బంధాలు తెగి బందీలుగా.. | Many sad stories at Erragadda Mental Hospital | Sakshi
Sakshi News home page

బంధాలు తెగి బందీలుగా..

Apr 27 2026 2:43 AM | Updated on Apr 27 2026 2:43 AM

Many sad stories at Erragadda Mental Hospital

ప్రతీకాత్మక చిత్రం

ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో దీనగాథలెన్నో..

చికిత్సతో పూర్తిగా కోలుకున్నా పట్టించుకోని కుటుంబీకులు 

సపర్యలు చేసే వారు లేకపోవడం ఓ కారణం 

వ్యాధి మళ్లీ తిరగబెడుతుందనే భయంతోనూ ఇలా... 

ఫలితంగా ఇక్కడ చేర్చాక వదిలేస్తున్న వారెందరో 

మానవతా దృక్పథంతో స్పందిస్తున్న అక్కడి వైద్యులు

బైపోలార్‌ ఎఫెక్టివ్‌ డిజార్డర్‌ బారినపడిన పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తి 2024 సెప్టెంబర్‌ 27న మానసిక వైద్యశాలలో చేరారు. చికిత్స పూర్తి కావడంతో అదే ఏడాది నవంబర్‌ 20న డిశ్చార్జ్‌కు అర్హుడయ్యారు. చికిత్స పూర్తయ్యే సమయానికి తల్లి మరణించింది. కుటుంబంలో విభేదాలు వచ్చాయి. ఫలితంగా ఆయన్ను తీసుకువెళ్లడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆస్పత్రిలోనే ఉన్నారు.

స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్న నిజామాబాద్‌ జిల్లా నాగారం వాసి (38) 2024 మే 4న ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరగా... అదే ఏడాది జూలై 22న చికిత్స పూర్తయింది. చికిత్స పొందిన తర్వాత ఆయనలో మెరుగుదల కనిపించినా... అవివాహితుడు కావడంతోపాటు తల్లిదండ్రులు మరణించడంతో సోదరులు తీసుకువెళ్లడానికి సిద్ధపడకపోవడంతో అక్కడే ఉండక తప్పలేదు.

శ్రీరంగం కామేష్‌
హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ (ఐఎంహెచ్‌)లోని డిశ్చార్జ్‌ అండ్‌ క్యూర్‌ (డీసీ) వార్డులో ఏ బెడ్‌ వద్దకు వెళ్లినా ఇలాంటి దీనగాథలెన్నో బయటకు వస్తాయి. వైద్యశాస్త్రం ఎంత పురోగతి సాధించినా... సమాజంలో ఉన్న అంతరాన్ని అది చెప్పకనే చెప్తుంది. ఐఎంహెచ్‌లో మానసిక రోగిగా చేరి, వైద్యం పూర్తి అయి కోలుకుని, ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కుటుంబీకులు.. బంధువుల తిరస్కారానికి గురవుతున్న 90 మంది డీసీ వార్డులోనే ఉండిపోవాల్సి వచ్చింది. వైద్యులు, సిబ్బంది ఈ వార్డులోని వారి కుటుంబీకులకు నచ్చజెప్పడానికి రోజూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనికోసం నిత్యం 25 నుంచి 30 ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు, అయినప్పటికీ వాళ్లు మాత్రం ఇంటికి తీసుకెళ్లడానికి ముందుకు రావట్లేదు. చికిత్స పూర్తయిన వారిని కుటుంబీకులు, అధికారిక సంరక్షులకు మాత్రమే అప్పగించాల్సి ఉంటుంది. ఈ కారణంగా కోలుకున్న రోగుల్ని డిశ్చార్జ్‌ చేయలేక ఆస్పత్రి వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  

ఈ దుస్థితికి కారణాలు అనేకం... 
డిశ్చార్జ్‌ అయిన రోగులు పెద్ద సంఖ్యలో డీసీ వార్డులోనే ఉండిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అక్కడి వైద్యులు చెబుతున్నారు. వీరిలో అత్యధికులు స్కిజోఫ్రీనియా, బైపోలార్‌ డిజార్డర్‌ సహా ఇతర మానసిక వ్యాధులతో బాధపడిన వాళ్లే. వీళ్లు ఐఎంహెచ్‌లో చేరే వరకు వీరిపై శ్రద్ధ తీసుకున్న కుటుంబీకులు చనిపోవడం లేదా ఆయా కుటుంబాల్లో విభేదాలు రావడం ఓ ప్రధాన కారణంగా ఉంది. మరోపక్క పెళ్లికాని ఆడపిల్లలు, మగపిల్లలు ఉన్న ఇళ్లల్లోకి వీరిని తీసుకెళ్తే సమస్యలు వస్తాయని కుటుంబీకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో సరైన పెళ్లి సంబంధాలు రావనే కారణంగా వీరిని ఇక్కడే వదిలేస్తున్నారు. కొందరి సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మందుల ఖర్చులు భరించలేక, భవిష్యత్తులో ఆ వ్యాధి మళ్లీ తిరగబెడుతుందనే భావనతో, ఆయా రోగుల సంరక్షణ చూసే వాళ్లు ఎవరూ లేకపోవడం వంటి కారణాలతో ఐఎంహెచ్‌లోనే వదిలేస్తున్నారు.  

ఏమాత్రం ‘ఛాయలు’ఉన్నా వదిలేస్తూ... 
ఐఎంహెచ్‌లో సాధారణ మానసిక రుగ్మతలు ఉన్న రోగులకు మూడు నెలల వరకు వైద్యం అందిస్తారు. దీర్ఘకాలిక మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు చికిత్స చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే డిశ్చార్జ్‌ కావడానికి అర్హత పొందుతారు. చికిత్స తర్వాత వైద్యులు, నిపుణులు పరీక్షించిన తర్వాతే డిశ్చార్జ్‌కు అనుమతి ఇస్తుంటారు. అయితే కొందరి విషయంలో అసలు మానసిక అనారోగ్య సమస్య తీరినా... కొన్ని ఛాయలు మాత్రం ఉంటాయి. సిర్పూర్‌కు చెందిన వ్యక్తి విషయాన్నే తీసుకుంటే ఈయన మానసిక స్థితి మెరుగుపడినా... ఇంకా మాటలు స్పష్టంగా చెప్పడంలో ఇబ్బంది (స్లర్డ్‌ స్పీచ్‌) పడుతున్నారు. అలాగే నడకలో కూడా కొంత ఇబ్బంది ఉంది. ఈ కారణాలతోనే కుటుంబం ఆయన్ను తమ వెంట తీసుకెళ్లడానికి అంగీకరించట్లేదు.  

వైద్యశాల ఎదుర్కొంటున్న సమస్యలెన్నో... 
రాష్ట్రంలో ఉన్న మానసిక ఆరోగ్య సమీక్ష బోర్డులు ఆయా రోగుల డిశ్చార్జ్‌ ప్రక్రియలను పర్యవేక్షిస్తాయి. డిశ్చార్జ్‌కు సిద్ధంగా ఉన్నప్పటికీ, కుటుంబాలు తీసుకెళ్లని రోగుల్లో అత్యధికుల్ని అనివార్యంగా ఆస్పత్రిలోనే ఉంచాల్సి వస్తోంది. దీనివల్ల తీవ్రమైన, కొత్తగా చేర్చుకోవాల్సిన రోగులకు బెడ్స్‌ కొరత వస్తోంది. దీనికితోడు వైద్యులు, సిబ్బందిపై అదనపు పని భారం పడి, తీవ్రమైన ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. డీసీ వార్డులో ఉన్న కొంతమంది కోలుకున్న మానసిక రోగులకు జ్వరం, దగ్గు, రక్తపోటు, మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీంతో వీరిని ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రితోపాటు ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సి రావడం మానసిక వైద్యశాల సిబ్బందికి తలకుమించిన భారంగా మారుతోంది. కోలుకున్న రోగి వెంట కనీసం ఒక సిబ్బంది అంబులెన్స్‌లో వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆస్పత్రిలో సిబ్బంది కొరత మరింత పెరుగుతోంది. 
 
ప్రజల్లో అపోహలు 
మానసిక రోగుల పట్ల ప్రజల్లో ఇప్పటికీ అనేక అపోహలు ఉన్నాయి. చాలా రకాలైన మానసిక వ్యాధులు సరైన చికిత్సతో నయం అవుతాయి. ఆ రోగులకు కుటుంబీకుల మద్దతు ఉంటే వారు పూర్తి సాధారణ జీవితాన్ని గడపగలరు. వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ కుటుంబీకుల తిరస్కారంతో ఐఎంహెచ్‌లోనే ఉండిపోతున్న రోగుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నాం. కోలుకున్నప్పటికీ కుటుంబీకులు తీసుకెళ్లని వారిలో స్థితిగుతుల్ని బట్టి డీసీ వార్డులో ఉంచడం, రెస్క్యూ హోమ్స్, రీహ్యాబ్‌ సెంటర్లకు తరలించడం వంటి చర్యలు తీసుకుంటున్నాం. మానసిక ఆరోగ్య చట్టం–2017 ప్రకారం కోలుకున్న మానసిక రోగులకు సమాజంలో కలిసి జీవించే హక్కు ఉంటుంది. అనేక మంది కుటుంబీకులకు పదేపదే ఫోన్లు చేసినప్పటికీ వాళ్లు కోలుకున్న రోగిని తిరిగి తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు మళ్లీ రుగ్మతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. 
–డాక్టర్‌ అనిత రాయిరాల, సూపరింటెండెంట్, ఐఎంహెచ్‌ 

సిర్పూర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి బైపోలార్‌ ఎఫెక్టివ్‌ డిజార్డర్‌తో 2023 డిసెంబర్‌లో చేరి, 2024 ఏప్రిల్‌లో డిశ్చార్జ్‌కు అర్హుడయ్యారు. అయితే అనివార్య కారణాలతో కుటుంబం పట్టించుకోవట్లేదు. 
పెదపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి (46) కోర్టు ఆదేశాల మేరకు 2019లో ఐఎంహెచ్‌లో చేరి, 2020లో డిశ్చార్జ్‌కు అర్హుడయ్యారు. వైద్యులు అతను కోలుకున్నాడని చెబుతున్నా.. కుటుంబం మాత్రం తిరిగి తీసుకువెళ్లడానికి సిద్ధంగా లేదు.   

Advertisement
 
Advertisement
Advertisement