రిమాండ్‌ ఖైదీ సొమ్ము మాయం! | Rs 6 Lakhs Transferred Online from Phones Seized During Arrest: Karimnagar | Sakshi
Sakshi News home page

రిమాండ్‌ ఖైదీ సొమ్ము మాయం!

May 1 2026 1:00 AM | Updated on May 1 2026 1:00 AM

Rs 6 Lakhs Transferred Online from Phones Seized During Arrest: Karimnagar

అరెస్టు వేళ సీజ్‌ చేసిన ఫోన్ల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రూ. 6 లక్షలు బదిలీ 

బెయిల్‌పై విడుదలయ్యాక విషయం తెలిసి అవాక్కైన నిందితుడు 

డీజీపీ సహా కరీంనగర్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: పోలీసు రిమాండ్‌లో ఉన్న ఓ నిందితుడి డబ్బు దొంగలు కొట్టేశారు. అది కూడా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా డబ్బును వారి ఖాతాలకు మళ్లించుకున్నారు. బెయిల్‌పై విడుదలైన నిందితుడు అసలు విషయం తెలిసి నెత్తీనోరు బాదుకుంటున్నాడు. కరీంనగర్‌ పట్టణానికి చెందిన మహేందర్‌పై ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో ఓ కేసు నమోదు కావడంతో అక్కడి పోలీసులు 2025 డిసెంబర్‌ 4న అతన్ని అరెస్టు చేశారు. ఆ సమయంలో నిందితుడి కారు, సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.

అనంతరం మార్చి 26న బెయిల్‌పై విడుదలైన మహేందర్‌ తన సెల్‌ఫోన్లు తీసుకొని బ్యాంకు బ్యాలెన్సు చూసుకొని అవాక్కయ్యాడు. జైలుకు వెళ్లే సమయంలో ఖాతాలో రూ. 6.64 లక్షలు ఉండగా అందులోంచి ఏకంగా రూ. 6 లక్షలకుపైగా నగదు మాయమైంది. దీంతో అతను వెంటనే బ్యాంక్‌ అధికారులను సంప్రదించగా సెల్‌ఫోన్ల నుంచే లావాదేవీలు జరిగిగాయని, ఫిబ్రవరి 19, మార్చి 17 తేదీల్లో రూ. 6 లక్షలకుపైగా నగదు బదిలీ అయిందని వివరించారు. మరోవైపు ఇంట్లోని 157 గ్రాముల బంగారం, వెండి పాత్రలు, హార్డ్‌ డిస్కులు, చెక్‌ బుక్కులు, బిల్లులు కూడా మాయమైనట్లు బాధితుడు గుర్తించాడు.

దీనిపై కరీంనగర్‌ సైబర్‌ క్రైం పోలీసులతోపాటు డీజీపీకి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొన్ని ఖాతాలను స్తంభింపజేసి రూ. 50 వేలు ట్రాన్స్‌ఫర్‌ కాకుండా ఆపగలిగారు. మిగిలిన ఖాతాలు ఎవరివన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే అరెస్టు సమయంలో పోలీసులకు తాను సెల్‌ఫోన్ల పాస్‌వర్డ్‌లు చెప్పానని.. పోలీసులు సీజ్‌ చేసిన సెల్‌ఫోన్ల నుంచి డబ్బు మాయం కావడం నమ్మశక్యంగా లేదంటూ మహేందర్‌ ‘సాక్షి’తో వాపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement