breaking news
Superman roles
-
నేను సూపర్ మ్యాన్‌ను: ట్రంప్
వాషింగ్టన్: కరోనా వైరస్ చికిత్స తీసుకున్నాక తనకి తానే ఒక సూపర్ మ్యాన్‌లా అనిపిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ చికిత్సతో రోగ నిరోధక శక్తి పెరిగి తనలో శక్తి బాగా పుంజుకుందని అన్నారు. కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన పెన్సిల్వేనియా ఎన్నికల సభలో తన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడారు. తనకు చికిత్స అందించిన వైద్యులకు ధన్యవాదాలు చెప్పారు. ‘‘కరోనా సోకిన తర్వాత నాకు ఇచ్చిన మందులు అద్భుతంగా పని చేశాయి. అవేవో యాంటీ బాడీస్ చికిత్స అనుకుంటాను. నాకు సరిగ్గా తెలీదు. అది తీసుకున్నాక నా ఆరోగ్యం చాలా మెరుగుపడింది. నాకు నేనే ఒక సూపర్ మ్యాన్‌లా అనిపిస్తున్నాను’’ అని ట్రంప్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యులు అమెరికాలో వాల్టర్ రీడ్ ఆస్పత్రిలో ఉన్నారని ఆయన కొనియాడారు. తనకు ఎంతటి శక్తి వచ్చిందంటే ఈ సభలో ఉన్న అందరినీ ముద్దాడగలనని అంటూ చమత్కరించారు. ట్రంప్ క్వారంటైన్ సమయం ముగియ కుండానే బయటకి వచ్చారన్న విమర్శలకి ఆయన బదులిస్తూ ‘‘కావాలంటే నేను కూడా వైట్‌హౌస్‌లో ఒక మూల గదిలో కూర్చోవచ్చు. కానీ నేను అలా చెయ్యలేను. ఎందుకంటే నేను ఈ దేశానికి అధ్యక్షుడిని. నేను ప్రజల్ని కలుసుకోవాలి. వారితో మాట్లాడాలి. అందుకే నేను అలా శ్వేత సౌధానికే పరిమితమవలేకపోయాను’’ అని ఆ ఎన్నికల సభలో ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ కంటే ట్రంప్ బాగా వెనుకబడి ఉన్నారని సర్వేలు చెబుతూ ఉండడంతో ట్రంప్ ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నారు. బైడెన్‌కే ఇండో అమెరికన్లు జై తాజా సర్వేలో మళ్లీ వెల్లడి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కే భారతీయ అమెరికన్లు జై కొడుతున్నారని తాజా సర్వేలో మరోసారి వెల్లడైంది. ఇండో అమెరికన్ ఓటర్లలో 72శాతం మంది బైడెన్‌కి ఓటు వేయాలని భావిస్తుంటే, 22శాతం మంది అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కి మద్దతుగా ఉన్నట్టుగా ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే (ఐఏఏఎస్)లో తేలింది. మరో మూడు శాతం మంది వేరే అభ్యర్థి వైపు మొగ్గు చూపిస్తే, మరో మూడు శాతం మంది ఓటు వెయ్యడానికి సుముఖత వ్యక్తం చేయలేదని ఆ సర్వే వెల్లడించింది. ఇండియన్ అమెరికన్లు ఎప్పటి నుంచో డెమొక్రాట్లకే మద్దతుగా ఉన్నారు. ఈ సారి భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండడం, విదేశీ విధానంపై ట్రంప్ అనుసరిస్తున్న ఆందోళనలు వంటివి కూడా ప్రవాస భారతీయులు ఎక్కువగా జో బైడెన్ వైపు మొగ్గు చూపించడానికి దోహదం చేశాయని ఆ సర్వే వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి 20 వరకు ఆన్లైన్ ద్వారా 936 మంది ఇండో అమెరికన్లతో ఈ సర్వే నిర్వహించింది. -
నిజాలు దేవుడికెరుక: సూపర్‌మ్యాన్ శాపగ్రస్తుడా?
విజ్ఞానం ఎంత పెరిగినా ఇప్పటికీ విజ్ఞతకు అందని విషయాలు చాలానే ఉన్నాయి ప్రపంచంలో. ఏది ఎందుకు జరుగుతుందో తెలీదు. దాన్ని జరక్కుండా ఎలా ఆపాలో తెలీదు. ఆపకపోతే ఏం అనర్థం జరుగుతుందో అంచనాకు అందదు. సూపర్‌మ్యాన్ పాత్ర విషయంలో అదే పరిస్థితి! ఆ పాత్ర వేసిన నటులను ఏదో శాపం వెంటాడుతోంది. వారి జీవితాలను ఊహించని మలుపు తిప్పుతోంది. అలా ఎందుకు జరుగుతోంది? సూపర్‌మ్యాన్ పాత్రలు చాలామంది చేశారు. సూపర్‌మ్యాన్ చిత్రాలకు చాలామంది పని చేశారు. వారిలో చాలామంది జీవితాలు ఊహించని మలుపులు తిరిగాయి. కొందరు వ్యాధుల బారిన పడ్డారు. ప్రమాదాలకు గురయ్యారు. ప్రాణాలనూ కోల్పోయారు. అయితే ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా జీవించినవారు, జీవిస్తున్నవారూ ఉన్నారు. మరి సూపర్‌మ్యాన్ శాపం ఉన్నట్టా? లేనట్టా? మే 27, 1995. ఆ రోజు అమెరికా అంతా తీవ్రమైన షాక్‌కి గురయ్యింది. ఎవరూ ఊహించని ఓ దుర్వార్త అందరినీ కలచి వేసింది. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, సామాజికవాది అయిన క్రిస్టఫర్ రీవ్ పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. అత్యంత వేగంగా గుర్రపు స్వారీ చేస్తూ పట్టు తప్పి పడిపోయాడు. మెడ ఎముక, వెన్నెముక, ఇంకా అక్కడక్కడా కొన్ని ఎముకలు విరిగిపోయాయి. తలకి తీవ్రమైన గాయాలు అయ్యాయి. స్పృహ తప్పిపోయిన అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాణం దక్కింది. కానీ శరీరం పట్టు కోల్పోయింది. దాంతో రీవ్ చక్రాల కుర్చీకి పరిమితమవ్వాల్సిందే అని వైద్యులు తేల్చేశారు. సూపర్‌మ్యాన్ పాత్రలతో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసిన అతగాడికి... ఓ మామూలు వ్యక్తిగా కూడా జీవితాన్ని సాగించలేని దీన స్థితి ఏర్పడింది. ‘‘అయ్యో... ఎంత దారుణం జరిగిందిరా... పాపం రీవ్’’... నిట్టూర్పు విడిచాడు జాన్ టీవీ చూస్తూ. అతడు రీవ్కి వీరాభిమాని. పక్కనే కూర్చుని ఉన్న అతడి స్నేహితుడు నిక్సన్ భారంగా తలూపాడు. ‘‘సూపర్‌మ్యాన్ పాత్రలు చేసేవాళ్లకి ఆ గతి పట్టడంలో వింతేముంది?’’ అన్నాడు జాలిగా. చప్పున చూశాడు జాన్. ‘‘అదేంటి అలా అన్నావ్? ఆ పాత్రకీ యాక్సిడెంటుకీ సంబంధం ఏంటి?’’ అన్నాడు జాన్ ఆశ్చర్యంగా. ‘‘అదేంటంత ఆశ్చర్యపోతున్నావ్. సూపర్‌మ్యాన్ శాపం గురించి నీకు తెలియదా? ఆ పాత్ర చేయడమంటే ప్రాణాలతో ఆడుకోవడమే. ఇప్పటికే చాలామంది ఆ శాపానికి బలయ్యారు. ఇప్పుడు రీవ్ కూడా...’’ నిక్సన్ మాటలకు నిశ్చేష్టుడయ్యాడు జాన్. సూపర్‌మ్యాన్ శాపమా? ఆ పాత్ర చేస్తే ప్రాణాలకు ప్రమాదమా? ఇదంతా నిజమా లేక మూఢ నమ్మకమా? ఒక్క క్షణంలో వెయ్యి సందేహాలు తలెత్తాయతడికి. సూపర్‌మ్యాన్ శాపం గురించి చాలామందికి తెలుసు. కానీ అందులో ఎంత వాస్తవం ఉంది అన్నది మాత్రం ఎవరికీ కచ్చితంగా తెలియదు. కానీ జరిగిన సంఘటనలన్నీ పరిశీలిస్తే... దాన్ని వాస్తవం అని నమ్మడానికే ఎక్కువ అవకాశాలున్నాయనిపిస్తుంది. టెలివిజన్‌లో సూపర్‌మ్యాన్‌గా 1940 ప్రాంతంలో అదరగొట్టినవాడు కిర్క్ అలిన్. అతడు ఆ పాత్రని ఎంతగా పండించాడంటే... ఆ తర్వాత అతడు మామూలు రోల్స్ చేస్తే చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు. ఓసారి విలన్ పాత్ర వేస్తే అందరూ మండిపడ్డారు. సూపర్‌మ్యాన్ ఏంటి, అలాంటి రోల్ చేయడమేంటి అంటూ వ్యతిరేకతను తెలియజేశారు. దాంతో అతడి కెరీర్ డల్ అయిపోయింది. అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత అతడు అల్జైమర్స్ వ్యాధి బారినపడ్డాడు. నాటి నుంచి చనిపోయేవరకూ నరకం చూశాడు. అయితే అతడు మరణించేలోపే మరికొందరు సూపర్‌మ్యాన్ పాత్రధారుల జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. 1951లో వచ్చిన ‘సూపర్‌మ్యాన్ అండ్ ద మోల్ మెన్’ చిత్రంలో సూపర్‌మ్యాన్‌గా నటించాడు జార్జ్ రీవ్స్. ఆ సినిమా అతణ్ని చాలా పాపులర్ చేసింది. కెరీర్ ఊపందుకుంది. అయితే అంతలోనే ఊహించని దారుణం జరిగింది. ఇంకొద్ది రోజుల్లో రీవ్స పెళ్లి జరుగుతుందనగా... తన గదిలో విగతజీవిగా కనిపించాడు రీవ్స్. తుపాకీ గుండు అతడి ప్రాణాలను తీసిందని తెలిసింది. అయితే ఆ బుల్లెట్‌ను పేల్చింది ఎవరన్నది తెలియకపోవడంతో ఆత్మహత్యగా నమోదు చేశారు. కానీ విచిత్రం ఏమిటంటే... తుపాకీ మీద అతడి వేలిముద్రలు కూడా దొరకలేదు. మరి ఆత్మహత్య అని ఎలా నిర్ధారించారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. ఆ తరువాత బడ్ కాల్యర్, లీ క్విగ్లీల మరణాలతో సూపర్‌మ్యాన్ కథ మలుపు తిరిగింది. బడ్ కాల్యర్ కార్టూన్ షోలలో సూపర్‌మ్యాన్ పాత్రకి డబ్బింగ్ చెప్పాడు. బాగా పేరు వచ్చింది. సూపర్‌మ్యాన్ టీవీ షోలకి అతడు మాత్రమే డబ్బింగ్ చెప్పాలి అని దర్శకులంతా కోరుకునేంతగా సక్సెస్ అయ్యాడు. అయితే అంతుపట్లని అనా రోగ్యం అతణ్ని వేధించింది. రక్తప్రసరణలో సమస్యలు తలెత్తడంతో తన అరవయ్యవ యేట కన్ను మూశాడు. ఆ తరువాత లీ క్విగ్లీ వంతు. ఓ సినిమాలో బాల సూపర్‌మ్యాన్‌గా నటించాడు లీ. కొన్నేళ్ల తరువాత ఏదో అనారోగ్యానికి వేసుకున్న మందులు రియాక్షన్ ఇవ్వడంతో చనిపో యాడు. అప్పుడతడికి పద్నాలుగేళ్లు. ఈ సంఘటనలతో అందరిలోనూ అనుమానం రేకెత్తింది. సూపర్‌మ్యాన్ పాత్రతో సంబంధం ఉన్నవారందరినీ ఏదో శాపం వెంటాడుతోందని, అందుకే అందరూ ప్రాణాలు కోల్పోతున్నారనీ అనుకోవడం మొదలైంది. ఆ అనుమానం బలపడటానికి క్రిస్టఫర్ రీవ్స్ ఉదంతం దోహదపడింది. సూపర్‌మ్యాన్ పాత్రకి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు రీవ్. సూపర్‌మ్యాన్-ద మూవీ, సూపర్‌మ్యాన్ 2, సూపర్‌మ్యాన్ 3, సూపర్‌మ్యాన్ 4-ద క్వెస్ట్ ఫర్ పీస్ చిత్రాలతో ప్రభంజనం సృష్టించాడతడు. అలాంటివాడు గుర్రం మీద నుంచి పడి, ఎముకలు విరిగిపోయి, శరీరం చచ్చుబడిపోయి, చక్రాల కుర్చీకే పరిమితమైపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు జనం. కచ్చితంగా సూపర్‌మ్యాన్ పాత్ర శాపగ్రస్తమైనదని, అందుకే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని నిర్ధారించేసుకున్నారు. 2004, అక్టోబర్‌లో రీవ్ హార్ట్ ఫెయిలై మరణించాడు. వీళ్లు మాత్రమే కాదు. సూపర్‌మ్యాన్ చిత్రాలు, సీరియల్స్‌తో సంబంధం ఉన్న చాలామంది జీవితాల్లో ఊహించని సంఘటనలు జరిగాయి. సూపర్‌మ్యాన్ చిత్రంలో క్రిస్టఫర్ రీవ్తో కలిసి నటించిన మార్లన్ బ్రాండో... రీవ్ మరణించడానికి సరిగ్గా నాలుగు నెలల ముందు చనిపోయాడు. అతడు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. బ్రాండో కొడుకు క్రిస్టియన్, తన చెల్లెలు షెయేన్ బాయ్‌ఫ్రెండ్‌ని కాల్చి చంపాడు. దాంతో అతడికి యావజ్జీవిత ఖైదు విధించారు. ఆ బాధతో షెయేన్ ఆత్మహత్య చేసుకుంది. ఇది బ్రాండోని కుంగదీసింది. ఆ బాధతోనే చనిపోయాడు. క్రిస్టఫర్ రీవ్ సరసన ఒక చిత్రంలో నటించిన మార్గట్ కిడ్డర్ ఓరోజు సడెన్‌గా కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తరువాత మతి చలించిన స్థితిలో ఉన్న ఆమెని పోలీసులు పట్టుకుని, ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె బై పోలార్ డిజార్డర్‌తో బాధపడుతోందని వైద్యులు నిర్ధారించారు. అయితే తర్వాత మెల్లగా తేరుకుందామె. సూపర్‌మ్యాన్ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులర్ అయిన రిచర్డ్ ప్రయర్ డ్రగ్స్‌కి బానిసయ్యాడు. ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయ్యాడు. మానసిక వ్యాధి బారిన పడ్డాడు. చివరికి హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. సూపర్‌మ్యాన్ పాత్రను సృష్టించిన జెర్రీ సీగల్, అతడికి సహకరించిన జో షస్టర్లు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా చితికిపోయారు. దివాళా తీసి, బతకడం కోసం చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేయాల్సి వచ్చింది వారికి. జో అయితే అనారోగ్యంతో కంటిచూపును కూడా పోగొట్టుకున్నాడు. డీన్ కెయిన్, బ్రాండన్ రూత్, బాబ్ హాలీడే లాంటి వాళ్లయితే, సూపర్‌మ్యాన్ చిత్రాల్లో నటించాక తమ కెరీర్ నాశనమైపోయిందని అంటూ ఉంటారు. ఇవన్నీ చూసిన తరువాత సూపర్‌మ్యాన్ శాపం కచ్చితంగా ఉంది అని నమ్మేవాళ్ల సంఖ్య పెరిగింది. ఇన్ని సినిమాల్లో ఇంతమంది నటిస్తున్నారు, ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు, కేవలం సూపర్‌మ్యాన్ సినిమాల్లో నటించినవాళ్లకు మాత్రమే ఎందుకిలా జరుగుతోంది అంటూ వాళ్లు ప్రశ్నిస్తారు. అయితే దీన్ని కొట్టి పారేసేవాళ్లు కూడా బోలెడంత మంది ఉన్నారు. కిర్క్ అలిన్, బడ్ కాల్యర్ లాంటివాళ్లు వ్యాధుల బారిన పడినా, వయసు మీద పడిన తరువాతే చనిపో యారు, అప్పుడది శాపమెలా అవుతుంది అనేది కొందరి వాదన. చివరికి బైపోలార్ డిజార్డర్ బారినపడి, కొన్నాళ్లు కనిపించకుండా పోయిన మార్గట్ కూడా శాపం గీపం ఏదీ లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘అంతా ట్రాష్... ఓసారి నా కారుకు యాక్సిడెంట్ అయ్యి మూడు పల్టీలు కొట్టింది. అయినా నాకేమీ కాలేదు. శాపమనేదే ఉంటే నేను అప్పుడే చనిపోవాలి కదా, మతి చలించిన నేను మళ్లీ ఎలా కోలుకుంటాను’’ అందామె. కొందరు కాదంటారు. కొందరు అవునంటారు. ఎవరి మాట నమ్మాలి? ఈ శాపం నిజం కాదా? సూపర్‌మ్యాన్ పాత్ర వల్ల వచ్చిన ప్రమాదమేమీ లేదా? అది ఒక మూఢ నమ్మకమేనా? శాపమనేదే లేకపోతే ఇంతమంది జీవితాల్లో ఇన్ని అనర్థాలు ఎలా సంభవించాయి? శాపమే ఉండివుంటే... అందరికీ ప్రమాదాలు జరక్కుండా కొందరికే ఎందుకు జరిగాయి? ఏమో మరి... నిజాలు దేవుడికెరుక! - సమీర నేలపూడి