breaking news
VGS
-
అవినీతి ‘పుస్తకం’
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ పాలనలో విద్యార్థుల టెక్ట్స్‌బుక్ కాంట్రాక్టుల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం నూతన పుస్తకాలను లీక్ చేసిన ముద్రణ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.70 కోట్ల విలువైన 1, 2, 7, 10 తరగతుల పుస్తకాల ముద్రణ కాంట్రాక్టును నామినేషన్‌పై కట్టబెట్టింది. ఆ ముద్రణ సంస్థ తప్పు చేసి అడ్డంగా దొరికిపోయినా ప్రభుత్వం మళ్లీ భారీ కాంట్రాక్టును అప్పగించడం సంచలనంగా మారింది. 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్లో రెండో ఏడాదికి కొత్త సిలబస్ ప్రవేశపెట్టారు.నూతన సిలబస్ ఆధారంగా పాఠ్య పుస్తకాల(సేల్ బుక్స్) ముద్రణ కాంట్రాక్టును రూ.19 కోట్లకు వీజీఎస్, విక్రమ్ సంస్థలకు అప్పగించారు. ఈ సంస్థలకు కాంట్రాక్టు అప్పగించేందుకు ఏకంగా టెండర్ నిబంధనలనే మార్చేశారు. పనులు దక్కించుకున్న వీజీఎస్ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించి పుస్తకాల పీడీఎఫ్ కాపీలను లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు.ఈ వ్యవహారంలో కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి రూ.10 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వీజీఎస్‌కు అప్పగించిన ముద్రణ కాంట్రాక్టును తెలుగు అకాడమీ రద్దు చేసింది. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని వీజీఎస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా ఆ సంస్థపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అదే సంస్థకు రూ.70 కోట్ల విలువైన పాఠశాల పాఠ్యపుస్తకాల ముద్రణను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు మార్చి... నామినేషన్‌పై పనులు అప్పగించిగతంలో ఎస్సీఈఆర్టీ సిలబస్ పుస్తకాల ముద్రణలోనూ వీజీఎస్ తప్పుడు మార్గాలను అనుసరించిందని బ్లాక్ లిస్టులో పెట్టారు. అటువంటి సంస్థకు ఏకంగా టెండర్ నిబంధనలనే మార్చేసి ఇంటర్మీడియెట్ పుస్తకాల ముద్రణ కాంట్రాక్టును అప్పగించారని, దీనివెనుక విద్యాశాఖ మంత్రి కార్యాలయంతోపాటు విద్యాశాఖలోని అత్యున్నతాధికారి పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా, వీజీఎస్ ఇంటర్ పుస్తకాల పీడీఎఫ్‌ను లీక్ చేసి అడ్డంగా దొరికిపోయింది. కానీ ఆ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా... రూ.70 కోట్ల విలువైన పాఠశాల పాఠ్య పుస్తకాల ముద్రణ కాంట్రాక్టును నామినేషన్‌పై కట్టబెట్టబెట్టడం గమనార్హం. వాస్తవానికి పాఠశాల పుస్తకాల ముద్రణ కాంట్రాక్టు కోసం గతంలో టెండర్లు పిలిచేవారు. గతేడాది నుంచి నామినేషన్ విధానంలో అప్పగిస్తున్నారు. -
క్షమాపణ చెప్పిన వీజీఎస్ ప్రచురణకర్తలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ‘నైతికత, మానవ విలువలు’ పా ఠ్యాంశానికి సంబంధించిన స్టడీ మెటీరియల్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిల గురించి అనుచిత ప్రస్తావన చేసినందుకు వీజీఎస్ ప్రచురణ కర్తలు క్షమాపణ ప్రకటించారు. జరిగిన తప్పిదాన్ని వెంటనే సవరిస్తామని, మార్కెట్లో ఉన్న స్టడీ మెటీరియల్(గైడ్) పుస్తకాలను వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. ‘విలువలకు తిలోదకాలు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ప్రచురణ సంస్థ స్పందించింది. ‘పుస్తక రచయిత చేసింది పొరపాటే. ప్రముఖ రాజకీయ నేతల పేర్లతో అనుచి తవ్యాఖ్యలు చేసినందుకు మేం చింతిస్తున్నాము. ఈ విషయం మా దృష్టికి రాగానే స్టడీ మెటీరియల్‌లో ఆ అంశాన్ని తొలగించాము. స్టాల్స్‌లో ఉన్న పుస్తకాలను వెంటనే వెనక్కి తీసుకుంటున్నాము. తదుపరి వెలువరించే పుస్తకాల్లో ఇలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా జాగ్ర త్త పడుతాము. జరిగిన పొరపాటుకు తీవ్రంగా చింతిస్తున్నాము’ అని వీజీఎస్ ప్రచురణ సంస్థ గురువారం ప్రకటనలో తెలియజేసింది.


