breaking news
rajahmundry tragedy
-
'బాబు పొలిటికల్ మైలేజీకి పాకులాడటం వల్లే.. '
హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట ఘటనపై పౌరహక్కుల సంఘం హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. పుష్కరాలను మతపరమైన కార్యక్రమాలుగా ప్రభుత్వాలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాజమండ్రి తొక్కిసలాట ఘటనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన పొలిటికల్ మైలేజీ కోసం పాకులాడటం వల్లే 29 మరణించారని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. తొక్కిసలాట మృతులను అనుమానాస్పద మరణాలుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తొక్కిసలాట ఘటనను నేరాభియోగం కింద నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చే అవకాశముంది. -
సీఎం బాధ్యత వహిస్తున్నారా? లేదా?
-
సీఎం బాధ్యత వహిస్తున్నారా? లేదా?
* రాజమండ్రి ఘటనపై స్పష్టం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ * పార్టీ తరఫున బాబుకు 12 ప్రశ్నలు సంధించిన వైఎస్సార్సీపీ నేత బొత్స సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన దుర్ఘటనకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తారా? లేదా? స్పష్టం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. పార్టీ ముఖ్య నాయకుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటకు చంద్రబాబే కారణమనడానికి అనేక ఆధారాలున్నాయన్నారు. పుష్కరాల్లో చంద్రబాబు పూజలు చేసే సమయంలో డాక్యుమెంటరీ కోసం షూటింగ్ చేస్తున్నారనడానికి ఆయన పక్కన సినిమా డెరైక్టర్ ఉండటమే నిదర్శనమని ఆ ఫొటోను బొత్స మీడియాకు ప్రదర్శించారు. సామాన్య భక్తులు స్నానం చేసే ఘాట్లలో వీఐపీలు స్నానాలు చేయడం వల్ల గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సి రావడంతోనే తొక్కిసలాట జరిగిందన్న జిల్లా కలెక్టరు ఇచ్చిన నివేదిక తేల్చిందన్నారు. సీఎం చంద్రబాబు సామాన్య భక్తులు స్నానాలు చేయాల్సిన ఘాట్‌లో గంటల తరబడి పూజలు చే శారు. ఈ ఘటనకు చంద్రబాబే కారణమని తెలిసినా బాధ్యులెవరో తేల్చడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సినీ డెరైక్టర్ బోయపాటి శ్రీను మైకు పట్టుకొని ఆయన పక్కన నిల్చోని ఉన్న ఫొటో చూపుతూ... ‘ఈ ఫొటో వాస్తవం కాదా చెప్పండి. ఫొటోలో ముఖ్యమంత్రి.. చిత్రీకరిస్తున్న ఫొటోగ్రాఫర్వైపే చూస్తున్నారు. చిత్రీకరణ కోసం భక్తులందరినీ ఒక దగ్గర చేర్చి తొక్కిసలాటకు ఆయనే కారణమైన విషయం వాస్తవం కాదా?’ అని బొత్స తూర్పారపట్టారు. ఇంతజరిగిన తర్వాత కూడా ప్రభుత్వం మరోసారి అదే తప్పు చేయాలని చూస్తుందని బొత్స మండిపడ్డారు. రాజమండ్రిలో మంత్రివర్గ సమావేశం నిర్వహించడం వల్ల పుష్కర విధుల్లో ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం సీఎం, మంత్రులు, ఉన్నతాధికారుల భద్రతపైనే దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఏమిటీ తుగ్లక్ పాలన అని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు పార్టీ తరఫున 12 ప్రశ్నలను బొత్స సంధించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? ఆ సంఘటనకు ముఖ్యమంత్రి కూడా బాధ్యులు అన్న కోణంలో కేసు విచారణ జరుగుతుందా.. లేదా? సీఎం, వీవీఐపీ, వీఐపీల కోసం రెండు గంటలపాటు సామాన్య భక్తులను నిలిపివేసినట్టు జిల్లా కలెకర్టు నివేదిక తరువాత అయినా మీరు నైతిక బాధ్యత వహిస్తారా? లక్షలాది భక్తులను ఆపేసి పుష్కరాల్లో ముఖ్యమంత్రే మొదటి స్నానం చేయాలని ఏ శాస్త్రంలోనైనా లేదంటే రాజ్యాంగంలో చెప్పారా? కోట్లాది మంది మత విశ్వాసాలకు సంబంధించిన పుష్కరాలను మీ కుటుంబ వ్యవహారంగా మార్చడం వల్లే అంతమంది మృతిచెందడం నిజం కాదా? జాతీయ, అంతర్జాతీయ మీడియాలో రావాలన్న కిర్తీ కండూతి ఇంతమంది మరణానికి కారణం కాదా? మీరు చేసిన నేరం కల్పబుల్ హోమిసైడ్ కాదా? ఈ పుష్కరాలకు రూ.1,650 కోట్లు ఖర్చు పెట్టి చివరికి దేవుడికీ, మతానికి సంబంధించిన అంశాలనూ మీ అవినీతికి ఉపయోగించుకొని రూ.వెయ్యి కోట్లు మీ నేతలు, ప్రభుత్వ పెద్దల జేబుల్లో వేసుకోవడం నిజం కాదా? పుష్కర కార్యక్రమాలకు మీతో పాటు సినిమా డెరైక్టరును ఎందుకు తీసుకెళ్లారు? ఇలాంటి తొక్కిసలాట మరణాలు మరో సినిమా షూటింగ్లో జరిగి ఉంటే అప్పుడూ ఇలాగే కేసులు పెట్టకుండా ఊరుకునేవారా? లక్షలాది మంది భక్తులు స్నానాలు చేయడానికి ఎదురు చూస్తుంటే వారికి సౌకర్యాలు కల్పించే బాధ్యత మీది కాదా? సామాన్యుల ఘాట్‌కు వెళ్లినప్పుడు త్వరితగతిన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత సీఎంగా మీకు లేదా? మీ వల్లే చనిపోయినా సంస్కారం గానీ, మానవత్వంగానీ మీకు ఉందా? ఇప్పుడు మీ అనుకూల చానళ్ల ద్వారా పుష్కరాలు ఆహా.. ఓహో అని చెప్పించడానికి మీ శక్తియుక్తుల్ని ఉపయోగిస్తున్నారన్నది నిజం కాదా? సీఎం చట్టానికి అతీతుడా? సాక్షాత్తు ఇంతమంది మరణాలకు కారణమైతే కేసులు ఉండవా? ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేస్తున్నారా లేదా? అన్ని బొత్స ప్రశ్నించారు. -
'చంద్రబాబు రాజీనామా చేయాలి'
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట దుర్ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం బొత్స మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారులు చంద్రబాబు సేవలో తరించడం వల్లే తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం జరిగిందని అన్నారు. తొలిరోజు జరిగిన తొక్కిసలాటలో 27 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. -
అప్రమత్తమైన తెలంగాణ
కరీంనగర్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం ఉదయం గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 27 మంది మరణించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో గోదావరి పుష్కరాల సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కరీంనగర్ జిల్లాలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాళేశ్వరంలో పుష్కరఘాట్లలో తనిఖీలు చేపట్టారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలిన ఆదేశించారు. ఇక మంథనిలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.