breaking news
Umarani
-
దత్తత పేరుతో శిశువుల విక్రయం
సూర్యాపేట టౌన్: ఇతర రాష్ట్రాల నుంచి శిశువులను అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేటకు చెందిన భార్యాభర్తలు నక్క యాదగిరి, ఉమారాణితోపాటు మరో 11 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బుధవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.నరసింహ మీడియాకు వెల్లడించారు. ముంబై, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి కొన్ని ముఠాల ద్వారా శిశువులను తీసుకొచ్చి ఒక్కో శిశువును రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీరు ఇప్పటివరకు టేకుమట్లలో ముగ్గురు మగశిశువులను, సూర్యాపేట పట్టణంలో ఇద్దరు ఆడ శిశువులను, పెన్‌పహాడ్‌లో ఒక మగ శిశువు, ఉప్పలపహాడ్‌లో ఇద్దరు మగ శిశువులు, తిప్పర్తి మండలం చిన్న సూరారం గ్రామంలో ఒక ఆడశిశువు, హైదరాబాద్‌లో ఒక మగ శిశువును విక్రయించినట్టు గుర్తించారు. పిల్లలందరినీ రక్షించి నల్లగొండ జిల్లా కేంద్రంలోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. అరెస్టయినవారిలో నక్క యాదగిరి, ఉమారాణి, కోరె నాగేంద్రకుమార్, కొట్టె రామలక్ష్మి, పిల్ల పావని, గరికముక్కు విజయలక్ష్మి, ఆముదాలపల్లి సత్యమణి, నాగర్‌కర్నూల్‌కు చెందిన ముడావత్ రాజు, హైదరాబాద్‌కు చెందిన ఎండి.షాహానా, ఇస్తా శోభారాణి, సబావత్ శ్రీనివాస్, ఏర్పుల సునీత, రాజస్తాన్‌కు చెందిన ఖాన్ షాహీనా ఉన్నారు. ఈ ముఠాపై గతంలో మేడిపల్లి, మునగాల, మంగళగిరి, జనగామ, ముంబైలో కేసులు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. శిశువుల విక్రయం ఇలా.. యాదగిరి, ఉమారాణి దంపతులు వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఇతర రాష్ట్రాల నుంచి శిశువులను తీసుకొచ్చి విజయవాడకు చెందిన కోరె నాగేంద్రకుమార్ మధ్యవర్తిత్వంతో దత్తత పేరుతో విక్రయిస్తున్నారు. సూర్యాపేట మండలం టేకుమట్లకు చెందిన అంజయ్య, నాగయ్య పిల్లల కోసం నక్క యాదగిరిని సంప్రదించారు. వారికి 15 రోజుల మగ శిశువును విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. వీరిపై నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు శిశువును అప్పగించే సమయంలో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో మరో 11 మంది ముఠా ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే వారిని అరెస్టు చేశారు. కొనుగోలుచేసిన వారినుంచి శిశువులను పోలీసులు తీసుకురావటంతో వారంతా సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పిల్లలను ఇవ్వకపోతే స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. -
ప్రాణాన్ని బలి తీసుకున్న ‘పరువు’
తండా పరువు తీస్తున్నావని పంచాయతీ పెట్టిన పెద్దలు అవమానంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య ఒంటరిగా కన్పించినందుకు పంచాయతీ పెట్టారు. తండావాసులందరి సమక్షంలో ఆమెను నిలదీశారు. తండా పరువు తీస్తున్నావని ఆమెను మందలించారు. దీంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. పరువు కోసం పెట్టిన పంచాయతీ నిండు ప్రాణాన్ని బలిగొంది. పెంబి(ఖానాపూర్) : పెంబి మండలం ఇటిక్యాల పంచాయతీ పరిధిలోని కిష్టునాయక్‌తండాకు చెందిన డిగ్రీవిద్యార్థిని ఉమారాణి(20) మనస్థాపానికి గురై మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కిష్టునాయక్ తండాకు చెందిన దశరత్, లలిత దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కుతురు ఉమారాణి(20) ఈ నెల 1న గ్రామశివారు ప్రాంతంలో పలువురు గ్రామస్తులకు ఒంటరిగా కనిపించింది. ఈ విషయమై తండా పరువు తీస్తున్నావంటు గ్రామానికి చెందిన పలువురు పెద్దలు ఈ నెల 2న గ్రామంలో పంచాయతీ పెట్టి అందరి సమక్షంలో ఆమెను నిలదీశారు. దీంతో అవమానానికి గురైన యువతి మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకులు వెంటనే పెంబిలోని ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో యువతి మార్గమధ్యలోనే మృతి చెందింది. విద్యార్థి తండ్రి దశరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెంబి ఎస్ఐ కాశవేని సంజీవ్‌కుమార్ తెలిపారు. కాగా పంచాయతీ పెట్టి యువతి మృతికి కారణమైన వారందరిపై విచారణ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి క్వాలిఫై అయి.. కాగా ఉమారాణి అక్లోబర్‌లో నిర్వహించిన కానిస్టేబుల్ మెయిన్స్‌కు ఎంపికైంది. ఉద్యోగ ఎంపిక పరీక్షలో 86 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. నిర్మల్‌ల్లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఉమారాణి అందరితో కలివిడిగా ఉండేది. ఉమారాణి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులు, బంధువులతో పాటు గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. యువతి ఆకస్మికంగా మరణించడంతో పెంబి గ్రామానికి చెందిన నాయకులు పుప్పాల శంకర్, కున్సోత్ రమేశ్ తదితర నాయకులు ఆస్పత్రికి చేరుకొని కుటుంబీకులను పరామర్శించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం గ్రామానికి చేరుకుంది. -
21న జాబ్‌మేళా
కరీంనగర్ అర్బన్: హైదరాబాద్‌కు చెందిన కాల్హెల్త్ సర్వీసెస్ ప్రై వేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల నియామకాల కోసం ఈ నెల 21న ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరీంనగర్‌లోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సీహెచ్.ఉమారాణి తెలిపారు. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగి పదేళ్ల అనుభవం ఉన్న 20నుంచి 35 ఏళ్ల వయసుగల వారు అర్హులని పేర్కొన్నారు. విద్యార్హత, అనుభవం సర్టిఫికెట్లతో ఇంటర్వూ్యలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైనవారికి రూ.20వేల నుంచి 24వేల వేతనం ఉంటుందని పేర్కొన్నారు.