breaking news
sr
-
రైతులను దగా చేస్తున్న ఎస్ఆర్ కన్స్ట్రక్షన్
అనంతపురం: భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నిర్వాహకులు దగా చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రతినిధులను నష్టపరిహారం చెల్లించాలని అడిగేందుకు వెళ్లిన రైతులపై దౌర్జన్యానికి పాల్పడడాన్ని ఖండించారు. ఇందులో భాగంగానే రైతులతో కలిసి ఆదివారం సాయంత్రం అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిని కలిసి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గత కొన్నేళ్లు వందల కోట్ల కాంట్రాక్టు పనులు దక్కించుకున్న ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ రైతులకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. అనంతపురం–బళ్లారి రహదారి వెడల్పు పనుల్లో కూడా రాచానపల్లి, సిండికేట్ నగర్ తదితర గ్రామాల రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా సదరు కాంట్రాక్టు సంస్థ జారుకుందన్నారు. దీని వలన రైతులు వందల కోట్లు నష్టపోయారని తెలిపారు. తాజాగా అనంతపురం– కళ్యాణదుర్గం రోడ్డు వెడల్పు పనులు కూడా పూర్తి చేసి ప్రభుత్వం నుంచి నిధులు కొల్లగొట్టి వెళ్లిపోయేందుకు యత్నాలు చేస్తోందని మండిపడ్డారు. తమకు నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని అడిగేందుకు ఆదివారం సాయంత్రం కొంతమంది రైతులు పంపనూరు సమీపంలో సదరు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగేందుకు వెళ్లారన్నారు. అయితే సంస్థ వారు మాత్రం ఏకంగా రైతులను దాడికి పాల్పడ్డారన్నారన్నారు. పైగా రైతులే దాడి చేసినట్లు అక్రమ కేసులు బనాయించేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఫిర్యాదు ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో తమ ఆఫీసుపై కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేసి, తమ సిబ్బందిని కొట్టారని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రతినిధి అవినాష్‌చౌదరి డీఎస్పీ వీరరాఘవరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, కేసు విచారిస్తున్నామన్నారు. -
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే..
అదే నా సక్సెస్‌కు కారణం మాండలిన్ శ్రీనివాస్ గురువు కావడం నా అదృష్టం త్వరలోనే హీరోగా కనిపిస్తా నాన్న సజీవంగా ఉండాలనే శ్రీసత్యమూర్తి ఫౌండేషన్ ఏర్పాటు – సినీ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ ఆయన స్వరపరిచిన పాటలు సంగీతాభిమానుల నోళ్లలో నిత్యం నానుతూనే ఉంటాయి. ఆయన అందించిన సంగీతం కొన్ని సినిమాలను విజయాల బాట పట్టించిందనడంలో ఏమాత్రం సందేహమే లేదు. ‘దేవి’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన దేవీశ్రీప్రసాద్ ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో సుమారు 80 సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే సక్సెస్‌కు మార్గమంటున్నారు ఆయన. నాన్నపై ప్రేమతోనే శ్రీసత్యమూర్తి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. రాయవరం మండలం వెదురుపాక వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆవిశేషాలు ఆయన మాటల్లోనే.. - వెదురుపాక(మండపేట) ఆయన గురువు కావడం నా అదృష్టం.. మాండలిన్ శ్రీనివాస్‌ను ప్రేమతో అన్నయ్యా అని పిలుస్తాను. ఆయన నా గురువు కావడం ఎంతో పుణ్యం, అదృష్టం. గొప్ప వ్యక్తులు ఎప్పుడూ సింపుల్‌గానే ఉంటారు. నాన్న సత్యమూర్తి నుంచి ఆత్మస్థైర్యం, అమ్మ శిరోమణి నుంచి కష్టించేతత్వాన్ని అలవర్చుకున్నా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే నా సక్సెస్‌కి కారణం. సక్సెస్‌ను నిలబెట్టుకోవడం ఒక పోరాటమే.. సక్సెస్‌ను నిలబెట్టుకోవడం కూడా ఒక పోరాటమే. ప్రతి సినిమాను ఛాలెంజింగ్‌గా తీసుకుంటాను. మొదటి సినిమాను ఎలా ప్రేమిస్తానో ఇప్పుడు నా చేతిలో ఉన్న సినిమాలను అలాగే ప్రేమిస్తాను. సంగీతం, డాన్స్ నాకు రెండు కళ్లు. నా విజయం వెనుక కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇప్పటి వరకు 80 సినిమాలు.. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటి వరకు 80 సినిమాల వరకు సంగీతాన్ని అందించాను. ప్రస్తుతం జై జానకి నాయకా.., జై లవకుశ, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు, దిల్‌రాజు బ్యానర్‌పై వేణుశ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు, తమిళంలో విక్రమ్ హీరోగా రూపొందుతున్న సినిమా సామి–2 తదితర సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాను. త్వరలో హీరోగా వస్తున్నా.. నన్ను హీరోగా పెట్టి సినిమా చేయాలని చాలా మంది అడిగారు. సుకుమార్ దర్శకత్వంలో త్వరలోనే హీరోగా సినిమా చేసే అవకాశం ఉంది. దిల్‌రాజు, అల్లు అరవింద్ వంటి నిర్మాతలతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులు హీరోగా చేయాలని అడిగారు. సినిమా చేద్దామనుకున్న తరుణంలో నాన్న సత్యమూర్తి దూరమవ్వడంతో తాత్కాలికంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. ఆ ఆలోచన ఇప్పట్లో లేదు.. సంగీతం నా ఉచ్ఛ్వాస నిశ్చ్వాసలు. చేతినిండా సినిమాలున్న ఈ పరిస్థితుల్లో..ఇప్పట్లో వివాహం చేసుకునే ఆలోచన నాకు లేదు. మీరు ప్రేమ వివాహం చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అని ప్రశ్నించగా పెళ్లి చేసుకున్నప్పుడు ఆలోచిద్దాం అని సమాధానమిచ్చారు. నాన్నకు ప్రేమతో.. నాన్నపై ప్రేమతోనే శ్రీసత్యమూర్తి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాం. ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ఉంది. ప్రస్తుతం రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా విద్యాపరంగా పేద, మెరిట్ విద్యార్థులను ప్రోత్సహిస్తాం. కష్టపడితే విజయం మీదే... రామచంద్రపురం : ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడూ.. అంటూ యువతను ఉర్రూగలూగించిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్ విద్యలోను, లక్ష్య సాధనలోను యువత కుమ్మేయాలంటూ ప్రసంగించి వారిలో స్ఫూర్తిని నింపారు. పట్టణానికి చెందిన డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీసత్యమూర్తి ఫౌండేషన్ నేతృత్వంలో ఆదివారం స్థానిక లయన్స్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దేవీశ్రీప్రసాద్, ఆయన తమ్ముడు ప్రముఖ గాయకుడు సాగర్లు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. పదో తరగతి పరీక్షల్లో మంచి పాయింట్లు సాధించిన 115 మంది విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.ఐదు వేలు చొప్పున వారు బెస్ట్ స్టూడెంట్ అవార్డులను అందజేశారు. ఉపాధ్యాయుడు అరవ విస్సూ వ్యాఖ్యానంతో సాగిన ఈ కార్యక్రమంలో దేవీశ్రీప్రసాద్ మాట్లాతూ విద్యార్థి దశంలో పదో తరగతి, ఇంటర్ అత్యంత కీలకమైనవిగా ఆయన చెబుతూ ప్రతి వారు లక్ష్యసాధనతో కష్టపడి పనిచేసినప్పుడే విజయం వరిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే శక్తులుగా మారాలన్నారు. తమతో పాటుగా ప్రతి వారికీ చేయూతనందిస్తూ, తల్లిదండ్రుల సూచనలతో ముందుకు సాగాలన్నారు. నాన్న సత్యమూర్తి జ్ఞాపకార్థం ఆయన ఆదర్శాల కోసం సత్యమూర్తి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశామని, విద్యను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు అందిస్తున్నామన్నారు. చివరిగా ఆయన అమ్మడు లెట్స్‌గో కుమ్ముడు అనే పాటను పాడి యువతను ఉర్రూతలూగించారు. అప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ యువత చదువులో తమ కుమ్ముడు చూపాలని చెప్పారు. దేవీశ్రీప్రసాద్ తమ్ముడు, ప్రముఖగాయకుడు సాగర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ గోల్ పెట్టుకుని ముందుకు సాగాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఆర్డీఓ కె సుబ్బారావు, డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ కే శ్రీదర్, డోనర్స్‌క్లబ్ కన్వీనర్ తాడాల సత్యనారాయణ, కరస్పాండెంట్ తొగరుమూర్తి, ఆచంట రాంబాబు, తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన డోనర్స్‌క్లబ్ సభ్యులు 24 మందిని దేవీశ్రీప్రసాద్, సాగర్లు మెమెంటోలతో సత్కరించారు.