breaking news
Places to visit
-
దీపావళిని మధురంగా మార్చే ప్రాంతాలివే!
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో జరుపుకొనే ముఖ్య పండుగలలో ఒకటి దీపావళి. ఈ పండుగ దేశమంతటా జరుపుతున్నప్పటికీ, కొన్ని నగరాలలో అత్యంత వైభవంగా జరుపుతారు. ప్రపంచ నలు మూలల నుంచి ఈ పండగ వెలుగులను చూడటానికి యాత్రికులు వస్తుంటారు. ఈ దీపావళి ఎక్కడ జరుపుకోవాలా ? అని మీరు ఆలోచిస్తున్నట్లయితే... కింది ప్రదేశాలు తప్పక మధురానుభూతులను అందిస్తాయి. కోల్కతా : దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం సర్వసాధారణం. ఇందుకు భిన్నంగా కోల్కతాలో కాళికా దేవిని పూజిస్తారు. దేవాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించి, ప్రమిదలను వెలిగించి అమ్మవారిని పూజిస్తారు. బాణసంచా కాలుస్తూ కాళికా దేవి రూపాలను ఊరేగిస్తారు. నగరమంతా దీపాలతో, మిరుమిట్లుగొలుపుతూ కాంతులీనే పలు రకాల బాణసంచా పేలుస్తారు. నగరమంతా వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. చెన్నై: ఇతర ప్రాంతాలకు భిన్నంగా చెన్నైలో దీపావళి రోజున కుబేరుని పూజిస్తారు. ఆయనకు తేనె, బెల్లం సమర్పించి దీవించమని ప్రార్థిస్తారు. ఆరోగ్యానికి అధిపతిగా ఉన్న ధన్వంతరిని కూడా ఈరోజున పూజిస్తారు. ఇళ్లను శుభ్రపరచుకోవడం ఈ పండుగలో ఒక భాగం. అమృత్సర్ : దీపావళి నాడు పెద్ద పెద్ద విందు భోజనాలకు అమృత్సర్ పెట్టింది పేరు. దీపావళిని మొఘల్ చెర నుంచి హరగోబింద్ సాహిద్ విడుదలైన రోజుగా సిక్కులు భావిస్తారు. స్వర్ణ దేవాలయమంతా వేలాది విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. నది పక్కనే వెలుగుతున్న దీపాలు, దేవాలయానికి మరింత శోభను తెస్తాయి. పట్టణమంతా బాణసంచా శబ్ధాలతో హోరెత్తుతుంది. వారణాసి : ఇతర ఏ ప్రాంతంలో లేని విధంగా ఈ పట్టణంలో దీపావళి పక్షం రోజుల పాటు కొనసాగుతుంది. ఫోటోగ్రఫీని ఇష్టపడేవారికి ఈ పట్టణం స్వర్గధామంలా అనిపిస్తుంది. వారణాసిలో ఈ పండుగను దేవతల దీపావళిగా అభివర్ణిస్తారు. రవిదాస్, రాజ్ ఘాట్ల వద్ద స్వామీజీలు ప్రార్థనలు నిర్వహించి దేవతలను ఆహ్వానిస్తారు. గంగా నదిలో స్నానం చేయడానికి దేవతలు దిగివస్తారన్నది వారి నమ్మకం. గోవా: సంవత్సరాంత పార్టీలకు, అందమైన సముద్ర తీరాలకు గోవా పెట్టింది పేరు. అయినప్పటికీ దీపావళి పండుగ గోవాకు దేశమంతట నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. పల్లెటూర్లలో ప్రజలంతా తమ ఇళ్ల వద్ద ప్రమిదలను వెలిగిస్తారు. -
కెన్యా
నైసర్గిక స్వరూపం ఖండం : ఆఫ్రికా రాజధాని: నైరోబి వైశాల్యం: 5,81,309 చదరపు కిలోమీటర్లు జనాభా: 4,50,10,056 (తాజా అంచనాల ప్రకారం) ప్రభుత్వం: ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ కరెన్సీ: కెన్యా షిల్లింగ్ భాషలు: స్వాహిలి, ఇంగ్లిష్, ఇతర తెగల భాషలు మతం: 66% క్రైస్తవులు, 26% ఆదిమజాతి తెగలు, 6% ముస్లిములు స్వాతంత్య్రం దినం: 1964, డిసెంబర్ 12 సరిహద్దులు: హిందూ మహాసముద్రం, టాంజానియా, ఉగాండా, ఇథియోపియా, సోమాలియా. చరిత్ర: కెన్యా ఆఫ్రికా ఖండంలో ఉంది. ఈ దేశంలోని టుర్కానా సరస్సు ప్రాంతంలో లభించిన మానవుని పుర్రె, కాలిఎముకలను పరిశోధించిన శాస్త్రవేత్తలు ఈదేశానికి రెండు మిలియన్ల కన్నా ఎక్కువ సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పారు. నేటి ఆధునిక మానవుని ప్రస్థానం ఇక్కడి నుండే అని చాలామంది నమ్ముతున్నారు. 19వ శతాబ్దానికి ముందు ఈ ప్రాంతానికి ఆసియా, అరేబియా, ఐరోపా దేశాల నుండి వ్యాపార నిమిత్తం వచ్చిన ప్రజలు ఇక్కడే ఉండిపోయారు. ఇప్పుడు కెన్యా దేశంలోని సముద్ర తీర ప్రాంతంలో నివసించే ప్రజలు ‘స్వాహిల’ జాతిగా పిలవబడుతున్నారు. వీరంతా ఒకప్పటి అరబ్బులు, ఆఫ్రికన్లు.మొట్టమొదట బ్రిటిషు దేశస్థులు ఈ ప్రాంతాన్ని కనుగొని ఇక్కడి వ్యవసాయ నిమిత్తం వలస వచ్చారు. ఇక్కడి సారవంతమైన నేలలు బ్రిటిష్ వారు ఆక్రమించుకొని, ఆఫ్రికన్లను బానిసలుగా వ్యవసాయ పనులు చేయించేవారు. ఇలా బ్రిటిష్ వారు ఆక్రమించు ప్రాంతాన్ని ‘వైట్ హైలాండ్’ అని పిలుస్తారు. బ్రిటన్ దేశం కెన్యాకు 1963లో స్వతంత్రాన్ని ప్రకటించింది. ప్రజలు-సంస్కృతి: కెన్యా దేశంలో జనాభా పెరుగుదల ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతి సంవత్సరం నాలుగు శాతానికి పైగా జననరేటు ఉండడం అందరిదీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వెయ్యేళ్ల క్రితం బంటు భాష మాట్లాడే తెగ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు వీరి తరాల ప్రజలే కికుయు, కంబా, లుహ్య తెగలుగా విస్తరించాయి. తర్వాత లూ తెగ కెన్యాకు వచ్చింది. ఆ తర్వాత భారతదేశం నుండి దాదాపు 78 వేలమందిని బ్రిటిషువారు ఇక్కడికి తీసుకువచ్చారు. భారతీయ వ్యక్తుల చేత అక్కడ రైల్వే లైన్లు నిర్మింపజేశారు. ప్రస్తుతం కికుయు తెగవారే కెన్యా దేశాన్ని పరిపాలిస్తున్నారు. దేశంలో ఈ తెగవారి జనాభా 20 శాతానికి పైగా ఉంది. వివిధ తెగలకు చెందిన ప్రజలు ఉండడం వల్ల కెన్యాలో విభిన్న సంస్కృతులు కనిపిస్తాయి. వ్యవసాయం-పరిశ్రమలు: కెన్యా ఆర్థికవ్యవస్థలో వ్యవసాయానిది రెండవస్థానం. ముఖ్యంగా తేయాకు తోటలు, పూలతోటలు, కాఫీ, మొక్కజొన్న, గోధుమ, చెరకు బాగా పండుతాయి. వీటితోపాటు కొబ్బరి, పైనాపిల్, బాదం కూడా పండిస్తారు. కెరిచో కౌంటీలో తేయాకు తోటలు అధికంగా ఉన్నాయి. తీయని బంగాళదుంపలను, ఉల్లిపంటను రైతులు ఇక్రిసాట్ సహకారంతో పండిస్తున్నారు. పరిశ్రమలు నైరోబి, మొంబాసా, కిసుము ప్రాంతాలలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి. బీరు ఉత్పత్తి, చెరకు, సిమెంట్, చమురు శుద్ధి మొదలైన పరిశ్రమలు, మోటరు వాహనాల విడిభాగాలు, గృహోపకరణాలు, వ్యవసాయ పనిముట్లు, వస్త్రపరిశ్రమ ముఖ్యమైనవి. టూరిజం ఒక పరిశ్రమగా కొనసాగుతోంది. గణనీయంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఆహారం: వివిధ తెగల ప్రజలు వారివారి ఆచారాల ప్రకారం ఆహారం తయారు చేసుకుంటారు. మొక్కజొన్న, గోధుమ పిండితో ఎక్కువగా ఆహారం తయారుచేసుకుంటారు. వీరి ఆహారాన్ని ఉగాలి, కుచుంబారి అంటారు. బంగాళదుంపలు, మాంసం, బీన్స్ ఎక్కువగా తింటారు. సముద్ర తీర ప్రాంతాలలోని వారు చేపలు ఎక్కువగా తింటారు. చూడదగిన ప్రదేశాలు నైరోబి జాతీయపార్కు: నైరోబి నగరానికి సమీపంలో ఉన్న ఈ పార్కులో అడవి జంతువులు ఎక్కువగా ఉన్నాయి. జీబ్రాలు ప్రత్యేక ఆకర్షణ. వీటితోపాటు డైనోసార్లు, అడవి మృగాలు ఉన్నాయి. సంవత్సరంలో ఏ నెలలో అయినా ఈ పార్కును చూడడానికి వెళ్ళవచ్చు. అడవి మృగాలు వలస వెళ్ళే సమయంలో ఈ పార్కును సందర్శిస్తే అద్భుతంగా ఉంటుంది. కొన్ని లక్షల మృగాలు వరుసల్లో వెళ్ళడం మనం ఊహించని అనుభూతిని కలిగిస్తాయి. నైరోబి నగరం నుండి కేవలం పది నిమిషాలలో ఈ పార్కును చేరుకోవచ్చు. నైరోబి నగరం: నైరోబి నగరం కెన్యా దేశానికి రాజధాని. ఈ నగరానికి శతాబ్దాల చరిత్ర ఉంది. నగరంలో ముఖ్యంగా నైరోబి జాతీయ మ్యూజియం, కారెక్బ్లిక్సెన్ మ్యూజియం పక్కనే నైరోబి జాతీయపార్కు ఉన్నాయి. బ్రిటిషు పాలకులు ఈ నగరాన్ని తమ రాజధానిగా ఏర్పరచుకున్నారు. నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బోమాస్ ఆఫ్ కెన్యాలో ఒక సజీవ మ్యూజియం ఉంది. ఇక్కడ కెన్యా ప్రజలు జీవనరీతులు సంస్కృతిని ప్రతిబింబించే ఎన్నో ప్రదర్శనలు ఉంటాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం నుండి వివిధ నృత్యరీతులను ప్రదర్శిస్తారు. ఇక నగరంలో కెన్యా అంతర్జాతీయ కాన్ఫరెన్స్ సెంటర్ భవనం ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంది. నగరంలో ఉన్న రైల్వే మ్యూజియం చూపరులను ఎంతో ఆకర్షిస్తుంది. పురాతన రైలు ఇంజనులు, ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. 19వ శతాబ్దపు మోడళ్ళు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మొంబాసా: కెన్యాలో రెండో అతిపెద్ద నగరం మొంబాసా. ఇది సముద్రతీరంలో ఉంది. ఓడరేవు ఎంతో పురాతనమైనది. బ్రిటన్, పోర్చుగీసు, అరబ్బు, ఇండియా, ఆసియాదేశాలనుండి వలసవచ్చిన ప్రజలు ఇక్కడ భిన్న సంస్కృతులను ప్రదర్శిస్తారు. నిజానికి మొంబాసా ఒక ద్వీపం. ముఖ్య భూభాగానికి దీనికి మధ్య పుట్టగొడుగుల రిఫ్ట్ అనుసంధానమై ఉంది. వాసిని ద్వీపంలోని మొంబాసా మెరీన్ జాతీయ పార్కు ఎంతో ఆకర్షణీయమై ఉంది. ఇక్కడ డాల్ఫిన్లను సమీపం నుండి దర్శించే అవకాశం ఉంది. సముద్రంలో చేపలు పట్టే అవకాశం ఉంది. 16వ శతాబ్దంలో నిర్మించిన ఫోర్ట్జీసస్, పాతనగరం చూడదగ్గవి. పాత నగరంలోని వీధులు ఎంతో సన్నగా చిన్న సందులతో కూడి ఉంటాయి. నగరానికి ఉత్తర భాగంలో తెల్లని ఇసుక తిన్నెలు ఉన్న బీచ్లు, బంబూరి బీచ్, షెల్లీ, టివి, డియాని బీచ్లు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. దీనిని 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు నిర్మించారు. ఈ భవన సముదాయంలోనే వివిధ శతాబ్దాలకు చెందిన యుద్ధ సామగ్రి, కూలిపోయిన భవనాలు కనిపిస్తాయి. సమీపంలోని మంబా గ్రామంలో ప్రపంచంలోనే పెద్దదైన మొసళ్ళ పార్కు ఉంది. నకురు జాతీయ పార్కు: ఇది దేశానికి మధ్య భాగంలో ఉంది. నకురు సరస్సు ఒక ముఖ్య ఆకర్షణ. ఈ పార్కును 1951లో నిర్మించారు. ఈ సరస్సులో 450 రకాల నీటి పక్షులు నివాసం ఉన్నాయి. ఇక సరస్సులో లక్షలాది ఫ్లెమింగో పక్షులు మొత్తం సరస్సును గులాబీ మయం చేస్తాయి. సముద్రమట్టానికి 1754 మీటర్ల ఎత్తులో, 188 చదరపు కిలోమీటర్లు ఉన్న ఈ సరస్సులో నలుపురంగులో కనబడే రైనోలు ఉన్నాయి. పార్కులో జిరాఫీలు, పులులు, చీతాలు, చిరుతలు కూడా ఉన్నాయి. మసాయి మారా జాతీయపార్కు: ఇది టాంజానియా దేశ సరిహద్దులో ఉంది. ఇక్కడ అడవి జంతువులకు స్వర్గధామంలాంటి వాతావరణం ఉంటుంది. అడవి మృగాలు, జీబ్రాలు ఈ పార్కులో వేలాదిగా ఉంటాయి. ఇక అడవి జంతువుల వలసను చూడాలంటే ఈ పార్కుకు రావలసిందే. జులై నుండి అక్టోబర్ కాలంలో ఇక్కడి నుండి టాంజానియాలోని సెరంగేటి జాతీయ పార్కుకు వలస వెళతాయి. ఈ ప్రయాణంలో అవి మారా నదిని దాటాల్సి ఉంటుంది. ఈ నదిలో భయంకరమైన మొసళ్ళు ఉంటాయి. అడవి జంతువులు నదిని దాటే ప్రక్రియలో మొసళ్ళు వీటిని పట్టి తినేస్తుంటాయి. ఫిబ్రవరి, మార్చి నెలలో ఈ అడవి జంతువులు సిరెంగేటి పార్కులో ఉండి సంతానోత్పత్తి చేసి తిరిగి మసాయిమారాకు వలస వస్తాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈ జంతువుల వలస ప్రయాణాన్ని మనం అక్కడ దగ్గరి నుండి చూడవచ్చు. ఇవిగాక మొంబాసాలో ఉన్న మసీదులు, గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ, తికాలోని కాఫీ తోటలు, మౌంట్ కిలిమంజారో, సముద్రతీరంలోని బీచ్లు ఈ దేశంలో చూడదగ్గ ప్రదేశాలు.