U.S. Secretary of State
-
ప్రస్తుతానికి ఇబ్బందులు తప్పవు
న్యూఢిల్లీ: వీసాల జారీ విషయంలో మరింత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. వలసల విధానాన్ని మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టామని, ఈ మార్పు సమయంలో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఉండొచ్చని అన్నారు. చట్టబద్ధమైన వలసదారులకు ప్రయోజనం చేకూర్చేలా అంతిమంగా ఒక సమర్థవంతమైన వ్యవస్థను తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని తేల్చిచెప్పారు. ‘ప్రపంచంలో వలసలను స్వాగతించే అతిపెద్ద దేశం అమెరికా’అని ఉద్ఘాటించారు. అక్రమ వలసదార్ల సవాలును పరిష్కరించడానికి వీసాల జారీలో సంస్కరణలు ప్రారంభించామని, ఇందులో భారత్‌ను ఎంతమాత్రం టార్గెట్ చేయడం లేదని వివరణ ఇచ్చారు. ఇటీవలి కాలంలో వీసా, వలస విధానాల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేసిన మార్పుల పట్ల భారత్ ఆందోళనను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్.. మార్కో రూబియో దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ విధానపరమైన మార్పుల వల్ల చట్టబద్ధమైన వలసలు ప్రతికూలంగా ప్రభావితం కాకూడదని అన్నారు. ఎస్.జైశంకర్, రూబియో ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రధానంగా భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. కీలక రంగాల్లో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని, కలిసికట్టుగా ముందుకెళ్లాలన్న అభిప్రాయానికి వచ్చారు. అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల మధ్య సంబంధాలే భారత్–అమెరికా సంబంధాలకు కీలకమని జైశంకర్ అన్నారు. అమెరికాల వీసాల జారీ విషయంలో భారతీయులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి రూబియోకు తెలియజేశానని వెల్లడించారు. చట్టబద్ధంగా వెళ్లేవారిని ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని కోరానని పేర్కొన్నారు. అక్రమ వలసలను అరికట్టే విషయంలో అమెరికాకు సహకరిస్తున్నామని గుర్తుచేశారు. చట్టబద్ధమైన వలసలకు అడ్డంకులు సృష్టించవద్దని అమెరికాకు సూచించారు. అన్నింటికంటే ముఖ్యంగా రెండు దేశాల వ్యాపార, సాంకేతిక, పరిశోధన సహకారానికి వలసలు కీలకమని ఉద్ఘాటించారు. హెచ్–1బీ వీసా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేయడం భారతీయులకు శరాఘాతంగా మారింది. గ్రీన్ కార్డు విషయలోనూ వారు ఆందోళనకు గురవుతున్నారు. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే స్వదేశానికి వెళ్లేలా నిబంధన తీసుకొచ్చారు. అమెరికా తన విదేశాంగ విధానాన్ని ‘అమెరికా ఫస్ట్’గా నిర్దేశించుకుందని, భారతదేశానికి ‘ఇండియా ఫస్ట్’విధానం ఉందని జైశంకర్ అన్నారు. స్వదేశీ జాతీయ ప్రయోజనాకు ఇరుదేశాలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని వివరించారు. భారత్ మా లక్ష్యం కాదు గ్రీన్ కార్డ్ నిబంధనల్లో మార్పులపై ప్రశ్నకు రూబియో సమాధానమిస్తూ.. ప్రస్తుత వ్యవస్థను సంస్కరించే సమగ్ర విధానంలో ఇది ఒక భాగమని వెల్లడించారు. అమెరికాలో వలస సంక్షోభం నెలకొందని అంగీకరించారు. ఇది భారతదేశం వల్ల జరిగిందని తాను చెప్పడం లేదన్నారు. గత కొన్నేళ్లుగా 2 కోట్ల మందికి పైగా ప్రజలు చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించారని, ఆ సవాలును పరిష్కరించాల్సి ఉందని వివరించారు. ప్రస్తుత వ్యవస్థను సంస్కరించే ప్రక్రియలో భారత్ తమ లక్ష్యం కాదని బదులిచ్చారు. ఎప్పుడైనా ఒక సంస్కరణను చేపట్టినప్పుడు, ప్రజలు భాగస్వాములయ్యే వ్యవస్థలో మార్పు చేసినప్పుడు.. కొన్ని ఇబ్బందులను, అవరోధాలను సృష్టించే ఒక పరివర్తన కాలం ఉంటుందని వ్యాఖ్యానించారు. మన గమ్యం ఒక మెరుగైన వ్యవస్థగా, మరింత సమర్థవంతమైన వ్యవస్థగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న దానికంటే మెరుగైన, సుస్థిరమైన వీసా విధానాన్ని తీసుకురాబోతున్నామని వెల్లడించారు.మూర్ఖులు ఎక్కడైనా ఉంటారు అమెరికాలో భారతీయులు జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నారనే ఆరోపణల్లో నిజం లేదని మార్కో రూబియో తెలిపారు. నిజంగా భారతీయులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని అన్నారు. ఆన్లైన్లో, బయట కూడా వ్యాఖ్యలు చేసిన వారు కచ్చితంగా ఉంటారని నేను భావిస్తున్నానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ తెలివితక్కువ ప్రజలు, మూర్ఖులు ఉంటారని వ్యాఖ్యానించారు. ఇక్కడ మూర్ఖులు ఉన్నారని కచ్చితంగా తెలుసని అన్నారు. అమెరికాలో కూడా ఎల్లప్పుడూ తెలివితక్కువ వ్యాఖ్యలు చేసే మూర్ఖులు ఉన్నారని తేల్చిచెప్పారు. -
‘ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’...
జెనీవాలో బుధవారం మానవ హక్కుల మండలి సమావేశం జరుగుతోంది. ఐక్యరాజ్యసమితి మండలి అది. అత్యంత కీలకమైన సమావేశం. దేశాలన్నీ బాధ్యతగా హాజరవుతాయి. మానవ హక్కుల గురించి మాట్లాడతాయి. మనమూ వెళ్లాం. మన పొరుగున ఉండే పాకిస్తాన్ కూడా వచ్చింది. ఎప్పటిలా జమ్మూ–కశ్మీర్లో ఉగ్రవాదం గురించి, స్వతంత్ర ప్రతిపత్తి గురించి మాట్లాడ్డం మొదలు పెట్టింది! మాట్లాడినంతా మాట్లాడనిచ్చి, మన దౌత్య అధికారి సీమా పూజాని మైక్ అందుకున్నారు. ‘నీకు సంబంధం లేని విషయం లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు?’ అని ప్రశ్నించారు. ‘ఆగస్టులో జరిగిన సదస్సులో కూడా ఇలాగే ఎక్కువ చేశావు’ అని హెచ్చరించారు. అక్కడితో ఆగలేదు. ఆ దేశం ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నుతోంది, భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ వేదికల్ని ఎలా వాడుకుంటోందో మండలి సభ్యులందరి దృష్టికి తెచ్చారు. ఆ యువ ఐ.ఎఫ్.ఎస్. ఇచ్చిన ‘రైట్ ఆఫ్ రిప్లయ్’కి దేశంలో ఇప్పుడు ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ∙∙ సీమా పూజాని ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫున మాట్లాడే హక్కు కలిగిన సెకెండ్ సెక్రెటరీ. దౌత్య అధికారి. ఆమె ఇచ్చిన సమాధానం గానీ, చేసిన ప్రకటన గానీ భారత్ తరఫున అధికారికం అవుతుంది. అందుకే హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ ఆరోపణలను ఆమె తిప్పికొట్టిన విధానానికి దౌత్యపరమైన ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణ భాషలో చెప్పాలంటే.. ‘ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’ అని ఆ దేశానికి చెప్పడమే. సీమను తగిన పోస్ట్‌లోనే నియమించుకుంది భారత్. 2014 సివిల్స్‌లో ఆలిండియా ర్యాంకర్ ఆమె. 34వ ర్యాంకు సాధించి, ఇండియన్ ఫారిన్ సర్వీసును ఎంచుకున్నారు. అప్పటికి ఆమె ‘లా’ పూర్తయింది. ‘లా’ లోనే పై చదువుల కోసం జర్మనీ వెళ్లి అక్కడి ప్రతిష్టాత్మక బ్యూసెరియస్ లా స్కూల్ చేరుదామని అనుకుని కూడా.. సివిల్స్ సాధించాలనే తన కలలోకి మళ్లీ వెళ్లిపోయారు. రెండో అటెంప్ట్‌తో ఆమె కల నిజమైంది. సీమ హర్యానా అమ్మాయి. ఫరీదాబాద్‌లో పుట్టింది. ఇంట్లో తనే చిన్న. మిగతా ఇద్దరూ అక్కలు. తండ్రి అమర్నాథ్ పూజానీ రిటైర్డ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్. తల్లి గృహిణి. సీమ మొదట ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు. ఇంటర్లో సైన్స్ తీసుకున్నారు. ఇంటర్ తర్వాత మాత్రం ఇంజనీరింగ్ చేయలేదు. ‘లా’ వైపు వెళ్లిపోయారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్లో చదివారు. అప్పుడే విస్తృతంగా సామాజిక అంశాల అధ్యయనం చేశారు. దాంతో సివిల్స్ వైపు వెళ్లాలన్న ఆలోచన కలిగింది. మరీ చిన్నప్పుడైతే ఆమెకు వెటరినరీ డాక్టర్ అవాలని ఉండేదట. చివరికి ఆరోగ్యకరమైన దౌత్య సంబంధాలను నెరిపే బాధ్యతల్లోకి వెళ్లిపోయారు. అవసరమైతే మాటకు మాటతో చికిత్స కూడా. సమితి మానవ హక్కుల మండలిలో మొన్న పాకిస్తాన్‌కు ఆమె చేసిన చికిత్స అటువంటిదే. సమితి హక్కుల ‘మండలి’లో సీమ మాటకు మాట -
నాడు అణుబాంబులు.. నేడు పుష్పగుచ్ఛాలు
కాలంతోపాటు గాయం మానిపోతుందంటారు. చరిత్రలోనే అత్యంత హేయమైన నరమేధాన్ని ఎదుర్కొన్న జపాన్ కూడా 'ఎన్నటికీ మర్చిపోలేని' గాయాన్ని మాన్పుకోవాలనుకుంటోంది. నాటి శత్రుదేశాలతో స్నేహం కోరుకుంటోంది. జీ7(గ్రూప్ ఆఫ్ సెవెన్) కూటమి ద్వారా ఆ ప్రక్రియకు గతంలోనే బీజాలు పడినప్పటికీ సోమవారం చోటుచేసుకున్న పరిణామంతో అది చారిత్రక మలుపుతిరిగింది. నాడు హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులు కురిపించిన అమెరికా నేడు పుష్పగుచ్ఛాలతో అణుబాంబు మృతుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ సహా జీ7 దేశాల మంత్రుల బృందం సోమవారం హిరోషిమాలోని అణుబాంబు మృతుల స్మారక స్థూపాన్ని సందర్శించింది. నాటి విధ్వంసంలో మరణించిన లక్షలాదిమందికి నివాళులు అర్పించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక అమెరికా విదేశాంగ మంత్రి హిరోషిమాను సందర్శించడం ఇదే మొదటిసారి కావటంతో జాన్ కెర్రీ పర్యటనపై సర్వత్రా ఆసక్తినెలకొంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ చేరుకున్న జాన్ కెర్రీ ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఇటలీ, కెనడా దేశాల మంత్రులతో కలిసి జపాన్ తో చర్చలు జరుపుతారు. పలు అభివృద్ధి అంశాలు, ఆర్థిక ఒప్పందాలపై అవగాహన కుదుర్చుకుంటారు. జపాన్ లో అడుగుపెట్టకముందు అమెరికాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కెర్రీ హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసినందుకు జపాన్ కు క్షమాపణలు చెప్పబోయేదిలేదని కుండబద్దలు కొట్టారు. దాదాపు మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన నాటి సంఘటనపట్ల విచారం వ్యక్తచేస్తామేతప్ప క్షమాపణలు కోరమని కెర్రీ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా 1945, ఆగస్టు 6న జపాన్ లోని పారిశ్రామిక నగరం హిరోషిమాపై అమెరికా యుద్ధవిమానాలు అణుబాంబు వేశాయి. మూడు రోజుల తర్వాత (ఆగస్టు 9న) తీర పట్టణం నాగసాకిపై మరో అణుబాబు పడింది. రెండు ఘటనల్లో దాదాపు మూడు లక్షల మంది చనిపోగా, 30 ఏళ్లపాటు రేడియేషన్ ఎఫెక్ట్ కొనసాగింది.


