ప్రస్తుతానికి ఇబ్బందులు తప్పవు | US immigration policy changes involving Green Cards, H-1B visas | Sakshi
Sakshi News home page

ప్రస్తుతానికి ఇబ్బందులు తప్పవు

May 25 2026 2:33 AM | Updated on May 25 2026 2:33 AM

US immigration policy changes involving Green Cards, H-1B visas

 వలసల విధానాన్ని మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాం  

వీసాల జారీలో మెరుగైన వ్యవస్థ తీసుకొస్తున్నాం  

వలసలను స్వాగతించే అతిపెద్ద దేశం అమెరికా  

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టీకరణ  

విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ  

మార్పుల వల్ల చట్టబద్ధమైన వలసలు ప్రభావితం కాకూడదన్న జైశంకర్‌  

న్యూఢిల్లీ: వీసాల జారీ విషయంలో మరింత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. వలసల విధానాన్ని మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టామని, ఈ మార్పు సమయంలో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఉండొచ్చని అన్నారు. చట్టబద్ధమైన వలసదారులకు ప్రయోజనం చేకూర్చేలా అంతిమంగా ఒక సమర్థవంతమైన వ్యవస్థను తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని తేల్చిచెప్పారు.

 ‘ప్రపంచంలో వలసలను స్వాగతించే అతిపెద్ద దేశం అమెరికా’అని ఉద్ఘాటించారు. అక్రమ వలసదార్ల సవాలును పరిష్కరించడానికి వీసాల జారీలో సంస్కరణలు ప్రారంభించామని, ఇందులో భారత్‌ను ఎంతమాత్రం టార్గెట్‌ చేయడం లేదని వివరణ ఇచ్చారు. ఇటీవలి కాలంలో వీసా, వలస విధానాల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం చేసిన మార్పుల పట్ల భారత్‌ ఆందోళనను విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌.. మార్కో రూబియో దృష్టికి తీసుకెళ్లారు. 

ప్రభుత్వ విధానపరమైన మార్పుల వల్ల చట్టబద్ధమైన వలసలు ప్రతికూలంగా ప్రభావితం కాకూడదని అన్నారు. ఎస్‌.జైశంకర్, రూబియో ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రధానంగా భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. కీలక రంగాల్లో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని, కలిసికట్టుగా ముందుకెళ్లాలన్న అభిప్రాయానికి వచ్చారు. 

అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల మధ్య సంబంధాలే భారత్‌–అమెరికా సంబంధాలకు కీలకమని జైశంకర్‌ అన్నారు. అమెరికాల వీసాల జారీ విషయంలో భారతీయులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి రూబియోకు తెలియజేశానని వెల్లడించారు. చట్టబద్ధంగా వెళ్లేవారిని ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని కోరానని పేర్కొన్నారు. అక్రమ వలసలను అరికట్టే విషయంలో అమెరికాకు సహకరిస్తున్నామని గుర్తుచేశారు. చట్టబద్ధమైన వలసలకు అడ్డంకులు సృష్టించవద్దని అమెరికాకు సూచించారు. 

అన్నింటికంటే ముఖ్యంగా రెండు దేశాల వ్యాపార, సాంకేతిక, పరిశోధన సహకారానికి వలసలు కీలకమని ఉద్ఘాటించారు. హెచ్‌–1బీ వీసా నిబంధనలను ట్రంప్‌ ప్రభుత్వం కఠినతరం చేయడం భారతీయులకు శరాఘాతంగా మారింది. గ్రీన్‌ కార్డు విషయలోనూ వారు ఆందోళనకు గురవుతున్నారు. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే స్వదేశానికి వెళ్లేలా నిబంధన తీసుకొచ్చారు. అమెరికా తన విదేశాంగ విధానాన్ని ‘అమెరికా ఫస్ట్‌’గా నిర్దేశించుకుందని, భారతదేశానికి ‘ఇండియా ఫస్ట్‌’విధానం ఉందని జైశంకర్‌ అన్నారు. స్వదేశీ జాతీయ ప్రయోజనాకు ఇరుదేశాలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని వివరించారు.  

భారత్‌ మా లక్ష్యం కాదు  
గ్రీన్‌ కార్డ్‌ నిబంధనల్లో మార్పులపై ప్రశ్నకు రూబియో సమాధానమిస్తూ.. ప్రస్తుత వ్యవస్థను సంస్కరించే సమగ్ర విధానంలో ఇది ఒక భాగమని వెల్లడించారు. అమెరికాలో వలస సంక్షోభం నెలకొందని అంగీకరించారు. ఇది భారతదేశం వల్ల జరిగిందని తాను చెప్పడం లేదన్నారు. గత కొన్నేళ్లుగా 2 కోట్ల మందికి పైగా ప్రజలు చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించారని, ఆ సవాలును పరిష్కరించాల్సి ఉందని వివరించారు.

 ప్రస్తుత వ్యవస్థను సంస్కరించే ప్రక్రియలో భారత్‌ తమ లక్ష్యం కాదని బదులిచ్చారు. ఎప్పుడైనా ఒక సంస్కరణను చేపట్టినప్పుడు, ప్రజలు భాగస్వాములయ్యే వ్యవస్థలో మార్పు చేసినప్పుడు.. కొన్ని ఇబ్బందులను, అవరోధాలను సృష్టించే ఒక పరివర్తన కాలం ఉంటుందని వ్యాఖ్యానించారు. మన గమ్యం ఒక మెరుగైన వ్యవస్థగా, మరింత సమర్థవంతమైన వ్యవస్థగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న దానికంటే మెరుగైన, సుస్థిరమైన వీసా విధానాన్ని తీసుకురాబోతున్నామని వెల్లడించారు.

మూర్ఖులు ఎక్కడైనా ఉంటారు  
అమెరికాలో భారతీయులు జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నారనే ఆరోపణల్లో నిజం లేదని మార్కో రూబియో తెలిపారు. నిజంగా భారతీయులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని అన్నారు. ఆన్‌లైన్‌లో, బయట కూడా వ్యాఖ్యలు చేసిన వారు కచ్చితంగా ఉంటారని నేను భావిస్తున్నానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ తెలివితక్కువ ప్రజలు, మూర్ఖులు ఉంటారని వ్యాఖ్యానించారు. ఇక్కడ మూర్ఖులు ఉన్నారని కచ్చితంగా తెలుసని అన్నారు. అమెరికాలో కూడా ఎల్లప్పుడూ తెలివితక్కువ వ్యాఖ్యలు చేసే మూర్ఖులు ఉన్నారని తేల్చిచెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement