psychiatric hospital
-
బంధాలు తెగి బందీలుగా..
బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ బారినపడిన పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తి 2024 సెప్టెంబర్ 27న మానసిక వైద్యశాలలో చేరారు. చికిత్స పూర్తి కావడంతో అదే ఏడాది నవంబర్ 20న డిశ్చార్జ్‌కు అర్హుడయ్యారు. చికిత్స పూర్తయ్యే సమయానికి తల్లి మరణించింది. కుటుంబంలో విభేదాలు వచ్చాయి. ఫలితంగా ఆయన్ను తీసుకువెళ్లడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆస్పత్రిలోనే ఉన్నారు.స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్న నిజామాబాద్ జిల్లా నాగారం వాసి (38) 2024 మే 4న ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరగా... అదే ఏడాది జూలై 22న చికిత్స పూర్తయింది. చికిత్స పొందిన తర్వాత ఆయనలో మెరుగుదల కనిపించినా... అవివాహితుడు కావడంతోపాటు తల్లిదండ్రులు మరణించడంతో సోదరులు తీసుకువెళ్లడానికి సిద్ధపడకపోవడంతో అక్కడే ఉండక తప్పలేదు.శ్రీరంగం కామేష్హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ (ఐఎంహెచ్)లోని డిశ్చార్జ్ అండ్ క్యూర్ (డీసీ) వార్డులో ఏ బెడ్ వద్దకు వెళ్లినా ఇలాంటి దీనగాథలెన్నో బయటకు వస్తాయి. వైద్యశాస్త్రం ఎంత పురోగతి సాధించినా... సమాజంలో ఉన్న అంతరాన్ని అది చెప్పకనే చెప్తుంది. ఐఎంహెచ్‌లో మానసిక రోగిగా చేరి, వైద్యం పూర్తి అయి కోలుకుని, ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కుటుంబీకులు.. బంధువుల తిరస్కారానికి గురవుతున్న 90 మంది డీసీ వార్డులోనే ఉండిపోవాల్సి వచ్చింది. వైద్యులు, సిబ్బంది ఈ వార్డులోని వారి కుటుంబీకులకు నచ్చజెప్పడానికి రోజూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనికోసం నిత్యం 25 నుంచి 30 ఫోన్ కాల్స్ చేస్తున్నారు, అయినప్పటికీ వాళ్లు మాత్రం ఇంటికి తీసుకెళ్లడానికి ముందుకు రావట్లేదు. చికిత్స పూర్తయిన వారిని కుటుంబీకులు, అధికారిక సంరక్షులకు మాత్రమే అప్పగించాల్సి ఉంటుంది. ఈ కారణంగా కోలుకున్న రోగుల్ని డిశ్చార్జ్ చేయలేక ఆస్పత్రి వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ దుస్థితికి కారణాలు అనేకం... డిశ్చార్జ్ అయిన రోగులు పెద్ద సంఖ్యలో డీసీ వార్డులోనే ఉండిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అక్కడి వైద్యులు చెబుతున్నారు. వీరిలో అత్యధికులు స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్ సహా ఇతర మానసిక వ్యాధులతో బాధపడిన వాళ్లే. వీళ్లు ఐఎంహెచ్‌లో చేరే వరకు వీరిపై శ్రద్ధ తీసుకున్న కుటుంబీకులు చనిపోవడం లేదా ఆయా కుటుంబాల్లో విభేదాలు రావడం ఓ ప్రధాన కారణంగా ఉంది. మరోపక్క పెళ్లికాని ఆడపిల్లలు, మగపిల్లలు ఉన్న ఇళ్లల్లోకి వీరిని తీసుకెళ్తే సమస్యలు వస్తాయని కుటుంబీకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో సరైన పెళ్లి సంబంధాలు రావనే కారణంగా వీరిని ఇక్కడే వదిలేస్తున్నారు. కొందరి సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మందుల ఖర్చులు భరించలేక, భవిష్యత్తులో ఆ వ్యాధి మళ్లీ తిరగబెడుతుందనే భావనతో, ఆయా రోగుల సంరక్షణ చూసే వాళ్లు ఎవరూ లేకపోవడం వంటి కారణాలతో ఐఎంహెచ్లోనే వదిలేస్తున్నారు. ఏమాత్రం ‘ఛాయలు’ఉన్నా వదిలేస్తూ... ఐఎంహెచ్‌లో సాధారణ మానసిక రుగ్మతలు ఉన్న రోగులకు మూడు నెలల వరకు వైద్యం అందిస్తారు. దీర్ఘకాలిక మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు చికిత్స చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే డిశ్చార్జ్ కావడానికి అర్హత పొందుతారు. చికిత్స తర్వాత వైద్యులు, నిపుణులు పరీక్షించిన తర్వాతే డిశ్చార్జ్‌కు అనుమతి ఇస్తుంటారు. అయితే కొందరి విషయంలో అసలు మానసిక అనారోగ్య సమస్య తీరినా... కొన్ని ఛాయలు మాత్రం ఉంటాయి. సిర్పూర్‌కు చెందిన వ్యక్తి విషయాన్నే తీసుకుంటే ఈయన మానసిక స్థితి మెరుగుపడినా... ఇంకా మాటలు స్పష్టంగా చెప్పడంలో ఇబ్బంది (స్లర్డ్ స్పీచ్) పడుతున్నారు. అలాగే నడకలో కూడా కొంత ఇబ్బంది ఉంది. ఈ కారణాలతోనే కుటుంబం ఆయన్ను తమ వెంట తీసుకెళ్లడానికి అంగీకరించట్లేదు. వైద్యశాల ఎదుర్కొంటున్న సమస్యలెన్నో... రాష్ట్రంలో ఉన్న మానసిక ఆరోగ్య సమీక్ష బోర్డులు ఆయా రోగుల డిశ్చార్జ్ ప్రక్రియలను పర్యవేక్షిస్తాయి. డిశ్చార్జ్‌కు సిద్ధంగా ఉన్నప్పటికీ, కుటుంబాలు తీసుకెళ్లని రోగుల్లో అత్యధికుల్ని అనివార్యంగా ఆస్పత్రిలోనే ఉంచాల్సి వస్తోంది. దీనివల్ల తీవ్రమైన, కొత్తగా చేర్చుకోవాల్సిన రోగులకు బెడ్స్ కొరత వస్తోంది. దీనికితోడు వైద్యులు, సిబ్బందిపై అదనపు పని భారం పడి, తీవ్రమైన ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. డీసీ వార్డులో ఉన్న కొంతమంది కోలుకున్న మానసిక రోగులకు జ్వరం, దగ్గు, రక్తపోటు, మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీంతో వీరిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రితోపాటు ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సి రావడం మానసిక వైద్యశాల సిబ్బందికి తలకుమించిన భారంగా మారుతోంది. కోలుకున్న రోగి వెంట కనీసం ఒక సిబ్బంది అంబులెన్స్‌లో వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆస్పత్రిలో సిబ్బంది కొరత మరింత పెరుగుతోంది. ప్రజల్లో అపోహలు మానసిక రోగుల పట్ల ప్రజల్లో ఇప్పటికీ అనేక అపోహలు ఉన్నాయి. చాలా రకాలైన మానసిక వ్యాధులు సరైన చికిత్సతో నయం అవుతాయి. ఆ రోగులకు కుటుంబీకుల మద్దతు ఉంటే వారు పూర్తి సాధారణ జీవితాన్ని గడపగలరు. వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ కుటుంబీకుల తిరస్కారంతో ఐఎంహెచ్లోనే ఉండిపోతున్న రోగుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నాం. కోలుకున్నప్పటికీ కుటుంబీకులు తీసుకెళ్లని వారిలో స్థితిగుతుల్ని బట్టి డీసీ వార్డులో ఉంచడం, రెస్క్యూ హోమ్స్, రీహ్యాబ్ సెంటర్లకు తరలించడం వంటి చర్యలు తీసుకుంటున్నాం. మానసిక ఆరోగ్య చట్టం–2017 ప్రకారం కోలుకున్న మానసిక రోగులకు సమాజంలో కలిసి జీవించే హక్కు ఉంటుంది. అనేక మంది కుటుంబీకులకు పదేపదే ఫోన్లు చేసినప్పటికీ వాళ్లు కోలుకున్న రోగిని తిరిగి తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు మళ్లీ రుగ్మతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. –డాక్టర్ అనిత రాయిరాల, సూపరింటెండెంట్, ఐఎంహెచ్ ⇒ సిర్పూర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్‌తో 2023 డిసెంబర్లో చేరి, 2024 ఏప్రిల్‌లో డిశ్చార్జ్‌కు అర్హుడయ్యారు. అయితే అనివార్య కారణాలతో కుటుంబం పట్టించుకోవట్లేదు. ⇒ పెదపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి (46) కోర్టు ఆదేశాల మేరకు 2019లో ఐఎంహెచ్‌లో చేరి, 2020లో డిశ్చార్జ్‌కు అర్హుడయ్యారు. వైద్యులు అతను కోలుకున్నాడని చెబుతున్నా.. కుటుంబం మాత్రం తిరిగి తీసుకువెళ్లడానికి సిద్ధంగా లేదు. -
ఆకలికి తాళలేక పిల్లిని తినేశాడు..చివరికి మానసిక వైద్యశాలలో..
ఓ వ్యక్తి ఆకలికి తాళ్లలేక చనిపోయిన పిల్లిని తినేశాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన కేరళలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అతను సైక్రియాట్రిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎందువల్ల ఈ జుగుప్సా కరమైన చర్యకు దిగాడు?. ఇలా పచ్చిమాంసం తినడం ఎంతవరకు మంచిది అంటే.. ఈ భయానక ఘటన కేరళలోని కుట్టిపురంలో చోటు చేసుకుది. 27 ఏళ్ల వ్యక్తి కుట్టిపురంలోని బస్టాండ్‌లో చనిపోయిన పిల్లి మాంసాన్ని తింటూ కనిపించాడు. దీంతో షాక్‌కి గురయ్యిన స్థానికలు పోలీసులుకు సమాచారం అందించారు. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రిలోకి తీసుకువెళ్లి పలు పరీక్షలు చేయించారు. ప్రాథమిక పరీక్షల్లో అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలడంతో పోలీసులు అతడిని మానసిక వైద్యశాలలో అడ్మిట్ చేశారు. అతడు గత ఐదు రోజుల నుంచి భోజనం చేయకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఏదీఏమైనా వండకుండా ఇలా పచ్చి మాంసం తినడం మంచిదేనా? ఏవైనా సమస్యలు వస్తాయా? అంటే.. చాలా దేశాల్లో పచ్చిగా మాంసాన్ని తినేసే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా చైనా వంటి దేశాల గురించి చెప్పనక్కర్లేదు. వాళ్లు చాలా వరకు పచ్చిగా తినేందుకే ఇష్టపడతారు. ఐతే ఇలా తినడం ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొదటగా ఫుడ్ పాయిజన్ అయ్యి ఆరోగ్యం చెడిపోతుందని అన్నారు. పచ్చి మాంసంలో బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్న జీవులు లేదా టాక్సిన్లతో చాలా విషపూరితంగా ఉంటుంది. వాటి ప్రేగులు కత్తిరించబడితే మరింత ప్రమాదం అని చెబుతున్నారు. ఒక వేళ ఆ మాంసానికి హానికరమైన వ్యాధికారకాలు వ్యాపిస్తే వధ సమయంలో ఆహార కాలుష్యం ఏర్పడుతుంది. అదీగాక సాల్మోనెల్లా, క్లోస్ట్రిడియా పెర్ఫ్రింజెన్స్, ఇ కోలి లిస్టేరియా మోనోసైటోజెన్‌లు క్యాంపిలోబాక్టర్ వంటి వ్యాధి కారకాలు పచ్చి మాంసలో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవన్నీ మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవి. ఇలా తింటే వచ్చే సమస్యలు.. వికారంతో వాంతులు అవ్వడం అతిసారం తీవ్రమైన కడుపు నొప్పి, తిమ్మిరి తీవ్రమైన జ్వరం తీవ్రమైన తలనొప్పి ఈ లక్షణాలు తిన్న 24 గంటల్లో కనిపిస్తాయి. వ్యాధికారకాన్ని బట్టి ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్‌కి చికిత్స చేయగలిగనప్పటికీ పలు సందర్భాల్లో ప్రాణాంతకం అయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అందువల ఉడికించి తింటే వ్యాదికారక క్రిములు నాశనంమయ్యి తినేందుకు సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఈ పచ్చి మాంసంలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవని చెప్పారు. కొన్ని దేశాల్లో పచ్చిగా తినే సంప్రదాయం ఉంది. ఇలా తినడం ఎంత మాత్ర సురక్షితం కానప్పటికీ అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించే మార్గాలు కొన్ని ఉన్నాయన్నారు. అవి అనుసరిస్తే ప్రమాదం ఉండదని సూచించారు. పచ్చిగా తినాలనుకుంటే తాజా మాంసాన్ని, అదికూడా ముక్కలుగా ఉన్నదాన్ని ఎంచుకోమని చెబుతున్నారు. (చదవండి: ఆయుష్షు పెంచే డ్రగ్ ట్రయల్!..ఏకంగా వెయ్యి కుక్కలపై..) -
ఆస్పత్రి లాబీలో కాల్పులు.. ఇద్దరు మృతి
న్యూహాంప్‌షైర్: అమెరికాలోని న్యూహాంప్‌షైర్ రాష్ట్ర రాజధాని కాంకార్డ్లోని సైకియాట్రిక్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసు బలగాల కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. కాల్పుల ఘటన ఆసుపత్రి లాబీ వరకే పరిమితం అయిందని, రోగులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నామన్నారు. తమ ట్రూపర్ జరిపిన కాల్పుల్లో అనుమానితుడు చనిపోయాడన్నారు. ఘటనకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. సుమారు 185 పడకలున్న న్యూహాంప్‌షైర్ సైకియాట్రిక్ ఆసుపత్రి రాష్ట్రంలోనే ఏకైక ఆస్పత్రి. -
20 నెలల తరువాత గుర్తుకొచ్చిన చిరునామా
సాక్షి, విశాఖపట్నం: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 నెలలు తరువాత మతిస్థిమితం లేని ఓ వ్యక్తికి ఎట్టకేలకు చిరునామా గుర్తుకొచ్చింది. దీంతో ఆయనను ప్రభుత్వ మానసిక ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జి చేయాలని వైద్యులు నిర్ణయించారు. వివరాలిలా ఉన్నాయి.మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్రకుమార్(22) చినవాల్తేరులో రోడ్డు పక్కన ఉండడంతో గమనించిన ప్రభుత్వ మానసిక ఆస్పత్రి డాక్టర్ ప్రొఫెసర్ రామానంద శతపతి తన సహచరుని కారులో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. (వైశాలి.. ఊరెళ్లమంటే చనిపోతానంటోంది..!) జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సాయంతో రిసెప్షన్ ఆర్డర్ తేవడంతో పోలీసులు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో రోగి కోలుకోవడంతో తన వివరాలు తెలియజేశాడు. ఈ మేరకు జిల్లా పోలీసులు మధ్యప్రదేశ్ డీజీపీని సంప్రదించడంతో కుమార్ డిశ్చార్జికి మార్గం సుగమమైంది. ఆస్పత్రి చిరునామా కోసం కుమార్ కుటుంబీకులు ఆస్పత్రి డాక్టర్ని ఆదివారం సంప్రదించారు. అతని కుటుంబ సభ్యులు సోమవారం మానసిక ఆస్పత్రికి వస్తారని డాక్టర్ రామానంద శతపతి ‘సాక్షి’కి తెలిపారు. (పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో..) -
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: 21 మంది మృతి
మాస్కో : రష్యా వోరోనిజ్ ప్రాంతంలోని మానసిక మానసిక ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు. మరో 20 మంది వరకు గాయపడ్డారని ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. క్షతగాత్రులను మరో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారని.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో 74 మంది ఉన్నారన్నారని.... వారిలో నలుగురు ఆసుపత్రి సిబ్బంది అని పేర్కొన్నారు. అయితే వారిలో ఇద్దరి ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని... మంటలు అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు. అగ్నిప్రమాదంలో ఆసుపత్రి దాదాపుగా కాలిపోయిందని ఉన్నతాధికారి తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు టాస్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.


