telugu peoples
-
తెలుగు ప్రజలకు YS జగన్ ఉగాది శుభాకాంక్షలు
-
ఇరాన్ దాడుల నేపథ్యంలో తెలుగు వారి ఆందోళన
-
ఢిల్లీలో తెలుగు ఓట్ల కోసం వేట!
ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు వారి పాత్ర తక్కువేం కాదు. దేశ రాజధానిలో కోటిన్నర ఓటర్లుంటే అందులో మనవారి వాటా అయిదున్నర శాతం. తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. మీట్ అండ్ గ్రీట్ పేరుతో బిజెపి దగ్గరయ్యే ప్రయత్నంచేస్తుండగా, తమ సొంత ప్రాంతాన్ని వదిలి ఇక్కడ ఉంటున్న తెలుగువారికి ఢిల్లీ తమ ఇళ్లే అన్న భద్రత భరోసా ఇస్తామంటోంది ఆప్.దేశరాజధాని ఢిల్లీని మిని ఇండియాగా అభివర్ణిస్తుంటారు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఏకంగా 15 భాషల్లో ఎన్నికల ప్రచారం జరిగే చోటు ఏదైనా ఉందంటే అది ఢిల్లీనే. చాలా ఏళ్ల కిందటే దేశం నలుమూలల నుంచి వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ ఢిల్లీలో స్థిరపడిపోయినవాళ్లు కొందరైతే.. కేంద్ర ఉద్యోగులు, ప్రొఫెషనల్, నాన్ ఫ్రొఫెషనల్ రంగాల్లో పనిచేస్తున్నవాళ్లూ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో సంఖ్యాపరంగా ఆధిపత్యం ఉత్తరాదివాళ్లదే అయినా.. 25 లక్షల పైచిలుకు ఓట్లతో దక్షిణాదిప్రజలు కూడా తమదైన ప్రభావం చూపిస్తున్నారు. కోటిన్నర ఓటర్లలో తెలుగువారు దాదాపు అయిదుశాతానికి పైనే ఉన్నారు. తెలుగువాళ్లు ప్రధానంగా ఢిల్లీలోని షాద్రా, మయూర్ విహార్, లజ్‌పత్ నగర్, సరితా విహార్, ద్వారక, వికాస్పురి, కేశవపురం, రోహిని, మునిర్కా, వసంత్ విహార్ నివసిస్తుంటారు. పలు తెలుగు సంఘాలు, సంస్థల లెక్కల ప్రకారం అక్కడ సుమారు 9 లక్షల మంది తెలుగువాళ్లున్నారు. తెలుగువారికి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం ఇక్కడ లోటుగా కనిపిస్తోంది.తెలుగు ప్రజలను కలుస్తున్న పార్టీలు వారిని ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. సొంతూళ్లకు దూరంగా ఉంటున్న ఢిల్లీలోని తెలుగువారికి తగిన భద్రత, ప్రయోజనాలు ఇస్తామంటూ ఆప్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.ఢిల్లీలో తెలుగువారి సంక్షేమం కోసం పలు తెలుగుసంఘాలు పనిచేస్తున్నాయి. ఆంధ్రా అసోసియేషన్, ఢిల్లీ తెలుగు సంఘం, ఆదిలీలా ఫౌండేషన్ పేరుతో పండుగల సమయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. తెలుగువారిని ఒక వేదికపైకి తీసుకువస్తుంటాయి. అయితే తెలుగు ప్రజలు సైతం తమకంటూ కొంత రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రయత్నం చేసినా పెద్దగా ఎవరు సక్సెస్ కాలేదు.18వ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరవ దశలో మే 25వ తేదీ శనివారం నాడు ఢిల్లీ 7 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది:::సాక్షి, ఢిల్లీ ప్రతినిధి -
Ugadi 2024: క్రోధిని కార్యసాధనంగా మలచుకుందాం!
ఉగాది తెలుగువారి తొలిపండుగ. ప్రభవతో మొదలు పెట్టి అక్షయ వరకు తెలుగు సంవత్సరాలు 60. ఈ వరుసలో ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఉగాదికి క్రోధి నామ సంవత్సర ఉగాది అని పేరు. క్రోధి అంటే కోపం కలవారని సామాన్యార్థం. క్రోధి అనే పదానికి కొన్ని నిఘంటువులు కోప స్వభావులైన కుక్క, దున్న΄ోతు అని అర్థం చెప్పినప్పటికీ, దానిని పరిగణనలోకి తీసుకోనక్కరలేదు. అన్ని స్వభావాల లాగే మనిషికి కోపం లేదా క్రోధం కూడా అవసరమే. మనకు ఎంత అవసరమో, అంతవరకు మాత్రమే కోపాన్ని ఉంచుకోవాలి. మిగిలిన దానిని నిగ్రహించుకోవాలి. ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడు కూడా కొన్ని సందర్భాలలో కోపించాడు. అలా మన జీవితాలకు అవసరమైన మేరకు మాత్రమే కోపాన్ని ఈ ఉగాది ఇస్తుందని, ఇవ్వాలనీ ఆశిద్దాం. ఉగాదితో చాంద్రమాన సంవత్సరం మొదలవుతుంది. పౌర్ణమిచంద్రుడు చిత్త లేదా చిత్ర నక్షత్రంతో కూడి ఉన్న మాసాన్ని చైత్రమాసంగా పిలుస్తారు. చైత్రమాసం తొలిరోజు అంటే చైత్రశుక్ల పాడ్యమి రోజు ఉగాది అవుతుంది. చంద్రుడు ఒక నక్షత్రంతో మొదలుపెట్టి, భూమి చుట్టూ తిరిగి మళ్లీ ఆ నక్షత్రం దగ్గరకు రావడానికి పట్టే కాలం నక్షత్రమాసం అవుతుంది. ఆ రోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. కాలానికి సూర్య, చంద్ర గమనాలుప్రాతిపదిక కాబట్టి ఈ మేరకు చాంద్ర–సౌర సంవత్సరం అవుతుంది. వ్యావహారిక శకానికి పూర్వం తొలిదశలో సప్తఋషులు నక్షత్ర సంవత్సరాన్ని, చాంద్ర–సౌర సంవత్సరాన్ని కలిపి పంచాంగాన్ని అమలులోకి తెచ్చారు. మూడు, ఐదు సంవత్సరాలలో వచ్చే అధికమాసాలను కలుపుకుని ఐదు సంవత్సరాలతో ఒక యుగం అని పంచాంగ పరంగా అమలు చేశారు. అప్పట్లో ఆ యుగం ఆరంభం శరత్ విషువత్, శరత్ ఋతువు లో ఉండేది. ఈ ఐదు సంవత్సరాల యుగంలో మొదటి సంవత్సరంలో మొదటి రోజు యుగాది అయింది; అదే ఉగాది అయింది. ఈ యుగం జ్యోతిష శాస్త్రానికి అనుగుణం గా కూడా రూపొందింది. ‘జ్యోతి’ అంటే నక్షత్రం అనీ ‘షం’ అంటే సంబంధించిన అనీ అర్థం. జ్యోతిషం అంటే నక్షత్రానికి సంబంధించినది అని అర్థం. చాంద్ర– సౌర గమనాలప్రాతిపదికన మన పంచాంగం నిర్మితమైంది. పంచాంగం ప్రకారం మనకు ఉగాది నిర్ణీతమైంది. విశ్వామిత్ర మహర్షి పంచాంగంలోనూ, కాలగణనంలోనూ కొన్ని ప్రతిపాదనలను, మార్పులను తీసుకు వచ్చాడు. ఆ తరువాత కాలక్రమంలో జరుగుతూ వచ్చిన ఖగోళమార్పులకు తగ్గట్లు గర్గ మహాముని సంవత్సరాదిని వసంత విషువత్కు మార్చాడు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు దాన్నే కొనసాగించారు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. సాంప్రదాయిక సంవత్సరాన్ని లేదా ఆచార వ్యవహారాల కోసం సంవత్సరాన్ని చైత్రమాసంతో మొదలుపెట్టారు. వసంతం, వసంతంతోపాటు ఉగాది... ఈ రెండు ప్రాకృతిక పరిణామాల్ని మనం మన జీవితాలకు ఆదర్శంగా తీసుకోవాలి, వసంత ఋతువు రావడాన్ని వసంతావతారం అని కూడా అంటారు. వసంతావతారం సంవత్సరానికి ఉన్న అవతారాలలో గొప్పది, ఆపై శోభాయామానమైంది. సంవత్సరానికి శోభ వసంతం. వసంతం మనకు వచ్చే ఋతువుల్లో ప్రధానమైంది లేదా కేంద్రభాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, చెట్లకు కొత్త చివుళ్లు, కోయిలల గానాలు, పచ్చదనం, పువ్వుల కళకళలను తీసుకు వచ్చేది వసంతమే. అందుకే వసంతంలో ఎక్కువ వేడి, చలి ఉండవు. వాతావరణం ఉల్లాసకరంగా ఉంటుంది. వసంతం శ్రేష్ఠమైంది కాబట్టే శ్రీకృష్ణుడు భగవద్గీతలో తాను ఋతువుల్లో వసంతాన్ని అని చె΄్పాడు. నాటి కవులు, పండితులు మొదలుకొని కళాకారుల వరకు అందరికీ వసంత రుతువంటేనే మక్కువ. వసంతాన్ని కుసుమాకరం అనీ, కుసుమాగమం అనీ అంటారు. కుసుమానికి పుష్పం, పండు, ఫలం అని అర్థాలు ఉన్నాయి. ఈ మూడూ మనకు ఎంతో అవసరం అయినవి. తప్పకుండా మనం వీటిని పొందాలి. మన జీవితాలు కూడా నిండుగా పుష్పించాలి, పండాలి, ఫలవంతం అవ్వాలి. వసంతాన్ని ప్రకృతి ఇస్తున్న సందేశంగా మనం గ్రహించాలి. వసంతం ఒక సందేశం దాన్ని మనం అందుకోవాలి, అందుకుందాం. సంవత్సరంలో ఉండే మంచితనం వసంతం. వసంతం ప్రకృతి నుంచి మనకు అందివచ్చే మంచితనం. ‘...సంతో వసంతవల్లోకహితం చరంతః ...‘ అని వివేక చూడామణిలో జగద్గురు ఆదిశంకరాచార్యులవారు అన్నారు. అంటే మంచివాళ్లు వసంతంలాగా లోకహితాన్ని ఆచరిస్తారు అని అర్థం. వసంతం వంటి హితం. హితం వంటి వసంతం మనకు, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి ఎంతో అవసరం. శుభానికి తొలి అడుగుగా, మంచితనానికి మారు పేరుగా అన్ని ఆరంభాలకూ ఆది అయిన తొలి పండుగగా ఉగాదికి విశిష్టత ఉంది. ఇతర పండుగలలా కాకుండా ఉగాది కాలానికి, ప్రకృతికి సంబంధించిన పండుగ. మనిషి కాలానికి, ప్రకృతికి అనుసంధానం అవ్వాలని తెలియజెప్పే ఒక విశిష్టమైన పండుగ. ఆరు ఋతువులకు ఆదిగా వచ్చేది ఈ పండుగ. సంవత్సరంలోని ఆరు ఋతువులకు ప్రతీకలుగా తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపుల్ని తీసుకుని ఆ రుచుల కోసం కొత్త బెల్లం, మిరియాల΄÷డి, వేపపువ్వు, మామిడి పిందెలు, ఉప్పు, కొత్త చింతపండు కలిపి తయారు చేసిన ఉగాది పచ్చడిని మనం తీసుకుంటున్నాం. నింబకుసుమ భక్షణం అని దీనికి పేరు. ఇది ఉగాది పండుగలో ముఖ్యాంశం. మరో ముఖ్యాంశం పంచాంగశ్రవణం. ఆదిలోనే ఎవరి రాశి ప్రకారం వారికి సంవత్సరంలో జరగడానికి అవకాశం ఉన్న మేలు, కీడులను ఆయా రాశి గల వ్యక్తులకు సూచన్రపాయంగా పంచాంగం తెలియచెబుతుంది. పంచాంగ శ్రవణానికి ముందుగా మనం అభ్యంగన స్నానం చేసి, మామిడి తోరణాలతో, పుష్పాలతో ఇళ్లను అలంకరించుకుని దైవపూజ చెయ్యాలి. ప్రకృతి ఇచ్చిన సందేశాలుగా అందివచ్చిన ఉగాదిని, వసంతాన్ని ఆకళింపు చేసుకుని, ఆదర్శంగా తీసుకుని, మనం మనకు, ఇతరులకు ఈ ఏడాదిలోని అన్ని ఋతువుల్లోనూ హితకరం అవుదాం. కాలం ఒక ప్రవాహం కాలం నదిలాంటిది. ముందుకు ప్రవహిస్తుందే కానీ, వెనక్కి తిరగదు. అలా ముందుకు ప్రవహించే నదిలో ఎన్నో సెలయేర్లు, వాగులు, వంకలు కలిసి ఉన్నట్టే... కాలవాహినిలో తృటి, క్షణం, ముహూర్తం, దినం మొదలైన కాలగతి సూచికలు మిళితమై ఉంటాయి. వీటిన్నింటి మేలు కలయికే కాల ప్రవాహం. ఇటువంటి కాలాన్ని ఉగాది రూపంలో ఆరాధించాలన్నదిప్రాచీనుల నిర్దేశ్యం. ప్రతి కొత్త సంవత్సరం శుభపరంపరలతో కొనసాగాలని కోరుకోవడంతోపాటు శుభాచరణకు మనల్ని మనం సమాయత్తం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఆరు రుచులలో అనేక అర్థాలు ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరు రుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి సరికొత్త ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్చే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈ సత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉగాది పచ్చడి. పంచాంగ శ్రవణ ఫలమేమిటి? ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు. ఉగాది పంచాంగ శ్రవణం వల్ల. భూమి, బంగారం, ఏనుగులు, గోవులతో కూడిన సర్వలక్షణ లక్షితమైన కన్యను యోగ్యుడైన వరునకు దానం చేస్తే కలిగే ఫలంతో సమానమైన ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తి. వీటితోపాటు సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం వల్ల గ్రహదోషాలు నివారితమై , వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందంటారు పెద్దలు. కాబట్టి ఉగాదినాడు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్ కార్యాచరణను చేపట్టవచ్చు. నూతనత్వానికి నాంది బ్రహ్మదేవుడు సృష్టినిప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలుప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభతరుణం మరొకటి లేదనే కదా అర్థం. – డి.వి.ఆర్. భాస్కర్ -
స్విట్జర్లాండ్‌లో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు
స్విట్జర్లాండ్‌లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు పాల్గొన్నారు. ఈ దీపావళి వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విటర్లాండ్ ప్రెసిడెంట్ గనికాంబ కడలి గారు, జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గారావు , ట్రెజరర్ మాధురి ముళ్ళపూడి , కల్చరల్ సెక్రెటరీ మాణిక్యవల్లి చాగంటి ,స్పోర్ట్స్ సెక్రెటరీ రామచంద్ర వుట్టి, ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
డల్లాస్‌లో నాట్స్ 5కే రన్/1కే ఫన్ వాక్
టెక్సాస్: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్ లో 5కే రన్/1కే ఫన్ వాక్, ఫుడ్ డ్రైవ్ లను నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ప్రతి ఏటా గాంధీ జయంతి సందర్భంగా మన తెలుగువారిలో ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తోంది. ఇందులో వారిని భాగస్వాములను చేసేందుకు ఈ కార్యకమాన్ని 2014 నుంచి నిర్వహిస్తూ వస్తుంది. డల్లాస్-ఫోర్టువర్తు మెట్రో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి దాదాపు 100 మందికి పైగా ఈ రేసులో పాల్గొన్నారు. ఫిటెనెస్ కోసం పరుగులు పెట్టే వారంతా 5కె రన్లో పాల్గొంటే.. ఆరోగ్యం కోసం 1కే ఫన్‌లో సరదాగా నడస్తూ ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఈ పరుగు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రేస్ బిబ్స్ ను అందించడం జరిగింది. దీని ఆధారంగా వారు 5K రన్ పూర్తి చేయటానికి తీసుకున్న సమయం, వారి వయోపరిమితి ఆధారంగా తీసుకోవడంతో పాటు మొదటి మూడు స్థానాలలో నిలిచిన వారిని విజేతలుకు పతకాలను అందించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల ఈ రన్ విజయవంతం కావడానికి తన వంతు సహకారం అందించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యక్రమాలకి తమ సహాయ సహకారాలను అందిస్తున్న అందరికి చాప్టర్ కోఆర్డినేటర్ సత్య శ్రీరామినేని ధన్యవాదాలు తెలిపారు. స్వాగత్ బిర్యానీస్ ఇండియన్ క్యూసిన్, ఫార్మ్ 2 కుక్, హిండ్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, వైకుంట్ డెవలపర్స్, క్లౌడ్ జెనిక్స్, ఏజ్నిక్స్ ఫార్మాస్యూటికల్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాల్వేషన్ ఆర్మీ కోసం నాట్స్ ఫుడ్ డ్రైవ్ నాట్స్ ప్రతి ఏటా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ఫుడ్ డ్రైవ్ కూడా డల్లాస్ నాట్స్ విభాగం ఈ 5కే రన్‌తో పాటు నిర్వహించింది. ఈ ఫుడ్ డ్రైవ్ కి కూడా మన తెలుగు వారి నుంచి విశేష స్పందన లభించింది. దీని ద్వారా విరాళంగా వచ్చిన ఆహారాన్ని డల్లాస్‌లోని స్థానిక సాల్వేషన్ ఆర్మీకి విరాళంగా అందించారు. డల్లాస్ టీం క్రీడా విభాగ నాయకులు గౌతం కాశిరెడ్డి, నాట్స్ డల్లాస్ చాప్టర్ కో-కోర్డినేటర్ రవి తాండ్ర, డల్లాస్ టీం సభ్యులు శ్రీథర్ న్యాలమడుగుల, రవీంద్ర చుండూరు, శ్రీనివాస్ ఉరవకొండ, త్రినాథ్ పెద్ది, యషిత, రేహాన్, సందీప్ తాతినేనితో పాటు ఇతర సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ డల్లాస్ విభాగం చేపట్టిన రన్, ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా క్రీడా విభాగ సభ్యులకు నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
‘మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం’
మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవటం తెలుగు వారిగా మన గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తుందని భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దిశగా తెలుగు వారంతా చొరవ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం మలేషియా, సింగపూర్ పర్యటనల్లో ఉన్న ఆయన, మలేషియా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలేషియాలోని తెలుగు సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. 41 ఏళ్ళ క్రితం రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు, నాటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు ఆహ్వానం మేరకు మిత్రులు జైపాల్ రెడ్డితో కలిసి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి సంస్కృతిలో జీవన విధానం, విశ్వాసాలు భాగంగా ఉంటాయన్న ఆయన, ఈ రెండు కాలగమనంలో పురోగమించాలే తప్ప, తిరోగమించరాదని సూచించారు. ఇటీవల తమ చెన్నై పర్యటనలో భాగంగా ఉన్నతమైన కుటుంబ విలువలకు చిరునామాగా నిలిచిన బటర్ ఫ్లై గ్రూప్ అధినేత మురుగేశన్ చెట్టియార్ గృహాన్ని సందర్శించారని అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ఇంటిలో 65 మంది కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవించడం గొప్పవిషయమని తెలిపారు. ఇలాంటి విలువలను ముందు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తమ కుమార్తె, మనుమడిని కూడా వారి ఇంటికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. భాష మన సంస్కృతికి జీవనాడి అన్న ఆయన, ఉన్నతమైన సంస్కృతి... ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తుందని, భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతమౌతాయని పేర్కొన్నారు. భారత్, మలేషియా మధ్య చక్కని బంధం ఏర్పడటంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమన్నారు. ఈ నేపథ్యంలో 1960ల నుంచి మలేషియా తెలుగు సంఘం పోషిస్తున్న పాత్రను అభినందించిన ఆయన, తెలుగు సాంస్కృతిక వారసత్వం, భాషను పరిరక్షించుకునేందుకు ప్రారంభమైన మలేషియా తెలుగు సంఘం, పేర్లు మార్చుకున్నా ప్రాథాన్యతలను మార్చుకోకుండా అదే స్ఫూర్తితో పని చేస్తుండటం ఆనందదాయకమన్నారు. మలేషియాలోని ఇతర ప్రజల మధ్య సామరస్యంగా జీవించటంలో, బహుళ జాతుల మధ్య తెలుగు సంఘం గౌరవం, గుర్తింపును నిలబెట్టడానికి వారు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఇదే స్పూర్తి భవిష్యత్ లోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. -
స్వాతంత్య్రోద్యమంలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం
సాక్షి, న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దేశవ్యాప్తంగా ఎందరో వీరులు, వీర వనితలు ఆత్మ త్యాగాలు చేశారని, ఈ పోరాటంలో తెలుగువారి పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా జాతీయవాద చైతన్యం పెరుగుతోందని చెప్పారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలోనూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థలు చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశాయని కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. భారతదేశ స్వాతంత్య్ర సిద్ధికి ఘనమైన చరిత్ర ఉన్నట్టుగానే, ఆంధ్రా అసోసియేషన్‌కు సైతం గొప్ప చరిత్ర ఉందని చెప్పారు. తెలుగు తేజం విప్లవ వీరుడైన అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన పోరాట స్ఫూర్తిని యావత్ దేశానికి తెలియజేసే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి ద్వారా అల్లూరి 125వ జయంతి కార్యక్రమాలను భీమవరంలో ఘనంగా నిర్వహించి, విగ్రహాన్ని ఆవిష్కరింపజేశామని తెలిపారు. ఈ నెల 22న అల్లూరి నడయాడిన ప్రాంతాల్లో పర్యటించి రూ.50 కోట్లతో ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రముఖ తెలుగు గాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడైన ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతిని కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నప్పటికీ.. భారతదేశంపై ఆ ప్రభావం లేకుండా ప్రజలపై ఆర్థిక మాంద్యం భారం పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, అసోసియేషన్ ప్రతినిధులు, ఢిల్లీలోని తెలుగు ప్రజలు పాల్గొన్నారు. -
రెండు వసంతాలు పూర్తి చేసుకున్న ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’
సింగపూర్‌లో 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ రెండు వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులందరూ కలిసి మా రెండేళ్ల ప్రయాణం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా విరాజిల్లేలా సంస్థ స్థాపించిన మొదటి రోజు నుండి సింగపూరులో నిక్షిప్తమైన తెలుగు సాహితీ సంపదను, కళాకారులను, సాహితీ వేత్తలను వెలుగులోకి తెస్తుందంటూ ప్రముఖులు కొనియాడారు. అనంతరం సంస్థ ప్రధాన ప్రధాన కార్యవర్గ సభ్యుల అంతరంగాలను ఆవిష్కరించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ రెండేళ్ల ప్రస్థానంలో తమ సంస్థను కలుపుకొని ప్రోత్సహించిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, తానా, మలేషియా తెలుగు సంఘం, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మొదలైన ప్రపంచవ్యాప్త సంస్థలకు, వారి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కవుటూరు రత్నకుమార్, సుబ్బు వి పాలకుర్తి,రాధిక మంగిపూడి, ఊలపల్లి భాస్కర్, చామిరాజు రామాంజనేయులు, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయనిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మలేషియాలో తెలుగు వైభవం.. 5 లక్షల పైమాటే..!
పరిచయంలేని ప్రదేశంలో మన ప్రాంతం వాళ్లు కనిపిస్తే ఆనందం! పరాయిగడ్డ మీద మన భాష వినిపిస్తే నైతిక బలం..!! సంఘాలు, సంస్థలను ఏర్పాటుచేసుకునేది ఇలాంటి మద్దతు కోసమే! మన మాట, సంస్కృతి, సంప్రదాయాలను పట్టి ఉంచుకోవడానికే!! నివసిస్తున్న దేశమేదైనా మన ఉనికి చాటుకోవడానికే!! ఇదంతా ఓ పోరాటం.. స్వస్థలాలను వదిలి దేశాంతరం వెళ్లిన వాళ్లంతా చేసే కనిపించని పోరాటం!! బ్రిటిష్ రాజ్యంలో మన తెలుగు వాళ్లు కూడా తెల్లవారి కూలీలుగా వాళ్ల కాలనీలకు వలస వెళ్లారు! అందులో మలేసియా ఒకటి! అక్కడి కొబ్బరి, రబ్బరు తోటలు సహా చాలా చోట్ల పనులకు కుదిరారు. అక్కడే స్థిరపడ్డారు. మాతృభాషను పరిరక్షించుకుంటే అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నట్లేనని భావించారు. తెలుగు సంఘం ఏర్పాటు చేసుకున్నారు. తెలుగును కాపాడుకుంటున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ద్వైవార్షిక సభలు ఇటీవల రవాంగ్‌లో నిర్వహించారు. ఆ సందర్భంగానే ఈ స్టోరీ! అది రవాంగ్ పట్టణం.. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు ఇరవై మైళ్ల దూరంలో ఉంటుంది. చుట్టూ ఆకాశపుటంచుల్లోకి కొమ్మలు చాచుకొని పెరిగిన.. ప్రపంచంలోకెల్లా ఎతైన మహావృక్షాలు, వాటితో పోటీపడే కొండలు, కోనలతో పచ్చగా.. ఆహ్లాదభరింతంగా ఉంటుంది. బహుశా ఆ వాతావరణం వల్లనే రవాంగ్ సామాజిక జీవితం కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. నెమ్మదిగా ప్రవహించే నదిలో సాఫీగా సాగిపోయే పడవ ప్రయాణంలా జనజీవితం కనిపిస్తుంది. ఆ రవాంగ్‌లో జూన్ 26వ తేదీ.. ఆదివారం పండగలాంటి సందడి నెలకొంది. మలేసియాకు నలుదిక్కులా ఉన్న రహదారులు రవాంగ్‌కు ప్రయాణమయ్యాయి. ఉదయం ఏడింటికే వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. రవాంగ్‌కు వందల మైళ్ల దూరంలోని జోహూర్, క్లింగ్, బాగాన్ డత్తో తదితర నగరాలు, పట్టణాలు, గ్రామాల నుంచి ఉదయం తొమ్మిదింటికల్లా వచ్చేశారు. ఇటు సింగపూర్, అటు థాయ్‌లాండ్ సరిహద్దు జిల్లాల నుంచి కూడా వందలాది మంది వచ్చారు. వాళ్లంతా ఆ దేశంలో పుట్టిపెరిగిన మలేసియన్ తెలుగువాళ్లు. ఎనభై ఏళ్లు దాటిన రెండో తరం పెద్దల నుంచి ఐదారేళ్ల నేటి తరం చిన్నారుల వరకూ ఉన్నారు. అది వాళ్లు ప్రాణప్రదంగా భావించే తెలుగుతల్లి ఆలయం. మలేసియా తెలుగు అకాడమీ భవన ప్రాంగణం. గత 50 ఏళ్లుగా ఆ ప్రాంగణంతో మలేసియా తెలుగువాళ్లకు అనుబంధం ఉంది. ఒకప్పుడు రవాంగ్ తెలుగు సంఘం కార్యాలయంగా, తెలుగు సాంస్కృతిక నిలయంగా వెలుగొందిన ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ఐదంతస్తుల తెలుగు అకాడమీ భవనాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని తెలుగువాళ్లంతా కలసి ఒక్కో రింగిట్ (అక్కడి కరెన్సీ) పోగు చేసుకొని ఆ భవానాన్ని కట్టుకున్నారు. అది అక్కడి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. 150 ఏళ్లకు పైగా కాపాడుకుంటున్న తల్లిభాష తెలుగును భవిష్యత్ తరాలకు వారసత్వ కానుకగా అందజేసేందుకు మలేసియా తెలుగు సంఘం సకల సదుపాయా లతో ఆ భవనాన్ని నిర్మించింది. విశాలమైన తరగతి గదులు, వసతి కేంద్రాలు, గ్రం«థాలయం, ఆటస్థలం వంటి అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. తెలుగు భాషాభివృద్ధి, బోధన, సాహిత్య అధ్యయనం, మలేసియా తెలుగువారి చరిత్రను గ్రంథస్థం చేయడం వంటి లక్ష్యాలతో ఏర్పాటైన తెలుగు అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్లు ఆ ఆదివారం అక్కడ సమావేశామయ్యారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మలేసియా తెలుగు సంఘం 44వ ద్వైవార్షిక ప్రతినిధుల మహాసభ కూడా అదే రోజు కావడం మరో విశేషం. కుటుంబ వేడుకలా... నిజానికి రెండేళ్ల క్రితమే తెలుగు అకాడమీ భవనం ప్రారంభం కావలసి ఉంది. కోవిడ్ కారణంగా వాయిదా పడింది. గతంలో ఏడాదికి రెండు, మూడు సార్లయినా ఎక్కడో ఒకచోట కలుసుకొనే తెలుగువాళ్లు గత రెండేళ్లుగా కలవలేకపోయారు. దాంతో జూన్ 26వ తేదీ నాటి కార్యక్రమం వారికి ఒక భావోద్వేగభరితమైన వేదికైంది. అందుకే ఇంటిల్లిపాదీ ఆ తెలుగు వేడుకల కోసం తరలివచ్చారు దూరభారాలు లెక్కచేయకుండా! దేశంలోని తెలుగు వాళ్లంతా ఆ రోజు అక్కడ ఒక కుటుంబంలా కలసిపోయారు. ఆత్మీయ పలకరింపులతో తెలుగు భాష తేనెలూరింది. సంప్రదాయ వస్త్రధారణతో తెలుగుదనం ఉట్టిపడింది. మలేసియా మాజీ ప్రధానమంత్రి దత్తో శ్రీ నజీబ్‌తోపాటు అక్కడి తెలుగు ప్రముఖులు అందరూ ఆ వేడుకకు హాజరయ్యారు. మొదటగా మలేసియా జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులూ’ అంటూ తెలుగుతల్లి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. అక్కడ తెలుగు సాంస్కృతిక వైభవాన్ని చాటే కార్యక్రమాలు, ప్రసంగాలు, ఆటలు, పాటలతో ఆ ఉదయం.. సాయంకాలంగా ఎప్పుడు కరిగిపోయిందో తెలియలేదు. మలేసియాలోని తెలుగువాళ్లు మొదట్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వాళ్లు పనిచేసే తోటల్లో తెలుగు బడులు, గుడులు ఉండేవి. పిల్లలు తెలుగు నేర్చుకొనేవారు. పెద్దవాళ్లు సాయంత్రం పూట రాముడి సన్నిధిలో చేరి కష్టసుఖాలను పంచుకొనేవారు. కాలక్రమంలో తెలుగు బడులు శిథిలమయ్యాయి. ఆ తదనంతర తరాలకు చెందినవారు ఉన్నత చదువులు చదువుకొని గొప్ప స్థానాల్లో స్థిరపడ్డప్పటికీ తల్లి భాష తెలుగుకు దూరమయ్యారు. మలేసియా తెలుగు సంఘానికి ఇది మనస్తాపంగా మారింది. ఈ క్రమంలోనే 2006లో ఆ సంఘం జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు నేతృత్వంలో తెలుగు భాషాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. మలేసియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పాఠ్యపుస్తకాలను తయారు చేశారు. పలు చోట్ల నీతిశిబిరాలు, తెలుగు తరగతులు ఏర్పాటు చేశారు. తెలుగు వారిని తిరిగి సంఘటితం చేశారు. మలేసియా అంతటా 30కి పైగా తెలుగు శాఖల్లో ఇది ఒక ఉద్యమంలా సాగింది. ప్రస్తుతం 6 వేల మంది పిల్లలు తెలుగు భాష నేర్చుకుంటున్నారు. ‘మలేసియా భూమిపైన తెలుగు వాడు ఉన్నంత కాలం తెలుగు వర్ధిల్లుతుంది. ఆ లక్ష్యంతోనే అకాడమీ నిర్మించుకున్నాం. భవిష్యత్ తరాలకు ఇది బాటలు వేస్తుంది. తెలుగుకు దూరమైన వాళ్లంతా ఇప్పుడు దగ్గరయ్యారు. పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు’అని సంతోషం వ్యక్తం చేశారు డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు. ఆయన నేతృత్వంలో మొదలైన తెలుగు భాషోద్యమం ఇప్పుడు చక్కటి ఫలితాలనిస్తోంది. తెలుగు వారి ముఖద్వారం బాగాన్ డత్తో... మలేసియా తెలుగువాళ్లకు గొప్ప చరిత్ర ఉంది. 150 ఏళ్లకు పూర్వమే వలస వెళ్లిన తెలుగువాళ్లు ఆ దేశ చరిత్రలో భాగమయ్యారు. ఒకప్పటి మలయా దేశం (ఇప్పుడు మలేసియా)లో కొబ్బరి, కాఫీ, తేయాకు, రబ్బరు, పామాయిల్ తోటల్లో పని చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుంచి కార్మికులను తరలించింది. 1850 నుంచే ఈ వలసలు మొదలైనప్పటికి 1890 నాటికి వేలాది మంది తమిళ, తెలుగు ప్రజలు పిల్లాపాపలతో, కట్టుబట్టలతో పొట్టచేతపట్టుకొని అక్కడికి చేరుకున్నారు. విశాఖ, చెన్నపట్టణం, తదితర రేవు పట్టణాల నుంచి బయలుదేరి ఓడలు ఏడు రోజుల తరువాత మలేసియాలోని పినాంగ్ రేవుకు చేర్చాయి. అలా వెళ్లిన తెలుగువాళ్లు పినాంగ్ నుంచి జంగ్ అనే చైనా వారి తెరచాప ఓడల్లో మలక్కా జలసంధి గుండా పేరాక్ నది ముఖద్వారమైన బాగాన్ డత్తోకు చేరుకున్నారు. ఆ రోజుల్లో అది ఒక చేపల రేవు. బ్రిటన్‌కు చెందిన స్ట్రెయిట్స్ ప్లాంటేషన్ కంపెనీకి చెందిన వేల ఎకరాల విస్తీర్ణంలోని కొబ్బరి తోటల్లో మొట్టమొదటి తెలుగు తరం పనిలో చేరారు. ఆ తరువాత తెలుగు కుటుంబాలు విస్తరిస్తున్న కొద్దీ వివిధ ప్రాంతాల్లో ఉన్న కొబ్బరి, రబ్బరు, పామాయిల్ తోటలకు స్థానికంగా వలసబాట పట్టారు. రబ్బరు తోటలతో నిండి ఉన్న రవాంగ్లోనూ బాగాన్ డత్తోకు సమాంతరంగా తెలుగు కుటుంబాలు విస్తరించాయి. ఒకప్పుడు గుప్పెడు మంది కూడా లేని తెలుగు జనాభా ఇప్పుడు ఇంచుమించు 5 లక్షలకు చేరుకుంది. ఉపాధి కోసం వెళ్లిన తెలుగు వాళ్లు బ్రిటిష్ కంపెనీల లాభాల కోసం నెత్తురు ధారపోశారు. ఆ తదనంతరం మలేసియా అభివృద్ధిలో భాగమయ్యారు. రెండు ప్రపంచయుద్ధాల కాలంలో మలేసియా స్వాతంత్య్రోద్యమంలో తెలుగు ప్రజల త్యాగాలు ఉన్నాయి. తెలుగు ఒక్కటే అస్తిత్వం... బ్రిటిష్ వారు పంపిన వలస కూలీలుగా మలేసియాకు చేరుకున్న తెలుగువాళ్లు బతుకుతెరువు కోసం తమిళ, మలయ్, చీనా తదితర భాషలను నేర్చుకున్నారు. అయినా మృతృభాష తెలుగును మాత్రం విస్మరించలేదు. ఎక్కడెక్కడో స్థిరడిన తెలుగు వాళ్లను ఆ భాషే ఒక్క గూటి పక్షులను చేసింది. అదొక్కటే వారి అస్తిత్వం. మెజారిటీ భాషల ఆధిపత్యం నుంచి తమ అస్తిత్వాన్ని కాపాడుకొనేందుకు ఎంతో కష్టపడ్డారు. తెలుగు బడులు మూసివేసిన తరువాత ఆ కష్టం మరింత ఎక్కువైంది. ‘ఒకదశలో తెలుగును బతికించుకోవడమే సవాలుగా మారింది. తెలుగు నీతి శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం తెలుగు బోధించాం. క్రమంగా ఫలితాలు కనిపించాయి’ అని చెప్పారు ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన చెగు అక్కయ్య అప్పల్నాయుడు. 74 ఏళ్ల వయస్సులో ఆయన ఇప్పుడు మలేసియాలోని అన్ని తెలుగు శాఖల్లో తెలుగు భాషా బోధన పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఇంచుమించు 1990 నుంచి 2005 వరకు తెలుగు భాష సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ఈ క్రమంలోనే ప్రతి కుటుంబంలో పిల్లలు, పెద్దలు తెలుగు రాయడం, మాట్లాడడం, చదవడం విధిగా అలవరచుకోవాలనే లక్ష్యంతో 2006లో మలేసియా తెలుగు సంఘం 50 ఏళ్ల స్వర్ణోత్సవాల సందర్భంగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొన్నారు. ఈ ఉద్యమానికి తెలుగు వారి నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభించాయి. ప్రతి ఇల్లు, ప్రతి తెలుగుశాఖ ఒక తెలుగు బడి అయింది. ఆరువేల మంది పిల్లలు ఇప్పుడు తెలుగుభాష పైన పట్టు సాధించారు. మలేసియా తెలుగువారి మహత్తరమైన తెలుగు వెలుగుల ప్రస్థానానికి ప్రతీకగానే తెలుగు అకాడమీ భవనం ప్రారంభమైంది. తెలుగుభాషోద్యమ రథసారథి 2006 నుంచి 2020 వరకు మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులుగా వ్యవహరించిన డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు తెలుగు నీతి శిబిరాలు, తెలుగు తరగతులు ఏర్పాటు చేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో ప్రాథమిక, మాధ్యమిక, ప్రవీణ, విశారద అనే నాలుగు దశల్లో తెలుగు బోధనకు అవసరమైన పాఠ్యప్రణాళికలను రూపొందించడం వెనుక ఆయన కృషి ఉంది. తెలుగు అకాడమీ భవన నిర్మాణాన్ని ఒక సవాలుగా తీసుకొని పూర్తి చేశారు. అలుపెరుగని అధ్యాపకుడు తెలుగు, తమిళ, మలయ్, ఇంగ్లిష్ భాషలపైన గట్టి పట్టు ఉన్న చెగు అక్కయ్య చెగు అప్పల్నాయుడు ఉపాధ్యాయ వృత్తిలో చేరినప్పటి నుంచి తెలుగు భాషా బోధన కోసం కృషి చేశారు. ఇప్పటికీ కాలికి బలపం కట్టుకొని మలేసియా అంతటా పర్యటిస్తూ తెలుగుశాఖలను ప్రోత్సహిస్తున్నారు. పాఠ్యప్రణాళికలను రూపొందించడంలోనూ, భాషాబోధనలోనూ ఆయన నిపుణులు. తెలుగు సాంస్కృతిక వారధి రెండో తరానికి చెందిన పెద్దలు, ఎనభై ఏళ్లు దాటినా తెలుగు భాషాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖ విద్యావేత్త డీవీ శ్రీరాములు. మలేసియాకు, తెలుగు రాష్ట్రాలకు నడుమ సాంస్కృతిక వారధిగా నిలిచారు. 1970ల నుంచే అక్కడి తెలుగు వాళ్లకు హైదరాబాద్, విశాఖ, సహా అన్ని ప్రాంతాలను పరిచయం చేయడంతో పాటు తెలుగు ఆత్మగౌరవాన్ని సమున్నతంగా చాటారు. ∙పగిడిపాల ఆంజనేయులు -
సింగపూర్‌లో రక్తదాన శిబిరం
సామాజికసేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం మరోసారి రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. 2021 నవంబరు 27, 28 తేదిల్లో స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బాంక్ నందు ఈ కార్యక్రమం జరిగింది. స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కరోనా సమయంలో తెలుగు సమాజం వరుసగా ఆరోసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం విశేషం. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 40 మంది రక్తదానం చేశారని నిర్వాహకులు జూనెబోయిన అర్జునరావు తెలిపారు. రక్తదానం పట్ల ఆసక్తి ఉన్న ఇతర దాతలు తర్వాత రోజుల్లో కూడా RO284 కోడ్ ఉపయోగించి రక్తదానం చేయవచ్చన్నారు. సింగపూర్ తెలుగు సమాజనికి, రెడ్‌క్రాస్‌తో పాటు బ్లడ్ బాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
Hurricane Ida: అమెరికా వరదల్లో.. మనోళ్లు ఇద్దరు మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో ఇడా తుపాను ప్రభావంతో సంభవించిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారిలో ఇద్దరు తెలుగు వారు ఉన్నట్లు తెలిసింది. వీరిని మాలతి కంచె(46) అనే సాఫ్ట్వేర్ డిజైనర్, ధనుష్ రెడ్డి(31)గా అధికారులు గుర్తించారు. ఈ నెల ఒకటో తేదీ సాయంత్రం రేరిటాన్‌కు చెందిన మాలతి కంచె(46) తన కుమారుడిని రట్జెర్స్ యూనివర్సిటీ కాలేజీలో దించి, కుమార్తె(15)తో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. బ్రిడ్జివాటర్ ప్రాంతంలో రూట్ –22 రోడ్డుపైకి అకస్మాత్తుగా చేరుకున్న నడుముల్లోతు వరద నీటిలో వారు చిక్కుకు పోయారు. కారులో నుంచి బయటపడిన తల్లి, కూతురు ఒక చెట్టును పట్టుకున్నారు. ఆ చెట్టు కూడా కూలిపోగా మాలతి వరద ఉధృతికి కొట్టుకు పోయారు. ఈదడం తెలిసిన ఆమె కూతురు సురక్షితంగా బయటపడింది. మాలతి గల్లంతైనట్లు సమాచారం అందుకున్న అధికారులు అన్వేషణ ప్రారంభిం చారు. ఆమె మృత దేహాన్ని అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని బౌండ్‌బ్రూక్ వద్ద శుక్రవారం కనుగొన్నారు. మాలతి స్వస్థలం హైదరాబాద్ కాగా, ఆమె భర్త ప్రసాద్ కంచె తెనాలికి చెందినవారు. వీరిది ప్రేమ వివాహం. మరో ఘటన న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ ప్రాంతంలో ఈ నెల 1వ తేదీన చోటు చేసుకుంది. ధనుష్ రెడ్డి అనే వ్యక్తి నడిచి వెళ్తుండగా అకస్మాత్తుగా వచ్చిన వరద తీవ్రతకు కొట్టుకు పోయారు. ధనుష్ రెడ్డి మృతదేహాన్ని మరుసటి రోజు అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని పిస్కాట్‌ఎవే అనే ప్రాంతంలో కనుగొన్నారు. -
అఫ్గాన్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్
సాక్షి,అమరావతి: అఫ్గానిస్తాన్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి కోసం కార్మికశాఖలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. అఫ్ఘాన్‌లో చిక్కుకున్న తెలుగు వారు 0866-2436314, 7780339884, 9492555089 హెల్ప్ డెస్క్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలను తెలుపవచ్చని కార్మిక శాఖ పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులు, అఫ్గానీల కోసం భారత ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అవసరమైన వారు ఈ నెంబర్లకు సంప్రదించడం ద్వారా భారత ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చు. ఇప్పటికే ఆఫ్గనీలకు ప్రత్యేక వీసాలను జారీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. వాట్సాప్: +91 8010611290 ; +91 9599321199 ; +91 7042049944 ఫోన్: +91 11 4901 6783 ; +91 11 4901 6784 ; +91 11 49016785 ఇ-మెయిల్: SituationRoom@mea.gov.in చదవండి: MK Stalin: 68 ఏళ్ల వయసులో ఔరా అనిపిస్తున్నారు, వీడియో వైరల్ -
‘అక్షర దీపిక’ జూన్ ఎడిషన్ విడుదల
టెంపాబే : ప్రవాత భారతీయులకు అండగా ఉంటూ వస్తోన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) 2021 జూన్‌కి సంబంధించి అక్షర దీపికను విడుదల చేసింది. ఈ పుస్తకంలో ఇటీవల కాలంలో నాట్స్ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను క్రోడీకరించారు. ముఖ్యంగా టెంపాబే నాట్స్ విభాగం ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో నిర్వహించిన కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ చాలా మందికి ఉపయోగపడిందని అక్షర దీపికలో పేర్కొన్నారు. పాస్‌పోర్టు పునరుద్ధరణ, కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తు, ఐసీఐ దరఖాస్తు, పునరుద్ధరణలు, పవర్ ఆఫ్ అటార్నీ, లైఫ్ సర్టిఫికేషన్, ధ్రువీకరణ వంటి సేవలు ఈ కాన్సులర్ ద్వారా అందించారు. సుమారు 400ల మందికి పైగా భారతీయులు ఈ సేవలను ఉపయోగించుకున్నారు. నాట్స్ ఆధ్వర్యంలో కాన్సులర్ సర్వీసెస్‌తో పాటు విద్యార్థుల కోసం వెబినార్స్ నిర్వహించారు. న్యూజెర్సీలో బాల సుబ్రహ్మణ్యం స్వర నీరాజనం కార్యక్రమం, యోగా, తులసీ దళంలతో పాటు తెలుగు ప్రజలకు ఉపయోగపడే పలు కార్యక్రమాలను నిర్వహించినట్టు నాట్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. జులై, ఆగష్టులలో సూపర్ బ్రెయిన్ వర్క్‌షాప్‌లను నిర్వహించబోతునట్టు తెలిపారు. -
ప్రధాని మోదీ ఉగాది శుభాకాంక్షలు, తెలుగులో ట్వీట్
సాక్షి, ఢిల్లీ: ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని.. తెలుగులో ట్వీట్ చేశారు. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. — Narendra Modi (@narendramodi) April 13, 2021 ఆనందాల హరివిల్లు ఉగాది: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అమరావతి: శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ అన్ని వర్గాలకూ శాంతి, సామరస్యం, ఆనందాన్ని తీసుకురావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఆయన సోమవారం ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు లోగిళ్లలో ఆనందాల హరివిల్లు అయిన ఉగాది పండుగ ప్రతి ఇంటా శుభం కలుగజేయాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటిస్తూ ఉగాది పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు. చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఉగాది కానుక వచ్చేసింది ఉగాది పండుగను ఇలా జరుపుకోవాలి! -
స్వదేశానికి రప్పించాలని వేడుకోలు
-
కువైట్‌లో తెలుగువారి ఆర్తనాదాలు..
సాక్షి, నిజామాబాద్: బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లిన తెలుగు రాష్ట్రాల వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. వారితో పాటు తమిళనాడు, బీహార్ వాసులు కూడా కరోనా ప్రభావంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నిజామాబాద్, కామారెడ్డి, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల వాసులు ఐదు నెలలుగా జీతాలు లేక కువైట్‌లో కష్టాలు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో రూముల్లోంచి బయటకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. వసతులు లేక విలవిల్లాడుతున్నారు. కనీసం భోజనం, నీళ్లు ఇప్పించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. భారత్‌కు రప్పించాలని సెల్పీ వీడియోలు ద్వారా వేడుకుంటున్నారు. అక్కడ కంపెనీలు పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్నారు. -
‘వారంతా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి’
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నవారంతా స్పందన వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని కోవిడ్ స్టేట్ లెవల్ కో ఆర్డినేటర్ కృష్ణబాబు తెలిపారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాళ్లంతా spandana.ap.gov.inలో నమోదు చేసుకోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు సమాచారం ఇచ్చామని.. ఏపీకి రావాలనుకుంటున్నవారికి ఏర్పాట్లు చేయాలని కోరామని ఆయన తెలిపారు. రాజస్తాన్‌లో 9వేల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం వచ్చిందని.. వారిని ఏపీకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తమిళనాడులో ఉన్న మత్స్యకారులను కూడా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహారాష్ట్ర వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రామిక్ రైళ్లలో సాధారణ ప్రజలకు అనుమతి ఉండదని.. వలస కూలీలకు మాత్రమే పాస్‌లు ఇస్తున్నామని కృష్ణబాబు వెల్లడించారు. రాజస్తాన్ మౌంట్ అబూలో 670 మంది వారు ఉన్నారని.. వారికి రాజస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక రైలు సిద్ధం చేసిందని తెలిపారు. ఏ రైలులో కూడా 1200 మందికి మించి ఉండరని తెలిపారు. వివిధ దేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు 10,500 మంది రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి ఒక పద్దతి ప్రకారం పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా సరిహద్దుల్లోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోలేని వారు తహశీల్ధార్ కార్యాలయంలో సంప్రదించవచ్చని కృష్ణబాబు పేర్కొన్నారు. (మద్య నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) -
క్వారంటైన్ కష్టాలు..
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన నాగరాజు (పేరు మార్చాం) మొన్నటివరకు జర్మనీలో ఉండి వచ్చారు. మొన్నటి వరకు ఆ కాలనీలో అతడో సెలబ్రిటీ.. కానీ ఇప్పుడు అతడిని అంటరానివాడిగా ఆ కాలనీవాసులు చూస్తున్నారు. గచ్చిబౌలిలో నివసించే అరుణ్ (పేరు మార్చాం) లండన్ నుంచి వచ్చాడు. అతడు ఉండే అపార్ట్మెంట్లో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాడు. ఇతడి ఫ్లాట్ తలుపులు, కిటికీలు తెరిచినా పక్కింటి వారు, అపార్ట్‌మెంట్‌వాసులు అంగీకరించట్లేదు. క్వారంటైన్లో ఉన్న మనిషిని ఇంట్లో పెట్టుకుని యథేచ్ఛగా తలుపులు తీస్తారా? అని ఆయన కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇవి రెండే కాదు.. విదేశాల నుంచి హోం క్వారంటైన్లో ఉన్న వందలాది మంది విదేశాల నుంచి వచ్చిన వారి గోస ఇది. గతంలో పూలు అమ్మిన చోట ఇప్పుడు రాళ్లు అమ్ముకుంటున్న పరిస్థితులు. గతంలో ఉన్న గౌరవాన్ని కరోనా మింగేయడంతో ఓ రకంగా వివక్షపూరిత జీవనం కొనసాగిస్తున్నారు. ఎంతగా అంటే.. కనీసం వారికి అన్నం పెట్టేందుకు కుటుంబసభ్యులు కూడా భయపడేంత. మార్పు వస్తేనే మేలు.. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల నుంచి వారికి దూరంగా ఉండటమే మంచిది. కానీ వారికి కరోనా సోకినా, సోకకున్నా తన చుట్టుపక్కల ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలన్న నిబద్ధతతో తమకు తాము 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటున్న వారిని కించపరిచేలా వ్యవహరించడం తగదని అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు వైద్యులు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారందరిలో ఈ వైరస్ లేదని, అయినా ముందు జాగ్రత్తగా మాత్రమే వారిని స్వీయ నిర్బంధంలో ఉం చామని, వారి పట్ల అమానుషంగా వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా యి. కరోనా వైరస్ సోకిన వారిని తాకినప్పుడు ఈ వైరస్ వస్తుందని, అది కూడా ఆ వ్యక్తి తన ముఖ భాగాలను చేతితో తాకితేనే శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి వారు వారి ఇళ్లల్లో ఉన్నా.. ఒకవేళ బయటకు వచ్చినా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ చేతులు తరచూ కడుక్కున్నా.. తన ముఖ భాగాలను తాకకపోయి నా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించదన్న వాస్తవాన్ని గుర్తించాలని సూచి స్తున్నారు. క్వారంటైన్లో ఉన్న వారు తమ పరిసరాల్లో ఉన్నంత మా త్రాన భయపడాల్సిన పని లేదనే విషయాన్ని గ్రహించాలని కోరుతున్నారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించేది కాదు కాబట్టి క్వారంటైన్లో ఉన్న వారు నివసించే ప్లాట్లు, ఇళ్ల తలుపులు తెరచి ఉన్నంత మాత్రాన ప్రమాదమేమీ లేదని వివరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్లో ఉండటంపై సమాజం అపోహలు తొలగించుకోవాలని, వారిలో ధైర్యం కల్పించినప్పుడే విదేశాల నుంచి వచ్చిన వారంతా ఇళ్లకు పరిమితమవుతారని, అప్పుడే ఈ వైరస్ నియంత్రణలోకి వస్తుందనే వాస్తవాన్ని మాత్రం విస్మరించొద్దని సూచిస్తున్నారు. రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ బాధితుడు రామ్‌తేజ్ మన్ కీ బాత్‌లో ప్రధారి నరేంద్ర మోదీతో చెప్పిన విధంగా క్వారంటైన్ అంటే జైలు జీవితం కాదని, అలాంటి వివక్షను ఈ సమాజం విదేశాల నుంచి వచ్చిన వారికి ఇవ్వడం వల్ల వారు మరింత భయపడితే అసలుకే ఎసరు వస్తుందని గుర్తుంచుకోవాలి. అందుకే సాటి మనిషిని గౌరవించడం నేర్చుకోండి.. క్వారంటైన్లో ఉన్నవారినే కాదు కరోనా వైరస్ సోకిన వారిని కూడా అవమానించొద్దని చెబుతున్నారు. -
ఇజ్రాయిల్‌లో మనోళ్లకు కష్టాలు
ఆర్మూర్: ఉపాధి కోసం ఇజ్రాయిల్ వెళ్లిన తెలుగు వారు కరోనా వైరస్ కారణంగా ఇక్కట్లు పడుతున్నారు. ఇజ్రాయిల్ ఇమ్మిగ్రేషన్ అథారిటీ నిబంధనల ప్రకారం ఉపాధి కోసం వెళ్లిన తెలుగు వారి సంఖ్య వెయ్యికి పైగా ఉండగా భారతీయులు మొత్తం పది వేల మందికి పైగా ఉంటారు. అనధికారికంగా విజిట్ విసాపై వెళ్లి అక్కడే ఉపాధి వెతుక్కుంటున్న వారి సంఖ్య సైతం అధికంగానే ఉంటుంది. అయితే కరోనా వైరస్ విస్తరిస్తున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వారు ‘సాక్షి’తో తమ కష్టాలను పంచుకున్నారు. కరోనా వైరస్ ఇజ్రాయిల్‌లో సైతం విస్తరిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా షాపింగ్ మాల్స్, థియేటర్లు, హోటళ్లు, బేకరీలు మూసివేసింది. బస్సులను సైతం నిలిపి వేశారు. కార్యాలయాల్లో విధులు నిర్వహించే వారికి హోంటు వర్క్‌కు అవకాశం కల్పించారు. కానీ అధికంగా తెలుగు వారు ఇక్కడ ఇళ్లలో కార్మికులుగా, వృద్ధులను, వికలాంగులను చూసుకొనే కేర్ టేకర్లుగా పని చేస్తుంటారు. వారం రోజులుగా వీరిని పనుల్లోకి రావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. వారి గదుల్లోనుంచి బయటకు రావొద్దని సూచించారు. దీంతో వారం, పది రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి గదులకే పరిమితమయ్యామని వారు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతి నెల డబ్బులను ఇంటికి పంపిస్తామని, ఇప్పుడు డబ్బులు లేక తమకు రోజు గడవడమే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. -
అమెరికాలో అద్భుత స్పందన
డాలస్ (అమెరికా): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అమెరికా పర్యటనలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆయన ఎక్కడకు వెళ్లినా తెలుగు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ముఖ్యంగా డాలస్‌లోని హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రవాసాంధ్రుల సమావేశం ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో కోలాహలంగా సాగింది. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోని తెలుగు వారు ఈ సమావేశానికి అంచనాలకు మించి హాజరు కావడం విశేషం. శనివారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి) డాలస్ విమానాశ్రయానికి సైతం పెద్దఎత్తున తరలి వచ్చిన ప్రవాసాంధ్రులు జై జగన్ అంటూ కేరింతల మధ్య ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్‌కు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడే అమెరికాలోని తెలుగు ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని, అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధులు కూడా జగన్‌ను అక్కడే కలుసుకున్నారు. ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించడానికి హచిన్సన్ ప్రాంతం చేరుకున్నప్పుడు ఆహూతులను అదుపు చేయడానికి అమెరికన్ భద్రతా సిబ్బంది బాగా ప్రయాస పడాల్సి వచ్చింది. సభా హాలులో నవరత్నాలుపై రూపొందించిన గీతంతో, వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. ‘నాకొక కల ఉంది...’ అని మార్టిన్ లూథర్ కింగ్ మాటలను ఉటంకించినప్పుడు మంత్రముగ్ధులయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తున్నప్పుడు హర్షామోదాలు వ్యక్తం అయ్యాయి. అమెరికా–భారత్ రెండు దేశాల జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. అమెరికాలో భారత రాయబార కార్యాలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభ అనంతరం నేరుగా డల్లాస్ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అక్కడ స్థానిక ప్రవాసాంధ్రులంతా ఘనంగా వీడ్కోలు పలికారు. కెనడాలోని టొరాంటో, మాంట్రియల్, న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ, పిట్స్బర్గ్, డెట్రాయిట్, షికాగో, ఓహియో, ఆరిజోనా, సియాటెల్, కాలిఫోర్నియా బే ఏరియా, ఎల్ఏ, నార్త్ కాలిఫోర్నియా, సెంట్ లూయిస్, ఓక్లహామా, అట్లాంటా, ఫ్లోరిడా, ఆస్టిన్, హ్యూస్టన్, డాలస్ నుంచి ప్రవాసులు హాజరయ్యారు. కాగా, ‘స్వాగత సుమాంజలి’ పేరుతో ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సన్మానపత్రాన్ని బహూకరించారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలంటూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, పలు కంపెనీల ప్రతినిధులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. వాషింగ్టన్ డీసీలో ఆదివారం ఆయన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాలన్నారు. (చదవండి: ఇది మీ ప్రభుత్వం.. ఆనందంగా రండి) -
తెలుగు వారమండీ!
చిన్న నుంచి పెద్ద దాకా ఫేస్‌బుక్‌ను ఎడాపెడా ఉపయోగిస్తుండడాన్ని చూసిన సీనియర్ పాత్రికేయులు పట్నాయకుని వెంకటేశ్వరరావు బుర్రలో ఓ చక్కటి ఆలోచన తళుక్కున మెరిసింది. అదేమిటంటే, తెలుగును ఇష్టపడే వారందరికీ ఆ మధురిమను రుచి చూపిస్తే బాగుంటుంది కదా, అందుకు ఫేస్‌బుక్‌నే వేదికగా మార్చుకుంటే ఎలా ఉంటుంది?’ అని. తనకు వచ్చిన ఈ ఆలోచనను వెంటనే అమలు చేసేశారు. అందులో భాగమే యూ ట్యూబ్‌లో తనకున్న వీఆర్ తెలుగు ఛానల్ ద్వారా ‘వారం వారం తెలుగు హారం’ పేరిట ప్రతి ఆదివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఫేస్బుక్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ప్రారంభించేశారు. దీనిని మొక్కుబడిగా కాకుండా ఎంతో చిత్తశుద్ధితో తనకు ఎన్ని పనులున్నా పక్కనపెట్టేసి, ఆ సమయాన్ని పూర్తిగా కేటాయిస్తూ, ఓ యజ్ఞంలా నిర్వర్తిస్తున్నారు. అలా గత ఏడాది మార్చి 17 నుంచి ఇప్పటి వరకు అంటే 54 వారాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తెలుగును ఇష్టపడే వారిలో చాలామందిని తన వీఆర్ తెలుగు ఛానల్‌కు వీక్షకులుగా చేసుకోగలిగారు. ఎంతోమంది తెలుగు భాషాభిమానులను, పెద్దలను, యువతను ఇందులో భాగస్వాముల్ని చేశారు. అది ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే...‘‘తెలుగు మాట ప్రతీ ఇంటా మార్మోగాలనే సదుద్దేశంతో దీన్ని నేను ప్రారంభించాను. ఇల్లే వేదికగా నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞం ఇంత చక్కగా సాగడానికి కారణం తెలుగు భాషాభిమానులు ఇస్తున్న ప్రోత్సాహం. నాకు సలహాలు ఇచ్చి వెన్నుదన్నుగా నిలుస్తున్న పెద్దలు, తెలుగు భాషాభిమానులకు నా నమస్సులు. ఇంటివద్ద సహకరిస్తున్న నా సతీమణి ఇందిర, మా అమ్మాయి శివప్రత్యూషలకు కృతజ్ఞతలు. ఇక నేను అడిగిన తడవుగానే ఎలాంటి బేషజాలు చూపకుండా ఇంటికి వచ్చి కార్యక్రమంలో పాలు పంచుకున్న అతిథులు, ఫోన్ ద్వారా ముచ్చటించి కార్యక్రమంలో తెలుగు భావాలను పంచుకున్న పెద్దలకు వందనాలు. ఇలా ఇప్పటికి 25 మంది ప్రముఖులు ఇంటివద్దకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మరో 25 మంది శ్రీకాకుళం, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు, సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్‌లనుంచి ఫోన్ ద్వారా ముచ్చటించి చక్కని తెలుగుకు చిక్కని బాటలు వేశారు. ఇక నేను వ్యక్తిగత వ్యాఖ్యానం ద్వారా 90 కి పైగా వేమన పద్యాలు, 50 వరకూ తెలుగు దనం నింపే పద్యాలు, 50 సామెతలు, తెలుగు విశేషాలు, తెలుగు ప్రముఖుల ముచ్చట్లు, సందర్భోచితంగా కొత్త అంశాలు మీముందు ఉంచాను. ఇవి కూడా ముమ్మరంగా షేర్ అయ్యాయి. వేలమంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చూశారు. దీనికి అనుబంధంగా యూ ట్యూబ్‌లో నడుస్తున్న ‘వీఆర్ తెలుగు చానల్’ ద్వారా 10 వేల వరకూ వీక్షకులు ఆదరించారు. ముఖ్యంగా తెలుగు విశేషాలు కొత్త తరానికి చేర్చాలనే సంకల్పంతో సాగుతున్న ఈ మహత్తర వినూత్న కార్యక్రమం మీ ముందుకు తెస్తున్నందుకు, దీనికి మీ ఆదరణ తోడుగా నిలుస్తున్నందుకు ఒడలు పులకరిస్తోంది. ఈ సరికొత్త ప్రయోగానికి సదా మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను..’’ తెలుగు హారంలో పరిమళించిన కొన్ని పుష్పాలు... రత్నాల నరసింహమూర్తి (సీనియర్ జర్నలిస్టు), వర్థనపు సుధాకర్( డీడీ ఖజానా శాఖ, విశాఖ), పి. లక్ష్మణ్ (వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మహబూబ్ నగర్); పోకల సుబ్బారెడ్డి (వ్యక్తిత్వ ప్రేరకుడు, కర్నూలు), ఆర్. మధుసూదన రావు(కథకుడు, సినీగేయ రచయిత); బాబూచారి (గాయకుడు), మక్కపాటి మంగళ (స్వర్ణపుష్పం పత్రిక ఎడిటర్); కాలువ మల్లయ్య (సాహితీ ప్రముఖుడు, ఉమ్మడి రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ సభ్యుడు), డా. వకుళాభరణం కృష్ణమోహన్ (తెలంగాణ రాష్ట్రం బీసీ కమిషన్ సభ్యుడు, సాహితీ వేత్త)లు అతిథులుగా వచ్చి తెలుగు భావాలను ప్రత్యక్షంగా పంచుకున్నారు. ఫోన్ ద్వారా ముచ్చటించిన వారు... సన్నశెట్టి రాజశేఖర్ (సంపాదకులు, ఉత్తరాంధ్ర పత్రిక, శ్రీకాకుళం), 2. భద్రి కూర్మారావు (జానపద కళా ప్రముఖుడు, డిగ్రీ కళాశాల ఉపన్యాసకుడు, శ్రీకాకుళం; శ్యామసుందర శాస్త్రి, (రేడియో వ్యాఖ్యాత, అనంతపురం) ఈశ్వర రెడ్డి (ఆచార్యుడు, వేమన వర్సిటీ, కడప), మహ్మద్ మియా (గజల్ గాయకుడు, కర్నూలు), నందిగం శివప్రసాద్ (సినీ సంగీత దర్శకుడు, హైదరాబాద్); జంద్యాల రఘుబాబు (కవి, రచయిత, కర్నూలు), శ్యామ్ ప్రసాద్ లాల్ (జేసీ, కరీంనగర్), ఎం. హరికిషన్ (ప్రఖ్యాత బాలల కథకుడు, కర్నూలు) తెలుగు హారం కార్యక్రమ లక్ష్యాలుప్రతీ ఇల్లూ తెలుగుకు పెద్ద పీట వేయాలి; తెలుగు భాష, సంస్కృతి, పద్యం, పాట, నాటకం, సామెతలు, నుడికారాలు, అవధానం వంటి అన్ని ప్రక్రియలను కొత్త తరం పిల్లలకు తెలియచేసి భాషా మమకారం పెంచడం, మన మాతృభాష కొన్ని వందల తరాలకు అందేలా తెలుగు కుటుంబాలు కృషి చేసేందుకు ప్రేరణ కలిగించడం -
నిత్యమైన మంగ
తెలుగు వారింట ‘శశిరేఖ’గా అడుగుపెట్టి ఇంటిల్లిపాదితో ‘మంగతాయారు’గా ముచ్చట్లుచెప్పి ‘నిత్య’మై వెలుగొందుతున్న మేఘనా లోకేష్ జీ తెలుగులో ‘కళ్యాణవైభోగం, రక్తసం బంధం’ సీరియల్స్‌లో నటిస్తున్నారు. తెలుగువారు మెచ్చిన మేఘన చెబుతున్న ముచ్చట్లు ఇవి. ‘‘సీరియల్స్ అంటే ఏడుపు మాత్రమే ఉంటుందనుకునే రోజులు కావివి. అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో, తమ జీవితాలతో పాటు కుటుంబ బంధాలను ఎలా సరిదిద్దుతారో చూపుతున్నారు. ఆరేళ్లుగా బుల్లితెర నటిగా ఉంటున్న నాకు నేను నటించిన పాత్రలన్నీ ఎంతో మంచిని నేర్పిస్తూనే ఉన్నాయి. స్ట్రాంగ్‌గా మార్చిన పాత్రలూ ఉన్నాయి. నేను పుట్టిపెరిగింది అంతా మైసూరులోనే. కన్నడ అమ్మాయిని. ఆరేళ్ల క్రితం వరకు చదువు, స్టేజ్ షోలే లోకంగా ఉండేవి. చదువు పూర్తి చేశాను. చదువుతో పాటు స్టేజ్ షోల పట్ల కూడా నాకు ఆసక్తి ఉండేది. నేను వృద్ధిలోకి రావడానికి మా నాన్న చాలా త్యాగాలు చేశారు. స్టేజ్ షోస్‌లో పాల్గొనేటప్పుడు ఆ షోస్ కోసం రోజూ 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి, తీసుకొచ్చేవారు. టీవీ సీరియల్స్‌లో అవకాశం వచ్చినప్పుడు నాన్న కాస్త డౌట్‌గానే ఓకే చెప్పారు. అయితే, పని పట్ల శ్రద్ధ అవసరం అని తరచూ చెబుతుండేవారు. కన్నడ సీరియల్లో నటించినప్పుడు ఆ రోల్‌కి అవార్డ్ రావడంతో నాన్నకు ధైర్యం వచ్చింది. తర్వాత వచ్చిన సీరియల్స్ అవకాశాలకు ఓకే చెప్పారు. అలా ఈ రంగంలో ఆరేళ్ల నుంచి వున్నాను. సీ‘రియల్ మలుపులు’... సీరియల్స్‌లో కొన్ని ఊహించని మలుపులు ఉంటాయి. అలాగే నా జీవితంలోనూ ఓ మలుపు.. కిందటేడాది క్యాన్సర్ వచ్చి నాన్న నాకు దూరమయ్యారు. క్యాన్సర్ ఉన్నట్టుగా 5–6 నెలల వరకు నాకీ విషయం తెలియనివ్వలేదు నాన్న. రక్తసంబంధం, కళ్యాణవైభోగం సీరియల్‌తో సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండి మైసూరుకు ఎక్కువ వెళ్లేదాన్ని కాదు. నా వర్క్ ఎక్కడ డిస్ట్రబ్ అవుతుందో అని నాకా విషయం చెప్పద్దన్నారట నాన్న. క్యాన్సర్ చివరి స్టేజ్‌లో నాకా విషయం తెలిసింది. అప్పటికే ఆలస్యం అయ్యింది. నాకు అమ్మ, అన్నయ్య, అమ్మమ్మ ఉన్నారు. ఎప్పుడు పెళ్లి అనే ఆలోచన వచ్చినా నాకు ఓ సమాధానం వస్తుంది. మా నాన్నలా నన్ను కేరింగ్‌గా, ప్రొటెక్టివ్‌గా చూసుకోవాలని. అంతగా లేకపోయినా ప్రేమగా ఉంటే చాలు అనుకుంటున్నాను. నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఉన్నవారు కూడా వేరే వేరే చోట్లలో వారి పనుల్లో బిజీ. నేనే మైసూర్ వెళ్లినప్పుడు వారిని కలుస్తుంటాను. ఈ మధ్య ఏడాదికి ఒకసారి స్నేహితులంతా కలిసేలా ప్లాన్ చేసుకున్నాం. సీరియల్స్ అంటే ఏడుపు సీన్లు కాదు చాలా వరకు సీరియల్ నటి అనగానే ఏడుపు సీన్లు ఉంటాయి అంటారు. ఇప్పుడు అలాంటివేవీ లేవు. సీరియల్స్‌లోనూ చాలా మార్పులు వచ్చాయి. రక్తసంబంధం సీరియల్లో తులసి క్యారెక్టర్‌నే తీసుకుంటే తను చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ తరానికి బాగా కనెక్ట్ అయిన పాత్ర అది. స్టోరీ డ్రామా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కళ్యాణ వైభోగం సీరియల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. నిత్య–మంగగా రెండూ రెండు భిన్న పాత్రలు. ఇదో సవాల్‌లా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. తెలుగువారు మెచ్చిన మంగతాయారు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లన్నీ ఇష్టమైనవే. అయితే, ‘కళ్యాణవైభోగం’ మంగతాయారు పాత్ర అంటే ఇంకా ఇష్టం. మంగ చాలా అమాయకురాలు. అప్పటివరకు ఓ పల్లెటూరు అమ్మాయి ఎంత అమాయకంగా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి ఆ అమ్మాయిలో తర్వాత తర్వాత చాలా ప్రతిభ కనిపిస్తుంటుంది. ఇల్లాలిగా, త్యాగమయిగా.. తనను తాను చాలా మార్చుకుంటూ ప్రూవ్ చేసుకుంటుంది. అన్ని వయసుల వారూ ఈ క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతారు. మంగతాయారు పాత్ర ద్వారా నా జీవితంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ పాత్ర–నేనూ వేరు కాదని అనిపిస్తుంటుంది. శశిరేఖగా అందరికీ పరిచయం అయినా ఈ పాత్ర వల్ల తెలుగువారింట నేనూ ఓ కుటుంబసభ్యురాలినైపోయాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.’’ నిర్మలారెడ్డి -
తెలుగువారితో కిషన్‌రెడ్డి లైవ్
సాక్షి, హైదరాబాద్: ‘భారత్ కీ మన్‌కీ బాత్ మోదీ కే సాథ్’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ పూర్వ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫేస్బుక్, ట్విట్టర్లలో లైవ్ కార్యక్రమం ద్వారా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారితో మాట్లాడి బీజేపీ మేనిఫెస్టో కోసం వారి అభిప్రాయాలను బుధవారం సేకరించారు. ఈ లైవ్ కార్యక్రమంలో విద్య, ఉపాధి, వైద్యం, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, తీవ్ర వాదం, వ్యవసాయం వంటి అంశాలపై ఆన్లైన్లో ప్రజలు కిషన్ రెడ్డితో ముచ్చటించారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డు పడకుండా చూడాలని కోరారు. ఆవాస్ యోజన కింద ఇచ్చే మొత్తాన్ని పెంచాలని, ఎన్నికల్లో డబ్బు ప్రవాహం తగ్గించడానికి ఎన్నికల సంస్కరణలను తీసుకురావాలని చెప్పారు. వీటిపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ బీజేపీ ప్రజల అభిప్రాయాల మేరకు నడుచుకునే పార్టీ కానీ ఒక కుటుంబం అభిప్రాయం మేరకు నడుచుకునే పార్టీ కాదన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు మేనిఫెస్టోను రూపొందించి ప్రజల ముందు పెడతామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిచినా ఢిల్లీలో వాళ్లు చేసేది ఏమీ లేదు కాబట్టి అత్యధిక స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లి శ్రీమావుళ్లమ్మ తల్లి
అమ్మలగన్న అమ్మగా, కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా భీమవరం గ్రామ దేవత శ్రీమావుళ్లమ్మ తల్లి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారి దైవంగా ప్రసిద్ధి. అమ్మ సన్నిధికి వచ్చి తమ బాధలను చెప్పుకుని ఆర్తితో వేడుకుంటే చాలు... చిటికెలో సమస్యలన్నీ దూరమవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే సామాన్య భక్తుడి నుంచి సంపన్నుడి వరకు నిత్యం అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తుంటారు. అంతటి మహిమ గల మూర్తి పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువై ఉంది. వ్యాపారం ప్రారంభించినా, వివాహాదివేడుకలు చేస్తున్నా, నూతన వాహనాలు కొన్నా, అంతా శ్రీమావుళ్లమ్మ అమ్మవారి దయ అని చెప్పుకుంటారు స్థానికులు. ఘనంగా ఆరంభమైన వార్షికోత్సవాలుఅమ్మవారి 55వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమైనాయి. జనవరి 13న మొదలైన ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. అమ్మవారి ఉత్సవాలను తిలకించడానికి తెలంగాణ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రతి రోజు పలు సంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయగా భక్తులు భారీగా తరలి వచ్చి తిలకిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఉత్సవాల నిర్వాహకులు నీరుల్లి, కూరగాయలు, పండ్లు వర్తకం సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటీ వారు రోజుకు సుమారు 800 మంది భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ చేస్తున్నారు. వచ్చే నెల 7 తేదీ శ్రీఆదిలక్ష్మీ అమ్మవారి అలంకరణ నుంచి 15 తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అమ్మవారి అలంకరణ వరకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయి. అమ్మవారి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను ఎంతో అకట్టుకుంటున్నాయి. – బొక్కా రామాంజనేయులు (నాని) ఉత్సవాలు... విశేషాలు ►శ్రీమావుళ్లమ్మ అమ్మవారు విగ్రహం ఎనిమిది అడుగుల మించిన ఎత్తుతో ఉండడం విశేషం. ►అమ్మవారి స్వర్ణ కిరీటం తిరుమల వెంకటేశ్వరస్వామి వారి కిరీటం కంటే పెద్ద కిరీటమని ప్రతీతి. ►శ్రీమావుళ్లమ్మ అమ్మవారు క్రీస్తు శకం 1200 సంవత్సరంలో వెలిసినట్లు చెబుతారు. ►భీమవరం పట్టణంలో ప్రస్తుతం ఉన్న మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరుచుటకు నిర్మించిన పూరి గుడి ఉన్న ప్రాంతంలో వేప, రావి చెట్టు కలిసి ఉన్న చోట శ్రీమావుళ్లమ్మ అమ్మవారు వెలిశారని తెలుస్తోంది. ►మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన తల్లి కనుక శుభపద్రమైన మామిడి పేరుమీదగా మామిళ్ళ అమ్మగా... అనంతరం మావుళ్లమ్మగా నామాంతరం చెందిందని చరిత్ర చెబుతుంది. ►చిన్న చిన్న ఊళ్ళ వారంతా కలిసి అమ్మవారిని గ్రామ దేవతగా కొలవడం వల్లే మావుళ్ల అమ్మ మావుళ్లమ్మగా నామాంతరం చెందారని మరి కొందరు అభిప్రాయం. ►ఫిబ్రవరి 15న అమ్మవారి ఆలయం వద్ద సుమారు 60 వేలమందికి అఖండ అన్నసమారాధన జరుగుతుంది. -
కేరళలో తెలుగోడి గోడు
కొచ్చి నుంచి సాక్షి ప్రతినిధి: కేరళ వరద విలయానికి అక్కడ నివసిస్తోన్న వందలాది మంది తెలుగు ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కేరళ వ్యాప్తంగా వేలాది మంది తెలుగువారు ఉండగా.. ఒక్క కొచ్చిలోని ఏలూర్ కాలనీలో 400 నుంచి 450 తెలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి వారంతా అక్కడికి వలస పోయారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు వరద చుట్టుముట్టడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు 50 నుంచి 100 తెలుగు కుటుంబాలపై వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. అనేక ఇళ్లు మునిగిపోవడంతో సామాన్లు పనికిరాకుండా పోయాయి. వారంతా కట్టుబట్టలతో మిగిలారు. 3 రోజుల పాటు సహాయ శిబిరాల్లో తలదాచుకుని ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు.అయితే రెండడుగుల మేర బురద పేరుకుపోవడంతో ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. మొత్తం వస్తువులన్నీ పాడవడంతో మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, వరదల వల్ల ఒక్కో కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని కొచ్చి తెలుగు సంఘం నేత నాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన స్థానిక ఫ్యాక్ట్ కంపెనీలో చిన్న కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. సొంత రాష్ట్రానికి దూరంగా ఉండటం, స్థానిక ప్రభుత్వం సహాయం అందే పరిస్థితి లేకపోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో వలస కార్మికులు కొచ్చిలోని ఫ్యాక్ట్ కంపెనీ, షిప్‌యార్డుల్లో దాదాపు వెయ్యి, పదిహేను వందల మంది తెలుగువారు పని చేస్తున్నారు. వర్షాల కారణంగా పది రోజులుగా పనులు లేక రోజు గడవడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. వీరిని ఆదుకోవడానికి కొచ్చి తెలుగు అసోసియేషన్ విరాళాల సేకరణ చేపడుతోంది. ఇక్కడి తెలుగు ప్రజల్లో చాలా మంది వలస కూలీలు కావడంతో వారికి స్థానికంగా ఎలాంటి అధికార గుర్తింపు కార్డులు లేవు. అందువల్ల ప్రభుత్వం చేస్తున్న సాయం, పరిహారం వీరికి అందే పరిస్థితి లేదు. దాంతో తెలుగు సంఘమే వీరిని ఆదుకోవడానికి నడుం కట్టింది. -
కొలంబోలో.. తెలుగు వారి కాయ్ రాజా కాయ్!
సాక్షి, అమరావతి: జూద ప్రియులను ఇప్పుడు శ్రీలంక అమితంగా ఆకర్షిస్తోంది. పొద్దున్నే విమానం ఎక్కి వెళ్లి పేకాడుకుని మర్నాడు ఉదయమే ఇంటికి తిరిగి వచ్చే సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. కాసినో (జూద క్రీడ) కోసం ఇన్నాళ్లూ గోవా, మకావూ, మలేషియా, సింగపూర్ తదితర చోట్లకు వెళ్తున్న వారి చూపు ఇప్పుడు శ్రీలంకవైపు మళ్లింది. హైదరాబాద్, విశాఖల నుంచి శ్రీలంకకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో జూదరులు కొలంబోకి క్యూ కడుతున్నారు. గతేడాది హైదరాబాద్, విశాఖల నుంచి జూద క్రీడల (కాసినో) కోసం సుమారుగా 26,000 మంది వచ్చినట్లు కొలంబోలోని బెలాజియో కాసినో మార్కెటింగ్ హెడ్ సిసిరా సెమసింఘే తెలిపారు. ఈ ఏడాది ఈ సంఖ్య 30,000 దాటుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గోవాతో పోలిస్తే చౌకనే.. కాసినో కోసం శ్రీలంక వెళ్తున్న వారిలో రాజధాని అమరావతి, భీమవరం ప్రాంతాలకు చెందిన బడాబాబులే అధికంగా ఉంటున్నారు. గోవాలో కాసినో కోసం సముద్రంలో సరిహద్దు జలాల వరకు వెళ్లాల్సి రావడం, పన్నుల భారం పెరగడం లాంటి కారణాలతో కొలంబో వెళ్తున్నట్లు చెబుతున్నారు. గోవా కంటే తక్కువ ఖర్చులో కాసినో కేంద్రాలు ఉండటంతో కొలంబో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కొలంబోలో అతిపెద్ద కాసినోలు 5 ఉన్నాయి. మందు, విందు... సకల సదుపాయాలు కాసినో కోసం వచ్చే బడాబాబుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాసినోలు, ఫైవ్‌స్టార్ హోటల్స్, ఎయిర్‌లైన్స్ సంస్థలు ఉమ్మడిగా ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఫ్లైట్‌లో తీసుకెళ్లి ఫైవ్‌స్టార్ హోటళ్లలో వసతి ఏర్పాటు చేయడమే కాకుండా మందు, విందు లాంటి సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మూడు రాత్రులు, నాలుగు రోజులు కలిపి హోటల్లో రూము, ఏర్పాట్లను బట్టి రూ. 3 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సెమసింఘే తెలిపారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే కొలంబో చేరుకునే అవకాశం ఉండటం, టికెట్ ధరలు కూడా తక్కువగా ఉండటం కలిసి వస్తోందంటున్నారు. విమానాల్లో ప్రత్యేక ధరలు ఒకరోజు వెళ్లి ఆడుకుని వచ్చే విధంగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు శ్రీలంక ఎయిర్‌లైన్స్ తెలంగాణ, ఏపీ మేనేజర్ చమ్మిక ఇద్దగోడగే తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారని చెప్పారు. మర్నాడు ఉదయం 7.15కి బయలు దేరితే 9.15 కల్లా వచ్చే విధంగా సర్వీసులను నడుపుతున్నట్లు వివరించారు. కొలంబోకు విశాఖ నుంచి రూ. 11,000, హైదరాబాద్ నుంచి రూ. 15,500 ధరలతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు చమ్మిక తెలిపారు. డబ్బు కడితే ఏజెంట్లే చూసుకుంటారు.. జూద క్రీడల పట్ల మక్కువ చూపే బడా బాబులను గుర్తించేందుకు ఈ సంస్థలు విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏజెంట్లను కూడా నియమించుకుంటున్నాయి. ఏడాదికి ఒకసారి ప్రమోషన్ ఈవెంట్లు నిర్వహించి ఆకర్షిస్తున్నారు. ప్యాకేజీ మొత్తాన్ని స్థానిక ఏజెంట్‌కు చెల్లిస్తే విమాన టికెట్లు, బస దగ్గర నుంచి వారే చూసుకుంటారు. వసతి, విందు, మందు ఉచితంగా అందించడంతోపాటు డిపాజిట్ చేసిన మొత్తానికి కాసినో టోకెన్లు ఇస్తున్నారని వెళ్లిన చాలామంది కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారని స్థానిక కాసినో ప్రియుడు ఒకరు తెలిపారు. మరికొంత మంది అయితే కాసినో టేబుళ్లను కొనుగోలు చేసి లాభనష్టాలను పంచుకునే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. అవకాశమిస్తే విశాఖలో కాసినో: పర్యాటకులను ఆకర్షించడానికి విశాఖలో కాసినో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తే ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సెమసింఘే తెలిపారు. ఇప్పటికే నేపాల్‌లో ఏర్పాటు చేసిన కాసినోకి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. -
చంద్రబాబూ.. చిచ్చుపెట్టకు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఉన్న తెలుగువారికి రాజకీయ రంగు పులమొద్దని తెలుగు ప్రజలు విజ్ఞప్తి చేశారు. మరో కర్ణాటక–తమిళనాడు సమస్యగా మార్చవద్దని, ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి అవకాశాలు లేక తామందరం బెంగళూరుకు వలస వచ్చి బతుకుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థత వల్లే తమకీ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం కర్ణాటకలో తెలుగువాడి ఓటు ఎవరికి అంటూ ఒక తెలుగు టీవీ చానెల్ చర్చ నిర్వహించింది. ఇందులో అన్ని పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు, తెలుగు సంఘాలు పాల్గొన్నాయి. కర్ణాటకలో కన్నడిగులు తమతో సోదర భావంతో ఉన్నారని, మాకు, వారికి ఎలాంటి సమస్య లేదని తెలిపారు. తమపై ఒక పార్టీ ముద్ర వేయడం ద్వారా ఇక్కడి ప్రజలకు తమకు మధ్య విద్వేషాలు పెరుగుతాయని చెప్పారు. తాము ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నామో, ఏ నాయకుడు అయితే మేలు చేకూర్చుతారని విశ్వసిస్తామో వారికే ఓటు వేస్తామన్నారు. బెంగళూరులో తాము చాలా ప్రశాంతంగా ఉన్నామని, ఇక్కడికొచ్చి బీజేపీకి ఓటు వేయొద్దు.. కాంగ్రెస్‌కు ఓటెయొద్దు అంటూ పిలుపునివ్వడం సమంజసం కాదని తెలిపారు. ఇటీవల ఇక్కడకు వచ్చిన ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బీజేపీకి ఓటు వేయొద్దని కోరడం సరికాదని చెప్పారు. ఇలాంటి మాటలతో తెలుగువారిపై ద్వేషభావాలు పెరుగుతాయని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు అసమర్థత, చేతకానితనం వల్లే తాము వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నామన్నారు. కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు కర్ణాటకలో టీడీపీ, కాంగ్రెస్ మైత్రి గురించి చర్చ లేవనెత్తారు. చంద్రబాబు అసమర్థతను కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గట్టిగా ప్రశ్నించారు. -
విషమ పరీక్షలు
అక్షర తూణీరం రెండు వారాలపాటు దేశ పార్లమెంటులో ఒక తీర్మానం బరిమీదకు రాకుండా చేశారే? మోదీ తెలుగు ప్రజల్ని అంచనా వేయడంలో పొరపాటు పడలేదు కదా? ఒక్కోసారి ఇలాగే దారుణంగా ఉంటుంది. నిన్న ఇస్రో సాధించిన ఘన విజయాన్ని ఆస్వాదించి ఆనందించి ఆ స్ఫూర్తిని సంపూర్తిగా మన యువతకు, బాలలకు అందించాల్సిన సందర్భంలో అవాకులు చెవాకులు అదే పనిగా వింటున్నాం. మిగతా అవినీతులు ఎట్లా ఉన్నా, కనీసం దిగువ స్థాయి నించి పై స్థాయి దాకా జరిగే పరీక్షల్ని లీకుల బారిన పడకుండా, సజావుగా నిర్వహించుకోలేక పోతున్నాం. పెద్దలంతా విద్యార్థి దశనించి వచ్చినవారే. ఒకసారి పరీక్షలు అయిపోయాక విద్యార్థులు ఒక దీక్షలోంచి లేదా ఒక ట్రాన్స్‌లోంచి దిగిపోతారు. మళ్లీ ఎక్కడో లీక్ అంటారు. ప్రశ్నపత్రాలు పునర్లిఖితమవుతాయి. హాయిగా ఊపిరి పీల్చుకున్న మెదళ్లు ఒక్కసారి ఉలిక్కిపడతాయి. అయితే జరిగిన పరీక్షలు ఒక కలా అనుకుంటారు. మళ్లీ కాడి భుజాన వేసుకుంటారు నిర్లిప్తంగా. ఏ మాత్రం ఉత్సాహం ఉండదు. ఉల్లాసం ఉండదు. యువత మనస్సుల్లో కసి, కార్పణ్యం తప్ప పాఠాలుండవ్. ఎవరో చేసిన తప్పుకి మాకేంటి ఈ శిక్ష అని వాపోతారు. అసహాయంగా తిట్టుకుంటారు. పాలనా యంత్రాంగాన్ని శపిస్తారు. దేశంమీద గౌరవం ఒక్కసారిగా సన్నగిల్లుతుంది. పరీక్షలు అయ్యాక నిజంగా అయిపోయాయని విద్యార్థులు అనుకుని కంటినిండా నిద్రపోయే శుభ ఘడియలు ఎప్పటికి వస్తాయో? ఎజెండాలో పెట్టండి. ఏ పార్టీ అయినా దీనిపై హామీ ఇవ్వండి. దీనికి వేరే శిక్షలుండాలి. ‘నరకంలో ఉంటాయని చెప్పుకునే శిక్షల్ని కారకులపై బహిరంగంగా అమలుచేసి మాకు కాస్తయినా ఊరట కల్పించాలని’ లీకులకు బలి అయిన విద్యార్థులు, వారితోపాటు శ్రమించిన వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. లేదంటే పరీక్షల నిర్వహణ బరువు బాధ్యతల్ని డిఫెన్స్ శాఖకు అప్పగించండని సలహా ఇస్తున్నారు. నిజం. వీట న్నింటి గురించి కొంచెం ఆలోచించి మాట్లాడుకోవడానికి మనకి వ్యవధి లేదు. ఒక దేశ భక్తుడు. ఒక తెలుగువాడు దేశ ముఖ్యమైన మూడు కళ్లల్లో ఒకటైన న్యాయ వ్యవస్థలో తేనెపట్టులో ఉన్నన్ని రంధ్రాలున్నాయని ఎత్తిచూపుతుంటే– మన మేధావులకు గళం ఎత్తే తీరికలేదు. ధర్మపీఠం బీటలు వారుతోందని సాక్షాత్తూ ఒక న్యాయమూర్తి పదే పదే హెచ్చరిస్తుంటే– ఎవరూ పలకరేం? ఇంత ఉదాసీనత దేశ దౌర్బల్యమేమోనని భయంగా ఉంది. రెండు వారాలపాటు దేశ పార్లమెంటులో ఒక తీర్మానం బరిమీదకు రాకుండా చేశారే? చాలా ఘోరం! మన ప్రియతమ ప్రధాని తొలినాడు పార్లమెంటు భవన సోపానాలకు భయభక్తులతో శిరసువంచి నమస్కరించడం నిన్న మొన్నటి దృశ్యంలా ప్రజల కళ్లముందు కదుల్తోంది. అందుకే మోదీపట్ల ఒక విశ్వాసాన్ని అభిమానాన్ని జనం పెంచుకున్నారు. గొప్ప ప్రధాని మెజార్టీ చూసి పొంగిపోడు. బలవంతులు ఎందరున్నా, తల్లి బలహీనుడైన బిడ్డమీదే మమకారం చూపుతుంది. తప్పిపోయిన గొర్రె కోసమే కాపరి తపిస్తాడు. మోదీ తెలుగు ప్రజని అంచనా వేయడంలో పొరపాటు పడలేదు కదా? నాడు తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన అల్లూరి ఈ భూమి పుత్రుడే.భారత జాతిని సమైక్యం చేసి నడిపిస్తున్న మన త్రివర్ణ జాతీయ పతాకాన్ని రూపుదిద్దిన అమృతమూర్తి పింగళి వెంకయ్య ఇక్కడివాడే. ఇంకా వివరాలు తెలుసుకోండి– సకాలంలో సరైన నిర్ణయం తీసుకోండి. -శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
శ్రీరాముడి దీవెనలు తెలుగువారందరికీ ఉండాలి
సాక్షి, అమరావతి : తెలుగువారందరికీ శ్రీరాముడి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం శ్రీరామనవమి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు, శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీ రాముడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 26, 2018 -
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
-
వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2018 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో, దేశ ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పులకు దారి తీయాలని ఆయన కోరుకున్నారు. -
క్రీస్తు జీవితం మానవాళికి మహోన్నత సందేశం
సాక్షి, హైదరాబాద్ : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సోదరులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమా గుణం ఇవన్నీ జీసస్ తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన మహోన్నత సందేశాలని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని చెప్పారు. క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
కొత్త కొత్త ఆవకాయ్
ఆవకాయ అంటే తెలుగువాళ్లకు ఎంత ప్రీతి ఉన్నా, ఆవకాయను తెలుగువాళ్ల జాతిసంపద అనుకున్నా... దేశంలోని మిగిలిన ప్రాంతాల వాళ్లు కూడా వాళ్ల వాళ్ల పద్ధతుల్లో ఆవకాయలు తయారు చేసుకుంటారు. మన ఆవకాయ కాని ఆవకాయ కూడా ఆవకాయే! అయితే ఏ ప్రాంతపు పరిమళం ఆ ప్రాంతానిది. దక్షిణాది ఆవకాయలు ఘాటుఘాటుగా ఉంటాయి. నోట్లోనే కాదు, కళ్ల వెంబడి కూడా నీళ్లూరేలా చేస్తాయి. ఉత్తరాది ఆవకాయల్లో తీపి పాళ్లు కొంత ఎక్కువగా ఉంటాయి. ఉత్తర దక్షిణాలే కాదు, తూర్పు పడమర రాష్ట్రాల్లోనూ ఆవకాయల తయారీలో ఎక్కడి వైవిధ్యం అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. దేశం నలు చెరగులా విస్తరించిన ఆవకాయ రుచుల విభిన్నతను, విలక్షణతను పాఠకులకు పరిచయం చేయడానికే ఈ ప్రయత్నం... ఆవకాయ రుచులను ఆస్వాదించండి మరి! పంజాబీ ఆమ్ కా అచార్ పంజాబీ రుచుల్లో సోంపు, ఇంగువ పరిమళాలు గుబాళిస్తుంటాయి. చివరకు వాళ్లు తయారు చేసే ఆవకాయల్లో కూడా... కావలసినవి: పచ్చి మామిడికాయ ముక్కలు - 3 కప్పులు, పసుపు - 1 టీ స్పూన్, సోంపుపొడి - పావుకప్పు, మెంతిపొడి - 1 టేబుల్ స్పూన్, నల్ల జీలకర్ర - అర టీ స్పూన్, ఇంగువ - పావు టీ స్పూన్, కారం పొడి - 2 టేబుల్ స్పూన్లు, ఆవనూనె - పావుకప్పు, ఉప్పు - 4 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటిని ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత వాటికి ఉప్పు, పసుపును బాగా పట్టించాలి. ఇప్పుడు ఆ ముక్కలను పెద్దసైజు జల్లెడలోకి తీసుకొని, వాటిపై మూతపెట్టి 4-6 గంటల పాటు ఎండలో పెట్టాలి. ఆపైన వాటిని ఓ గిన్నెలోకి తీసుకొని, అందులో సోంపుపొడి, మెంతిపొడి, నల్ల జీలకర్ర, ఇంగువ, కారంపొడి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మందంగా ఉన్న గాజు సీసాల్లోకి తీసుకొని నాలుగైదు రోజుల పాటు ఎండలో పెట్టాలి. అలా చేస్తే ఈ ఆవకాయ ఏడాదికాలం పాటు తాజాగా, రుచిగా ఉంటుంది. కర్ణాటక మ్యాంగో పికిల్ తెలుగు రాష్ట్రాలకు పొరుగునే ఉన్న కర్ణాటక రుచులు దాదాపు తెలుగు రుచుల్లానే ఉంటాయి. అయితే, ఆవకాయలో పచ్చిమిర్చి ముద్ద కలపడం కన్నడిగుల స్పెషల్. కావలసినవి: మామిడికాయ ముక్కలు - 5 కప్పులు, ఉప్పు - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ - పావుకప్పు, ఆవపిండి - అరకప్పు , మెంతిపొడి - అరకప్పు, పసుపు - 1 టేబుల్ స్పూన్, నువ్వుల నూనె - 2 కప్పులు, ఆవాలు - 2 టీ స్పూన్లు, ఇంగువ - పావు టీ స్పూన్ తయారీ: ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటిని ముక్కలుగా చేసుకోవాలి. మరోవైపు ఆవాలు, మెంతులను కొద్దిగా వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ పొడిని మామిడికాయ ముక్కలపై వేయాలి. దాంతోపాటు ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలిపి, మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమానికి పచ్చిమిర్చి ముద్దను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ పైన బాణలి పెట్టి నూనె పోసి, అది వేడెక్కాక అందులో ఆవాలు, ఇంగువ వేసి రెండు నిమిషాల తర్వాత దింపేయాలి. అది కొద్దిగా చల్లారాక, అందులో మామిడికాయల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆవకాయను ఓ గాజు సీసాలో నిల్వ చేయాలి. దీన్ని బయట పెడితే 2-3 నెలల వరకు తాజాగా ఉంటుంది. అదే ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఏడాది వరకూ ఉంటుంది. కశ్మీరీ అమెర్ అచార్ యాపిల్ పండ్ల తీయదనానికే కాదు, మిర్చిఘాటుకు కూడా కశ్మీర్ ప్రాంతం పెట్టిందిపేరు. కారం చిరుతిళ్లలో రుచికోసం వాడే నల్లజీలకర్రను తీపి ఆవకాయ తయారీలోనూ వాడటం కశ్మీరీల ప్రత్యేకత. కావలసినవి: పచ్చి మామిడికాయలు - 8, పంచదార - 1 కిలో, నల్ల జీలకర్ర - అర టీ స్పూన్, ఎండు మిరపకాయల ముక్కలు (గింజలు తీసేయాలి) - 1 టీ స్పూన్, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్, వెనిగర్ - 1 టేబుల్ స్పూన్, నీళ్లు - కావలసినన్ని తయారీ: మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లలో 10-12 గంటలపాటు నానబెట్టాలి. మధ్యమధ్యలో నీళ్లను మారుస్తూ ఉంటే ముక్కలకున్న పులుపుదనం కాస్త తగ్గుతుంది. ఇప్పుడు ఒక కుండలో అరలీటర్ నీళ్లు, పంచదార వేయాలి. దాన్ని స్టౌ పైన పెట్టి పాకం పట్టాలి. అందులో మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత దాంట్లోనే ఎండుమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర వేయాలి. కొద్దిగా వేడెక్కాక స్టౌ ఆఫ్ చేసేయాలి. ఇలాగే మరో రెండు రోజులు కాస్త వేడి చేస్తూ ఉంటే మిశ్రమం గట్టిపడుతుంది. ఆపైన ఈ మిశ్రమంలో వెనిగర్ వేసి ఓ రెండుగంటలపాటు వేడి చేయాలి. ఆవకాయ పాడవకుండా వెనిగర్ కాపాడుతుంది. కేరళ ఇన్స్టంట్ ఆవకాయ కేరళ స్టైల్ ఇన్స్టంట్ ఆవకాయ తయారీ చాలా తేలిక. దీని తయారీకి అరగంట కంటే ఎక్కువ సేపు పట్టదు. అయితే, ఇది ఏడాది పొడవునా నిల్వ ఉండదు. కావలసినవి: పచ్చిమామిడికాయ ముక్కలు- 2 కప్పులు (తొక్కతో పాటు కట్ చేసుకోవాలి), ఉప్పు- 2 టేబుల్ స్పూన్లు, నూనె- పావు కప్పు, ఆవాలు- రెండున్నర టీ స్పూన్లు, మెంతులు-అర టీ స్పూన్, కారం- 3 టీ స్పూన్లు, కరివేపాకు - 2 రెమ్మలు, వెనిగర్- 2 టీ స్పూన్లు తయారీ: తరిగిన మామిడికాయ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకుని, వాటికి ఉప్పు పట్టించాలి. అరగంట సేపు అలాగే వదిలేయాలి. ఆవాలు, మెంతులు మిక్సీలో వేసి పొడిగా తయారు చేసుకోవాలి. స్టౌ వెలిగించి, బాణలిలో నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, మెంతుల పొడి వేయాలి. వెంటనే కారం, కరివేపాకు వేసి గరిటెతో కొద్ది సెకండ్లు బాగా కలపాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలను బాణలిలో వేసి, బాగా కలుపుతూ స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత ఉప్పు, వెనిగర్ వేసి బాగా కలపాలి. చల్లారిన తర్వాత పొడిగా ఉన్న జాడీలోకి లేదా సీసాలోకి ఈ ఆవకాయను తీసుకుని, గాలి చొరబడకుండా మూత వేయాలి. ఫ్రిజ్‌లో భద్రపరచుకుంటే, దాదాపు రెండు వారాల వరకు నిల్వ ఉంటుంది. ఆమ్కా సూఖా ఆచార్ ఉత్తరాది రాష్ట్రాల్లో నూనె ఎక్కువగా వాడకుండా మామిడికాయలతో ఎండు ఆవకాయ కూడా తయారు చేస్తారు. ఉత్తరాది శైలిలో మామిడికాయ ఎండు ఆవకాయ తయారీ పద్ధతి చాలా తేలిక. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్ ప్రాంతం ‘ఆమ్కా సూఖా ఆచార్’ (ఎండు ఆవకాయ) తయారీకి పెట్టింది పేరు. కావలసినవి: మామిడి కాయలు - 6 (పెద్ద సైజువి), ఉప్పు - 100 గ్రాములు, పసుపు - 2 టీ స్పూన్లు, మెంతులు - 2 టేబుల్ స్పూన్లు, సోంపు - 2 టేబుల్ స్పూన్లు, పసుపు ఆవాలు - 2 టేబుల్ స్పూన్లు, వాము - 2 టీ స్పూన్లు, కారంపొడి - 1 టేబుల్ స్పూన్, ఇంగువ - అర టీ స్పూన్, ఆవనూనె - అరకప్పు తయారీ: మామిడి కాయలను దాదాపు పన్నెండు గంటల సేపు బకెట్ నీటిలో నానబెట్టాలి. తర్వాత వాటిని బయటకు తీసి, పొడిబట్టతో శుభ్రంగా తుడిచి, ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత కావలసిన సైజులో ముక్కలు తరుక్కోవాలి. ఈ ముక్కలను ప్లాస్టిక్ డబ్బాలో పోసి, ఉప్పు, పసుపు వేసి అవి ముక్కలకు బాగా పట్టేలా కలిపి వదిలేయాలి. ఇలా రోజుకు ఒకసారి చొప్పున వారం రోజుల పాటు ముక్కలను కలుపుతూ ఉండాలి. వారం రోజుల్లో ముక్కలు మెత్తబడతాయి. కాస్త నీరు ఊరుతుంది. ఇప్పుడు నీటిని వదిలేసి, ముక్కలను ఒక పళ్లెంలోకి తీసుకుని, ఎండలో పెట్టాలి. ఎండిన తర్వాత మామిడి ముక్కలు గోధుమ రంగులోకి మారుతాయి. ఇప్పుడు మెంతులు, పసుపు ఆవాలు, సోంపు, వాము, ఇంగువ మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. బాణలిలో నూనె తీసుకుని, స్టౌపై వేడి చేయాలి. నూనె వేడెక్కుతుండగా ఈ పొడితో పాటు కారం వేసి బాగా కలుపుతూ, స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత మామిడి ముక్కలను బాణలిలోని మిశ్రమంపై వేసి, అంతా పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు ఎండు ఆవకాయ తయారైనట్లే. దీనిని పొడిగా ఉన్న సీసా లేదా జాడీలో భద్రపరచుకోవాలి. మహారాష్ట్ర కైరీ చే లోంచే మహారాష్ట్రలో మరాఠీలు తయారు చేసుకునే ఆవకాయ దాదాపు తెలుగువారి ఆవకాయ మాదిరిగానే ఉంటుంది. కాకుంటే, వాళ్ల ఆవకాయలో ఇంగువ, ఇతర సుగంధద్రవ్యాల గుబాళింపు కాస్త ఎక్కువగా ఉంటుంది. కావలసినవి: పచ్చి మామిడికాయలు - 6, ఇంగువ- 1 టేబుల్ స్పూన్, నూనె - అరకప్పు, ఉప్పు - 3 టేబుల్ స్పూన్లు, ఆవపొడి - అరకప్పు, కారం - అరకప్పు, వెల్లుల్లి - పన్నెండు రెబ్బలు, పసుపు ఆవాలు - అరకప్పు, పసుపు - 1 టేబుల్ స్పూన్, మెంతులు - 3 టేబుల్ స్పూన్లు, జాజికాయ పొడి - 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క -రెండు మూడు చిన్న ముక్కలు, లవంగాలు - నాలుగైదు తయారీ: మామిడి కాయలను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ముక్కలకు ఉప్పు, పసుపు పట్టించి, అరగంట అలాగే వదిలేయాలి. తర్వాత స్టౌ వెలిగించి, మందపాటి బాణలిలో నూనె పోసి మరిగించాలి. ఇంగువ, జాజికాయ పొడి, దాల్చిన చెక్క, లవంగాలు, కారం వేసి కలుపుతూ స్టౌ కట్టేయాలి. చల్లారిన తర్వాత ఆవపొడి, ఆవాలు, మెంతులు వేసి కలపాలి. ఈ మిశ్రమంలో మామిడి ముక్కలు వేసి, బాగా కలపాలి. దీనిని పొడిగా ఉన్న జాడీలో లేదా సీసాలో భద్రపరచాలి. ఇది దాదాపు ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఆమ్కా ఛుందా గుజరాతీలు ఎక్కువగా తీపి పులుపుల సమ్మేళనాన్ని ఇష్టపడతారు. ‘ఖట్టా... మీఠా’కు కేరాఫ్ గుజరాత్. వాళ్ల ఆవకాయలోనూ ఈ రుచులే ప్రధానంగా కనిపిస్తాయి. కావలసినవి: పచ్చి మామిడికాయలు - 3 (పెద్దవి), ఉప్పు - 2 టీ స్పూన్లు, పసుపు - 1 టీస్పూన్, పంచదార - 1 కప్పు, కారం - 2 టీ స్పూన్లు, జీలకర్రపొడి - 1 టీ స్పూన్ తయారీ: ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటి తొక్క తీసి, తురుముకోవాలి. ఇప్పుడు ఆ మామిడికాయ తురుమును ఓ గిన్నెలోకి తీసుకొని, అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో పంచదార కూడా వేసి కలపాలి. కొద్దిసేపయ్యాక పంచదార కరుగుతుంది. అప్పుడు ఆ మిశ్రమంలో కారం, జీలకర్రపొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయ మిశ్రమాన్ని స్టౌ పైన పెట్టి మంట తగ్గించాలి. అలా 10 నిమిషాలు పెట్టి కలుపుతుండాలి. దాంతో మిశ్రమం చిక్కబడుతుంది. స్టౌ ఆఫ్ చేసి, మ్యాంగో ఛుందా ఆవకాయను దింపేయాలి. (ఈ ఆవకాయలో పంచదారకు బదులు బెల్లం కూడా ఉపయోగించొచ్చు) తమిళనాడు వడు మాంగాయ్ సాధారణంగా ఆవకాయల తయారీకి ముదురు కాయలనే ఎంచుకుంటారు. తమిళనాడులో మాత్రం కసురు పిందెలతో కూడా ఆవకాయ తయారు చేస్తారు. ‘వడు మాంగాయ్’గా తమిళులు చాలా ఇష్టంగా తినే ఈ ఆవకాయ తయారీ చాలా తేలిక. కావలసినవి: మామిడి పిందెలు - పావు కిలో, కారం - 1 టేబుల్ స్పూన్, పసుపు - 1 టీ స్పూన్, ఉప్పు - తగినంత, ఆవాలు - 1 టేబుల్ స్పూన్, మెంతులు - 1 టేబుల్ స్పూన్, నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు తయారీ: మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడిబట్టతో తుడవాలి. పిందెలపై తడి పూర్తిగా ఆరాక వాటికి నువ్వులనూనె పట్టించి, ఒక గిన్నెలో వేయాలి. నూనె పట్టించిన మామిడి పిందెలపై ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. వాటినలా ఒక రోజు వదిలేయాలి. మరుసటి రోజు ఆవాలు, మెంతులు పొడిగా చేసుకుని, ఆ పొడిని కారంలో కలపాలి. ఈ కారం పొడిని మామిడి పిందెలపై వేసి, బాగా కలపాలి. తర్వాత గిన్నెపై మూతపెట్టి ఐదారు రోజులు వదిలేయాలి. ఈ ఐదారు రోజుల్లో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కలుపుతూ ఉండాలి. ఐదారు రోజుల్లో నీరు ఊరి, మామిడి పిందెలపై తొక్క కాస్త ముడుతలు తేలుతుంది. ఇప్పుడు ‘వడు మాంగాయ్’ సిద్ధమైనట్లే. రాజస్థానీ ఆమ్కా మీఠా ఆచార్ రాజస్థానీ రుచులు అక్కడి భోజన రాజసానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఆవకాయల తయారీలోనూ వాళ్ల రూటే సెపరేటు. తీపి ఆవకాయ తయారీలో బెల్లం, పంచదార రెండింటినీ వాడతారు. కావలసినవి: పచ్చిమామిడికాయలు - 2 లేదా మామిడికాయ ముక్కలు - 1 కప్పు, ఉప్పు - చిటికెడు, పసుపు - పావు టీ స్పూన్, పంచదార - అరకప్పు, బెల్లం తురుము - అరకప్పు, వేయించిన ధనియాలపొడి - 2 టేబుల్ స్పూన్లు, ఆవపిండి - 2 టేబుల్ స్పూన్లు, మెంతిపొడి - 2 టేబుల్ స్పూన్లు, కారంపొడి - 1 టేబుల్ స్పూన్, ఇంగువ - 1 టీ స్పూన్, నూనె - 1 టేబుల్ స్పూన్ తయారీ: ముందుగా మామిడిపండ్లను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటి తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఆ ముక్కలకు పసుపు, ఉప్పును పట్టించి ఓ ఎనిమిది గంటల వరకు పక్కన పెట్టేయాలి. అప్పటికి ఆ ముక్కలు కొద్దిగా ఊరతాయి. ఆ మామిడికాయల మిశ్రమంలో పంచదార, బెల్లం తురుమును కొద్దికొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టౌపై బాణలి పెట్టి అందులో మామిడికాయల మిశ్రమాన్ని వేయాలి. సన్నని మంట మీద బెల్లం చిక్కని పాకంగా మారాక దింపేసి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో నూనెను వేడి చేయాలి. అందులో ఆవపిండి, ధనియాలపొడి, మెంతిపొడి, కారం పొడి, ఇంగువలను వేసి రెండు నిమిషాలు కలుపుకొని దింపేయాలి. అది పూర్తిగా చల్లారాక, ముందుగా తయారు చేసిన మామిడికాయల మిశ్రమంలో దీన్ని వేసి బాగా కలుపుకొని జాడీలోకి తీసుకోవాలి. ఈ ఆవకాయను ఏడాదికాలం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. బెంగాలీ గుడొ ఆమ్ ఆచార్ మిఠాయిలను ఇష్టపడే బెంగాలీలు ఎక్కువగా తీపి ఆవకాయలు, ఊరగాయలనే ఇష్టపడతారు. పచ్చి మామిడి ముక్కలతో బెంగాలీలు చేసుకునే తీపి ఆవకాయ తయారీ చాలా సింపుల్‌గా ఉంటుంది. కావలసినవి: మామిడి కాయలు - నాలుగు (మీడియం సైజులో ఉండేవి కాస్త పండినవైతే మంచిది), బెల్లం - 1 కప్పు (తరిగి ఉంచుకోవాలి), ఉప్పు - 1 టీ స్పూన్, పసుపు - 1 టీ స్పూన్, పాంచ్ ఫొరొన్ - 2 టేబుల్ స్పూన్లు (ఐదురకాల పోపు దినుసులు: ఆవాలు, మెంతులు, జీలకర్ర, సోంపు, నల్ల జీలకర్ర), ఎండు మిరపకాయలు - 12, జీలకర్ర - 1 టేబుల్ స్పూన్, ధనియాలు - అర టేబుల్ స్పూన్, సోంపు - ఒకటిన్నర టీ స్పూన్, ఆవనూనె - అరకప్పు, సున్నం - అర టీ స్పూన్ తయారీ: మామిడికాయలను శుభ్రంగా కడిగి, పొడిబట్టతో తుడిచి ఆరబెట్టాలి. తర్వాత వాటిని కావలసిన సైజులో తొక్క తీయకుండానే ముక్కలుగా తరగాలి. మామిడి ముక్కలు పట్టే సైజులోని ఒక పెద్దగిన్నెలో నీరు తీసుకుని, సున్నం కలపాలి. సున్నం కలిపిన నీటిలో మామిడి ముక్కలను వేసి, పది నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత ఆ నీటిని వంపేసి, మామిడి ముక్కలను పొడిగా ఉన్న పళ్లెంలోకి తీసుకోవాలి. స్టౌ వెలిగించి, మందపాటి బాణలిలో పోపు వేగడానికి తగినంత నూనె పోయాలి. నూనె కాగాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేయాలి. అవి చిటపటలాడుతుండగా, రెండు ఎండు మిరపకాయలను వేయాలి. తర్వాత స్టౌను మీడియం మంటలో ఉంచి, మామిడి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి నెమ్మదిగా కలపాలి. మామిడి ముక్కలు మెత్తబడగానే స్టౌ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వేరే బాణలిని స్టౌ మీద పెట్టి, అందులో బెల్లం వేసి, పాకానికి సరిపోయేలా కొద్దిగా నీరు పోయాలి. తక్కువ మంటపై ఉడకబెడుతూ బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పాకం చిక్కబడిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. పోపు పెట్టి సిద్ధంగా ఉంచుకున్న మామిడి ముక్కలను ఈ బెల్లం పాకంలో వేసి, బాగా కలపాలి. ఇప్పుడు మరో చిన్నసైజు బాణలిలో మిగిలిన టేబుల్ స్పూన్ పోపు దినుసులు, ధనియాలు, సోంపు, పది ఎండు మిరపకాయలు వేసి, నూనె లేకుండా పొడిగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత ఈ దినుసులను మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకంలో మామిడి ముక్కల మిశ్రమాన్ని వేసి ఉడికించాలి. అవి ఉడుకుతూ ఉండగా మిగిలిన నూనె పోయాలి. మామిడి ముక్కల్లోని నీరంతా ఇగిరిపోయే వరకు ఇలా ఉడికించి, తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మిక్సీలో తయారు చేసుకున్న పొడిని వేసి, బాగా కలపాలి. చల్లారిన తర్వాత పొడిగా ఉన్న సీసాలో లేదా జాడీలో భద్రపరచుకోవాలి. ఇది ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఆవకాయ చిట్కాలు * చాలామంది ఈపాటికే ఆవకాయ పెట్టేసి ఉంటారు. మరికొందరు దానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండుంటారు. పచ్చళ్లు పెట్టే సమయం మించిపోతుందన్న కంగారులో జాగ్రత్తలు తీసుకోకుండా ఆవకాయను పెట్టేస్తుంటారు. అలాంటప్పుడే అవి వారం, రెండు వారాలకే బూజు పడతాయి. అలా జరగకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి.. * నిర్లక్ష్యం చేయకుండా ఊరగాయలకు వాడే పాత్రలు, గిన్నెలు, గరిటెలు శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడవాలి. లేదంటే ఆ పాత్రలను స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. * ఇక ఆవకాయను నిల్వ చేసే గాజు సీసాలు, జాడీలను కొద్దిసేపు ఎండలో పెట్టినా మంచిదే. * ఆవకాయ బూజు పట్టకుండా ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే, వాటిని పెట్టే జాడీల పైభాగంలో వేడినూనెలో ముంచిన వస్త్రంతో తుడిస్తే చాలు. * ఊరగాయలు జాడీలోకి తీసుకున్నాక, చాలామంది వాటిపై వస్త్రం చుడతారు. అలా చుట్టడం మంచిదే కానీ ప్రస్తుతం మూత గట్టిగా ఉండే సీసాలు విరివిగా దొరుకుతున్నాయి. * స్టీలు, రాగి పాత్రల్లో, ప్లాస్టిక్ డబ్బాల్లో ఆవకాయను నిల్వ ఉంచకూడదు. * నూనె, ఉప్పు, కారం వంటి పదార్థాలు కలపడానికి చెక్క గరిటెను ఉపయోగించడం మేలు. వడ్డించుకునేటప్పుడు మాత్రం ఆవకాయను చిన్న సీసాలోకి తీసుకొని స్టీలు చెంచాను వాడొచ్చు. * ఆవకాయకు వాడే మామిడికాయలను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పగిలిన కాయలు, మెత్తబడిన కాయలను ఆవకాయకు వాడకూడదు. * నూనె విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కొందరు నువ్వుల నూనె వాడితే మరికొందరు వేరుశనగనూనె వాడుతుంటారు. ఏ నూనె వాడినా, అది స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలి. -
కాయల్లోన ఆవకాయ వేరయా!
చిల్లీ సిల్లీగా... ‘‘ఆవకాయ అనే మాటనో, పచ్చడినో సినిమాలో ఎక్కడైనా పెట్టేశామనుకో... అది సూపర్‌హిట్టు అవుతుందిరా’’ అన్నాడు రాంబాబు. ‘‘ఎందుకురా అనవసరంగా ఇలా రెండు వేర్వేరు అంశాలను ముడేస్తావు’’ అన్నాను. ‘‘నీకు విషయం తెలియదు. నేను సోదాహరణంగా చెబితే గానీ అర్థం కాదు. ఇప్పుడు మనం వెళ్లొస్తున్న మూవీ ఏమిటి? సూపర్‌స్టార్ మహేశ్ బాబు దూకుడు. అందులోని పాట ఇప్పుడే విన్నావు కదా... ఏమని పాడతాడు మహేశ్ బాబు... ‘ఇటురాయే ఇటు రాయే / నీ మీదే మనసాయే / గొడవ గొడవాయే / హే ధడక్ ధడక్ అని దేత్తడి దేత్తడి / ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశా’ అని పాడాడా లేదా. అది చాలు. సినిమా సూపర్ డూపర్ హిట్టు. ఇందులో పచ్చడి అంటే ఏమిటనుకుంటున్నావు? మన ఆవకాయేరా. ఆవకాయ సినిమాలో ఉందంటేఅది సూపర్ హిట్టే’’ అంటూ మళ్లీ అదే పల్లవి అందుకున్నాడు. ‘‘నవ్వు ఎన్ని చెప్పినా నమ్మను రా’’ అన్నాన్నేను. ‘‘యమగోల సినిమా చూశావా? అసలు ఆ సినిమా సక్సెస్ అంతా ఆవకాయ మీదే ఆధారపడి ఉంటుంది. అందులో ఆవకాయను చూసి రక్తమాంసాలనుకుంటారు యముడు సత్యనారాయణ, చిత్రగుప్తుడు అల్లు రామలింగయ్య. అప్పుడు సాక్షాత్తూ ఎన్టీఆర్ ఆవకాయ ప్రాశస్త్యం గురించి అద్భుతంగా వివరిస్తాడు. అంతే యముడు ఆవకాయ తిని, దాంతో లవ్వులో పడిపోతాడు. అలా పడిపోవడం వల్లనే జయప్రదను ‘కళ్యాణమస్తు అనీ, దీర్ఘసుమంగళీభవ’ అని దీవించి, మరోసారి బోల్తా పడిపోతాడు. ఇద్దిగ్గో... ఈ పాయింట్ మీదే సినిమా సక్సెస్ అంతా ఆధారపడి ఉంది. అలా దీవించడానికి కారణం ఆవకాయే. అలా దీవించబట్టే ఎన్టీఆర్‌ను తనతో తీసుకెళ్లలేకపోయాడు యముడు. అంతేకాదు దగ్గరుండి పెళ్లి కూడా చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఆయకాయ సినిమాకు టర్నింగ్ పాయింట్ అన్నమాట. అంతెందుకు ‘ఆహ నా పెళ్లంట’ సినిమాలో కోట శ్రీనివాసరావు ఇంటికి పెళ్లికొడుకు శుభలేఖ సుధాకర్‌తో పాటు ఇద్దరు బకాసురులు వస్తారు. ఇంట్లో తినడానికి ఏవీ లేవని కోట శ్రీనివాసరావు అంటే మామిడికాయ పచ్చడి ఉంటే చాలు అని ఆవకాయ బద్దల్ని కడుక్కుతినేస్తారు. దీన్ని బట్టి నీకు తెలిసేదేమిటీ... ఇప్పుడు పాటలో పచ్చడి పచ్చడి అని ఉన్నా... సన్నివేశంలో ఆవకాయ ఉన్నా సినిమా సూపర్‌హిట్టే’’ అని వివరించాడు. ‘‘నువ్వు చెప్పిన రెండూ కరెక్టే గానీ నాకెందుకో నువ్వు మోకాలికీ, బోడిగుండుకూ ముడేస్తున్నట్టు అనిపిస్తోంది రా’’ అన్నాను. ‘‘నో... నో... యూ ఆర్ మిస్టేకెన్. నేను చెట్టు మీది కాయకూ, సముద్రంలోని ఉప్పుకూ ముడేస్తున్నాను. అలా వేస్తే అది ఆవకాయ అవుతుంది. సదరు కాంబినేషన్ సూపర్ హిట్టవుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతా విను. సినీకమెడియన్ల తాలూకు అనేకానేక ఊతపదాలు ఆవకాయలోంచే పుట్టాయన్నది అబద్ధం కాదు. ‘తొక్క... టెంకె... పీచు...’ అవన్నీ పచ్చడి మామిడి నుంచి వచ్చాయన్నది మిడిమిడి జ్ఞానం కాదు. పరిశీలన మీద తెలిసే వాస్తవం. కేవలం కామెడీ మాత్రమే కాదురా... ఆవకాయలో సినిమాలకు సంబంధించిన ఎంతో ఫిలాసఫీ ఉంది’’ అన్నాడు రాంబాబు. ‘‘ఆవకాయలో సినిమా ఫిలాసఫీ ఏమిట్రా బాబు?’’ అంటూ అడిగా. ‘‘ఎందుకు లేదూ... విను. కొన్నిసార్లు పెద్ద హీరోను పెట్టుకొని భారీ బడ్జెట్ మూవీ తీస్తాం. అనుకున్నట్టే అది బ్లాక్‌బస్టర్ అవుతుంది. కానీ ఆ సినిమాతో అసలు హీరోకు బదులు ఎవడో చిన్నా చితకా ఆర్టిస్టుకు పెద్ద పేరొస్తుంది. సేమ్ టు సేమ్... ఆవకాయలోనూ అంతే. ఇక్కడ అసలు హీరో మామిడి. ఆవాలు అనేవి పచ్చడి కోసం వాడే అనేకానేక పదార్థాల్లో ఒకటి. అయితేనేం... మామిడికాయ పచ్చడి అనే మహా బ్లాక్‌బస్టర్‌లో మామిడి అనే హీరో మటుమాయమైపోయి ‘కాయ’ మాత్రం మిగిలి... ఆవాలలోని ‘ఆవ‘ అనే మాటే మొదట నిలుస్తుందనే విషయంలో ఆవగింజంతైనా అబద్ధం లేదు’’ అన్నాడు వాడు. ‘‘ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేసి దాన్ని సమస్త సినిమా ఫిలాసఫీ అంటే ఎలా’’ అన్నాను. ‘‘చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అసలు... అసలు హీరో మనం అయితే వాడెవడికో పేరు రావడం అన్నది మనకు కారం రాసినట్టు ఉంటుంది. అంటే ఇక్కడ పొడి కారం అనుకోకూడదు. అది నూనె, కారం మిక్స్. పచ్చడి చేసే ప్రక్రియలో కారం కలిపినప్పుడు నూనె కలిసిన కారం మాత్రమే చేతికి అంటి, మంట ఫీలింగ్ చాలా సేపు ఉంటుంది. కారం రాసినట్లు ఉండటం అనే వాడుక ఇలాగే వచ్చింది. ఇది సినిమా ఫీల్డులో చాలా కామన్. అంతేకాదు... రాంగ్ కాంబినేషన్స్ పెడితే సినిమా పెద్దగా ఆడే అవకాశం ఉండదని కూడా ఆవకాయ చెబుతుందిరా’’ అన్నాడు. ‘‘ఆవకాయ ఈ మాట ఎప్పుడు చెప్పింది?’’ అడిగా. ‘‘ఆవకాయ బిర్యానీ అన్నది పరమ రాంగ్ కాంబినేషన్ అని సినిమా టైటిల్ పెట్టిన్నాడే తెలిసిపోయింది. అన్నప్రాశన రోజే ఆవకాయ కూడదని ఆ సినిమా ద్వారా సమస్త మూవీ లోకానికి ఒక సందేశం అందింది ’’ అన్నాడు వాడు. ‘‘అవున్రోయ్... నువ్వు చెబుతుంటే నాకూ అనిపిస్తోంది... పెళ్లికాకుండానే హీరోయిన్ మామిడికాయ కొరుకుతుండటం చూసి గుమ్మడిలాంటి వారికి గుండెపోటు చాలాసార్లు వస్తుంది’’ అన్నాన్నేను కాస్త కోపంగా. ‘‘వారేవా... ఇప్పుడు కదరా నీకు కాయోదయం అయ్యింది’’ అన్నాడు వాడు మిర్చికోలుగా నన్ను చూస్తూ. - యాసీన్ -
ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంవత్సరం తొలి పండుగ.. అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. సకాలంలో వానలు పడి.. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పాడిపంటలతో రైతులు వర్ధిల్లాలని, పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని అన్నారు. షడ్రుచుల ఉగాది తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపి, ఆనందం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. -
తెలుగు ప్రజలకు మరోసారి ద్రోహం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపకంలో కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలకు రాష్ట్ర విభజన తరువాత మరోసారి ద్రోహం చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు పూర్తిగా భంగకరమని పేర్కొన్నారు. కేంద్రం సమర్పించిన అఫిడవిట్ గురించి ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన టీడీపీకి తెలియదంటే నమ్మశక్యంగా లేదన్నారు. టీడీపీ నేతలను సంప్రదించకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావించలేమన్నారు. ఎన్డీయే ప్రభుత్వం చేసిన ఈ అన్యాయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్‌గజపతి రాజు కూడా నోరు మెదపలేదని శ్రీకాంత్‌రెడ్డి తప్పు పట్టారు. వీరంతా తమ స్వీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్లుగా ఉందని మండిపడ్డారు. 2011లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడినప్పు డే మనకు అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. దిగువ రాష్ట్రాలకు మిగులు జలాలను వాడుకునే పూర్తి హక్కు ఉన్నా దానికోసం చంద్రబాబు పోరాడటం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను ఆయన దాదాపుగా వదులుకున్నారని ధ్వజమెత్తారు. విభజన చట్టంలో అమలు చేయాల్సిన అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉండటమే రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సమీక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ ముందడుగు తాము అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపుల రద్దుతోపాటు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్క మద్యం షాపు మాత్రమే ఉండేలా చేస్తామని, ధరలు షాక్ కొట్టేలా నిర్ణయిస్తామని వైఎస్ జగన్ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. విజయవాడలో కల్తీ మద్యం వల్ల మరణాలు సంభవించడంతో ఆయన ప్రస్తుతం ఓ అడుగు ముందుకేసి సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని చెప్పారని పేర్కొన్నారు. -
షరతులు వర్తిస్తాయా.. ?
-
విద్యుత్ రంగంలోకి ‘ఎంటర్ ది వరల్డ్ బ్యాంక్’ షరతులు వర్తిస్తాయా.. ?
ఫసియుద్దీన్ హైదరాబాద్ : ప్రపంచబ్యాంకు, విద్యుత్ రంగం అనే రెండు పదాలను జంటగా వినాల్సి వస్తే తెలుగు ప్రజలకు ఆటోమేటిగ్గా షాక్ తగులుతుంది. విద్యుత్ సంస్కరణల కోసం అప్పటి సీఎం చంద్రబాబు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకోవడం, ఆ బ్యాంకు షరతులను అమలుచేసి ప్రజా కంటక పాలకుడిగా ముద్రపడిపోవడం ఇంకా మన జ్ఞాపకాల్లోంచి జారిపోలేదు. ఇన్నాళ్లకు మళ్లీ తెలంగాణ విద్యుత్ రంగం వాకిట్లోకి ప్రపంచ బ్యాంకు వచ్చి నిలబడింది. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ప్రపంచ బ్యాంకు అధికారులు చర్చలు జరుపబోతున్నారనేది విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యాదాద్రి థర్మల్ కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా చేసే లైన్ల నిర్మాణం కోసం రూ.4 వేల కోట్లను ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా సమకూర్చుకోవడం ప్రభుత్వ తొలి లక్ష్యం. అంతేగాకుండా నష్టాల్లో ఉన్న డిస్కంలను లాభాల బాటలో పడవేసేందుకు కూడా రెండో దశలో రుణం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు రుణం అనగానే కన్సల్టెన్సీలు, వాటి కర్రపెత్తనం ఉండి తీరుతుంది. మరి అలాంటివేమీ లేకుండా తెలంగాణ ప్రభుత్వానికి మినహాయింపులు ఉంటాయా? లేక షరా మామూలుగానే ప్రపంచ బ్యాంకు షరతులు వర్తిస్తాయా..? వేచి చూడాలి.. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగా ఇప్పటికే పలుమార్లు ప్రపంచ బ్యాంకుతో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం... అధికారికంగా చర్చలు జరిపేందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్ర అధికారులు గురువారం ప్రపంచ బ్యాంకు బృందంతో సమావేశమై రుణ ఒప్పందంపై చర్చలు జరపనున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో ‘యాదాద్రి’ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని టీజెన్‌కో చేపట్టిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి విద్యుత్ సరఫరా లైన్లను నిర్మించేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4 వేల కోట్ల రుణాన్ని సమీకరించేందుకు అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. తదుపరి దశల్లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలిసింది. అయితే చంద్రబాబు హయాంలో తప్పితే ఆ తర్వాత విద్యుత్ రంగంలో ప్రపంచ బ్యాంకు రుణం స్వీకరించిన దాఖలాలు లేవు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ, వినియోగదారులకు సబ్సిడీలు నిలిపేయాలన్న ఆంక్షలతో నాడు ప్రపంచ బ్యాంకు చంద్రబాబు సర్కారుపై పెత్తనం సాగించింది. అలాంటిది తాజాగా టీఆర్ఎస్ సర్కారు.. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో వరల్డ్ బ్యాంకు ఝలక్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగ పునర్నిర్మాణ పథకం పేరుతో 1996లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి బిలియన్ డాలర్లు (అప్పటి లెక్కన సుమారు రూ.4,200 కోట్లు) రుణాన్ని సమీకరించింది. ఈ రుణాన్ని నాలుగు దశల్లో చెల్లించాలని, ప్రతి దశలో నియమ నిబంధనలన్నీ పాటించాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు రూపొందించిన ఆంక్షల ఒప్పందంపై బాబు సర్కారు సంతకాలు చేసింది. ఆ ఒప్పందం తొలిదశలో భాగంగానే ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు 3 ముక్కలై జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలుగా ఏర్పడ్డాయి. రెండోదశలో విద్యుత్ చార్జీలు భారీగా పెంచేసి, ఆ తర్వాత డిస్కంలను ప్రైవేటీకరించాల్సి ఉండగా.. ఆ దిశగా ప్రభుత్వం పావులు కదిపింది. 2000 జూలై లో భారీగా విద్యుత్ చార్జీలను పెంచేసింది. సగటున 15 శాతం చార్జీలు పెరిగినప్పటికీ గృహాలపై 100 శాతం, రైతులపై 50 శాతం అదనపు భారం పడింది. ఆ తర్వాత డిస్కంల ప్రైవేటీకరణ జరపాలన్న షరతు అమలుకు చంద్రబాబు సర్కారు ప్రయత్నించింది. అయితే విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ... 2000 ఆగస్టు 28న కాంగ్రెస్, వామపక్షాలు చలో హైదరాబాద్ పేరుతో లక్షల మందితో ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనకారులపై బషీర్‌బాగ్ వద్ద పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు మృతిచెందారు, వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఈ ఘటనతో బాబు సర్కారు డిస్కంల ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గింది. దాంతోపాటు ఒరిస్సాలో డిస్కంల ప్రైవేటీకరణ విఫలం కావడంతో వేచి చూడాలని నిర్ణయించింది. ఈ సమయంలో ప్రపంచ బ్యాంకు ఆంక్షలకు వ్యతిరేకంగా నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఉద్యమాలు మొదలయ్యా యి. రైతులకు ఉచిత విద్యుత్ నినాదంతో వైఎస్ 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న డిస్కంల ప్రైవేటీకరణ ఒప్పందాన్ని అమలు చేయడానికి వైఎస్సార్ నిరాకరించారు. స్వదేశీ బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నప్పుడు ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లాల్సిన అవసరం లేదని బహిరంగంగా ప్రకటించారు. ఆ తర్వాత ప్రభుత్వాలేవీ విద్యుత్ రంగంలో ప్రపంచ బ్యాంకు రుణానికి సాహసించలేదు. అలాంటిది ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ఆర్ఈసీ, పీఎఫ్సీ లాంటి సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నా.. ప్రపంచ బ్యాంకు రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విపరిణామాలు ఎన్నో.. ఆర్ఈసీ, పీఎఫ్‌సీల రుణాల ఖర్చులపై విద్యుత్ సంస్థలకు స్వేచ్ఛ ఉంటుంది. అదే ప్రపంచ బ్యాంకు ఎన్నో ఆంక్షలు పెడుతుంది. ఆ బ్యాంకు కన్సల్టెన్సీల పర్యవేక్షణలో ప్రాజెక్టు అమలు చేయాలి. అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్న సంస్థలకు అనుకూలంగా ఈ కన్సల్టెన్సీలు బిడ్ డాక్యుమెంట్లో నిబంధనలను చొప్పిస్తాయి. దేశీయ కంపెనీలు టెండర్లలో పాల్గొనకుండా చేస్తాయి. ఈ రుణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారెంటీ, కౌంటర్ గ్యారెంటీలు ఇవ్వాలి. ప్రపంచ బ్యాంకు వడ్డీలు తక్కువ అని ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటాయి. కానీ విద్యుత్ సంస్థలపై వడ్డీల భారం తడిసి మోపెడు కానుంది. ఈ రుణం ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి, కేంద్రం నుంచి రాష్ట్రానికి, ఆ తర్వాత విద్యుత్ సంస్థలకు చేరుతుంది. అంతేగాకుండా రుణం డాలర్లలో ఇచ్చే నేపథ్యంలో.. మారకపు విలువలో హెచ్చుతగ్గుల భారం విద్యుత్ సంస్థలపై పడుతుంది. రూ.5 కోట్లకు మించి విద్యుత్ సంస్థలు చేసే ఖర్చును విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నియంత్రిస్తుంది. కానీ ప్రపంచ బ్యాంకు విషయంలో ఈఆర్సీదీ ప్రేక్షక పాత్రే. ప్రపంచ బ్యాంకు సూపర్ రెగ్యులేటరీ కమిషన్‌గా అజమాయిషీ చెలాయించేందుకు ప్రయత్నిస్తుంది. -
తెలంగాణ ఏర్పాటును ‘గాయం’గా భావించొద్దు
⇒ ముందు ఆ భావనను తొలగించుకోండి ⇒ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పిలుపు ⇒ ఇరు రాష్ట్రాల తెలుగు వారికి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ⇒ ఇక్కడి తెలుగు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ⇒ తెలంగాణ తొలి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా‘సాక్షి’తో ముఖాముఖి సాక్షి, ముంబై: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును గాయంగా భావించవద్దని, ఒకవేళ ఆ భావన మనస్సుల్లో ఉంటే తొలగించుకోవాలని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసమే తెలుగు రాష్ట్రాలు విడిపోయాయని, అన్నదమ్ముళ్లలా విడిపోయి కలసి ఉండొచ్చని చెప్పారు. ఇక్కడి తెలుగువారి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ తొలి అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇరు రాష్ట్రాలుగా ఏర్పడ్డ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్రాలు విడిపోవడం మాయని గాయంగా మిగిలిపోతుందన్న అభిప్రాయాన్ని, భావాన్ని మనస్సుల్లోంచి తొలగించుకోండి. రెండు రాష్ట్రాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో తెలుగు భాష పట్ల ఉన్న ప్రేమాభిమానాలను, నమ్మకాన్ని పెంచాలి. హైదరాబాద్, ముంబైలాంటి నగరాలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రజల సమాహారంవంటివి. ఈ బంధాన్ని ఎప్పటికీ తెంపవద్దు. గణనీయమైన అభివృద్ధి సాధించి దేశానికే చక్కటి సంకేతాన్ని అందించాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలపై ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్ని ఆందోళనలు, ఉద్యమాలు జరిగినా మహారాష్ట్రలో మాత్రం తెలుగు వారంతా కలసిమెలసి ఉంటున్నారు’ అని సందేశాన్నిచ్చారు. తెలుగు భవనం కోసం... రాష్ట్రంలో తెలుగు భవనం ఏర్పాటుకు, కులధ్రువీకరణ పత్రాల జారీలో ఏర్పడిన సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని విద్యాసాగర్ రావు తెలిపారు. ‘ రాష్ట్రంలోని శ్రమ శక్తి అంటే తెలుగువారే. అయితే అనేక మంది సమస్యలు బాధాకరం. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధానంగా నేత కార్మికులు, కూలీలు, శ్రామికులు, తదితరులపై మారిన పరిస్థితుల ప్రభావం పడింది. కొన్ని ప్రాంతా ల్లో వలస వచ్చిన ప్రజలే మళ్లీ వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో షోలాపూర్, భివండీ తదితర ప్రాంతాల్లో తెలుగువారి జనాభా తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనం. ఈ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చాం. వాటిని అంచెలంచెలుగా పరిష్కరించడానికి ప్రభుత్వం కూడా సన్నద్ధవుతుంది అని ఆయన అన్నారు. చెరగిపోని చరిత్ర... ముంబైతోపాటు మహారాష్ట్రలోని పలు నగరాల్లో తెలుగు వారి చరిత్ర ఎన్నటికీ చెరిగిపోనిదని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఇక్కడి అనేక ప్రాంతాల అభివృద్ధి కోసం చెమటోడ్చిన చరిత్ర తెలుగువారిదని అభివర్ణించారు. సం యుక్త మహారాష్ట్ర కోసం తెలుగు ప్రజలు చేసి న సుధీర్గమైన పోరాటం మరచిపోలేదని అన్నా రు. మహారాష్ట్ర కోసం ప్రాణాలు విడిచిన అమరవీరుల్లో మనవారు కూడా ఉన్నారన్నారు. ఉద్యమ సమిధలను స్మరించుకోవాలి... తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన వారందిరిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని విద్యాసాగర్ రావు తెలిపారు. రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన బిడ్డల త్యాగం మరచిపోలేనిదని, ఆత్మగౌరవం కోసం గళం విప్పిన కళాకారులు, కదం తొక్కిన కలం యోధులకు అభినందినలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్లో సంత్ గాడ్గేబాబా విగ్రహం స్వచ్ఛత అభియాన్ గురించి సంత్ గాడ్గేబాబా చేసిన కృషి మరవలేనిదని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఆయన చేపట్టిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. ఆయన విగ్రహాన్ని త్వరలోనే తెలంగాణలోని కరీంనగర్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. రజకుడైన ఆయన చేపట్టిన ఉద్య మం ద్వారా లక్షలాది మంది ప్రజల మన్ననలు పొందిందన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ వంటి వారిని కూడా ప్రభావితం చేశారన్నారు. -
రైల్వే బడ్జెట్‌పై తెలుగు ప్రజల్లో నిరసన
ఒక్క ప్రతిపాదన కూడా పరిశీలించలేదని అసహనం సాక్షి ముంబై: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన 2015-16 రైల్వే బడ్జెట్ మహారాష్ట్రలోని తెలుగు ప్రజలతోపాటు అనేక మందిని నిరాశపరిచింది. ముంబైకి చెందిన ప్రభు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నందున ముంబైకి వరాలు ప్రకటిస్తారని ప్రజలు భావించారు. ముంబై నుంచి నిజామాబాద్ మార్గంలో కొత్త రైలు లేదా వారానికి ఒకసారి నడిచే ఎల్టిటి-నిజామాబాద్ రైలును ప్రతి రోజు నడిపించడం లాంటి ప్రకటనలు వస్తాయని అనుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్లన్నింటిని ఠాణేలో నిలపాలనే డిమాండ్‌తోపాటు షోలాపూర్-హైదరాబాద్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, పుణే-హైదరాబాద్‌ల మధ్య మరో రైలు నడపాలన్న డిమాండ్లలో ఏదో ఒకటి పూర్తవుతుందని భావించారు. అయితే వీటిలో ఏ ఒక్క డిమాండ్‌ను పరిశీలించలేదు. దీంతో తెలుగు ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. అయితే రైళ్ల చార్జీలు పెంచకపోవడంతో కొంత ఊరటలభిందని చెప్పొచ్చు. మరోవైపు 2014-15 బడ్జెట్లో ఎన్డీఏ ప్రభుత్వం ముంబై-కాజిపేట(వరంగల్) వయా బల్లార్షా వారానికి ఒకసారి కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఇంతవరకు మోక్షం లభించలేదు. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి రిక్తహస్తాలే.. సాక్షి ముంబై: కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్(2015-16)లో ప్రయాణికులపై ఎలాంటి భారం మోపకపోయినా..మహారాష్ట్ర ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీలేదు. కొత్త రైళ్లు, జనాకర్షక పథకాల జోలికి వెళ్లకుండా కేవలం స్వచ్చత, భద్రత, ఆధునీకరణకు పెద్దపీట వేయడం వంటి తదితర అంశాలతోనే ముగించారు. ముఖ్యంగా కొత్త రైలు ఒక్కటీ ప్రకటించకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి రైల్వే మంత్రిగా సురేష్ ప్రభు రికార్డు సృష్టించారని చెప్పుకోవచ్చు. మహారాష్ట్రను దృష్టిలో ఉంచుకుని పెద్దగా జనాకర్షక ప్రకటన ఏదీ చేయకపోయినా.. కోంకణ్ రైల్వేలో రాబోయే మూడేళ్లలో 50 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. ముంబైకి కొంత ఊరట...! ముంబై-మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన సురేష్ ప్రభు రైల్వే మంత్రిగా ఉండడంతో రాష్ట్రానికి పెద్దపీట వేస్తారని ప్రజలంతా భావించారు. అనుకున్న స్థాయిలో పథకాలు ప్రవేశపెట్టకపోయినా... ముంబై వాసులకు ఎయిర్ కండిషన్ లోకల్ రైలు, ముంబై-ఢిల్లీ మార్గంలో హైస్పీడ్ రైళ్లు, ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు వంటి వాటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోందన్నారు. బుల్లెట్ రైలును ప్రవేశపెట్టేందుకు మాత్రం మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. మహిళా భద్రత దృష్టి కోణంతో మహిళ బోగీలతోపాటు ముంబై సబర్బన్ (ఉపనగరం) రైల్వేస్టేషన్లలో సీసీ టీవీలు అమర్చనున్నారు. దీంతోపాటు ఐరోలి-కల్వా ఎలివేటెడ్ మార్గం కోసం రూ. 428 కోట్లను కేటాయించారు. విరార్-డహాను మధ్య మూడో, నాలుగో ట్రాక్‌ల నిర్మాణం కోసం రూ. 3,555 కోట్లు, లోకల్ రైళ్ల బోగీల కోసం రూ. 565 కోట్లను ప్రకటించారు. రైల్వే బడ్జెట్‌పై శివసేన అసంతృప్తి సాక్షి, ముంబై: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రకటించిన రైల్వే బడ్జెట్‌పై శివసేనతోపాటు ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ముంబైలోని లోకల్ రైళ్లతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా పెద్దగా ఒరిగిందేమిలేదని ఆరోపించింది. రాష్ట్రానికి చెందిన వ్యక్తి రైల్వేశాఖ మంత్రిగా ఉండడంతో అనేక విషయాల్లో మహారాష్ట్రకు పెద్దపీట లభిస్తుందని శివసేన భావించింది. అయితే రాష్ట్రానికి అంతగా ప్రాధాన్యం లభించలేద ని శివసేన పార్లమెంట్ సభ్యులు గజానన్ కీర్తికర్, శివాజీరావ్ ఆడల్రావ్లు పేర్కొన్నారు. నాసిక్-పుణే కొత్త మార్గం సర్వే పనులు పూర్తయ్యాయని, అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన ప్రక్రియ ముందుకుసాగకపోగా మరోవైపు రతన్ ఇండియా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు కోసం 30 కిలోమీటర్ల రైలు మార్గాన్ని వేసేందుకు సానూకూలత తెలిపారని శివాజీరావ్ ఆడల్‌రావ్ ఎద్దేవా చేశారు. వర్దా-నాగపూర్‌ల మధ్య మూడవ లైను, కోంకణ్ రైల్వేలో 50వేల ఉద్యోగాల భర్తీచేస్తామన్న హామీలు మినహా పెద్దగా ఏమి జరగలేదని అన్నారు. రాష్ట్రంలో 359 ప్రాజెక్టులకోసం ఈ సారి రైల్వే బడ్జెట్లో రూ. 18 కోట్ల నిధులు కేటాయించడంతోపాటు కల్యాణ్-నగర్ రైల్వే మార్గం, విదర్భలోని కొత్త మార్గాలు, పుణే-నాసిక్ రైల్వే మార్గాలకు మోక్షం లభిస్తుందని భావించారు. కాని సురేష్ ప్రభూ నాగపూర్-వర్దా మార్గం మినహా ఎలాంటి కీలక ప్రకటనలు చేయలేదని శివసేన నాయకులు విమర్శించారు. సామాన్యులకు అనుకూలమైన బడ్జెట్ : ఆఠవలే ప్రయాణ చార్జీలను పెంచకుండా ప్రకటించిన రైల్వే బడ్జెట్ సామాన్యలకు అనుకూలమైనదిగా ఆర్పిఐ అధ్యక్షుడు రామ్‌దాస్ ఆఠవలే అభివర్ణించారు. రాష్ట్రానికి పెద్దగా ఏమి ప్రకటించకపోయినప్పటికీ చార్జీలు పెంచకపోవడం అందరికీ అనుకూలమైన అంశమనిఆయన పేర్కొన్నారు. బీజేపీ గడ్డుకాలం చూపిస్తోంది!: ఎన్సీపీ - పుణ్యక్షేత్రాలకే ఈ రైల్వేబడ్జెట్ అని విమర్శ - మంత్రి సొంత ప్రాంతానికీ మొండిచెయ్యి: నవాబ్ మాలిక్ సాక్షి, ముంబై: త్వరలో మంచి రోజులొస్తాయని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం పేదలకు గడ్డు కాలాన్ని చూపిస్తోందని ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మలిక్ ఆరోపించారు. కేంద్ర మంత్రి గురువారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎన్సీపీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ రైల్వే బడ్జెట్ పేదలను నిరాశపరిచే విధంగా ఉందని, తీర్థ యాత్రలకే ప్రాధాన్యం ఇచ్చారని, ఇది పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారికే మేలుచేసే విధంగా ఉందని చురకంటించారు. ‘మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. కాని ముంబైలో చేపడుతున్న ప్రాజెక్టులు ముంబై రైల్వే వికాస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకు రుణాలు, రాష్ట్ర ప్రభుత్వ సాయంతో జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులకు రైల్వే బడ్జెట్‌తో ఎలాంటి సంబంధం లేదు. మంత్రి ఇలా పేర్కొనడం ప్రజలను మోసం చేయడమే’ అని ఆరోపించారు. రైల్వే మంత్రి కొంకణ్ ప్రాంతానికి చెందినవారు కావడంతో అక్కడి ప్రజలు గంపెడాశతో ఉన్నారని, వారికి కూడా బడ్జెట్ వల్ల ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. ఈ బడ్జెట్లో డిజిటలైజేషన్ మినహా కొత్తదనమేమీ లేదని విమర్శించారు. ఈ సారి ప్రయాణికులకు ఎలాంటి చార్జీలు వడ్డించలేదని బీజేపీ వీపు తట్టుకుంటోందని, ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని మలిక్ అన్నారు. ‘వాస్తవానికి డీ జిల్ ధరలు తగ్గడంతో రైల్వేకు రూ.15వేల కోట్లు ఆదా అయ్యాయి. అందుకు చార్జీలు తగ్గించాలి. కాని యథాతథంగా ఉంచి, ఇప్పుడు ఎలాంటి చార్జీల భారం ప్రజలపై మోపలేదని సొంత డప్పు కొట్టుకుంటున్నారు’ అని ఆయన ధ్వజమెత్తారు. -
ఐకమత్యంతోనే తెలుగు ప్రజల ప్రగతి
దాదర్, న్యూస్‌లైన్: తెలుగు ప్రజలంతా ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ఏకమై సమస్యలపై పోరాడినప్పుడే ప్రగతి సాధిస్తారని ‘తెలుగు కళా సమితి’ ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి అన్నారు. నవీముంబై వాషిలోని కళాసమితి ప్రాంగణంలో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు కళా సమితిలో ప్రాంతీయబేధాలకు తావు లేదన్నారు. అన్ని ప్రాంతాలకు చెందిన పండుగలను, సాంస్కతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు కళా సమితి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందన్నారు. ముంబైలో తెలుగువారి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఒకే విధమైనవని అన్నారు. వాటి పరిష్కారానికి వారంతా సంఘీభావం తెలపాలని పిలుపు నిచ్చారు. అంతకు ముందు కళా సమితి అధ్యక్షుడు బండి నారాయణరెడ్డి, మాదిరెడ్డి కొండారెడ్డి, ఎం.సుబ్రహ్మణ్యం, కె.వరలక్ష్మి, ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి రాధా మోహన్ తదితరులు జ్యోతి ప్రజ్వలన గావించి సంబరాలను ప్రారంభించారు. కె.వరలక్ష్మి ఆలపించిన ..‘శ్రీ గణనాధం భజరే-సిద్ధ పరా శక్తి యుతం’ ప్రార్థనా గీతంతో సాంస్కతిక కార్యక్రమాలు ప్రారంభించారు. మహిళా సభ్యులు రజని, నీరజలు ‘నీరు జల్లిన ముంగిట్లో... పన్నీరు జల్లిన వాకిట్లో-- దారి పొడుగునా గొబ్బిళ్లో, ముత్యాల ముగ్గులా గొబ్బిళ్లో’ వంటి సంక్రాంతి పాటలను ఆల పించగా చిన్నారులు వాటికి అనుగుణంగా నృత్యం చేశారు. అభినయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్‌కు చెందిన డెరైక్టర్, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, గురు రాధామోహన్ బృందం ప్రదర్శించిన త్రిమూర్తులు, పుష్పాం జలి, మహారాష్ర్టకు చెందిన లావణి, ఇమేజస్ ఆఫ్ ఇండియా నృత్యాలు ఆహూతులను అలరించాయి. కాగా, ప్రముఖ తెలుగు కళాకారుడు కిషన్ జగ్లర్ ప్రదర్శించిన అద్భుత సాహస విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గత విద్యా సంవత్సరంలో ఉన్నత శ్రేణిలో విజయం సాధించిన విద్యార్థులకూ, కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు ఈ సందర్భంగా బహుమతులు, సర్టిఫికెట్లు అందించి సత్కరించారు. సమితి సభ్యులు సుబ్రహ్మణ్యం, వరలక్ష్మి, వై.వి.నారాయణరెడ్డి, టి. మంజుల, మీర్జాల్లి షేక్, మీనాంబిక తదితరులు సహాయ సహకారాలు అందించారు. -
మరాఠీ గడ్డపై తెలుగు బిడ్డలు
- ముంబైతోపాటు మహారాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర - రాజకీయ, సామాజిక సేవల్లోనూ తమదైన ముద్ర సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మరాఠీలతో తెలుగు ప్రజలు మమేకమైపోయారు. ముంబైతోపాటు మహారాష్ట్రలోని పలు రంగాల్లో అభివృద్ధిలో తెలుగు ప్రజలు తమదైన ముద్రను వేయగలిగారు. భవన నిర్మాణం, రాజకీయాలతోపాటు పలు రంగాల్లో రాణించారు. రాష్ట్ర రాజకీయాల్లో అనేక మంది తెలుగు ప్రజలు క్రియాశీలక పాత్ర పోషించారు. రాష్ట్ర చరిత్రలో తెలుగువారికి ఓ ప్రత్యేకత ఉంది. స్పీకర్ , ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్లతోపాటు మేయర్ల వరకు అనేక పదవులను తెలుగువారు అనుభవించారు. ఈ నెల 15న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అన్నిరంగాల్లో ఓ వెలుగు వెలిగిన తెలుగు ప్రజల కీర్తి గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం. తొలిస్పీకర్‌గా సయాజీ శీలం దేశంలోనే అత్యంత ప్రాముఖ్యతగల రాష్ట్రాల్లో ఒకైటె న మహారాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా తెలుగు వ్యక్తి సయాజీ శీలం పనిచేశారు. తెలుగువారి కీర్తి పతాకాన్ని మరాఠ గడ్డపై ఆవిష్కరించారు. అప్పటి నిజాం రాష్ట్రం నుంచి బొంబాయికి వచ్చిన సయాజీ శీలం. మే 18, 1896లో జన్మించారు. బాంబే విశ్వవిద్యాలయం నుంచి 1912లో మెట్రిక్యులేషన్, 1916లో బీ.ఏ, 1920లో ఎల్.ఎల్.బీ పూర్తి చేశారు. సామాజిక సేవాతత్పరుడైన సయాజీ 1914లో కామాటిపుర, నాగ్పాడా, బైకలా ప్రాంతాలుండే ‘ఈ’ వార్డు పరిధిలో పేద, నిరిక్షరాస్యులైన ప్రజల అభ్యన్నతికోసం పనిచేశాడు. 1918 సంవత్సరంలో అంటువ్యాధి సమస్య తీవ్రంగా ప్రబలిన సమయంలో ఆయన ధైర్యంగా ప్రజలకు సేవలందించారు. విద్యా సంస్థల నిర్వాహణలో, వైద్య శిబిరాల ఏర్పాటులో సయాజీ చురుకైన పాత్ర పోషించారు. తెలుగు మిత్ర అనే అనే పత్రిక ను మరాఠి భాషలో నిర్వహించి వెనుకబడిన వర్గాల కోసం కృషి చేశారు. సయాజీ శీలం బాంబే స్టేట్ స్పీకర్‌గా 21 నవబంర్ 1956 నుంచి 1957 వరకు పనిచేశారు. 1957 నుంచి 1960 ఏప్రిల్ వరకు సభాపతిగా తన సేవలనందించారు. భాష ప్రాతిపదికగా సంయుక్త మహారాష్ట్ర అవతరించిన తర్వాత ఆయన రాష్ట్ర శాసనసభకు తొలి స్పీకర్‌గా 1960 మే 1 నుంచి 1962 మార్చి 19 వరకు కొనసాగారు. తర్వాత పాండిచ్చేరికి లెఫ్ట్నె ంట్ గవర్నర్‌గా పదవీ భాద్యతలను చేపట్టారు. నేటితరం తెలుగు నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముంబై అభివృద్ధిలో ‘పుప్పాల’ కీలకపాత్ర... ముంబై అభివృద్ధి అనేక మంది తెలుగు ప్రజలు కీలకపాత్ర పోషించారు. శంకర్రావ్ పుప్పాల మనవడు నర్సింగ్‌రావ్ పుప్పాల 1942 నుంచి ముంబైకి సుపరిచితులు. ఆయన మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ నుంచి ముంబై మేయర్‌గా ఎదిగారు. ముంబై అభివృద్ధికి కృషిచేసి తెలుగువారి ముద్రను వేయగలిగారు. ముంబై నగరం పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చెందడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అన్ని రాష్ట్రాల ప్రజలు వలస రావడానికి అవకాశం ఏర్పడింది. ముంబై తెలుగు వెలుగులు.. ముంబై రాజకీయాల్లో అనేక మంది తెలుగు ప్రజలు ఓ వెలుగు వెలిగారు. తెలుగు కాంట్రాక్టర్ జాయా కారాడీ లింగూ బాయిఖలా ‘ఈ’ డివిజన్ నుంచి ముంబై మున్సిపల్ కార్పొరేటర్‌గా 12 ఏళ్లు పని చేశారు.1893లో జరిగిన మతపరమైన అల్లర్లను నివారించడంలో జాయాకారాడీ లింగూ కీలక పాత్ర నిర్వహించారు. కామాటిపుర, నాగ్పాడా ప్రాంతాల్లో అల్లర్లు ఎక్కువగా జరుగుతుండేవి. హిందూ-ముస్లిం ప్రజల మధ్య సఖ్యతను పెంచేందుకు లింగూ కీలకపాత్ర పోషించారు. లింగూ నిర్వహించిన పాత్రను అప్పటి పోలీస్ కమిషనర్ విన్సెంట్ సైతం ప్రశంసించారు. లింగూ 63వ యేట, అక్టోబరు 28, 1898న మరణించారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అదే సంవత్సరం నవంబర్ 9న ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ముంబై రాజకీయ సమాజంలో రావ్ బహదూర్ యెల్లప్పా బలరామ్ పేరు తరచుగా వినిపించేది. 1888 నుంచి ఆయన 27 సంవత్సరాల పాటు భైఖలా డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పనిచేశారు. బల్రామ్కు అనేక మంది రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన చేసిన అనేక స్వచ్ఛందసేవలు చేశారు. 1883లో జస్టిస్ ఆఫ్ పీస్, 1891లో రావ్‌సాహెబ్, 1898లో రావ్‌బహదూర్ బిరుదులనిచ్చి సన్మానించారు. 1914లో యెల్లప్పా బలరామ్ మరణించారు. రాజకీయాల్లో మేరు నగధీరులు నాటి రాజకీయాల్లో పర్ష శంకర్రావు, పుప్పాల పరశురామ్, పుప్పాల శంకర్రావ్, రావ్‌సాహెబ్ పోరాడే, రాయపల్లి దశరథ్ తదితరులు కీలకపాత్ర నిర్వహించారు. పర్ష శంకర్రావ్ అప్పట్లో తెలుగు వాళ్ల సమస్యలపై వార్తపత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. తెలుగు సమాచార్ లాంటి పత్రికను ఆయన నడిపించారు. విద్యా సంస్థలు గ్రంథాలయాల నిర్వహణ కోసం నిధులను వెచ్చించారు. మద్యపాన నిషేధం, స్వదేశి వస్తువు వినియోగ ప్రచారాల కోసం ఆయన జీవిత కాలం పనిచేశారు. లోక్మాన్య తిలక్ జ్ఞాన కోశ్కర్ ఖేత్కార్, బాబాసాహెబ్ అంబేద్కర్ కత్తరకోటి శంకరాచార్యా లాంటి గొప్ప వ్యక్తుల స్నేహాన్ని శంకర్రావ్ సంపాదించారు. పుణే నగరంలో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన సార్వజనిక గణేశోత్సవాలకు పర్ష శంకర్రావ్ 13వ వీధికి కార్యదర్శిగా ఉండేవారు. కామాటిపుర కాంగ్రెస్ కమిటీకి ఆయన రెండు సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. శంకర్రావ్ చూపిన ఉత్తమ సేవాభావానికి ఆ నాటి కాంగ్రెస్ నాయకులు సయాజీరావ్ శీలం ఆకర్శితులయ్యారు. శంకర్రావ్ను కాంగ్రెస్‌లో చేర్పించారు. కామాటిపురాలోని తెలుగు సమాజంలో కాంగ్రెస్ ఉద్యమాలకు పుప్పాల శంకర్రావ్ సయాజీ శీలంలు, వర్ష శంకర్రావ్లు ప్రసిద్ధి చెందారు. 1935లో 40 సంవత్సరాల వయస్సులోనే రక్తపోటుతో శంకర్రావ్ ఉప్పాల మరణించారు. ఆ తరువాత 1939లో ఏప్రిల్ ఆరున వర్ష శంకర్రావ్ మరణించారు. ఈ ఇద్దరు నాయకులు ఆకస్మికంగా మరణించడంతో తెలుగు సమాజంలో నాయకత్వ కొరత ఏర్పడింది. అనేక మంది విద్యావంతులు ఆ లోటును పూరించగలిగారు. శంకర్రావ్ పుప్పాల చనిపోయినప్పుడు ఆయన కుమారుడు పరశురామ్ 17 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉండేది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ 1942 ఉద్యమంలో పరశురామ్ కీలకపాత్ర నిర్వహించారు. కామాటిపురా, నాగ్పాడాలలో అనేక సంవత్సరాల పాటు మత ఘర్షణలు కొనసాగాయి. అనేక మంది తెలుగు నాయకుల మాదిరిగానే లింగన్న పూజారి అనే తెలుగు నాయకుడు మత సామరస్యాన్ని ఈ ప్రాంతంలో నెలకొల్పేందుకు విశేషంగా కషి చేశారు. 1944లో డంకన్ రోడ్లో జరిగిన అల్లర్లలో లింగన్న పూజారి ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. అప్పటి కమిషనర్ విల్సన్ లింగన్నను ప్రశంసించారు. లింగన్న పూజారి 1946లో మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆనాటి నుంచి రాష్ట్రంలో తెలుగు ప్రజల కీర్తిపతాకం రెపరెపలాడుతోంది. -
తెలుగువారిని మామూలుగానే ఉంచినవాడు...
ఎత్తిన జెండా దించకోయ్ అని పిలుపిస్తాడొకడు. పితృస్వామ్య దురహంకారాన్ని తెగ్గొయ్యమనే నినాదమొకటి ప్రతిధ్వనిస్తుందొక మూల. అగ్రవర్ణ దాష్టికాన్ని బదబదాలు చేయమని సంపాదకీయం రాస్తుందొక కలం. మతోన్మాద మస్తిష్కాలను ఆక్యుపంక్చర్ చేసైనా సరే స్వస్థత పరచాలని ప్రార్థిస్తాడొక కవి. అభ్యుదయ నీరెండలో అలా కలిసి నడుద్దాం రాబ్రదర్ అని ఆహ్వానిస్తాడొక ప్రగతిశీలి. వీరుల బలిదానాలకు అశ్రువొక్కటి జారవిడవమని మూర్ఛనలు పోతాడో స్టూడెంట్. పరస్పర అంగీకా రంతోనైనా సరే ఫలానా పాడు పని ఎలా చేస్తాడని ఎర్లీ మార్నింగ్ షోలో బల్లగుద్దుతుందొక అగ్నినేత్రి. పంచకర్మలు చేస్తే తప్ప ఈ వ్యవస్థ బాగుపడదని పాట రాస్తాడొక వాగ్గేయకారుడు. దిష్టిబొమ్మను తగులబెడితే తప్ప చల్లబడదో దగ్ధ హృదయం. ఇంతేనా? ఎవరైనా దూరం నుంచి తెలుగువారిని చూస్తే అంతేనా? నిద్రపోయేటప్పుడు కూడా పిడికిళ్లు బిగించే నిద్రపోతారా వీరంతా అని అనుకోవడమేనా? వీరి కళావస్తువులంటే ఎర్రగా, ఉగ్రంగా, ప్రగతిశీలంగా, సామాజిక స్పృహతో రగిలిపోవలసిందేనా? రాళ్లెత్తిన కూలీలూ... పల్లకీ మోసిన బోయీలూ... దరిద్రంలో పేదవారి కారాగారం... దరీ అంతూ లేని భ్రష్టాచారం... అంతేనా? కాదు అని చెప్పారు బాపూ. తెలుగువాళ్లు కూడా మామూలు మనుషులే అని తేల్చారు బాపూ. వాళ్లూ మామూలు బట్టలే కట్టుకుంటారనీ, వాళ్లూ డాబా మీద వడియాలు ఆర బెట్టుకుంటారని, వారూ కుంపట్ల మీదే కూరలు చేసుకుంటారని, వారి భార్యలూ అందరి భార్యల్లానే భర్తలను అదిలిస్తారనీ, వారి భర్తలూ అందరి భర్తల్లానే బెదురుకుంటారనీ, వారికీ ఉద్యోగాలు చేతనవుననీ, వారికీ సద్యోగాల మీద సరదా ఉందనీ, వారూ టైపిస్ట్ల మీద సాంతం వాలి అడగని డౌట్లు క్లియర్ చేస్తారని, వారూ అక్కర కోసం వచ్చిన స్నేహితుడికి అటక మీద దాగి జెల్ల కొడ్తారని, వారూ పక్కింటి పడతిని పవిత్రంగా పై నుంచి కింద దాకా చూస్తారనీ, వారూ ఇరుగింటి పిన్నిగారిని మర్యాదగా ఆమె వెళ్లాకే తిట్టుకుంటారని, వారూ ఎవరికైనా పేరు వస్తే కింద వేసి నలుపుతారని, వారూ మరెవరైనా కింద పడితే అచ్చొచ్చోలు అభినయిస్తారనీ.... వారి ఇళ్లల్లోనూ చూడచక్కని ఆడపిల్లలు ఉంటారని, వాళ్ల ముంగిళ్లలోనూ చూడముచ్చటి పాపాయిలు ఆడుకుంటారని, వారి దేవుడి గదుల్లో రాముడు సీత పక్కన చిద్విలాసంగా నిలుచుంటాడని, వాళ్ల నాన్నగారు పడక్కుర్చీలో హుందాగా కాఫీ తాగుతారని, వాళ్ల అమ్మ అమ్మలాగే కరుణగా ఉంటుందనీ, వాళ్ల వాకిలి ముగ్గులతో అందంగా మెరుస్తుందనీ, వాళ్లు కూడా వెన్నెలను చూసి మురుసుకుంటారనీ, వాళ్లూ పువ్వులను చూసి పరిమళిస్తారనీ, వాళ్లూ నవ్వు వస్తే నవ్వుకుంటారనీ..... వారికీ సరసం తెలుసుననీ, వారికి విరసం కొత్తగాదనీ... పట్టీలు... గోరింటాకు పాదాలు... నడుము కింద చరిచే పొడుగు జడలూ... పుస్తకాలను పట్టుకున్న గాజుల చేతులు... ఫ్రెంచ్ మీసాలు... పంచె కట్టులూ... నవ్వే పెదాలు... వెలిగే నయనాలు... పళ్లు ఊడిన తాతలూ బోసి నవ్వుల బామ్మలూ... ఒక పెంకుటిల్లు... కొన్ని కొబ్బరి చెట్లు... నూతి చెప్టా... పాత సైకిలు... బూర ఊదే పాపడు... తెలుగువాళ్లూ అందరిలాగే మామూలుగానే బతికారనీ... ఉన్నందుకు సంతోషంగా లేనందుకు ఆనందంగా జీవించారనీ... వారూ ఎప్పుడైనా పోరాటాలు చేస్తారనీ... అంతమాత్రాన పోరాటాలే వారి జీవితం కాదనీ... బాపూ తన బొమ్మలతో కార్టూన్లతో వేలాది రీతులలో లక్షలాది రేఖలతో చరిత్రలో నిక్షిప్తం చేశారు. అందుకు కృతజ్ఞతలు... అందుకే శుభాకాంక్షలు... డిసెంబర్ 15 బాపు బర్త్ డే -
ఘనంగా తెలుగువారి వీడ్కోలు
రాష్ర్టవ్యాప్తంగా ఆయా నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు పదిరోజుల పాటు గణేశ్ ఉత్సవాలను జరుపుకున్న అనంతరం బుధవారం నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కతి సంప్రదాయం ఉట్టిపడేలా అలంకరించిన వాహనాలపై గణనాథులను ఆటపాటలతో, చిందులతో తోడ్కొని పోయి సమీప సముద్ర తీరాల్లో, నదీ జలాల్లో నిమజ్జనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో తెలుగు ప్రజలతో పాటు స్థానికులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పలు తెలుగు గణేశ్ మండళ్లు సేవా కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహించారు. వర్సోవా, న్యూస్‌లైన్: తూర్పు చెంబూర్‌లోని మాహుల్గావ్ ప్రాంతంలో ‘ఆంధ్ర గణేశ్ మిత్ర మండలి’ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం గణేశ్ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక సముద్ర తీరం వద్ద ఆఖరి హారతి అందించి వినాయకుడికి వీడ్కోలు పలికారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు గణపతికి సమర్పించిన లడ్డూను వేలం వేయగా సంపత్ శ్రీనివాసులు రూ.15,500 లకు దక్కించుకున్నారు. శ్రీ సత్యనారాయణ మహా పూజ , శ్రీ వేంకటేశ్వర స్వామి, గణపతి పూజ, ఓం పూజలు జరిగాయని, భక్తులకు అన్నదానం చేశామని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో అతిథులుగా విజయా బ్యాంక్ మేనేజర్ ఎన్.అంజయ్య, ఎం.కొండారెడ్డి, ఎస్.కాసిరెడ్డి, ఎం.తిరుపతి రెడ్డి, జి.వెంకటయ్య, నాగయ్య, వెంకటేశ్వర్లు, జి.వెంకటరెడ్డి, పిచ్చయ్య, గురువయ్య, రాజుల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన వేలాది మంది నివసిస్తున్న మాహుల్గావ్లో గత 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా గణేశోత్సవాలను నిర్వహిస్తున్నామని మండలి సభ్యులు తెలిపారు. సూరత్‌లో.. సాక్షి, ముంబై: సూరత్‌లో గణనాథుల నిమజ్జన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువత సంగీత నత్యాలు చేస్తూ విఘ్నేశ్వరుడిని సాగనంపారు. లడ్డూ వేలం, సత్యనారాయణ స్వామి పూజలతో మండపాలన్నీ కోలాహాలంగా కనిపించాయి. లింబాయత్‌లోని గణేశ్ మండపాలను పార్లమెంట్ సభ్యుడు ఎం.పీ.ఆర్.పాటిల్, స్థానిక తెలుగు కార్పొరేటర్లు రాపోలు లక్ష్మి, పి.ఎస్.శర్మలు దర్శించుకున్నారు. ముఖ్యంగా పట్టణంలో తెలుగు వారు అధికంగా నివాసముంటున్న లింబాయత్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 681 సార్వజనిక్ గణేశ్ మండళ్లు గణనాథులను నిమజ్జనం గావించాయి. లింబాయత్‌లోని మార్కండేయ యువకమిటీ గణేశ్ ప్రసాదం (లడ్డూ)ను వేలంలో పవిత్ర సారీ హోస్ అధిపతి గంగుల వెంకటేష్ రూ.41 వేలకు దక్కించుకున్నారని పద్మశాలీ యువ కమిటీ అధ్యక్షుడు యెన్నం వెంకన్న తెలిపారు. పశ్చిమ ఠాణేలో.. సాక్షి, ముంబై: పశ్చిమ ఠాణేలోని సుభాష్ నగర్లో ‘శ్రీ ఆంధ్ర గణేశ్ మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో బుధవారం నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ఎక్కువగా నివసించే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తెలుగు ప్రజలు 47 ఏళ్లుగా ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. విఘ్నేశ్వరుడికి సమర్పించిన లడ్డూను వేలంపాటలో బాబ్జీ అనే భక్తుడు రూ.5,600 కైవసం చేసుకున్నాడు. చివరిగా స్థానిక నదిలో వినాయకుడిని నిమజ్జనం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మేయర్ హరిచంద్ర పాటిల్, నవీ ముంబై బీజేపీ అధ్యక్షుడు సీవీ రెడ్డి, మండలి సభ్యులు భాస్కర్‌రావు, కె.శ్రీనివాస్‌రావు, జి.సాయిబ్‌రావు, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. భివండీలో.. భివండీ, న్యూస్‌లైన్: భివండీలో 10 రోజులు పూజలందుకున్న గణేశుడి విగ్రహాలను బుధవారం సాయంత్రం ఘనంగా నిమజ్జనం చేశారు. నిమజ్జన ఘాట్ల వద్ద చివరి హారతి అందించి వినాయకుడికి వీడ్కోలు పలికారు. పట్టణవ్యాప్తంగా ఇళ్లల్లో ప్రతిష్ఠించిన 6,267 విగ్రహాలు, 158 సార్వజనిక గణపతులు వరాలదేవి, పేనాగావ్, కామత్‌ఘర్, కరివలి, తిలక్, నదినాక తదితర ఘాట్ల వద్ద నిమజ్జనమయ్యాయని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. జీవన్ రక్షా తెలుగు బందం ప్రతి సంవత్సరం మాదిరిగానే వరాలదేవి ఘాట్ వద్ద ఉదయం నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు సేవలందించారు. ముఖ్యంగా ధామన్‌కర్ నాకా మిత్ర మండలి, స్వ. నానా పండిత్ మిత్ర మండలి గణపతులు రాత్రి ఎనిమిది గంటలకే నిమజ్జనం గావించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. వర్లీలో.. సాక్షి, ముంబై: వర్లీలోని పద్మశాలి సమాజ సుధారక మండలి సాంస్కతిక సమితి ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు సాంస్కతిక సమితి పదాధికారి అల్లె శంకరయ్య చెప్పారు. బుధవారం సాయంత్రం సమాజ హాలు నుంచి గణపతి విగ్రహాన్ని భారీ ఊరేగింపు మధ్య లోటస్ సముద్రతీర ప్రాంతంలో నిమజ్జనం చేసినట్లు మండలి అధ్యక్షుడు వాసాల శ్రీహరి చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సతీమణి సంగీత అహిర్, బీజేపీ ముంబై నాయకులు సునీల్ రాణే తదితరులను పూలమాలతో సత్కరించారు. నిమజ్జన ఉత్సవాల్లో ఆ సంస్థ పదాధికారులు కస్తూరి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవాల్లో తెలుగుదనం..!
సాక్షి, ముంబై: ముంబైతో పాటు ఠాణే, భివండీ, పుణే, షోలాపూర్‌తోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున గణేశోత్సవాలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తెలుగు ప్రజలే సార్వజనిక మండళ్లు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తుండగా మరి కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న స్థానిక మరాఠీ ప్రజలతో మమేకమై ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మాధవ్ భువన్ సార్వజనిక్ గణేశోత్సవ మండలి 1934లో ప్రారంభమైన ఎన్ఎమ్ జోషీ మార్గ్‌లోని మాధవ్ భువన్ సార్వజనిక్ గణేశోత్సవ మండలి ఈ ఏడాది కూడా ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఈ మండలిలో తెలుగు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో ఈ వినాయకుని ఉత్సవాలలో మరాఠీ, తెలుగు ప్రజల సంప్రదాయ పద్ధతులు కన్పిస్తాయి. వీరు తమ మండలి గురించి, వినాయకుని ఉత్సవాల గురించి అందరికీ తెలియపరచాలనే ఉద్దేశ్యంతో 2011 లో www.ma-d-ha-v-bh-uva-ng-anes-h-pooja.org అనే వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. ఈ ఏడాది మొత్తం 11 రోజుల్లో 1,071 పూజలను చేయనున్నట్లు మండలి ఉప కార్యదర్శి గోపినాథ్ మేవరేకర్ తెలిపారు. వీటితోపాటు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల నుంచి కానుకల రూపంగా వచ్చిన బంగారంతో వినాయకునికి సంబంధించిన అనేక వస్తువులు రూపొందిస్తున్నారు. మండలి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2008లో 1,260 గ్రాముల బంగారంతో స్వర్ణ కిరీటం చేయించినట్లు తెలిపారు. అదేవిధంగా 2009లో స్వర్ణ హస్తాలు (చేతులు), 2010లో 464 గ్రాముల బంగారంతో గోల్డెన్ మోదక్‌ను తయారు చేయించామన్నారు. ఈ ఏడాది 600 గ్రాముల బంగారంతో స్వర్ణ చెవులు తయారు చేయించామన్నారు. ఇలా ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మేర ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలలో 11వ రోజైన ఆదివారం నిమజ్జనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మండలి అధ్యక్షులు అమిత్ తలవనేకర్, ప్రధాన కార్యదర్శి విలాస్ బోభాటే, మేనేజింగ్ ట్రస్టీ మోహన్‌దాస్ పి.మాల్యా తదితరులు కోరారు. ఠాణేలో.. ఠాణేలో తెలుగు ప్రజలు గణేశోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సుభాష్‌నగర్, హజూరి, సీపీ తలావ్, కిసాన్‌నగర్, శివాజీనగర్ తదితర పరిసరాల్లో తెలుగు ప్రజలు అట్టహాసంగా ఉత్సవాలు జరుపుతున్నారు. సుభాష్‌నగర్ పోక్రాన్ రోడ్డు నంబర్ రెండులోని ‘శ్రీ ఆంధ్ర గణేశ్ మిత్ర మండలి’ ఆధ్వర్యంలో 1967 నుంచి తెలుగు సంస్కృతీ సంప్రదాయాలతో గణేశోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మండలి ఎవరినుంచీ చందాలు వసూలు చేయకుండా కేవలం మండలి సభ్యులు, తెలుగు ప్రజలు ఇచ్చిన నగదు, సామగ్రితోనే ఉత్సవాలు నిర్వహిస్తుండడం విశేషం. బాల్కుమ్ ప్రాంతంలో నివసించే తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గుత్తుల ధనంజయ్ ఈసారి విగ్రహాన్ని అందజేశారు. ఇక్కడ ఈ ఏడాది ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నుంచి బ్రాహ్మణులైన ప్రభాకర్ బృందం ఠాణేకి వచ్చింది. ప్రస్తుతం ఈ మండలికి అధ్యక్షుడిగా గుత్తుల సాహెబ్రావ్, ప్రధాన కార్యదర్శిగా కె.శ్రీను, క్యాషియర్‌గా శ్రీమాన్నారాయణ బాధ్యతలు నిర్వహిస్తున్నారని మండలి సభ్యుడు దాసరి భాస్కర్‌రావ్ ‘సాక్షి’కి తెలిపారు. -
వివరం: తెలుగు తెలుగే కనెక్షన్
పదేళ్ల తర్వాత, ‘మనం’ అంటే ఎవరిని ప్రతిబింబిస్తుందో ఇప్పుడు చెప్పడం కష్టం. ఇప్పటికైతే మనం అంటే మనమే! భాషగా తెలుగువాళ్లమే!! ప్రాంతంగా భారతీయులమే!!! ఇలాంటి ‘మనవాళ్లు’ వీరందరూ! వీళ్లంతా తెలుగువాళ్లు; లేదా, తెలుగు నేలతో ముడిపడినవాళ్లు; వీళ్లకు తెలుగుతో సంబంధముందని చెబితే, ‘అవునా’ అని ఆశ్యర్యం పుట్టించేవాళ్లు. అందులో కొందరి గురించైనా కొంతమేరకు ఈ ప్రత్యేక కథనం. బెంగాలీ అమ్మాయి సుస్మితాసేన్‌కు 1994లో ‘విశ్వ సుందరి’ కిరీట ధారణ జరిగినప్పుడు, హైదరాబాద్‌లో కూడా ఆనందం వెల్లివిరిసింది; ఆమెను పల్లకీలో కూడా ఎక్కించి తిప్పారు. కారణం? సుస్మిత కళ్లు తెరిచింది హైదరాబాద్ నగరంలో. వాళ్ల నాన్న శువేర్ సేన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగంలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్నప్పుడు సుష్ పుట్టింది. అదీ విషయం! కోపం ప్రదర్శించడానికి కారణాలు కావాలిగానీ, సంతోషం పంచుకోవడానికి ఏమీ అక్కర్లేదు; అది సంతోషం కలిగించే విషయమైతే చాలు. హర్షా మనవాడే! క్రికెట్ వ్యామోహం ఉన్నవాళ్లకు హర్షా భోగ్లే ఇట్టే తెలుసు. ఏ క్రికెట్ సీజన్లోనైనా ఈఎస్పీఎన్లోనో, స్టార్ స్పోర్ట్స్లోనో తెరమీదకు వచ్చేది హర్షానే. ఇరవై ఏళ్లలో ఆటగాళ్లు ఎందరో రిటైర్ అయివుండవచ్చుగానీ, కామెంటేటర్‌గా హర్షా ఇప్పటికీ ‘క్రీజు’లోనే ఉన్నారు. ఈ మరాఠీ ప్రొఫెసర్(ఎ.డి.భోగ్లే) కొడుకు హైదరాబాద్‌లోనే పుట్టారు; ఇక్కడి గల్లీల్లోనే క్రికెట్ నేర్చుకున్నారు; హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు; ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ చదువుతూ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు; 19 ఏళ్లప్పుడు హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో కామెంటేటర్‌గా తొలి అడుగులు వేశారు; కాబట్టి, హర్షా తెలుగు మాట్లాడగలుగుతారని చెప్పడం చాలా చిన్న విషయం. ‘‘ఇది మన తెలుగువాళ్ల కోసం...’’ అని ఓసారి ట్వీట్ కూడా పెట్టారు. స్పందనలన్నీ తెలుగులోనే వస్తుంటే, ‘‘ఇదేంటి! రెండు ట్వీట్స్ తెలుగులో చేస్తే మీరు అందరూ తెలుగులోనే జవాబులు ఇస్తున్నారు. అంత బాగా తెలుగు రాదు,’’ అని రాదంటూనే వచ్చని నిరూపించుకున్నారు. నా మాతృభాష తెలుగు హర్షా రాదన్నారుగానీ, క్రికెటర్ రోహిత్ శర్మ అయితే, ‘అవును, నా మాతృభాష తెలుగు. మా అమ్మది వైజాగ్,’ అని చెప్పేశారు. ఐపీఎల్లో ఎవరున్నా లేకున్నా పదేళ్ల పాటు రోహిత్ కచ్చితంగా ఉంటాడన్నంతగా తన ప్రతిభను చాటుకున్న ఈ తెలుగు బిడ్డ నాగ్‌పూర్‌లోనే పుట్టి పెరిగినప్పటికీ, ఇక్కడి వైజాగ్ సముద్రంతో సంబంధం ఉంది. వాళ్ల అమ్మ పూర్ణిమ, అమ్మమ్మ విశాలాక్షి ఇక్కడివాళ్లే. వాళ్లమ్మ తెలుగు, మరాఠీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ తన కొడుకు గురించి మురిసిపోతూ ఉంటారు. ఉండరా మరి! మరాఠీ ప్రాంతంలో ఉంటూ కూడా రోహిత్ తెలుగులో చక్కగా మాట్లాడేస్తుంటే! తెలుగు రేఖ! బాలీవుడ్ నటీమణి రేఖకు తెలుగుతో ఏమైనా సంబంధం ఉందా? రేఖ తల్లి పుష్పవల్లి తెలుగు వనిత. వరవిక్రయం, చెంచులక్ష్మి లాంటి సినిమాల్లో నటించారు. తమిళంలోనూ నటించినప్పుడు జెమినీ గణేశన్‌తో జీవితాన్ని ముడేసుకున్నారు. రేఖ అక్కడే జన్మించొచ్చుగాక, కానీ తన 180 చిత్రాల సుదీర్ఘ కెరీర్‌ను ‘రంగుల రాట్నం’లో బాలనటిగా ప్రారంభించారు. అంతకంటే సంబరపడే విషయం, తనదైన గొంతుతో తెలుగును పలికించగలగడం! జానీ జానీ తెలుగు పప్పా! హిందీ సినిమాలు చూసేవాళ్లకు చెప్పే పనిలేదుగానీ, చూడనివాళ్లకు జానీ లీవర్ను పరిచయం చేయాలంటే ఈ పోలిక తప్పదు. టాలీవుడ్లో బ్రహ్మానందం ఎంతో, బాలీవుడ్లో జానీ లీవర్ అంత. కామెడీలో ఇద్దరూ కింగులే అనేది పక్కనపెడితే, బ్రహ్మానందంలాగే జానీ లీవర్ కూడా అచ్చమైన తెలుగువాడు. ప్రకాశం జిల్లాలో జాన్ ప్రకాశ్ రావుగా పుట్టి, బతుకుతెరువుకోసం ముంబై వెళ్లి, తనకు సహజంగా అబ్బిన మిమిక్రీలు ప్రదర్శిస్తూ, హిందుస్తాన్ లీవర్ కంపెనీలో చేరి, అక్కడివాళ్లను తెగనవ్వించి, ఆ పేరులోని లీవర్ను తనకు తగిలించుకుని, హిందీ సినిమాల్లో జానీ లీవర్‌గా తెలుగు కేతనం ఎగరవేశారు. 300 సినిమాల్లో నటించిన జానీ ఏకైక తెలుగు చిత్రం ‘క్రిమినల్’ ఇది బాధే అయినా, సంతోషపెట్టే విషయం ఏమిటంటే ఆయన ఇక్కడి అమ్మాయి సుజాతనే పెళ్లి చేసుకున్నారు. వాళ్ల పిల్లలిద్దరూ(కూతురు జేమీ, కొడుకు జెస్సీ) బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడతారు. గొప్ప దర్శకుడి ఇష్టురాలు భారతీయ సినిమాను సుసంపన్నం చేసిన నట దర్శకుడు గురుదత్ మెచ్చిన వహీదా రెహమాన్ రాజమండ్రి అమ్మాయి. ‘రోజులు మారాయి’లో ‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా’ పాటలో నృత్యం చేసిన అందగత్తె వహీదాను హైదరాబాద్‌లో చూసి, ఈ కొత్తముఖమే తన సినిమాలకు కావాలనుకున్నాడు గురుదత్. వహీదాకు ఉర్దూ కూడా రావడం ఇద్దరికీ లాభించింది. లేదంటే, ప్యాసా, కాగజ్ కే ఫూల్ లాంటి సినిమాల్లో వహీదాను ఎవరు భర్తీ చేయగలరు! అలాగే, గైడ్, నీల్ కమల్ లాంటి చిత్రాలను ఎవరు పూరించగలరు! అందాల ఝరి! 1970ల్లో ‘చిత్ చోర్’, ‘గోపాల్ కృష్ణ’ లాంటి హిందీ సినిమాల్లో నటించిన జరీనా వాహబ్ ఇక్కడివారంటే కొంచెం ఆశ్చర్యమే! కడపలో పుట్టిన జరీనా పుణె ఫిలిం ఇన్స్టిట్టూట్లో శిక్షణ పొందారు. ‘గాజుల కిష్టయ్య’ ‘అమర ప్రేమ’ ‘హేమాహేమీలు’ లాంటి తెలుగు సినిమాల్లో నటించినా, ఈ నాచురల్ బ్యూటీ బాలీవుడ్ వైపు వెళ్లిపోయారు. ‘రక్త చరిత్ర’లో ప్రతాప్ వాళ్లమ్మ పాత్ర వేసింది కూడా జరీనానే! ఇంకో విషయం ఏమిటంటే, తను ప్రేమించి పెళ్లాడిన నటుడు ఆదిత్య పంచోలి ‘షాడో’ చిత్రంలో నటించడానికి కారణం కూడా ఈ తెలుగు సంబంధమే. శంకరయ్య వస్తావయ్యా! నట లెజెండ్ రాజ్‌కపూర్ నటించి దర్శకత్వం వహించిన ‘శ్రీ 420’ చిత్రంలో ఒక హిందీ పాట ‘రామయ్యా వస్తావయ్యా’ లాంటి తెలుగు మాటతో మొదలైందంటే దానిక్కారణం సంగీతద్వయం ‘శంకర్-జై కిషన్’లోని శంకర్! అసలు పేరు శంకర్ సింగ్ రఘువంశీ. గుజరాత్ వాడైనా తండ్రి ఇక్కడ హోటల్ వ్యాపారంలో ఉండటంతో హైదరాబాద్‌లో పెరిగారు. సంగీతంలో ఆసక్తికొద్దీ తబలా పట్టుకుని ముంబై పయనమయ్యారు. జై కిషన్ జోడీగా ‘చోరీ చోరీ’ ‘బ్రహ్మచారి’ ‘మేరా నామ్ జోకర్’ ‘జిస్ దేశ్ మే గంగా బెహ్తీ హై’ ‘సంగం’ లాంటి చిత్రాలకు స్వరకల్పన చేశారు. హిందీలో ఉటంకించిన ఆ తెలుగు మాటతోనే ఇటీవల ఒక హిందీ చిత్రం వచ్చింది, ఇంకో తెలుగు సినిమా రాబోతోంది. ఎంత శక్తిమంతమైన పాట! ఎంత శక్తిమంతమైన సంగీత దర్శకుడు! తొలి సూపర్‌స్టార్! బాలీవుడ్ ఇంకా ఏర్పడకముందు, (ఇంగ్లీషు) మూకీల్లో నటించి, హిందీ టాకీలు వచ్చాక అందులో సూపర్‌స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు పైడి జయరాజ్. ఆయనది కరీంనగర్ జిల్లా. నిజాం కాలేజీలో చదువుతూ నటన మీది ఆసక్తితో 1929లో బొంబాయి వెళ్లారు. షాజహాన్, పృథ్వీరాజ్, రాణా ప్రతాప్, టిప్పు సుల్తాన్ లాంటి చారిత్రక పాత్రలకు పెట్టింది పేరైన జయరాజ్ మొహర్, సాగర్ లాంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. 1980లో జయరాజ్‌ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో ప్రభుత్వం గౌరవించింది. వాహ్ అజీజ్! గజల్ గాయకుడు తలత్ అజీజ్ హైదరాబాదీ! ఎన్నో ఆల్బమ్స్ విడుదల చేశారు. ఉమ్రావ్ జాన్, బజార్ లాంటి సినిమాల్లో పాడారు. దీవార్, నూర్జహాన్, ఎహ్సాస్, సురూర్ లాంటి టెలీ సీరియల్స్‌కు సంగీత దర్శకత్వం వహించారు. సానియా మీర్జా అంకుల్ కూడా! మన శ్యామ్! అంకుర్, నిషాంత్, మంథన్, భూమిక లాంటి హిందీ చిత్రాలతో 1970ల్లో న్యూ వేవ్ శకానికి తెరలేపిన శ్యామ్ బెనెగల్ సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో పుట్టారు. నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో చదివారు. జన జీవితాన్ని ఆకళింపు చేసుకున్నారు. స్వాతంత్య్రపు పూర్వ తెలంగాణ భూస్వామ్య వ్యవస్థను, ఉత్సవాలను తన సినిమాల్లో బొమ్మకట్టారు. ‘‘ఇది నా జన్మభూమి,’’ అంటారు బెనెగల్. యాభై ఏళ్ల క్రితం ముంబై తరలివెళ్లినా ఇక్కడిలాంటి సంస్కృతిని మరెక్కడా చూడలేదంటారు దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్న ఈ దేశం గర్వించదగ్గ దర్శకుడు. మన రిపోర్టర్! ‘రూరల్ రిపోర్టర్’ పి.సాయినాథ్ కూడా తెలుగువాడే! రైతుల వెతల మీద ఆయన ఎన్నో విలువైన కథనాలు రాశారు. కరువు, ఆకలి మీద గొప్ప పట్టున్న నిపుణుడిగా సాయినాథ్ నోబెల్ గ్రహీత ఆమర్త్యసేన్ కితాబు పొందారు. తమిళ తెలుగులు ద్రవిడోద్యమ నేత అన్నాదురై తెలుగు మూలాలు ఉన్నవారు. ఒక ఇంటర్వ్యూలో, ‘మా అమ్మ బంగారమ్మ, కంచిగుళ్లో దేవదాసీ, స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది,’ అని చెప్పారు. అన్నాదురై వారసుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా ఇక్కడివారే! నట ముఖ్యమంత్రి ఎమ్జీయార్ మలయాళీయుడు అని కరుణ వర్గం ‘నాన్-తమిళ్’ ఇష్యూ తెచ్చినప్పుడు, కరుణానిధి కూడా తమిళుడు కాదు; వాళ్లది కృష్ణా జిల్లా మువ్వ ప్రాంతం అని ఎమ్జీయార్ ప్రకటించారు. ఎండీఎంకే పార్టీ నేత, వై.గోపాలస్వామి(వైగో) మూలాలూ ఇక్కడివే. నటదర్శకుడు కె.భాగ్యరాజా అంతే! అలాగే, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజయ్‌కాంత్ కూడా తెలుగు వేర్లున్నవారే! ఇంట్లో తెలుగు మాట్లాడుతారు కూడా. అంటే, తమిళ రాజకీయాల్ని మలుపు తిప్పేదంతా తెలుగువాళ్లే! ఇంకా ఎందరో... బాలీవుడ్లో భిన్నమైన సినిమాలు చేస్తున్న దర్శకుడు, నటుడు నగేశ్ కుకునూర్ జన్మించింది హైదరాబాద్‌లోనే. లిటిల్ ఫ్లవర్ కాలేజీలో చదువుకున్నారు; నారాయణగూడ టాకీసుల్లో సినిమాలు చూశారు. అందువల్లే ‘హైదరాబాద్ బ్లూస్’ లాంటి సినిమా పుట్టింది. తర్వాత నగేశ్ ‘రాక్‌ఫోర్డ్’ ‘బాలీవుడ్ కాలింగ్’ ‘ఇక్బాల్’ లాంటి భిన్నమైన సినిమాలను అందించారు. ఇక్కడి అల్లుళ్లు... తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి టి.రాజేందర్ తెలుగు నటి ఉషను పెళ్లి చేసుకున్నారు. వీళ్లబ్బాయే ఇప్పటి సూపర్ హీరో శింబు. సంగీత దర్శకుడు అనూ మాలిక్ తమ్ముడిగా డాబూ మాలిక్‌ను పరిచయం చేయొచ్చు. కానీ, డాబూ తెలుగు సినిమా ‘సర్వర్ సుందరం గారి అబ్బాయి’లో నటించారు. దానికన్నా ముఖ్య విషయం, తెలుగమ్మాయి జ్యోతిని పెళ్లి చేసుకున్నారు. ఎంటీవీలో ప్రాక్టికల్ జోకుల షో ‘బక్రా’ యాంకర్ సైరస్ బ్రోచా కూడా హైదరాబాద్ అల్లుడే! ఆయేషాను సైరస్ వివాహం చేసుకున్నారు. ఇక్కడే పుట్టినవాళ్లు... అంతర్జాతీయ నటి, పద్మభూషణ్ గ్రహీత షబానా అజ్మీ జన్మస్థలం హైదరాబాదే! సామాజిక కార్యకర్తగా కూడా పేరుమోసిన షబానా అంకుర్, నిషాంత్, అర్థ్, మాసూమ్, మండి, ఫైర్ లాంటి ఎన్నో విమర్శకుల మెప్పు పొందిన సినిమాల్లో నటించారు. ఈ నగరంలో పుట్టిన తారకు ఏఎన్నార్ అవార్డు ఇవ్వడం మరింత సముచితంగా ఉందని అప్పటి వక్తలు అభినందించారు కూడా! తన గొంతుతో ప్రత్యేకంగా కనిపించే శతాధిక చిత్రాల హిందీ నటుడు సురేశ్ ఒబెరాయ్‌ను అక్కున చేర్చుకున్నది హైదరాబాదే! దేశ విభజన అనంతరం వాళ్ల కుటుంబం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి తరలివచ్చింది. ఇక్కడే వృద్ధిలోకి వచ్చింది. సురేశ్ ఇక్కడే పెరిగారు, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదివారు, ముంబై వెళ్లి నటుడిగా పేరు ప్రతిష్టలు సంపాదించారు. కొడుకు వివేక్ ఒబెరాయ్‌ను కూడా నటుడిగా తీర్చిదిద్దారు. సురేశ్ తెలుగు మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు, ‘కంపెనీ’ ‘రక్త చరిత్ర’ లాంటి సినిమాల్లో నటించిన వివేక్‌కు కూడా తెలుగువచ్చు. వివేక్ పుట్టింది హైదరాబాద్‌లోనే మరి! భారత ద్వితీయ రాష్ట్రపతి, భారతరత్న గ్రహీత సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టింది తెలుగు కుటుంబంలోనే. ఓ సందర్భంలో చిత్రకారుడు బుజ్జాయి గీసిన సర్వేపల్లి చిత్రం మీద ‘సర్వేపల్లి రాధాకృష్ణయ్య’ అని తెలుగులో సంతకం కూడా చేశారు. భారతీయ జనతా పార్టీకి పాష్ లుక్ తేవడంలో కీలక పాత్ర పోషించిన ప్రమోద్ మహాజన్ మహబూబ్‌నగర్‌లో జన్మించారు. నటుడు అజిత్ సికింద్రాబాద్‌లోనే పుట్టారు. నవరంగ్, దో ఆంఖే బారా హాత్ లాంటి చిత్రాల దర్శకుడు, దాదాసాహెబ్, పద్మవిభూషణ్ గ్రహీత వి.శాంతారాం వాళ్లది తెనాలి దగ్గరేనని చెబుతారు. చెన్నైలో ఉంటున్న కన్నడిగుడిగా కనిపించే ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ తెలుగువాడు. విజయనగరానికి చెందిన వీళ్ల కుటుంబం కర్ణాటకకు తరలివెళ్లింది. జగ్గీ వాసుదేవ్ తెలుగు మాట్లాడటమే కాదు, నెమ్మదిగా చదవగలరు కూడా! ముగింపు... మనది అనిపించే ప్రతిదీ మనిషికి ఒక ఆనందాన్ని, స్వీయ గౌరవాన్ని కలిగిస్తుంది. అది సహజం కూడా! అయితే, ఈ మన అనేదాన్ని విస్తరించుకుంటూ పోవడం మరింత ఆరోగ్యకరం. రుషులు, విశ్వమానవులు, మహనీయులు చేసేది అదే! మన ఊరు, మన జిల్లా, మన ప్రాంతం, మన దేశం, చివరగా మన ప్రపంచం! ప్రేమ అనే ఒక మూలకం ఒంట్లో సజీవంగా ఉన్నంతవరకూ ఎవరూ మనవాళ్లు కాకుండాపోరు. -
మహా పోరాటం
సాక్షి, ఏలూరు : జాతి.. మతం.. కులం.. వర్గం.. జిల్లాలో ఈ భేదాలన్నీ కనుమరుగయ్యూరుు. సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా కుటుంబ సభ్యుల తరహాలో ప్రజ లంతా ఒకే తాటిపైకి వచ్చారు. తెలుగు జాతి కలిసే ఉండాలని గళమెత్తి నినదిస్తున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా జిల్లాలో చేపట్టిన ఉద్యమం శుక్రవారం 17వ రోజుకు చేరింది. ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సిన మహిళలు రోడ్లపైనే వ్రతాలు ఆచరించారు. సమైక్రాంధ్ర కోసం ప్రార్థించారు. ఏపీ ఎన్జీవోలు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఏలూరు నగరంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. డీపీవో కార్యాలయం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ సిటిజన్లు, పలు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, ధర్నాలు జరిగారుు. రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఫైర్ స్టేషన్ సెంటర్లో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 13వ రోజుకు చేరాయి. వసంతమహల్ సెంటర్లో గాయత్రీ పురోహిత సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. సీఆర్ఆర్ విద్యాసంస్థలు, రెవె న్యూ, సర్వేయర్లు, మన కోసం సమాచార హక్కు సంఘం ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. కలయిక సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ రెండో రోజూ కొనసాగింది. కొవ్వూరులో మహాధర్నా కొవ్వూరులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహిం చారు. రోడ్డు కం రైలు వంతెనపై 3 గంటల పాటు వేలాది మంది సమైక్యవాదులతో మహా ధర్నా జరిగింది. విభజన నిర్ణయూన్ని నిరసిస్తూ కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు అర్ధశిరోముండనం చేరుుంచుకున్నారు. దేవరపల్లిలో వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఆయనను పరామర్శించి సంఘీభావం తెలిపారు. భీమవరంలో సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు రోడ్లపై కూరగాయలు అమ్మారు. అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. ఉద్యోగులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు రిలే దీక్షలు చేశారు. రోడ్డుపైనే వరలక్ష్మి వ్రతాలు ఇళ్లల్లో ఆచరించే వరలక్ష్మి వ్రతాలను చాలాచోట్ల రోడ్లపై నిర్వహించారు. భీమవరం తాలూకా ఆఫీస్ సెంటర్లో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వొద్దని ప్రార్థించారు. పాల కొల్లు గాంధీబొమ్మల సెంటర్లో రోడ్లపై వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. సమైక్యవాదులు రోడ్లపైనే స్నానాలు చేసి నిరసన తెలిపారు. మోకాళ్లపై నడక, ఆటలు, ముస్లింల మానవహారం వంటి కార్యక్రమాలు పాలకొల్లులో జరిగారుు. పెరవలి మండలం కాపవరం, వీరవాసరంలో జాతీయ రహదారిపై వంటావార్పు చేశారు. వీరవాసరంలో వీఆర్వోలు చెవిలో పువ్వులతో నిరసన తెలిపారు. ఆర్టీసి సిబ్బంది రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులు వాలీ బాల్ ఆడారు. ఉండి సెంటర్లో నాయూ బ్రాహ్మణులు, ఎన్జీవోలు రాస్తారోకో నిర్వహిం చారు. నరసాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలో వైఎన్ కళాశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఉద్యోగులు వంటావార్పు చేశారు. ఈనెల 17, 18 తేదీల్లో ఆచంట మండల బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. మార్టేరులో సీనియర్ సిటిజన్లు ధర్నా నిర్వహిం చారు. ఇరగవరం మండలం తూర్పువిప్పర్రులో విద్యార్థులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అత్తిలిలో రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ సీపీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య సంఘీభావం తెలిపారు. రోడ్డెక్కిన న్యాయవాదులు, ముస్లింలు తణుకులో న్యాయవాదులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నిడదవోలులో ముస్లింలు భారీ ర్యాలీ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించి సమైక్యాంధ్రను పరిరక్షించాలని అల్లాను ప్రార్థిస్తూ తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ వద్ద వందలాది ముస్లింలు గంటసేపు నమాజు చేశారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉంగుటూరులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభి షేకం చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా పార్థసారథి విద్యానికేతన్ స్కూల్ ఉపాధ్యాయులు దెందులూరు మండలం గోపన్నపాలెం ప్రధాన రహదారిపై విద్యార్థులకు పాఠాలు బోధిం చారు. పెదవేగి మండలం కవ్వగుంటలో సోని యా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. దేవరపల్లిలో లారీ ఓనర్స్, వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించారు. నల్లజర్ల కూడలిలో అర్ధనగ్న ప్రదర్శన, వంటావార్పు, రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిం చారు. వేగవరం గ్రామస్తులు వేగవరం నుంచి జంగారెడ్డిగూడెం వరకు మోటార్ సైకిళ్ల ర్యాలీ జరిపారు. సంగీత కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. ప్రైవేట్ వాహనాలను, ఆటోలను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయానికి తాళాలు వేశారు. చింతలపూడి మండలంలో రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు సమైక్యాంధ్ర ప్రకటన వెలువడే వరకు పోరాటం ఆగదన్నారు. లింగపాలెంలో ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో మోకాళ్లపై అర్ధనగ్న ప్రదర్శన చేసిన ఉద్యోగులు అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. కామవరపుకోటలో రోడ్డుపై దుస్తులు కుట్టి టైలర్లు నిరసన వ్యక్తం చేశారు. -
కలిసుంటే కష్టాలు తీరుతాయి
సాక్షి, రాజమండ్రి : తెలుగు ప్రజలు కలిసుంటేనే కష్టాలు తీరుతాయని, విడిపోతే నష్టాల పాలవుతారనే విషయాన్ని ప్రజలకు చాటి చేప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో బస్సు యాత్రను ప్రారంభించింది. ఉదయం పది గంటలకు వీఎల్ పురంలోని సాయిబాబా ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర నగర వీధుల్లో కొనసాగి లాలాచెరువు వద్ద ముగిసింది. ‘ఆంధ్రా వేరు కాదు, తెలంగాణ వేరుకాదు, రాయలసీమ వేరుకాదు, మూడు ప్రాంతాలు కలిస్తేనే తెలుగు ప్రజలు సమైక్య శక్తిని చాటగలుగుతారు’ అంటూ వాడవాడలా ప్రచారం చేస్తూ ముందుకు సాగింది. ఈ యాత్రను ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ విడిపోతే రెండు ప్రాంతాల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర ప్రదేశ్‌ను కాంక్షిస్తున్నారన్నారు. సోనియా తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు పూనుకున్నారని విమర్శించారు. రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోతే విద్యుత్తు, సాగునీటి సమస్యలు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వైఖరిని అవలంబిస్తున్నాయన్నారు. తెలంగాణ విడిపోతే సీమాంధ్ర ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయన్నారు. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ద్వారా చంద్రబాబు నాయుడు విభజనకు అంగీకరిస్తూ లేఖ పంపడం వల్లనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో విభజన చిచ్చు రగులుకుందని దుయ్యబట్టారు. విభజన నెపాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై నెడుతున్న చంద్రబాబు.. సీఎం కిరణ్ మాటలకు వంత పాడుతూ అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ ప్రజలు సమైక్యంగానే ఉండాలని కోరుకుంటున్నారన్నారు. సమైక్య వాదాన్ని పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల ప్రజల వద్ద బలంగా వినిపిస్తామన్నారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికీ మన ఎంపీలు ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. భారీ మోటార్ బైక్ ర్యాలీ ముందుగా మోటారు బైక్‌ల భారీ ర్యాలీ మొదలవ్వగా, బస్సు యాత్ర అనుసరించింది. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు బైక్ నడిపి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. అడుగడుగునా సమైక్యాంధ్ర నినాదాలను మారుమోగించారు. ఈ యాత్ర మధ్యాహ్నానికి పుష్కర్‌ఘాట్ చేరుకుంది. అక్కడ వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం ప్రధాన ప్రాంతాల్లో కొనసాగిన యాత్రలాలాచెరువులోని వైఎస్ విగ్రహం వద్ద ముగిసింది. ఈ యాత్రలో పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత, అర్బన్ కోఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్, రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మైనారిటీ సెల్ జిల్లా కన్వీనర్ నయూమ్, సాంస్కృతిక విభాగం కన్వీనర్ గారపాటి ఆనంద్ పాల్గొన్నారు.