జేఎన్‌యూ విద్యార్థులపై లాఠీచార్జి

Police stop JNU students march towards Parliament, baton-charge - Sakshi

ఉద్రిక్తంగా ర్యాలీ

ఢిల్లీలో తాత్కాలికంగా మూతపడ్డ 3 మెట్రో స్టేషన్లు

న్యూఢిల్లీ: హాస్టల్‌ ఫీజుల పెంపునకు నిరసనగా జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులు సోమవారం చేపట్టిన పార్లమెంట్‌ మార్చ్‌ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫీజుల పెంపును నిరసిస్తూ వర్సిటీ నుంచి పార్లమెంట్‌ వైపు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఆయిషీ ఘోష్‌ సహా దాదాపు 100 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పలువురిపై లాఠీ చార్జ్‌ చేశారు. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

సోమవారం నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఫీజులు తగ్గించాలన్న డిమాండ్‌తో జేఎన్‌యూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఢిల్లీ వీధుల్లో నినాదాలు చేసుకుంటూ ముందుకుసాగారు. పార్లమెంటు భవనం వద్దకు వెళ్లేందుకు యత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు సఫ్దర్‌గంజ్‌ సమాధి వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ సమీపంలో ఉన్న మూడు మెట్రో స్టేషన్‌లను తాత్కాలికంగా మూసివేశారు.

ఉద్యోగ్‌ భవన్, పటేల్‌ చౌక్‌ మెట్రో స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. నెల్సన్‌ మండేలా మార్గ్, అరబిందోమార్గ్, బాబా గంగానాథ్‌ మార్గ్‌లలో పలు ఆంక్షలు విధించారు. విద్యార్థుల ఆందోళనలతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కాగా, పోలీసుల తీరుపై విద్యార్థులు విరుచుకుపడ్డారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థుల చిత్రాలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఎమర్జెన్సీ ఇన్‌ జేఎన్‌యూ’పేరుతో ట్యాగ్‌ చేశారు. ఈ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అయింది.  

త్రిసభ్య కమిటీ ఏర్పాటు..
జేఎన్‌యూలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన హైపవర్‌ కమిటీని ఏర్పాటుచేసినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి ఆర్‌.సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈ కమిటీలో యూజీసీ మాజీ చైర్మన్‌ వీఎస్‌ చౌహాన్, ఏఐసీటీఈ చైర్మన్‌ అనిల్‌ సహస్రబుద్ధ, యూజీసీ కార్యదర్శి రజనీష్‌ జైన్‌ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీకి యూజీసీ సహకారం అందించనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top