breaking news
pranahitha chevella
-
మరణించిన నేతపై అబద్ధాలా?: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై అబద్ధాలు మాట్లాడటం సీఎం కేసీఆర్‌కు మంచిదికాదని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. బుధవారం ప్రాజెక్టులపై కాంగ్రెస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ్మిడిహెట్టి వద్ద 1,144 టీఎంసీల నీటిలభ్యత ఉందని కేసీఆర్ శాసనసభలోనే అంగీకరించారని.. 1,144 టీఎంసీల నుంచి 170 టీఎంసీలు తీసుకున్నా ఇంకా 950కి పైగా టీఎంసీలు సముద్రంలోనే కలుస్తాయన్నారు. మన అవసరాల కన్నా ఎక్కువ లభ్యత ఉన్నప్పుడు తమ్మిడిహెట్టి నుంచి బ్యారేజీ మార్చడానికి కేసీఆర్ రీడిజైన్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తమ్మిడిహెట్టివద్దే ప్రాజెక్టును ప్రతిపాదించేలా వ్యాప్కోస్ సర్వే సంస్థచేత దివంగత నేత వైఎస్ చెప్పించారంటూ అబద్ధాలను చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. -
ఆ ప్రాజెక్టును మా వద్దే ఉంచండి
ఆదిలాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లా నుంచి తరలించవద్దని ఉద్యమం ఉధృతం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు జన్మ స్థానమైన తుమ్ముడి హెట్టి వద్ద ధర్నా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్, జలసాధన సమితి రాష్ట్ర నాయకులు ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ ప్రజల ఆశాదీపమైన ప్రాణహిత చేవెళ్లను వేరే చోటుకు తరలిస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. మున్మందు రోజుల్లో దీక్షను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. -
కాళే శ్వరం వద్దే బ్యారేజీ
► ప్రాణహిత నీరు ఆదిలాబాద్‌కే పరిమితం చేస్తాం ► ఎక్కడ ప్రాణహిత.. ఎక్కడ చేవెళ్ల? ►600 కి.మీ. నీటి తరలింపు సాధ్యం కాదు ► కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించి మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు నీరిస్తాం ► 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ► గత ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఈ కరువు ► నీళ్లు రాని పథకాలను పెట్టారు.. డూప్లికేట్ ప్రాజెక్టులు కట్టారు ► నేను నిఖార్సయిన తెలంగాణ బిడ్డను.. నా ప్రజలను మోసం చేయను: సీఎం కేసీఆర్ ► గూడెం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు వివాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొదటిసారిగా స్పందించారు. ప్రాణహిత నీటిని ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం చేస్తామని, గోదావరి నదిపై కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించి మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాకు నీటిని తరలిస్తామని స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. దండేపల్లి మండలం గూడెం వద్ద నిర్మించిన శ్రీ సత్యనారాయణస్వామి (గూడెం) ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం ప్రసంగం ప్రారంభం కాగానే.. న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం నాయకులు ప్రాణహిత డిజైన్‌ను మార్చవద్దంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సీఎం ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అసహనానికి గురైన కేసీఆర్ వారిపై మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల వైఫల్యాల వల్లే ఈ కరువు. నీళ్లు రాని సాగునీటి పథకాలు పెట్టారు. నటించేందుకే ప్రాజెక్టులు కట్టారు. అంతర్రాష్ట్ర వివాదాలు సృష్టించారు. ప్రాజెక్టు ఉంటే కాలువలు ఉండవు. కాలువలు నిర్మిస్తే ప్రాజెక్టు ఉండదు. డూప్లికేట్ ప్రాజెక్టులు కట్టారు. ఎస్ఎల్బీసీ 40 ఏళ్లు అవుతోంది. మిషన్‌ను గుట్ట సొరంగంలో సొరగోట్టారు. అడ్వాన్సులు ఇచ్చేశారు. ప్రాణహితకు 120 టీఎంసీలు కేటాయించారు. తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. కమీషన్లతో నాలుగు వేల కోట్లు జేబుల వేసుకున్నరు. ఎక్కడ ప్రాణహిత.. ఎక్కడ చేవెళ్ల? 600 కిలోమీటర్ల దూరం నీటిని తీసుకుపోవడం సాధ్యం కాదు. మధ్యలో సింగరేణి గనులున్నాయి.. రిజర్వు ఫారెస్టు భూములున్నాయి.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టు పనులకు అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ లేఖలు రాసింది. ఈ ప్రాజెక్టుతో తమకు ముంపు ఉందని, ఈ పనులు చేస్తే ఫలితం లేని ఖర్చు అవుతుందని రాసిన లేఖల రికార్డులు ఇప్పటికీ ఉన్నాయి. తెలంగాణ సర్కారు వచ్చాక మహారాష్ట్రతో మాట్లాడితే భూములు మునగకుండా నీళ్లు తీసుకుపోవాలని చెప్పారు. మహారాష్ట్ర భూములు మునుగకుండా ప్రత్యామ్నాయం చూస్తున్నాం. కాళేశ్వరం నీళ్లు శ్రీరాంసాగర్‌కు వెళ్లేలా ప్రణాళికకు రూపకల్పన చేస్తున్నాం. ప్రాణహితపై డైవర్షన్ ఆనకట్ట కట్టుకుని ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు.. ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ప్రాణహిత నీటిని ఆదిలాబాద్‌కు సరిపెట్టి.. గోదావరిపై కాళేశ్వరం వద్ద బ్యారేజీ కడితే కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశాలున్నాయి’’ అని కేసీఆర్ వివరించారు. ‘‘నేను నిఖార్సయిన తెలంగాణ బిడ్డని. నా ప్రజలను నేను మోసం చేయను. ఒక్క సుక్క నీళ్లు ఎక్కువే రావాల ని చూస్తా గానీ.. అబద్ధాలు చెప్పను. డైవర్షన్ ఆనకట్ట కట్టుకుని, కాలువలను అనుసంధానం చేస్తాం. నేనే స్వయంగా పనులు మొదలు పెట్టిస్తా. ఇందుకోసం రూపకల్పన చేస్తున్నా. ఎస్సారెస్పీ నుంచి నీటిని ఎత్తిపోసుకుని నిర్మల్ ప్రాంతానికి లక్ష ఎకరాలకు సాగునీరందిస్తాం. ఏ పరిజ్ఞానం లేకుండా జిల్లా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. ప్రజలే వారికి బుద్ధి చెప్పాలి. రాబోయే ఏడెనిమిదేళ్లలో జిల్లాలో ప్రతి ఇంచుకు నీళ్లిస్తాం’’ అని వివరించారు. ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు గోదావరి పుష్కరాల తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు. ఒక్కో జిల్లాలో రెండు, మూడు రోజులు బస్సు యాత్ర చేసి సమస్యలకు పరిష్కార మార్గాలు చూస్తామన్నారు. ఆదిలాబాద్‌లో టూరిజం అభివృద్ధికి జిల్లాలో మంచి అవకాశాలున్నాయన్నారు. ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు వస్తుందని ఇతర ప్రాంతాలతో లింకు ఏర్పడుతుందని చెప్పారు. అడవిని నరకడం ఆపాలి ‘‘ఆదిలాబాద్ జిల్లాలో అడవులను ఆక్రమిస్తున్నారు. అడవులను నరికేస్తున్నారు. అడవిని కాపాడాలి.. జంగల్ ఉన్నది కాబట్టే వర్షాలు పడుతున్నాయి.. వందల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉన్న అడవిని కాపాడుకుని.. చెట్లను పెంచాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు. అడవులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు. అటవీ అభివృద్దికి నిధులు మంజూరు చేస్తామని, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు నగేశ్, బాల్కసుమన్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.