breaking news
State for Agriculture
-
కేంద్ర మంత్రి నిర్వాకం
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్య రైతులకు అందాల్సిన సబ్సిడీకి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి సైతం లబ్ధిదారుగా మారారు. ఆయన పొలంలో సాగు చేస్తున్న కీరదోస సాగుకు గాను 50 శాతం సబ్సిడీ కింద ఏకంగా రూ.99 లక్షలను పొందారు. ఈ మొత్తాన్ని ఏకంగా తన రుణ ఖాతాలోకి జమ చేయించుకున్నారు. ఈ పథకాన్ని మంజూరు చేసే జాతీయ ఉద్యాన బోర్డు (ఎన్‌హెచ్‌బీ)కి ఆయనే ఎక్స్–అఫీషియో వైస్–ప్రెసిడెంట్ కావడం గమనార్హం. రాజస్తాన్‌లోని దీద్వానా–కుచమన్ జిల్లా పీహ్ గ్రామంలో ఉన్న మంత్రి పొలంలో నాలుగు పెద్ద పాలీహౌస్‌లు, కృత్రిమ చెరువులు ఉన్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన తెల్ల బోర్డుపై ‘జాతీయ ఉద్యానవన బోర్డు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహకారంతో‘అని రాసి ఉంది. లబ్దిదారు పేరు ‘శ్రీ భగీరథ్ చౌదరి’, సబ్సిడీ మొత్తం ‘50శాతం (రూ.99,60,000)’ అని స్పష్టంగా పేర్కొన్నారంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పథకం వివరాలు, మంజూరు ప్రక్రియ వాణిజ్యపరంగా కీరదోస, టమాటా, క్యాప్సికం సాగును ప్రోత్సహించేందుకు ‘మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్’(ఎంఐడీహెచ్) కింద ఈ పథకాన్ని 2014–15లో ప్రారంభించారు. ఒక కుటుంబానికి గరిష్టంగా రూ.1 కోటి వరకు, ప్రాజెక్టు వ్యయంలో 50శాతం సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుంది. మంత్రి చౌదరి 16,592 చదరపు మీటర్లలో కీరదోస సాగు ప్రాజెక్టు కోసం 2025లో దరఖాస్తు చేశారు. 2025–26లో ఈ పథకం కింద మొత్తం 467 ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, అందులో మంత్రి పొలంలో ప్రాజెక్టు ఒకటి. 14 రోజుల్లోనే ఫైలుపై సంతకం వ్యవసాయ శాఖ రికార్డుల ప్రకారం.. అజీ్మర్ బీజేపీ ఎంపీ అయిన భగీరథ్ చౌదరి 2025 ఏప్రిల్ 15న సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి కాబట్టి, ఆయనకు కేవలం 14 రోజుల్లో అంటే ఏప్రిల్ 29వ తేదీనే సూత్రప్రాయ ఆమోదం లభించింది. 2026 మార్చి 11న తుది అనుమతి రాగా, మార్చి 30న రూ.99.03 లక్షల ‘క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ’నేరుగా ఆయన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లోన్ ఖాతాలో జమ కావడం గమనార్హం. -
బహుళజాతి కంపెనీలకు ఝలక్
* జన్యుమార్పిడి ప్రయోగాలపై అభ్యంతరాలు * సాంకేతిక సమాచారం కోరిన వ్యవసాయశాఖ సాక్షి, హైదరాబాద్: జన్యుమార్పిడి పంటలపై ప్రయోగాలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్సీ) చేసుకున్న దరఖాస్తులను రాష్ట్ర వ్యవసాయశాఖ పక్కనపెట్టింది. కంపెనీలు దరఖాస్తుల్లో వెల్లడించిన వివరాలు సంతృప్తి కలిగించకపోవడంతో ఆ శాఖ అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రయోగాలు ఎందుకు చేయదలిచారు? ఏ పంటలపై చేస్తారు? రైతులకు కలిగే లాభమేంటి? ప్రయోగించబోయే విత్తన మూలకాలు ఏ లేబరేటరీలో, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో తయారుచేశారు? ఆ విత్తన మూలకాన్ని ఈ రాష్ట్రంలో జన్యుమార్పిడి చేస్తే విషపూరితం కావడానికి అవకాశం ఉందా? లేదా? తదితర సందేహాలను నివృత్తి చేస్తూ సమాచారంతో రావాలని వ్యవసాయశాఖ ఆదేశించింది. శాస్త్రీయ సమాచారంతో వస్తే అప్పుడు పరిశీలిస్తామని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పినట్లు సమాచారం. జన్యుమార్పిడి పంట ప్రయోగాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటికి అనుమతి ఇవ్వకూడదని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. కంపెనీలు సాంకేతిక సమాచారం తీసుకొచ్చినా వాటిపట్ల సంతృప్తి చెందే పరిస్థితి కనిపించడం లేదు. గోధుమలు, వరి, కూరగాయలు వంటి వాటిల్లో జన్యుమార్పిడి ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటికి అనుమతి సంపాదిస్తే తర్వాత పప్పుధాన్యాల్లోనూ దూరిపోవాలనేది బహుళజాతి కంపెనీల యోచనగా తెలుస్తోంది.


