Personal bank account
-
పీడీ ఖాతాలపై పిడి!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వ్యక్తిగత బ్యాంకు ఖాతా లకు ప్రభుత్వం గుడ్‌బై చెప్పనుంది. ప్రభుత్వ శాఖ లేదా ప్రభుత్వ రంగ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ద్వారా లేదా ఇతర పద్ధతుల్లో వచ్చే నిధులు సాధారణంగా ఈ పీడీ ఖాతాలో జమ అవుతాయి. ఆ శాఖకు సంబంధించిన కార్య క్రమాలకు, ఇతర అవసరాలకు ఈ నిధి నుంచి శాఖాధిపతి నిర్ణయంతో ఖర్చు చేస్తుంటారు. అయితే కొన్ని శాఖల పీడీ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నిధులు ఉండడం.. ఆ నిధికి సంబంధించి వడ్డీ భారీగా జమ అవడం జరుగుతోంది.ఈ క్రమంలో కొందరు అధికారులు వడ్డీ నిధులను వృథాగా ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొన్ని విభాగాల్లో పీడీ ఖాతాల్లోని నిధులను వ్యూహాత్మకంగా ఖర్చు చేస్తున్న తీరును సర్కారు గుర్తించింది. ఈ నేపథ్యంలో నిధుల వినియోగంలో పారదర్శకతకు, శాఖాధిపతులు చేస్తున్న అనవసర ఖర్చులకు చెక్ పెట్టడంతో పాటు ఇకపై ప్రతి పైసా రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోనే జరిగేందుకు గాను పీడీ ఖాతాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించింది.ఈ మేరకు ఆర్థిక శాఖ ద్వారా ఇతర ప్రభుత్వ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 నాటికి పీడీ ఖాతాలకు స్వస్తి పలకాలని, ఆయా ఖాతాల్లో నిల్వ ఉన్న నిధుల వివరాలను అణా పైసలతో సహా లెక్కజెప్పాలని స్పష్టం చేసింది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1నుంచి ప్రభుత్వ శాఖల ఆర్థిక వ్యవహారాలన్నీ ఆర్థిక శాఖ ద్వారానే కొనసాగాలని సూచించింది.నిధుల వినియోగంపై ఫిర్యాదులు..పీడీ ఖాతాల్లోని నిధులకు సంబంధించి కొన్ని విభాగాల్లో గోల్మాల్ లెక్కలున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం ఉందని తెలుస్తోంది. మరికొన్ని విభాగాలు సచివాలయంలోని ప్రభుత్వ కార్యదర్శులకు సమాచారం ఇవ్వకుండానే నిధులు వినియోగిస్తున్నాయనే ఫిర్యాదులున్నాయి. ముఖ్యంగా సంక్షేమ శాఖలు, ఆయా శాఖల పరిధిలోని కార్పొరేషన్ల పీడీ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నిధులు ఉన్నట్లు తెలుస్తోంది.కాగా దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లోని ఓ కార్పొరేషన్‌కు చెందిన ఉన్నతాధికారి.. ఈ నిధి నుంచి, నిధికి సంబంధించిన వడ్డీ మొత్తం నుంచి గత కొంత కాలంగా వృధా ఖర్చులు చేస్తున్నారంటూ సంబంధిత కార్యదర్శి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే విధంగా వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న కార్పొరేషన్ల ఉన్నతాధికారులు వృథా ఖర్చులకు నిధులు వినియోగిస్తున్న తీరుపై కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం.ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టేందుకే పీడీ ఖాతాలను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. గతంలో జిల్లా స్థాయిల్లో పీడీ ఖాతాలుండేవి. అప్పుడు కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతున్న నేపథ్యంలోనే గత ప్రభుత్వం జిల్లా స్థాయిలో పీడీ ఖాతాలను రద్దు చేసి వాటిల్లోని నిధులను వెనక్కు తీసుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల పీడీ ఖాతాలు కూడా రద్దు కానున్నాయి.నిధులు ఖర్చు చేయొద్దు..అన్ని శాఖలు, సంస్థలకు చెందిన పీడీ ఖాతాల్లో దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా నిధులు ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ నిధి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు చేరనుంది. ప్రస్తుతం నిధుల కొరతతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిధులు భారీ ఊరటనిచ్చే అవకాశం ఉంది. కాగా ఈ నిధుల నుంచి ఇక ఎలాంటి ఖర్చులు చేయొద్దని, ఆర్థిక శాఖ అను మతి లేకుండా చేసే ఖర్చులకు శాఖాధిపతి బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆయా శాఖలు, సంస్థలను ఆదేశించినట్లు సమాచారం. -
వ్యక్తిగత బ్యాంకు ఖాతా తప్పనిసరి
ఒంగోలు సెంట్రల్ : ప్రతి కుటుంబానికి వ్యక్తి గత ఖాతా తప్పనిసరని, అదే విధంగా జిల్లాలో ఎన్ని కుటుంబాలకు ఇప్పటి వరకూ వ్యక్తిగత ఖాతాలు ఉన్నాయో సర్వే నిర్వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ ఎ.పద్మజ ఆదేశించారు. గురువారం స్థానిక టీటీడీ కార్యాలయంలో ఐకేపీకి సంబంధించిన ఏసీలు, ఏపీఎంలతో ఆమె సమావేశమయ్యారు. జన్‌ధన్ పథకం కింద వ్యక్తిగత ఖాతాను ప్రారంభించిన వారికి రూపే డెబిట్ కార్డు అందిస్తారని, అదేవిధంగా లక్ష రూపాయల వరకు సంవత్సరం పాటు వ్యక్తిగత బీమా కల్పిస్తారని చెప్పారు. అగస్టు నెలలో రూ.223 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటి వరకూ రూ.76 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఆరు నెలల ముగింపు సందర్భంగా అర్హత కలిగిన ప్రతి గ్రూపునకు రుణం అందజేయాలన్నారు. తీసుకున్న రుణాలను రీపేమెంట్‌కు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని చెప్పారు. ఉలవపాడు, సంతమాగులూరు, చినగంజాం మండలాల్లో రీపేమెంట్లు తక్కువగా ఉన్నాయన్నారు. మండలాల్లో బ్యాంక్ లింకేజిలో సమస్యలు ఉంటే బ్యాంక్ లింకేజి డీపీఎంకు తెలియజేయాలని సూచించారు. స్త్రీనిధి రికవరీలో బాగా వెనుకబడి ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో 56 మండలాలు ఉంటే వీటిలో 50 మండలాల్లో 70 శాతం కుడా రికవరీ కావడం లేదన్నారు. స్త్రీనిధి సంమృద్ధి పథకంలో భాగంగా రూ. 9 కోట్ల లక్ష్యం నిర్దేశిస్తే కేవలం 12 శాతం అంటే కోటి 12 లక్షలు మాత్రమే డిపాజిట్లు సేకరణ జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జన్‌ధన్ పథకంలో భాగంగా గ్రామాల్లో ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు ఎకౌంట్లు తెరిపించాలన్నారు. గ్రామాల్లో బ్యాంకింక్ సేవలను ప్రజల ముంగిట తెచ్చేందుకు విలేజ్ లెవల్ ఎంట్రిప్రూనర్స్ను నియమించిన్నట్లు తెలిపారు. స్టేట్ బ్యాంక్‌కు 24 మందిని, ఆంధ్రాబ్యాంక్‌కు 10 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరికి కావాల్సిన నెట్వర్క్ కార్డు, ల్యాప్‌టాప్, ప్రింటర్, వెబ్కామెరా, తదితర సామగ్రిని పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మండల అధ్యక్షులు సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రెండు జీరో బ్యాలెన్స్ ఎకౌంట్లను తెరిపించాలన్నారు. గ్రూపులు ఆడిట్‌ను తప్పకుండా పూర్తి చేయాలన్నారు. ఆడిట్ పూర్తి అయిన గ్రూపులకే గ్రేడింగ్‌లు ఉంటాయని, వడ్డీలేని రుణం వర్తిస్తుందన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద 2,200 మందికి 7 కోట్ల విలువైన యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని నిర్దేశించగా 19 మండలాలు మాత్రమే పూర్తి చేసాయన్నారు. మిగిలిన 28 మండలాల్లో కుడా యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని పీడీ ఆదేశించారు. కార్యక్రమంలో ఎల్డీఎం ఎల్.నరసింహారావు, డీపీఎంలు నరసింహారావు, విశాలాక్షి, ఎం.సుబ్బారావు, నారాయణ,తదితరులు పాల్గొన్నారు.


