breaking news
sivvampeta mandal
-
నిమజ్జనానికి తరలిన గణనాథులు
శివ్వంపేట: మండల కేంద్రమైన శివ్వంపేటతో పాటు పలు గ్రామాల్లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు బుధవారం కన్నులపండువగా నిర్వహించారు. శివ్వంపేటలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయకులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో నిమజ్జనానికి తరలించారు. బ్యాండ్ మేళాలతో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. -
కరెంట్ షాక్‌తో కాడెడ్లు మృతి
శివ్వంపేట: విద్యుత్‌షాక్‌కు గురై కాడెడ్లు మృతిచెందిన సంఘటన మండలంలోని చెండి పొలాల వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు అంతిరెడ్డి నర్సారెడ్డికి చెందిన కాడెడ్లు బుధవారం మేతకు వెళ్లి రాత్రికి తిరిగి రాలేదు. అడవి పందుల బారి నుంచి పంట రక్షించుకునేందుకు ఓ రైతు పొలం చుట్టూ విద్యుత్ వైరు ఏర్పాటు చేశాడు. అటుగా వెళ్లిన కాడెడ్లు విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. గురువారం ఉదయం విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన కాడెడ్లను రైతులు గుర్తించి నర్సారెడ్డికి సమాచారం అందించారు. కాడెడ్ల విలువ రూ. లక్ష ఉంటుందని బాధిత రైతు బోరున విలపించాడు. కాడెడ్లను నమ్ముకొని వ్యవసాయం సాగుచేస్తున్న తాను ఉపాధి కోల్పోయానని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. -
పోలీసులపై దాడి.. రిమాండ్
నర్సాపూర్: శివ్వంపేట మండలంలోని తాళ్లపల్లి తండాలోని భూములు పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేసిన ఘటనలో మరో 12 మంది గిరిజనులను అరెస్టు చేసినట్టు స్థానిక సీఐ, కేసు పరిశోధన అధికారి తిరుపతిరాజు చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగా తాళ్లపల్లి తండా పరిధిలోని ప్రవీన్‌రావు భూముల్లో పనిచేసే సిబ్బందిని నిర్బంధించారని గత నెల 29న రాత్రి సమాచారం వచ్చింది. దీంతో అదే రాత్రి అక్కడికి వెళ్లిన పలువురు పోలీసులపై గిరిజనులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇటీవల పది మందిని అరెస్టు చేసిన విషయం విదితమే. కాగా అదే కేసులో బుధవారం మరో 12 మందిని అరెస్టు చేశామని అన్నారు. తండాకు చెందిన మోతిలాల్, హీరాసింగ్, జగన్, లష్కర్లతోపాటు మరో ఎనిమిది మందిని రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్ఐ వెంకటరాజగౌడ్ పాల్గొన్నారు. -
భూములను పరిశీలించిన డీఎఫ్ఓ
శివ్వంపేట : ప్రభుత్వం ఇచ్చిన పట్టాభూమిలోకి ఫారెస్టు అధికారులు రానివ్వడం లేదని ఫిర్యాదు చేయడంతో మెదక్, నిజామాబాద్ జిల్లాల డీఎఫ్ఓ ప్లయింగ్‌స్కాడ్ రవీంద్రరాథోడ్ శుక్రవారం విచారణకు వచ్చారు. కొత్తపేట గ్రామానికి చెందిన హరినాథ్‌కు 480 సర్వే నెంబర్లో రెవెన్యూ అధికారులు ఐదు ఎకరాల భూమిని కేటాయించారు. సాగుకు చేయడానికి పోతే ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారని శివ్వంపేట మాజీ సర్పంచ్ పబ్బరమేష్‌గుప్తా ఫారెస్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు తెలుసుకునేందుకు రవీంద్రరాథోడ్ భూమిని పరిశీలించారు. విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామని చెప్పారు. -
‘శివ్వంపేట’లో ఆపరేషన్ ‘గగన్’
పైలెట్ ప్రాజెక్టు కింద మూడు గ్రామాల ఎంపిక శాటిలైట్ అనుసంధానంతో అధికారుల భూ సర్వే శివ్వంపేట: భూముల వివరాలు సులభతరం చేసేందుకు కేంద్రప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద వివరాలు నమోదు చేసేందుకు శివ్వంపేట మండలాన్ని ఎంపిక చేసింది. ఈమేరకు శబాష్‌పల్లి , పోతారం, గంగాయపల్లి గ్రామాల్లో మంగళవారం గగన్ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా అధికారులు శాటిలైట్ టెక్నాలజీ ద్వారా భూ సర్వే పనులు చేపట్టారు. ఇస్రో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సెంట్రల్ సర్వే ఆఫీస్‌కు చెందిన శాస్త్రజ్ఞులు, ఇంజినీర్లు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూముల వివరాలు కంప్యూటరీకరణ గ్రామంలోని ప్రభుత్వ, పట్టా భూములకు సంబంధించిన పూర్తి వివరాలను కంప్యూటరీకరణ చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీంతో సర్వే చేసిన భూమి వివరాలను రైతులు సులభంగా తెలుసుకోవచ్చు. సెల్ఫోన్లోనూ పూర్తి వివరాలు అందుతాయి. భూమికి సంబంధించిన నక్ష హద్దులు సైతం ఇందులో పొందుపర్చనున్నారు. మూడు బృందాలుగా సర్వే మొదటగా శబాష్‌పల్లి గ్రామంలో సర్వే పనులను మూడు బృందాలు చేపడుతున్నాయి. ముందుగా సర్వే నెంబర్లు, పట్టాదారులకు సంబంధించిన భూమి విస్తీర్ణం కొలతలు వేసి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం శాటిలైట్ పరిజ్ఞానంతో ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేసి చుట్టు కొలతలు నమోదు చేస్తున్నారు. దీంతో అసలు పట్టాదారులను గుర్తించడంతో పాటు నకిలీ పట్టాదారుల తొలగింపు శాశ్వతంగా జరుగనుంది. క్షణాల్లో పహాణీ భూములకు సంబంధించిన వివరాలను కంప్యూటర్లో పొందుపర్చడం ద్వారా క్షణాల్లో పహాణీ సర్టిఫికెట్లు రైతులు పొందే అవకాశం ఉంది. ఇదే గగన్ పైలెట్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని వల్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండడంతో పాటు రెవెన్యూ సేవలు సులభతరం అవుతాయని చెప్పారు. మూడు నెలల పాటు సర్వే ఒక్కో గ్రామంలో సర్వే పూర్తి చేయడానికి నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉంది. సమగ్ర సర్వేపై పట్టాదారులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శబాష్‌పల్లిలో 1,683 ఎకరాల భూ విస్తీర్ణం ఉండగా రెండు రోజుల్లో వంద ఎకరాల సర్వే చేపట్టారు. పరిశీలించనున్న ఉన్నతాధికారులు సర్వే పనులను రాష్ట్ర చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రేమన్ పీటర్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఇతర ఉన్నతాధికారులు పరిశీలించనున్నట్టు తెలిసింది. సర్వే బాగుంది: రైతు వెంకటేశ్, శబాష్‌పల్లి అసలైన పట్టాదారుకు సంబంధించిన భూములను గుర్తించడం బాగుంది. భూమికి సంబంధించిన సమగ్ర వివరాలు నమోదు కావడం వల్ల రెవెన్యూ ఇబ్బందులు ఉండవు. మూడు బృందాలుగా సర్వే: నర్సింగ్‌యాదవ్, వీఆర్వో శబాష్‌పల్లి మూడు బృందాలుగా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, రెవెన్యూ సిబ్బంది సర్వే చేస్తున్నారు. శబాష్‌పల్లిలో రెండురోజుల పాటు వంద ఎకరాల సర్వే పూర్తి చేశారు. రైతులు సహకరించాలి: ఫర్హీన్‌షేక్, తహసీల్దార్, శివ్వంపేట శాటిలైట్ సర్వేకు రైతులు సహకరించాలి. వారికి సంబంధించిన భూముల హద్దులు చూపెట్టడం ద్వారా నమోదు జరుగుతుంది. భూమలు అన్యాక్రాంతం కాకుండా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. మూడునెలల్లో సర్వే పూర్తి: అనంతపద్మనాభ, టీమ్ లీడర్ మూడు నెలల్లో ఈ మూడు గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తాం. ఆపై పూర్తి సమాచారాన్ని డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్కు అందిస్తాం. ప్రాజెక్టు విజయవంతమైతే దేశవ్యాప్తంగా అమలు పరిచే అవకాశం ఉంది.