breaking news
thuesday
-
పేదలకు అండగా వైఎస్సార్ సీపీ
రామచంద్రపురం(ఉంగుటూరు) : కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడంలో వైఎస్సార్ సీపీ ముందుంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని చెప్పారు. మంగళవారం రాత్రి నల్లమాడు శివారు రామచంద్రపురంలో జరిగిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం జిల్లాలో దిగ్విజయంగా జరుగుతుందని చెప్పారు. ఎన్నికలప్పుడు అలవికాని హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని మరిచిపోయారని విమర్శించారు. రెండున్నరేళ్లయినా వాటిలో ఒక్కదానిని కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు నమ్మిన ప్రజలను వంచించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ సీపీ నిరంతరం పేదల పక్షానే ఉంటుందన్నారు. రామచంద్రపురంలో వర్షం పడుతున్నా.. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం విజయవంతం అయిందంటే దీనికి ప్రజల ఆదరాభిమానాలే కారణమన్నారు. వైఎస్సార్ సీపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో 12 గ్రామాలలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించామని, విశేష స్పందన వచ్చిందని చెప్పారు. అంతకుముందు గ్రామస్తులు ఆళ్లనానికి సాదరస్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మాజేటి సురేష్, పార్టీ మండల కన్వీనర్లు మరడ మంగరావు(ఉంగుటూరు), రావిపాటి సత్యశ్రీనివాస్(భీమడోలు), సంకు సత్య కుమార్(నిడమర్రు), రామచంద్రపురం నాయకులు గౌతు అప్పారావు, గౌతు రాము, శివ శంకర్,సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
30 కంపెనీలతో ‘నన్నయ్య’ ఒప్పందం
పెనుగొండ : నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు, 30 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు రాజమండ్రి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాల నాయుడు తెలిపారు. పెనుగొండ ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాలలో తెలుగు విభాగం సౌజన్యంతో ర్యాలీ ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘వచనా కవితా శతావధానం’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పరిధిలో 450 కళాశాలలు, లక్ష మంది విద్యార్థులు ఉన్నారన్నారు. వీరికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విశేష కృషి చేస్తున్నట్టు చెప్పారు. చదువులో రసజ్ఞత, విచక్షణ అనే లక్షణాలు తప్పక చూడాలని అన్నారు. విద్యార్థి ముందుగా తన వ్యక్తిత్వంలో, జీవితంలో ఉన్న లోపాలను, సమస్యలను గుర్తించాలన్నారు. వీటిని గుర్తించిన నాడు ప్రతి విద్యార్థి సమాజం ముందుకు అబ్దుల్ కలాం రూపంలో వస్తారన్నారు. వివేకానంద, ఆదిశంకరాచార్యులు వంటి వ్యక్తులు ప్రత్యక్ష గురువులుగా వెలుగులోకి వచ్చారన్నారు. సమాజంలో బాహ్య చీకటి, అంతర్గత చీకటి ఉంటాయని, బాహ్యచీకటిని విద్యుత్ వెలుగులతో తొలగిస్తే, అంతర్గ చీకటిని తొలగించే శక్తి సామర్థ్యాలు కేవలం గురువుకు మాత్రమే ఉన్నాయన్నారు. విద్యాలయాలకు భక్తితో వచ్చి క్రమశిక్షణతో కోర్సులు పూర్తిచేయాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ నరశింహరాజు మాట్లాడుతూ వచన కవిత్వంలో శతావధాన ప్రక్రియకు నన్నయ్య విశ్వవిద్యాలయం తరువాత పెనుగొండ కళాశాల వేదిక కావడం గర్వంగా ఉందన్నారు. అనంతరం ర్యాలీ ప్రసాద్ వచన కవిత్వ శతావధానం అకట్టుకొంది. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు పితాని సూర్యనారాయణ, సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ కలిదిండి రామచంద్రరాజు, కోశాధికారి ఉద్దగిరి లవకుమార్, సంయుక్త కార్యదర్శులు సూర్నిడి రామ కోటేశ్వరరావు, పెన్మెత్స వెంకట సుబ్రహ్యణ్యం రాజు, ఉపాధ్యక్షుడు తాడి నాగిరెడ్డి పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై ప్రమాదంవ్యాన్‌ను ఢీకొట్టిన లారీ
సత్యనారాయణపురం (దెందులూరు)/ఏలూరు అర్బన్ : జాతీయ రహదారిపై దెందులూరు మండలం సత్యనారాయణపురం రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు రూరల్ గ్రామం శ్రీపర్రు, కష్ణా జిల్లా, మండవల్లి మండలం, నందిగామలంక, పెనుమాక లంక గ్రామాలకు చెందిన కొందరు కూలీలు దెందులూరు మండలం పోతునూరులో చేపల పట్టుబడికి మంగళవారం ఉదయం శ్రీపర్రు నుంచి వ్యాన్‌లో బయలుదేరారు. వ్యాన్ జాతీయ రహదారి సమీపంలో ఉన్న సత్యనారాయణపురం వద్దకు చేరుకున్న సమయంలో వెనుకగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వ్యాన్ బోల్తాపడింది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న వారిలో 16మంది తీవ్రంగా గయపడ్డారు. ఈ సమయంలో వ్యాన్‌లో 30 మంది కూలీలు ఉన్నారు. గాయపడిన వారు పెనుమాకలంక, నందింగంపాడు గ్రామాలకు చెందినవారుగా సమాచారం. క్షతగాత్రులను నాలుగు అంబులెన్సుల్లో పోలీసులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దెందులూరు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ. వెంకటరమణ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్, ఎ.వి.ఆర్.మోహన్‌ను కోరారు. -
మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు కృషి
ఏలూరు అర్బన్: జిల్లాలో మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖలోని అన్ని స్థాయిల ఉద్యోగులు, సిబ్బంది సమష్టి కృషిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్. కె.కోటేశ్వరి అన్నారు. స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో మంగళవారం మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టñ న్షన్ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మాతా, శిశుమరణాలను పూర్తిగా నిరోధించే యోచనతో కేంద్రం ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత అభియాన్ పేరిట నూతన కార్యక్రమం అమలు చేస్తుందన్నారు. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పథకాలను అమలు చేస్తుందన్నారు. ఏఎన్ఎం స్థాయి నుంచి అన్ని స్థాయిల వారు తమ ప్రాంత గ్రామాల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ, సురక్షిత ప్రసవాలు ఎక్కువ సంఖ్యలో జరిగేలా ప్రజలను చైతన్యపరచాలని కోరారు. గర్భిణులకు పూర్తిస్థాయి వైద్య సేవలందించాలని, హైరిస్క్ గుర్తించిన సమయాల్లో వారిని అన్ని వసతులు గల ఆస్పత్రుల్లో చేర్పించాలన్నారు. అడిషనల్ డీఎంహెచ్‌వో పి.ఉమాదేవి, జబార్, డాక్టర్, రోషన్మియా, డాక్టర్, రాథోడ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్సల్టెంట్, డాక్టర్, మిస్బా, డెమో చదలవాడ నాగేశ్వరరావు పాల్గొన్నారు.