breaking news
Vita
-
రూట్స్ : సేవే శక్తి!
ఉత్సాహం నుంచి శక్తి జనిస్తుంది. మరి ఆ ఉత్సాహం ఎలా వస్తుంది? ఎవరి మాట ఎలా ఉన్నా... విట, జలజ్ దాని దంపతులకు మాత్రం ఆ ఉత్సాహం స్వచ్ఛంద సేవాకార్యక్రమాల ద్వారా వస్తుంది. పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన ఈ దంపతులు తన ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఒక మంచి పని చేసి చూడండి. అందులో నుంచి వచ్చే శక్తి ఏమిటో మీకే తెలుస్తుంది’ అంటున్నారు... ముందుకు వెళ్లడం మంచిదేగానీ వెనక్కి తిరిగి చూసుకోవడం కూడా మంచిదే. విటల్, జలజ్ దాని దంపతులు అదే చేశారు. వారి తాత స్వçస్థలం గుజరాత్‌లోని చారిత్రక పట్టణం కపడ్ వంజ్. ఆయన రకరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఒకసారి ఆయన సేవాకార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. ఆ స్ఫూర్తితో ఎనభై సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ‘కపడ్వంజ్ కెలవాణి మండల్’ (కెకెఎం) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఈ సంస్థ పరిధిలో పదమూడు విద్యాసంస్థలు ఉన్నాయి. ‘కెకెఎం’తో కలిసి పనిచేయడం విట, జలజ్ దంపతులలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత... తమ సేవాకార్యక్రమాలను విస్తృతం చేయడం కోసం ‘దాని ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ‘కెకెఎం’తో పాటు అన్నమిత్ర ట్రస్ట్, ఈఎల్ఎంఎస్ స్పోర్ట్స్ ఫౌండేషన్... మొదలైన సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ‘అన్నమిత్ర’తో కలిసి దేశంలోని 6,500 పాఠశాలలో పిల్లల కోసం మ«ధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ‘బాలకార్మిక వ్యవస్థ పోవాలంటే ముందు పిల్లలకు కడుపు నిండా తిండి దొరకాలి. ఆ భోజనమే వారిని విద్యకు దగ్గర చేస్తుంది. అభివృద్థిపథంలోకి నడిపిస్తుంది’ అంటుంది విట. ‘ప్రథమ్’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి అట్టడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమాలలో పాలుపంచుకుంటుంది దాని ఫౌండేషన్. సేవా కార్యక్రమాలే కాకుండా తమ కుమారుడు, ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ముదిత్ కోరిక మేరకు ఆటలపై కూడా దృష్టి సారించారు. ఈఎల్ఎంఎస్ స్పోర్ట్స్ ఫౌండేషన్‌తో కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి క్రీడా నైపుణ్యాలు మెరుగుపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ఆటలకు ప్రాచుర్యాన్ని తీసుకువస్తున్నారు. పాఠశాలలో క్రీడాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రొఫెషనల్ లెవెల్లో పిల్లలను క్రీడల్లో తీర్చిదిద్దడానికి హై–పెర్ఫార్మెన్స్ ప్లాన్స్, హై–పెర్ఫార్మెన్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్‌కు రూపకల్పన చేశారు. గతంతో పోల్చితే విద్యార్థులు ఆటలపై ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఇదొక శుభపరిణామంగా చెప్పుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా అంటుంది విట... ‘ఆటలో ఉత్సాహం ఉంటుంది. వినోదం ఉంటుంది. గెలుపు కోసం చేసే పథక రచన ఉంటుంది. లైఫ్ స్కిల్స్‌ను పిల్లలు ఆటల్లో నుంచే నేర్చుకోవడం మొదలు పెడతారు. మన దేశంలో కోట్ల జనాభా ఉంది. ఇలాంటి దేశంలో మనం ఛాంపియన్లను తయారు చేయలేమా!’ ‘క్రీడలపై వారి అనురక్తి, అంకితభావాన్ని దగ్గరి నుంచే చూసే అవకాశం వచ్చింది. క్రీడారంగంపై వారు చేపడుతున్న కార్యక్రమాల ప్రభావం తప్పకుండా ఉంటుంది’ అంటున్నాడు ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత అభినవ్ బింద్రా. గతకాలం మాట ఎలా ఉన్నా విట ప్రస్తుతం తమ ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువ సమయం గడుపుతుంది. ‘ఆడ్వర్బ్ టెక్నాలజీ ప్రైవెట్ లిమిటెడ్’ చైర్మన్ జలజ్ కంపెనీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమాలకు తగిన సమయం కేటాయిస్తుంటాడు. విట దృష్టిలో స్వచ్ఛంద సేవ అంటే చెక్ మీద సంతకం చేయడం కాదు. యాంత్రికంగా చేసే పని కాదు. మనసుతో చేసే మంచిపని. ప్రజలతో కలిసి పోయి చేసే ఉత్తేజకరమైన పని. ‘ఆటలో ఉత్సాహం ఉంటుంది. వినోదం ఉంటుంది. గెలుపు కోసం చేసే పథక రచన ఉంటుంది. లైఫ్ స్కిల్స్‌ను పిల్లలు ఆటల్లో నుంచే నేర్చుకోవడం మొదలు పెడతారు. – విట, దాని ఫౌండేషన్ -
జాట్ల ఆందోళన ఉధృతం
♦ ఆరుకు చేరిన మృతుల సంఖ్య ♦ రైల్వేస్టేషన్లు, బ్యాంకు,పాలశీతలీకరణ కేంద్రానికి నిప్పు ♦ కాల్చివేత ఆదేశాలూ భేఖాతరు.. ♦ డీపీఆర్వో సజీవదహనానికి విఫలయత్నం ♦ హరియాణా పరిస్థితిపై కేంద్ర మంత్రి వర్గం సమీక్ష రోహ్తక్: ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండుతో జాట్లు చేస్తున్న ఆందోళనతో హరియాణా అట్టుడుకుతోంది. చాలాచోట్ల ఆందోళనకారులు రోడ్డు, రైలు రవాణా వ్యవస్థతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను తగులబెట్టారు. శనివారం ఒక్కరోజే ఈ ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కర్ఫ్యూ విధించినా, కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేసినా.. జాట్ల విధ్వంసం కొనసాగుతోంది. శనివారం ఉదయం జింద్ జిల్లాలోని బుధఖేరా రైల్వేస్టేషన్‌కు ఆందోళనకారుల నిప్పుపెట్టారు. రికార్డు గదితో పాటు స్టేషన్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఝాజ్జర్లోని మంత్రి ఓపీ ధన్కర్ ఇంటిపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. ఝాజ్జర్‌లో డీపీఆర్వో వాహనానికి నిప్పుపెట్టడంతో.. అధికారితోపాటు నలుగురు ఉద్యోగులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రోహ్తక్లో ప్రభుత్వ డైరీ కార్పొరేషన్ పాలకేంద్రానికీ నిరసనకారులు నిప్పంటించారు. ఈ కేంద్రంలోని గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉన్నందున స్థానికులను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. శనివారం పొద్దుపోయిన తర్వాత పిలుఖేరాలో రైల్వేస్టేషన్, భునాలో తెహసిల్ కార్యాలయం, గోరఖ్‌పూర్ గ్రామంలో సహకార బ్యాంకు భవనానికి ఆందోళనకారులు నిప్పంటించారు. హరియాణాలోని తొమ్మిది జిల్లాల్లో ఇవే ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఆర్మీ వాహనాలు తిరగటం కూడా కష్టమవటంతో.. హెలికాప్టర్లలో జవాన్లను ఆయా ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. మరోవైపు కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు అమల్లో ఉన్న రోహ్తక్, భివానీ జిల్లాల్లో ఆర్మీ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించింది. సోనిపట్, గొహానా, ఝాజర్ ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో.. కర్ఫ్యూ విధించారు. హిస్సార్, కైథాల్ జిల్లాల్లో జాట్లు, జాటేతరుల మధ్య గొడవలు జరిగి 10 మందికి తీవ్రంగా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. తాజా పరిస్థితిని సమీక్షించిన హరియాణా సీఎం ఖట్టర్ జాట్ల రిజర్వేషన్ డిమాండును నెరవేరుస్తామని, ఆందోళన విరమించాలని కోరారు. అయితే.. ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వచ్చేంతవరకు ఉద్యమం ఆగదని జాట్ ఉద్యమ నాయకుడు యశ్పాల్ మాలిక్ తెలిపారు. జాట్లకు రిజర్వేషన్ ఇచ్చి ఓబీసీ కోటాకు నష్టం కలిగిస్తే.. రాజీనామాకు వెనుకాడనన్న కురుక్షేత్ర ఎంపీ సైనీ వ్యాఖ్యలపైనా జాట్లు మండిపడ్డారు. ఈ ఆందోళనతో.. 800 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు 25 నుంచి 30 వేల మంది తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని రైల్వేశాఖ తెలిపింది. కాగా, హరియాణాలో పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి సుష్మ, రక్షణ మంత్రి పరీకర్, రోడ్డు రవాణా మంత్రి గడ్కారీ, జాతీయ భద్రతా సలహాదారు దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్, హోం సెక్రటరీ, ఐబీ చీఫ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు శనివారం సమీక్ష జరిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని, శాంతిభద్రతలను కాపాడాలని హరియాణా ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. హరియాణాలో ఆందోళనల నేపథ్యంలో యూపీకి చెందిన జాట్ నేతలు రాజ్‌నాథ్‌ను కలసి రిజర్వేషన్ డిమాండును నెరవేర్చాలని కోరారు. దీనికి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. దీని ప్రభావంతో మారుతి సుజుకీ.. గురుగావ్‌లోని తయారీకేంద్రంలో కార్ల ఉత్పత్తిని నిలిపేసింది. ఢిల్లీని తాకిన సెగ అటు జాట్ల ఆందోళన ప్రభావం ఢిల్లీపై పడింది. దేశ రాజధానికి యమునా నీటిని అందించే మునాక్ కెనాల్‌ను ఆందోళనకారులు మూసేయటంతో సమస్యలు మొదలయ్యాయి. దీంతో కెనాల్‌ను తిరిగి తెరిచేలా చొరవతీసుకోవాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హరియాణా సీఎం ఖట్టర్‌లను కేజ్రీవాల్ కోరారు. ఈ కెనాల్ చుట్టూ సైన్యాన్ని మోహరించి నీటిని విడుదల చేయిస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారని కేజ్రీవాల్ ట్వీటర్లో వెల్లడించారు. ఈ ఆందోళన మరిన్ని రోజులు కొనసాగితే గురుగావ్, నోయిడా, ఢిల్లీల్లో నిత్యావసర వస్తువుల కొరత తప్పకపోవచ్చు. అటు ఢిల్లీ విశ్వవిద్యాలయం నార్త్ క్యాంపస్ బయట జాట్ విద్యార్థులు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది.