్తి చేయనున్నామని ప్రకటించింది. తమ పూర్తి సామర్థ్యం 5 మిలియన్ యూనిట్లకు చేరుకోనుందని 2016 నవంబరులో ప్రకటించింది. మరోవైపు తక్కువ ధర డేటా ప్రణాళికలను ప్రారంభించనున్నామని, వచ్చే నెల లో ఫీచర్ ఫోన్ల కోసం మొబైల్ బ్రౌజర్ ప్రారంభించటానికి సిద్ధమవుతున్నామని డేటా విండ్ చెప్పింది. ఇది కూడా జావా ఆధారిత ఫీచర్ ఫోన్ లో వినియోగదారులు వేగవంతమైన డేటా అనుభవాన్ని అందించేలా లాంచ్ చేయనున్నామని ప్రకటించింది.


