breaking news
outraged
-
అణచి వేయడానికే ‘దిమాగీ’ మాట
న్యూఢిల్లీ: దేశంలో దిమాగీ నక్సలైట్లు అశాంతి, అరాచకాలకు సృష్టించడానికి కుట్రలు సాగిస్తున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అసమ్మతిని అణచివేయడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డాయి. నక్సలిజాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నప్పటికీ, మావోయిస్టుల విషయంలో మోదీ ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ ఆరోపించారు. దిమాగీ నక్సలైట్లుఅంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నమేనని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నవారిని దేశద్రోహులుగా ముద్ర వేయడం, పాకిస్తాన్కు వెళ్లాలని అనడం ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అరెస్టయిన మావోయిస్టుల పట్ల మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉగ్రవాద చర్యలను తలపిస్తోందని ఆరోపించారు. కొందరిపై చట్టపరమైన విచారణ జరపకుండా, కస్టడీలోనే కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా మోదీ అసమ్మతివాదులను టార్గెట్ చేశారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆక్షేపించరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కళంకం వేయడానికి దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో మర్చిపోయి, అసమ్మతివాదులను లక్ష్యంగా చేసుకోవడానికి సమయం, అవకాశం వెతుక్కుంటున్నారని రాజా తప్పుపట్టారు. ఇది కేవలం భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని భయపెట్టడానికి చేసే ప్రయత్నం మాత్రమేనని తేల్చిచెప్పారు. విద్య, ఉపాధికి సంబంధించి విద్యార్థులు, యువత లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించాలని ప్రధాన మోదీకి డి.రాజా సూచించారు. రాజకీయ శాస్త్రంలో మోదీ ‘ఎంఏ’ ‘‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రత్యర్థులను దిమాగీ నక్సల్స్ అని పిలుస్తూ చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటు. విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉపయోగించుకోవడం సరైంది కాదు. మోదీ ఇకనైనా అహంకారం వదిలించుకోవాలి’’ అని తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సాకేత్ గోఖలే ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘ప్రధానమంత్రి మొదట తన ప్రత్యర్థులను అర్బన్ నక్సల్స్ అని విమర్శించారు. ఇప్పుడు వారిని దిమాగీ నక్సల్స్ అని పిలుస్తున్నారు. ఇది మోదీ నిస్సహాయతకు స్పష్టమైన సంకేతం. ఇతరులపై నిందలు వేయడంతో మోదీ ఆరితేరిపోయారు. మొత్తం రాజకీయ శాస్త్రంలోనే ఆయన మాస్టర్ అబ్యూజర్(ఎంఏ). కాబట్టి ప్రధానమంత్రికి ఎంఏ డిగ్రీ ఉండటంలో ఆశ్చర్యం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ‘ఎక్స్’లో తేల్చిచెప్పారు. -
దౌర్జన్య భూమి
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న జన్మభూమి–మావూరు గ్రామసభల్లో సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రజలు, ప్రతిపక్షం వైఎస్సార్సీపీ నాయకులపై అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. గురువారం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు 17వ వార్డులో జరిగిన సభకు వైఎస్సార్సీపీ నేత కొలుసు పార్థసారథి హాజరై ఎన్నికల హామీలు అమలుకు నోచుకోలేవని, జీ+3 ఇళ్ల నిర్మాణాల్లో భారీ కుంభకోణం చోటుచేసుకుందని ఆరోపించారు. దీనిపై ఆవేశంతో ఊగిపోయిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తిట్ల పురాణం అందుకున్నారు. అదే అదనుగా టీడీపీ నాయకులు బరితెగించి దౌర్జన్యానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు సైతం ఎమ్మెల్యేకు వంతపాడారు. పార్థసారథిని బలవంతంగా సభ నుంచి బయటకు పంపేశారు. కాగా, యనమలకుదురు సభలో బోడే ప్రసాద్ మాట్లాడుతూ బిల్డర్లు గ్రామంలో గ్రూప్హౌస్ల నిర్మాణాలు చేస్తుండటంతో వారిని బెదిరించి రూ.కోటి వసూలు చేశానని, ఆ సొమ్ముతో రోడ్లు వేశానని చెప్పడం గమనార్హం. విజయవాడ సెంట్రల్ 59వ డివిజన్ పరిధిలో జరిగిన గ్రామసభలో గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం చూపలేదంటూ అఖిలపక్షం నాయకులు ఎమ్మెల్యే బొండా ఉమా, అధికారులను నిలదీశారు. వారిపై పోలీసులు విరుచుకుపడ్డారు. కార్పొరేటర్ అవుతు శైలజపై టీడీపీ కార్యకర్త దాడికి యత్నించాడు. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బత్తిలి సభలో సంక్షేమ పథకాలు అర్హులకు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిలదీయగా.. అడ్డుపడిన టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో గ్రామసభను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో టీడీపీ మండలాధ్యక్షుడు బవిరిశెట్టి రాంబాబు వర్గీయులు కుర్చీలు, బల్లలతో దాడి చేశారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులకు గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరులో స్థానిక సమస్యలు పరిష్కరించట్లేదంటూ ఓ యువకుడు అధికారపార్టీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును నిలదీయగా.. పక్కనే ఉన్న పోలీసులు కలుగజేసుకుని నువ్వు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడివి.. సభలో గందరగోళం సృష్టించడానికి వచ్చావంటూ పక్కకు లాగేశారు. సీఎం చంద్రబాబు నివాసముంటున్న ఉండవల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో స్థానిక సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకొచ్చిన ప్రజల్ని అధికారపార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వారికి, ప్రజలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కిర్తుబర్తిలో అర్హులకు పింఛన్లు అందలేదని, సంక్షేమ పథకాలు కొంతమందికే అందజేస్తున్నారంటూ గ్రామస్తులు ఎమ్మెల్యే కె.ఎ.నాయుడును నిలదీశారు. మెరకముడిదాం మండలం చినబంటుపల్లిలో గ్రామ సమస్యలపైన, ఆంధ్రా పెర్రో అల్లాయిస్ పరిశ్రమలో కార్మికుల సమస్యలపైన ఎమ్మెల్యే కిమిడి మృణాళిని, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణిని అక్కడి ఉద్యోగులు నిలదీశారు. వేపాడ మండలం పి.కె.ఆర్.పురంలో హామీలు నెరవేర్చలేనప్పుడు గ్రామసభలొద్దంటూ గ్రామస్తులు అధికారులు ఊళ్లోకి రాకుండా ట్రాక్టరు, ఆటో, ముళ్లకంచెలు వేసి అడ్డుకున్నారు.కర్నూలు జిల్లా పడిదెంపాడు, పూడూరుల్లో రోడ్డు సమస్య పరిష్కరించాలంటూ అధికారులను గ్రామాల్లోకి రాకుండా రోడ్డుపై టైర్లు వేసి నిప్పంటించారు. ‘జన్మభూమి’ ఒత్తిడితో ఏఎస్ఐకి ఛాతీనొప్పి.. మృతి కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బొడవాడలో 20 ఏళ్లుగా నివాస స్థలాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇంకా ఎన్నిసార్లు అర్జీలివ్వాలని డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్రాజును ప్రశ్నించిన వారిపై పోలీసుల్ని ఉసిగొల్పారు. దీంతో ఆందోళనకు దిగిన వారిని అదుపు చేయడానికి ప్రయత్నించిన ఏఎస్ఐ మహబూబ్ బాషా ఒత్తిడికి లోనయ్యారు. విధులు ముగించుకుని వెళుతున్న సమయంలో ఛాతీనొప్పి రావడంతో మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కరవంజ గ్రామసభకు హాజరైన అడపా సత్యవతమ్మ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. మధ్యాహ్నం అధికారులు మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. -
దగా..
కర్నూలు అగ్రికల్చర్ : అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల బారిన పడి నష్టపోయిన రైతుల నోళ్లలో ప్రభుత్వం మట్టి కొట్టింది. ఏళ్ల తరబడి ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్న రైతుల ఆశలను నీరుగార్చింది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కోసం అవి చేస్తాం, ఇవి చేస్తామంటూ ఎన్నో, ఎన్నెన్నో వాగ్దానాలు చేసి అధికారం చేజిక్కించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమంగా రంగులు మారుస్తున్నారు. 2009 నుంచి 2013-14 వరకు అతివృష్టి, అనావృష్టి వల్ల జరిగిన పంట నష్టానికి ఎటువంటి ఇన్పుట్ సబ్సిడీ లేదని ప్రకటించి వేలాది మంది రైతుల నోళ్లలో మట్టి కొట్టింది. నిబంధనల ప్రకారం ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలకు నష్టం జరిగితే తగిన పెట్టుబడి రాయితీ(ఇన్పుట్ సబ్సిడీ) ఇవ్వాల్సి ఉంది. 50 శాతం ఆపైన దెబ్బతిన్న పంటలన్నింటికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో 2009 నుంచి 2013-14 వరకు ఇన్పుట్ సబ్సిడీ దాదాపు రూ.9 కోట్లు రావాల్సి ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాజకీయాలకు అతీతంగా ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయాల్సి ఉంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు గండి కొడుతోంది. రాష్ట్ర విభజన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదనే సాకుతో ఇన్పుట్ సబ్సీడీకి గండి కొడుతోంది. జనవరిలో చంద్రన్న సంక్రాంతి కానుకల పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేదనే కారణంతో ఇన్పుట్ సబ్సిడీని రైతులకు దూరం చేస్తోంది. 2013-14 వరకు ప్రకృతి వైపరిత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎటువంటి ఇన్పుట్ సబ్సిడీ లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు ఇచ్చారు. అంటే జిల్లాలో దాదాపు 1.50 లక్షల మంది రైతులు రూ.9 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని కోల్పోయారు. ఇక 2013-14 వరకు అతివృష్టి, అనావృష్టి వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ లేదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని వ్యవసాయాధికారులు సాక్షితో చెప్పారు. 2014-15 కరువుకు ఇన్పుట్ సబ్సిడీ ఏది.. 2014 సంవత్సరంలో జిల్లాలో ఏర్పడిన కరువుకు సంబంధించి ప్రభుత్వం మొదటి విడతలో 12 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. అయితే ఈ మండలాలకు కూడా ఇన్పుట్ సబ్సిడీ లేకుండా పోయింది. ప్రభుత్వం ఒకవైపు 12 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా, మరోవైపు మండల స్థాయి అధికారులు మా మండలాల్లో కరువు లేదు. సాగు బాగుంది, దిగుబడులు బాగా వచ్చాయంటూ నివేదికలు ఇచ్చారు. ఇలా 12 మండలాల అధికారులు ఇదే విధంగా నివేదికలు ఇచ్చారు. దీంతో 12 కరువు మండలాల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదని జేడీఏ ఠాగూర్నాయక్ స్పష్టంగా తెలిపారు. ఎన్నో వాగ్దానాలతో అధికారం చేపట్టిన చంద్రబాబు రైతులను అడుగడుగునా దగా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇన్పుట్ సబ్సిడీకి స్వస్తి పలికారు. రుణమాఫీ అయోమయంలో పడింది. మొదటి విడతలో అరకొరగా మాఫీ చేసిన ప్రభుత్వం రెండవ విడత మాఫీ గురించి ఆలోచించడమే లేదు. ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం పలకడాన్ని నిరసిస్తూ రైతు సంఘాలు ఆందోళనలకు సిద్ధం అవుతున్నాయి.


