అవినీతి ‘పుస్తకం’ | Chandrababu Government Offers Deal to VGS | Sakshi
Sakshi News home page

అవినీతి ‘పుస్తకం’

Apr 19 2026 6:16 AM | Updated on Apr 19 2026 6:16 AM

Chandrababu Government Offers Deal to VGS

ఇంటర్‌ కొత్త పుస్తకాలను లీక్‌ చేసిన వీజీఎస్‌కు చంద్రబాబు సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌

1, 2, 7, 10 తరగతుల పుస్తకాల కాంట్రాక్టును కట్టబెట్టిన ప్రభుత్వం

రూ.70 కోట్ల విలువైన పనులు నామినేషన్‌పై అప్పగింత

గతంలో వీజీఎస్‌పై తెలుగు అకాడమీ కేసు పెట్టినా చర్యలు శూన్యం

విద్యాశాఖ తీరుపై విమర్శల వెల్లువ

సాక్షి, అమరావతి: రెడ్‌బుక్‌ పాలనలో విద్యార్థుల టెక్ట్స్‌బుక్‌ కాంట్రాక్టుల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం నూతన పుస్తకాలను లీక్‌ చేసిన ముద్రణ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. రూ.70 కోట్ల విలువైన 1, 2, 7, 10 తరగతుల పుస్తకాల ముద్రణ కాంట్రాక్టును నామినేషన్‌పై కట్టబెట్టింది. ఆ ముద్రణ సంస్థ తప్పు చేసి అడ్డంగా దొరికిపోయినా ప్రభుత్వం మళ్లీ భారీ కాంట్రాక్టును అప్పగించడం సంచలనంగా మారింది. 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్‌లో రెండో ఏడాదికి కొత్త సిలబస్‌ ప్రవేశపెట్టారు.

నూతన సిలబస్‌ ఆధారంగా పాఠ్య పుస్తకాల(సేల్‌ బుక్స్‌) ముద్రణ కాంట్రాక్టును రూ.19 కోట్లకు వీజీఎస్, విక్రమ్‌ సంస్థలకు అప్పగించారు. ఈ సంస్థలకు కాంట్రాక్టు అప్పగించేందుకు ఏకంగా టెండర్‌ నిబంధనలనే మార్చేశారు. పనులు దక్కించుకున్న వీజీఎస్‌ కాపీరైట్‌ చట్టాలను ఉల్లంఘించి పుస్తకాల పీడీఎఫ్‌ కాపీలను లీక్‌ చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఈ వ్యవహారంలో కార్పొరేట్‌ విద్యాసంస్థల నుంచి రూ.10 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వీజీఎస్‌కు అప్పగించిన ముద్రణ కాంట్రాక్టును తెలుగు అకాడమీ రద్దు చేసింది. కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించిందని వీజీఎస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా ఆ సంస్థపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అదే సంస్థకు రూ.70 కోట్ల విలువైన పాఠశాల పాఠ్యపుస్తకాల ముద్రణను నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టడంపై విమర్శలు 
వెల్లువెత్తుతున్నాయి. 

నిబంధనలు మార్చి... నామినేషన్‌పై పనులు అప్పగించి
గతంలో ఎస్సీఈఆర్టీ సిలబస్‌ పుస్తకాల ముద్రణలోనూ వీజీఎస్‌ తప్పుడు మార్గాలను అనుసరించిందని బ్లాక్‌ లిస్టులో పెట్టారు. అటువంటి సంస్థకు ఏకంగా టెండర్‌ నిబంధనలనే మార్చేసి ఇంటర్మీడియెట్‌ పుస్తకాల ముద్రణ కాంట్రాక్టును అప్పగించారని, దీనివెనుక విద్యాశాఖ మంత్రి కార్యాలయంతోపాటు విద్యాశాఖలోని అత్యున్నతాధికారి పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా, వీజీఎస్‌ ఇంటర్‌ పుస్తకాల పీడీఎఫ్‌ను లీక్‌ చేసి అడ్డంగా దొరికిపోయింది. కానీ ఆ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా... రూ.70 కోట్ల విలు­వైన పాఠశాల పాఠ్య పుస్తకాల ముద్రణ కాంట్రా­క్టును నామినేషన్‌పై కట్టబెట్టబెట్టడం గమనార్హం. వాస్తవానికి పాఠశాల పుస్తకాల ముద్రణ కాంట్రాక్టు కోసం గతంలో టెండర్లు పిలిచేవారు. గతేడాది నుంచి నామినేషన్‌ విధానంలో అప్పగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement