breaking news
Parliament March
-
‘నన్ను వదిలేయండి.. సీజేపీ ఆందోళనకు వెళ్తా’
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో నిర్వహిస్తున్న పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి యాజమాన్యానికి లేఖ రాశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్య పారామీటర్స్ అన్నీ సాధారణంగానే ఉన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనకు స్వయంగా వెళ్లి మద్దతు తెలపాలని ఉందన్న ఆయన.. ఇందుకోసం ఆసుపత్రి నుంచి వెళ్లేందుకు తాత్కాలికంగానైనా అనుమతి (డిశ్చార్జ్) ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కోరారు. గత 21 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్షను శనివారం పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను బలవంతంగా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు, సీజేపీ కార్యకర్తల 'సంసద్ చలో' పిలుపుతో పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో, వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బారికేడ్లను తోసుకుంటూ పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రదర్శనకారులు ప్రయత్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయగా, కార్యకర్తలు పోలీసులపైకి వాటర్ బాటిళ్లు విసురుతూ ఎదురుదాడికి దిగడంతో ఢిల్లీ వీధులు రణరంగంగా మారాయి. -
జేఎన్‌యూ విద్యార్థులపై లాఠీచార్జి
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపునకు నిరసనగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులు సోమవారం చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫీజుల పెంపును నిరసిస్తూ వర్సిటీ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఆయిషీ ఘోష్ సహా దాదాపు 100 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పలువురిపై లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఫీజులు తగ్గించాలన్న డిమాండ్‌తో జేఎన్‌యూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఢిల్లీ వీధుల్లో నినాదాలు చేసుకుంటూ ముందుకుసాగారు. పార్లమెంటు భవనం వద్దకు వెళ్లేందుకు యత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు సఫ్దర్‌గంజ్ సమాధి వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమీపంలో ఉన్న మూడు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్ మెట్రో స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. నెల్సన్ మండేలా మార్గ్, అరబిందోమార్గ్, బాబా గంగానాథ్ మార్గ్‌లలో పలు ఆంక్షలు విధించారు. విద్యార్థుల ఆందోళనలతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా, పోలీసుల తీరుపై విద్యార్థులు విరుచుకుపడ్డారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థుల చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఎమర్జెన్సీ ఇన్ జేఎన్‌యూ’పేరుతో ట్యాగ్ చేశారు. ఈ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది. త్రిసభ్య కమిటీ ఏర్పాటు.. జేఎన్‌యూలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటుచేసినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈ కమిటీలో యూజీసీ మాజీ చైర్మన్ వీఎస్ చౌహాన్, ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్ధ, యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీకి యూజీసీ సహకారం అందించనుంది. -
14న బ్యాంకు ఉద్యోగుల చలో పార్లమెంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకు ఉద్యోగులు మార్చి 14న ‘పార్లమెంట్ మార్చ్’కి పిలుపునిచ్చారు. సుమారు 40,000 మంది ఉద్యోగులతో పార్లమెంట్ ముందు నిరసన ప్రదర్శన చేయనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీ ఈఏ) ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. రుణ ఎగవేతదారుల నుంచి బకాయిలను వసూలు చేయడం, ప్రభుత్వరంగ బ్యాంకులను మరింత పటిష్టపర్చాలన్నది తమ ప్రధాన డిమాండని ఏఐబీఈఏ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు.


