Online transfer
-
రిమాండ్ ఖైదీ సొమ్ము మాయం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పోలీసు రిమాండ్‌లో ఉన్న ఓ నిందితుడి డబ్బు దొంగలు కొట్టేశారు. అది కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బును వారి ఖాతాలకు మళ్లించుకున్నారు. బెయిల్‌పై విడుదలైన నిందితుడు అసలు విషయం తెలిసి నెత్తీనోరు బాదుకుంటున్నాడు. కరీంనగర్ పట్టణానికి చెందిన మహేందర్‌పై ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీసుస్టేషన్లో ఓ కేసు నమోదు కావడంతో అక్కడి పోలీసులు 2025 డిసెంబర్ 4న అతన్ని అరెస్టు చేశారు. ఆ సమయంలో నిందితుడి కారు, సెల్ఫోన్లు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.అనంతరం మార్చి 26న బెయిల్‌పై విడుదలైన మహేందర్ తన సెల్ఫోన్లు తీసుకొని బ్యాంకు బ్యాలెన్సు చూసుకొని అవాక్కయ్యాడు. జైలుకు వెళ్లే సమయంలో ఖాతాలో రూ. 6.64 లక్షలు ఉండగా అందులోంచి ఏకంగా రూ. 6 లక్షలకుపైగా నగదు మాయమైంది. దీంతో అతను వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించగా సెల్ఫోన్ల నుంచే లావాదేవీలు జరిగిగాయని, ఫిబ్రవరి 19, మార్చి 17 తేదీల్లో రూ. 6 లక్షలకుపైగా నగదు బదిలీ అయిందని వివరించారు. మరోవైపు ఇంట్లోని 157 గ్రాముల బంగారం, వెండి పాత్రలు, హార్డ్ డిస్కులు, చెక్ బుక్కులు, బిల్లులు కూడా మాయమైనట్లు బాధితుడు గుర్తించాడు.దీనిపై కరీంనగర్ సైబర్ క్రైం పోలీసులతోపాటు డీజీపీకి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొన్ని ఖాతాలను స్తంభింపజేసి రూ. 50 వేలు ట్రాన్స్ఫర్ కాకుండా ఆపగలిగారు. మిగిలిన ఖాతాలు ఎవరివన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే అరెస్టు సమయంలో పోలీసులకు తాను సెల్ఫోన్ల పాస్వర్డ్లు చెప్పానని.. పోలీసులు సీజ్ చేసిన సెల్ఫోన్ల నుంచి డబ్బు మాయం కావడం నమ్మశక్యంగా లేదంటూ మహేందర్ ‘సాక్షి’తో వాపోయాడు. -
పక్కాగా జీరో ఎఫ్ఐఆర్ అమలు
సాక్షి, హైదరాబాద్ : దిశ ఘటన నేపథ్యంలో జీరో ఎఫ్ఐఆర్ మరోసారి చర్చకు వచ్చింది. పోలీసు స్టేషన్ పరిధులతో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ముందు దర్యాప్తు ప్రారంభిస్తారు. అనంతరం కేసును సంబంధిత స్టేషన్‌కు బదిలీ చేస్తారు. వాస్తవానికి ఇదేం కొత్త విధానం కాదు. ఇప్పటికే మనుగడలో ఉన్నదే. దిశ హత్య కేసు అనంతరం జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ మహేందర్‌రెడ్డి గత నెలాఖరునే మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఈ విధానాన్ని అన్ని పోలీస్స్టేషన్లలో తప్పకుండా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. ప్రత్యేకించి యువతులు, బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారంటూ వచ్చిన ఫిర్యాదులపై ఏమాత్రం ఆలస్యం చేయవద్దని అందులో పొందుపరచనున్నారు. నేడో, రేపో ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లకు ఆదేశాలు చేరనున్నాయి. ఈ ఏడాది 200పైనే.. జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని చాలా ఏళ్లుగా తెలంగాణ పోలీసులు పాటిస్తున్నారు. 2018లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధుల్లో దాదాపు 1,200 కేసులు ఈ విధానంలో నమోదయ్యాయి. అనంతరం దర్యాప్తు దశలో వాటిని ఇతర స్టేషన్లకు బదిలీ చేశారు. తాజాగా వరంగల్‌లోని సుబేదారిలో నమోదైన యువతి మిస్సింగ్ కేసుతో జీరో ఎఫ్ఐఆర్ల సంఖ్య ఈ ఏడాదిలో 200 దాటింది. గతంలో కేసుల బదిలీ ప్రక్రియ మాన్యువల్‌గా జరిగేది. కానీ తెలంగాణ పోలీసులు ఈ కేసులో మాత్రం సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టం) ద్వారా ఆన్లైన్లో ఈ ఎఫ్ఐఆర్ను బదిలీ చేయడం గమనార్హం. మహిళలు, యువతులు అదృశ్యమైన సందర్భంలో వెంటనే స్పందిస్తారు. విషయాన్ని సంబంధిత ఎస్పీ, కమిషనర్ కార్యాలయాలకు వెంటనే సమాచారం చేరిపోతుంది. ఆ వెంటనే సీసీటీఎన్ఎస్ ద్వారా డీజీపీ కార్యాలయానికి కేసు వివరాలు చేరతాయి. ఇలాంటి కేసులను ఎస్పీ, కమిషనర్‌తోపాటు డీజీపీ కార్యాలయం కూడా పర్యవేక్షిస్తాయి. -
రేపట్నుంచి ఆన్లైన్లో ఈపీఎఫ్ సేవలు
ఢిల్లీ: దేశంలోని దాదాపు నాలుగు కోట్ల మంది ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) నిర్వహణ మరింత సుల భతరం కానుంది. ఇక ఈపీఎఫ్ ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి రానుండటంతో ఉద్యోగులు రేపటి నుంచి ఈ సేవలను వినియోగించుకునే సౌకర్యం ఉంటుంది. ఒకే ఒక్క సార్వత్రిక నంబర్ విధానంలో దీన్ని నిర్వహించనున్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) వెల్లడించింది. గతంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఈ కొత్త విధానాన్ని అనుసరించనున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందుబాటులోకి తెస్తామని కేంద్ర భవిష్య నిధి (సీపీఎఫ్) కమిషనర్ కె.కె.జలాన్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విధానంతో ప్రస్తుతం ఉన్న యాజమాన్య ఆధారిత విధానం పూర్తిగా ఉద్యోగి కేంద్రంగా మారుతుంది. ఉద్యోగి వేరే సంస్థకు మారినా, మరో ప్రాంతానికి బదిలీ అయినా అతని సార్వత్రిక భవిష్యనిధి నంబరు బ్యాంకు ఖాతా నంబర్లా శాశ్వతంగా ఉంటుంది. ఇక పెన్షనర్లందరికీ నవంబర్ నుంచి ప్రతి నెలా ఒకటో తేదీకల్లా పింఛన్ చేతికందుతుండటమే గాక ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతాను ఆన్లైన్ ద్వారా బది లీ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది. -
ధన ప్రవాహానికి అడ్డుకట్ట!
న్యూఢిల్లీ: ఎన్నికలలో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) పది సూత్రాల ప్రణాళికను తెరపైకి తీసుకొచ్చింది. లోక్‌సభతో పాటు ఐదు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ ప్రణాళిక అమలుకు సంబంధించి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఆహ్వానించింది. ఈసీ ప్రతిపాదనల ప్రకారం... పార్టీ అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పద్దులను, చిట్టాలను పార్టీ కోశాధికారి తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. పార్టీకి అందే విరాళాలు లేదా నిధులను సహేతుకమైన సమయంలోగా గుర్తింపు పొందిన బ్యాంకులోని ఖాతాలో జమ చేయాలి. పార్టీ సభలు, ఎన్నికల ప్రచారం ఖర్చుల నిమిత్తం ఏకమొత్తంలో నిధులు ఇవ్వదలస్తే, ఆ మొత్తాన్ని చెక్ (ఖాతా ద్వారా చెల్లింపు), డ్రాఫ్ట్, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ లేదా ఇంటర్నెట్ బదిలీ ద్వారా మాత్రమే చెల్లించాలి. నిర్దేశించిన మొత్తం కన్నా ఎక్కువగా అభ్యర్థి కానీ, కార్యకర్తలు కానీ తమ వెంట తీసుకెళ్లకుండా ఆయా రాజకీయ పార్టీలే చూసుకోవాలి. -
ఈ నెలాఖరుకల్లా ఆన్లైన్లో పీఎఫ్ బదిలీ
న్యూఢిల్లీ: ఉద్యోగాలు మారే వారి పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్లో బదిలీ చేసే ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఈ సర్వీసుకు సంబంధించి నిర్వహించిన ప్రయోగాత్మక ఆన్లైన్ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని, ఈ నెల ఆఖరి వారంలో ఆన్లైన్ బదిలీ మొదలు కానుందని అధికార వర్గాలు చెప్పాయి. ఈపీఎఫ్ఓ సోమవారం నుంచి ఈ సర్వీసును ‘లైవ్ టెస్టింగ్’లో పరీక్షిస్తుందని, ఇందులో భాగంగా ఎంపిక చేసిన సంస్థల ఉద్యోగులకు పీఎఫ్ బదిలీ చేసుకునేందుకు అనుమితిస్తుందని చెప్పాయి. ఆన్లైన్ బదిలీ అందుబాటులోకి వస్తే ఏటా 13 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది.


