breaking news
Pandharpur
-
2 వారాల పాటు అక్కడ చికెన్, మటన్ బంద్
సాక్షి ముంబై: ఆషాఢీ వారీ సందర్భంగా విఠోబా దర్శనం కోసం లక్షలాది మంది వార్కరీలు పండరీపూర్‌కు చేరుకోనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల మతపరమైన మనోభావాలను గౌరవిస్తూ నేటి నుంచి 29 వరకు మహారాష్ట్రలోని పండరీపూర్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో మాంసం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోలాపూర్ జిల్లా ఇంచార్జి మంత్రి జయకుమార్ గోరే సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు.ఆషాఢీ వారీ సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పాదయాత్రగా పండరీపూర్‌కు చేరుకుంటారని, ఈ పవిత్ర వేళలో మాంసం విక్రయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఆదేశాలను ఉల్లంఘించి మాంసం లేదా మటన్ అమ్మకాలు కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని వార్కరీ సంఘాలు స్వాగతించాయి.గజానన్ మహారాజ్ పల్లకీ యాత్రకు ముమ్మర ఏర్పాట్లు సోలాపూర్: శ్రీ క్షేత్ర షేగావ్ నుంచి పండరీపూర్ బయలుదేరిన శ్రీ గజానన్ మహారాజ్ పల్లకీ, వార్కారీల పాదయాత్ర ఈనెల 18న సోలాపూర్ చేరుకోనుంది. పల్లకీ, వార్కరీలు రెండు రోజులు ఇక్కడే బస చేయనున్న నేపథ్యంలో మేయర్ వినాయక కొండ్యాల్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట స్టాండింగ్ కమిటీ చైర్మన్ రంజిత చాకోతే, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ సచిన్ ఓంబాసే, అదనపు కమిషనర్ వీణా పవార్, కార్పొరేటర్లు వందన గైక్వాడ్ , శ్రీదేవి పూలారే, కల్పన కదం , గౌతం కస్బే, దిలీప్ కొల్హె, సిటీ ఇంజనీర్ సారిక ఆకులువార్, అగ్నిమాపక విభాగం ప్రముఖ అధికారి రాకేష్ సాలుంకే, శ్రీ గజానన మహారాజ్ షేగావ్ సంస్థాన్‌కు చెందిన స్థానిక ప్రతినిధులు సునీల్ కులకర్ణి, సునీల్ ఫాల్కే, ఉద్యానవన అధికారి కోమల్ కాశిది సంబంధిత విభాగాల అధికారులు ఉన్నారు.రూప భవాని చౌక్, తుల్జాపూర్ వేస్, కస్తూర్బా మార్కెట్, సామ్రాట్ చౌక్ శ్రీ సద్గురు ప్రభాకర్ స్వామి మహారాజ్ మందిర్, బాలివేస్ టెలిఫోన్ భవన్, కుంబార్ వేస్, కౌంతం చౌక్, కన్నా చౌక్ మార్గాలతో పాటు పద్మశాలీ శిక్షణ సంస్థకు చెందిన కుఛన్ పాఠశాలల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే వార్కారీలు బస చేసే ఉపలపు కళ్యాణ మండపాన్ని, అక్కడి నుండి తరలి వెళ్లే మోదీ రైల్వే బ్రిడ్జి, ధమాని నగర్ మార్గాల వద్ద సన్నాహాలను సమీక్షించారు.చదవండి: ఆ రూట్లో వెళ్లే వాహనాలకు టోల్ ఫీజు లేదువార్కరీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా మేయర్ అధికారులను ఆదేశించారు. పల్లకి మార్గంలో అడ్డువచ్చే చెట్ల కొమ్మలను వెంటనే కొట్టివేయాలని అలాగే రోడ్లపై గుంతలను పూడ్చాలని, పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెప్పారు. కమిషనర్ డాక్టర్ సచిన్ ఓం బాసే పల్లకి మార్గాల వెంబడి అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని, అలాగే పారిశుధ్యం, నీటి సరఫరా, ఆరోగ్య, అగ్నిమాపక, అత్యవసర విభాగాల సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని సూచించారు. -
ఆ రూట్లో వెళ్లే వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం
సాక్షి ముంబై: ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పండరీపూర్‌కు వెళ్లే భక్తుల వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం కల్పించింది. దీంతో ఉత్సవాలకు రాకపోకలు సాగించే భక్తులకు ఎంతో ఊరట లభించింది. ఈ సౌకర్యం సొంత వాహనాల్లో వెళ్లే భక్తులతోపాటు టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, అద్దె కార్లు, ఇతర పికప్ వాహనాలు సహా గ్రూపు బుకింగ్ చేసుకున్న మహరాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (ఎమ్మెస్సార్టీసీ) బస్సులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందు నుంచి ముగిసేవరకూ.. ఈ నెల 25న పండరీపూర్‌లో ఆషాఢ ఏకాదశి (Ashadi Ekadashi) ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల నుంచి భక్తులు పల్లకీలతో సహా కాలినడకన పక్షం రోజుల ముందే పండరీపూర్‌కు బయలుదేరతారు. ఏకాదశికి ముందు లేదా అదేరోజున అక్కడికి చేరుకుంటారు. కొందరు భక్తులు సొంత వాహనాల్లో మరికొందరు అద్దె వాహనాల్లో వస్తారు. దీంతో పండరీపూర్ సుమారు వారం రోజులపాటు భక్తులతో కిటకిటలాడుతుంది. ఉత్సవాలకు మూడు రోజుల ముందు నుంచి ముగిసేవరకు అంటే ఈ నెల 29 వరకు అన్ని రకాల వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాస్ ఇలా పొందాలి... అయితే ఈ సౌకర్యాన్ని పొందాలనుకునేవారు కొ న్ని నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్ప ష్టం చేసింది. పండరీపూర్ వెళ్లే వాహనాలు ‘ఆషాఢి ఏకాదశి–2026’ అనే స్టిక్కర్ లేదా పాస్ కోసం ముందుగా స్ధానిక పోలీసు స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రాఫిక్ ఫోలీసు శాఖ లేదా ప్రాంతీయ రవాణా కార్యాలయం అనమతి పొందాలి. ఈ స్టిక్కర్ లేదా పాస్‌ను వాహనం విండ్ షీల్డ్ (అద్దం ముందు భాగం) పై అతికించాలి. గ్రూపు బుకింగ్ చేసుకునే బస్సులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. అప్పుడే టోల్ నాకాల మీదుగా ఉచితంగా ఒకసారి వెళ్లి , తిరిగి రావడానికి (వన్ టైం) వీలుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.చదవండి: బీజేపీ నాయకులపై రాజ్‌ఠాక్రే ధ్వజంఅన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలి ఇదిలాఉండగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షం (Mumbai Rains) కారణంగా అనేక చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఉత్సవాలకు ముందే మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వాహనాల్లో వెళ్లే వారితోపాటు పల్లకీలతో కాలిబాటన వెళ్లే భక్తులు మార్గమధ్యంలో ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయాలని సూచించింది. వాహనాలను క్రమబద్దీకరించేందుకు మార్గమధ్యలో ట్రాఫిక్ పోలీసులను నియమించాలని, రోడ్డు ప్రమాదానికి గురైన, రిపేర్లతో ఆగిపోయిన వాహనాలను తరలించేందుకు టోవింగ్ వ్యాన్లు అందుబాటులో ఉంచాలని స్ధానిక పోలీసు స్టేషన్లకు సూచించింది. -
పండరీపురం: బక్రీద్ త్యాగాన్ని వాయిదా వేసిన ముస్లింలు!
పండరీపురం: మహారాష్ట్రలోని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం పండరీపురంలో మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుత ఘట్టం కనిపించింది. ఈ ఏడాది బక్రీద్ పండుగ, అత్యంత పవిత్రమైన ‘అధిక మాస ఏకాదశి’ ఒకే రోజు రావడంతో, అక్కడి ముస్లిం సోదరులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, బక్రీద్ నాటి మేక బలి సంప్రదాయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి, అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.సామరస్యానికి పెద్దపీటపండరీపురం అంటేనే విఠలుని భక్తులకు నిలయం. ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈసారి ఏకాదశి, బక్రీద్ కలిసి రావడంతో, ఏకాదశి వేడుకలకు ఎలాంటి అంతరాయం కలగకూడదని, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని ముస్లిం కమ్యూనిటీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. తరతరాలుగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సోదరభావాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని...ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అధిక మాస ఏకాదశికి భారీ స్థాయిలో భక్తులు తరలివస్తారు. ఆ రోజున నగరంలో నెలకొనే ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలాంటి భంగం కలగకూడదనే ఉద్దేశంతో, తాము చేయాల్సిన త్యాగ కార్యక్రమాన్ని కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు స్థానిక ముస్లిం ప్రతినిధులు పేర్కొన్నారు.తరతరాల అనుబంధంపండరీపురంలోని ముస్లింలకు, స్థానిక ఆలయ సంస్కృతికి మధ్య దశాబ్దాల అనుబంధం ఉంది. విఠలుని భక్తులపై, ఆ క్షేత్రంపై తమకు అమితమైన గౌరవం ఉందని, గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఇదే విధమైన సంయమనం పాటించామని వారు గుర్తు చేశారు. ఏ మతం వారైనా మరొకరి ఆచారాలను గౌరవించినప్పుడే, మతసామరస్యం వెల్లివిరుస్తుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.ఇది కూడా చదవండి: భక్తిశ్రద్ధలతో బక్రీద్: హై అలర్ట్‌లో భద్రతా బలగాలు -
తప్పిపోయిన కుక్క.. 250 కిలోమీటర్లు ప్రయాణించి..
బెంగళూరు : కుక్కలను విశ్వాసానికి మారుపేరుగా చెబుతుంటాం. అయితే కుక్కల్లో విశ్వాసమే కాదు.. అమితమైన ప్రేమ కూడా చూపిస్తాయనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. సాధారణంగా పెంపుడు కుక్కలు ఒక వీధి దాటి మరో వీధికి వెళ్లి తిరిగి రావడమే చాలా అరుదు. అలాంటి ఓ కుక్క ఏకంగా వందల కిలోమీర్లు ప్రయాణించింది. కొండలు,గుట్టలు, వాగులు,వంకలు దాటి చివరికి గమ్య స్థానానికి చేరుకుంది. దీంతో కుక్క యజమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఊరంతా పిలిచి ఊరబంతి పెట్టించాడు. ప్రస్తుతం ఈ అరుదైన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని బెలగావి జిల్లాలోని నిపాని తాలూకా యమగర్ని గ్రామానికి చెందిన కమలేష్ కుంభార్ ప్రతి ఏడాది మహారాష్ట్రలోని పండరీపూర్‌లో ఉన్న విఠల్ రుక్మిణి (విఠలుడి దేవాలయం) ఆలయానికి పాదయాత్ర చేస్తుంటారు. అలా ఓ ఏడాది పాదయాత్ర చేస్తున్న తన వెంట ఓ కుక్కని నడిచింది. అందుకే దానికి ‘మహారాజ్’ అని పేరు పెట్టాడు. తన ఇంట్లోనే పెంచుకుంటున్నాడు. పుణ్యక్షేత్రాలకు పాదయాత్రగా వెళ్లే సమయంలో మహారాజ్‌ను తన వెంటే తీసుకుని వెళ్లేవారు.అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది విఠల్ రుక్మిణి ఆలయ దర్శనానికి వెళ్లారు. జూన్ చివరి వారంలో పాదయాత్రగా వెళ్లిన కమలేష్‌కు మహారాష్ట పండరీపూర్‌కు వెళ్లిన తర్వాత మహారాజ్ తప్పి పోయింది. కుక్క గురించి స్థానికులను అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కమలేష్ తన పాదయాత్ర ముగించుకుని జులై 14న ఇంటికి చేరుకున్నారు.ఈ తరుణంలో దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించిన కుక్క మహారాజ్ తన యజమాని కమలేష్ వద్దకు చేరింది. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి తోక ఊపుతూ ఇంటి ముందున్న ‘మహారాజ్’ను చూసి కమలేష్ కుంభార్ ఆనందం పట్టలేకపోయాడు. ఒంటరిగా 250 కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోని తన గ్రామానికి అది చేరుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు. పాండురంగ నాథుడే ఆ కుక్కకు దారి చూపి తన ఇంటికి చేర్చినట్లు భావించాడు. మహారాజ్ మెడలో పూల దండ వేసి హారతి ఇచ్చి తన ఇంట్లోకి స్వాగతం పలికాడు. గ్రామస్తులకు విందు కూడా ఇచ్చాడు. -
ఏకాదశి ఉత్సవాల్లో సీఎం దంపతులు
ముంబైః ఆషాఢ ఏకాదశి ఉత్సవాలు మహరాష్ట్రలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్పవాల సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, అయన భార్య అమృతా లు పండరపుర విఠల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన మహా పూజకు భక్తులు లక్షల్లో హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆయన భార్య అమృతాలు పండరపుర విఠల్ దేవాలయాన్ని దర్శించారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన ఉత్సవాల్లో తెల్లవారుజామున మహాపూజ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి దంపతులు విఠలేశ్వరుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో కొలువైన పండరపుర విఠలుని ఏకాదశి దర్శనానికి లక్షల్లో భక్తులు క్యూ కట్టారు. ఆ విఠలేశ్వరుడు భక్తులందరినీ చల్లగా కాపాడాలని, ఆయన ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకున్నట్లు ఫడ్నవిస్ తెలిపారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా పండరపుర ఆలయంలో నిర్వహించే 'వారి' ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలలనుంచీ భక్తులు కాలినడకన వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఏకాదశి సందర్భంగా ముంబై 'వడాలా' లోని విఠల్ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర ఉత్సవాల సందర్భంగా స్వామిని దర్శించేందుకు వేలల్లో భక్తులు తరలివస్తారన్నఉద్దేశ్యంతో ముందుగానే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ను మళ్ళించి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


