Old bowenpally
-
సైకిల్... స్పీడ్‌గన్
హైదరాబాద్‌లోని ఓల్డ్ బోయినపల్లి వాసి జి.వి.శ్రీనివాస్‌రెడ్డి ఐదేళ్లలో 52 వేల కిలోమీటర్లు సైకిల్ రైడ్ చేసి, 3 సూపర్ రాండోన్నూర్ టైటిల్స్ సాధించారు. 200 కిలోమీటర్లను కేవలం ఆరున్నర గంటలలో పూర్తి చేసి, ‘స్పీడ్‌గన్’ అని అభినందనలు అందుకున్నారు. సైకిల్ రైడింగ్ ద్వారా జీవనశైలిలో వచ్చిన మార్పులు, క్రమశిక్షణతో చేసిన సాధన, మెరుగైన జీవనవిధానానికి ఎలా చేరువ చేస్తుందో తన అనుభవాల ద్వారా పంచుకున్నారు..‘‘2021 నుండి 2025 వరకు సైక్లింగ్ ప్రయాణం నాలో ఒక గొప్ప మార్పును తీసుకువచ్చింది. కోవిడ్ సమయంలో హాబీగా ప్రారంభమై, నెమ్మదిగా నా జీవనశైలిని మార్చింది. ప్రతిరోజూ మరికొన్ని అదనపు కిలోమీటర్లు రైడ్ చేయాలనే దృఢ సంకల్పాన్ని నాలో పెంచింది. వేళకు పని, నిద్ర, పోషకాహార విషయంలో క్రమశిక్షణను అలవాటు చేసింది. లక్ష్య సాధన పట్ల నిబద్ధతతో ఉండేలా చేయడమేకాదు బాడీని, మైండ్‌ను ఫిట్‌గా మార్చింది.స్పీడ్గన్గా పిలుపు...యూరోప్‌లో ఉండగా ఈ సైకిల్ రైడ్ నాకు పరిచయం అయ్యింది. నేనున్న సిటీలో అక్కడ ఎవరిని చూసినా సైకిల్‌మీదే ప్రయాణిస్తుంటారు. అక్కడ ఉన్నన్ని రోజులు మార్కెట్‌కి అయినా, ఆఫీస్‌కి అయినా సైకిల్‌పైనే వెళ్లేవాడిని. కోవిడ్‌కు ముందు హైదరాబాద్‌కి వచ్చేశాను. ఇక్కడి ట్రాఫిక్ చూశాక సైక్లింగ్ రూట్స్ సపరేట్గా లేకపోవడంతో ఇబ్బందిగా అనిపించింది. దీంతో జిమ్‌కి వెళ్లేవాడిని. కోవిడ్ సమయంలో జిమ్‌లు మూతపడ్డాయి. అప్పుడు వాహనాలేవీ రోడ్లమీదకు వచ్చే వీలు లేదు. కానీ, సైక్లింగ్ చేస్తున్నవారిని పోలీసులు ఆపడం లేదు. దీంతో మళ్లీ నా సైకిల్ రైడ్ వైపు వచ్చేశాను. ప్రతిరోజూ 50–60 కిలోమీటర్లు సైకిల్‌పై జర్నీ చేసేవాడిని. ఆ సమయంలోనే సైక్లింగ్ క్లబ్‌లలో చేరాను. అలా, ముందు కాలనీల్లో మొదలైన ఈ రైడ్ తర్వాత రైడర్స్ క్లబ్లో చేరే వరకు వెళ్లింది. ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసే సూపర్ రాండోన్నూర్ టైటిల్ వరుసగా మూడుసార్లు గెలుచుకున్నాను. దీంతో మరింత ఉత్సాహం పెరిగింది. ఈ రైడ్ నా శారీరక సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా, మానసిక దృఢత్వాన్ని కూడా మెరుగుపరచింది. 200 కి.మీ దూరాన్ని కేవలం 6 గంటల 24 నిమిషాల్లో పూర్తి చేశాను. అంటే సగటున 31.2 కిలోమీటర్ల వేగంతో రైడ్ పూర్తి చేశాను. రైడ్‌లో నా వేగం చూసి స్నేహితులు, సహచరులు నన్ను ‘స్పీడ్ గన్’ అని పిలిచేవారు. రైడ్‌లో ఎక్కువ శాతం ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రాంతాలను ఎంచుకునేవాడిని. వాటిలో తెలంగాణలోని ఆదిలాబాద్ ఒకటి. ఆదిలాబాద్ చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో రాత్రుల్లోనూ రైడ్ కొనసాగించాను. ఇందుకు నాతోటి రైడ్ మిత్రులు కూడా తమ సహకారాన్ని అందించారు. ప్రకృతికి దగ్గరగా ఉన్న భావన ఆ సమయంలోనే ఎక్కువ పొందాను. అందమైన జలపాతాలు, లోయలు, శిఖరాలు, సన్నని రోడ్డు మార్గాలు, హైవేలు.. అన్నీ సైకిల్ రైడ్ ద్వారానే వీక్షించాను. విదేశాలలో పొల్యూషన్ ఫ్రీ, పర్యావరణ పరిరక్షణకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మన దేశంలో పర్యావరణ పరిరక్షణకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కాలుష్య నివారణకు సైకిల్ రైడ్స్ చాలా హెల్ప్ అవుతాయి. శరీరం ఫిట్‌గా ఉండటానికీ ఇది మంచి అలవాటు. ఈ విషయాన్ని నలుగురికి తెలియజెప్పాలనే ఈ రైడ్‌లో పాల్గొంటుంటాను. ఇప్పటికి 52 వేల కిలోమీటర్లకు పైగా రీచ్ అయ్యాను. మరిన్ని థీమ్ బేస్డ్ రైడ్స్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలనుకుంటున్నాను. సహ జీవిత భాగస్వామ్యం...ఈ సైకిల్ రైడ్ అభిరుచిలో నన్ను నేను మలుచుకోవడానికి నా భార్య ప్రతిమ చాలా సహకరించింది. ‘రైడ్‌కు వెళుతున్నాను’ అని చెప్పగానే నాకు ఏమేం అవసరమో అన్నీ సరమకూర్చేది. తెల్లవారుజామున లేచి, నేను తీసుకోవాల్సిన ఫుడ్‌తో పాటు, అన్ని ఏర్పాట్లు చూసుకునేది. తిరిగి నేను సురక్షితంగా వచ్చేవరకు ఎదురు చూసేది. ముఖ్యంగా రాత్రి రైడ్స్ సమయంలో హైవేలు, అడవులు, తెలియని మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ నెట్వర్క్ కూడా అందుబాటులో ఉండేది కాదు. నా అభిరుచికి ఆమెను టెన్షన్ పెట్టక తప్పేది కాదు. ఆమె అండ లేకపోతే నా ఈ ప్రయాణం విజయవంతం అయ్యేది కాదు. నా ఈ విజయంలో నా స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇది కేవలం రోడ్డు మార్గంలో చేసే సైకిల్ ప్రయాణం కాదు, నా ఆరోగ్యాన్ని, సమర్థతను, పట్టుదలను పెంచిన జర్నీ కూడా’’ అని వివరించారు ఈ రైడర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
75 ఏళ్ల వయస్సులోనూ ఫిట్‌గా..
ఆయనకు సరిగ్గా 75 ఏళ్లు.. అయితేనేం..? నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతో కష్టపడితేగానీ నేటితరం యువత సాధించలేని సిక్స్‌ప్యాక్‌ను నలభై ఏళ్ల క్రితమే తన సొంతం చేసుకున్నాడు. వృద్ధాప్యంలోనూ సిక్స్‌ప్యాక్‌ను కాపాడుకుంటూ నేటితరం యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే సికింద్రాబాద్ ఓల్డ్‌బోయిన్‌పల్లికి చెందిన విజయ్‌కుమార్. అనేక కారణాలతో నేటి తరం యువత తమ సిక్స్‌ప్యాక్ కలను సాధించలేకపోతున్నారు.సిక్స్‌ప్యాక్ కోసం గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు తప్పనిసరి. ఎన్ని కసరత్తులు చేసినా సిక్స్‌ప్యాక్ సాధ్యం అవుతుందన్న గ్యారంటీ లేదు. ఇటువంటి కఠోర వ్యాయామాలను సునాయసంగా చేస్తూ తన సిక్స్‌ప్యాక్‌ను నేటికీ పదిలపరుచుకుంటున్నారు. వయసు శరీరానికే తప్ప మనసుకు కాదు అంటున్న విజయ్‌కుమార్ ఈ వయసులోనూ హుషారుగా వ్యాయామాలు చేస్తున్నారు.. ర్యాంప్‌వాక్‌లు సైతం చేయవచ్చని నిరూపిస్తున్నారు. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లడం, వ్యాయామంతోపాటు జాగింగ్, సైక్లింగ్ చేస్తూ ఎందరో యువకులు, విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ కండలవీరుడు విజయ్‌కుమార్‌పై సాక్షి కథనం.. సునాయాసంగా కఠోర ఆసనాలు 28 ఏళ్ల వయస్సు నుంచే వ్యాయామాలుఓల్డ్బోయిన్పల్లికి చెందిన ఎం.విజయ్‌కుమార్ నాలుగు దశాబ్దాలుగా క్రమం తప్పకుడా వ్యాయామం చేస్తూ అనారోగ్యాన్ని దరిచేరకుండా జాగ్రత్తపడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి సుచిత్ర వరకూ, ప్యారడైజ్ నుంచి బొల్లారం వరకూ, మారేడుపల్లి నుంచి బాలానగర్ వరకూ ఉన్న జిమ్ నిర్వాహకులకు, అందులో శిక్షణ తీసుకుంటున్న యువతకు సుపరిచితులు. సికింద్రాబాద్‌లో ఇంజినీరింగ్ వ్యాపారంలో స్థిపరడిన విజయ్‌కుమార్ తన 28 ఏళ్ల వయసు నుంచే వ్యాయాయం మొదలుపెట్టాడు. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ వ్యాపారాన్ని కొనసాగించిన ఆయన ప్రస్తుతం వ్యాయామంతోపాటు యువతకు స్ఫూర్తిగా నిలిచే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీనియర్ సిటిజన్స్లోనూ...కొద్ది సంవత్సరాలుగా స్నేహ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధిగా కొనసాగుతున్న విజయ్‌కుమార్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వృద్ధులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. డీజే పాటలకు డ్యాన్స్ చేయడం, స్వతహాగా పాటలు పాడడం వంటి కార్యక్రమాలతో అటు వృద్ధుల్లో ఇటు యువకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. జిమ్ వర్కవుట్తోపాటు జాగింగ్, సైక్లింగ్ పోటీల్లోనూ పలు మెడల్స్‌ను అందుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన బాడీబిల్డింగ్, సైక్లింగ్ పోటీల్లో నేటికీ పాల్గొంటుంటారు.అందరూ క్రీడాకారులే... వ్యాయామం, క్రీడలు విజయ్‌కుమార్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు అలవాటయ్యాయి. విజయ్‌కుమార్, భార్య పిల్లలు కూడా ఉదయం నిద్రలేచింది మొదలు వర్కవుట్స్ చేయడం వారి దినచర్య. భార్య శారద కూడా భర్తకు తోడుగా వాకింగ్, జాగింగ్‌లకు వెళతారు. సీనియర్ సిటిజన్స్ క్రీడల్లో శారద పలు పతకాలు గెలుచుకుంది. కూతురు వాణి వాలీబాల్ జాతీయ క్రీడాకారిణిగా అవార్డులు అందుకుంది. కుమారులు పవన్, నవీన్ ఇరువురూ జాతీయ, అంతర్జాతీయ స్విమ్మర్లు. పెద్దకుమారుడు ఆ్రస్టేలియాలో స్థిరపడగా చిన్నకుమారుడు స్విమ్మింగ్ కోచ్‌గా ఉన్నాడు.ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ...సికింద్రాబాద్ ప్రాంతంలో విజయ్‌కుమార్ వర్కవుట్ చేయని జిమ్, సైక్లింగ్ చేయని రోడ్డు, జాగింగ్ చేయని మైదానం లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన వర్కవుట్ చేయడంతో పాటు అక్కడి యువకులకు వర్కవుట్‌లో మెళకువలు నేర్పుతుంటారు. ఇంటి ఆహారం అందులోనూ శాకాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం, దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవడం పట్ల అవగాహన కలిగిస్తున్నారు.శేషజీవితం సమాజానికి అంకితం నిరంతర వ్యాయామంతో వృద్ధాప్యంలోనూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. ప్రస్తుతం కుటుంబ, వ్యాపార బాధ్యతలు ఏవీ నాపై లేవు. శేష జీవితం సమాజాభివృద్ధికి అంకితం చేయాలన్నదే లక్ష్యం. సీనియర్ సిటిజన్లలో నిరాశ, నిస్పృహలను దూరం చేసేందుకు చేతనైన సహాయం చేస్తున్నా. – మందుల విజయ్‌కుమార్ -
సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో విషాదం
-
గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న కరాటపు సురేష్ (38) గత ఏడేళ్లుగా ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ఆర్ఆర్ నగర్లో నివాసం ఉంటున్నాడు. దసరా పండుగ నేపథ్యంలో భార్య, కుమారుడు కాకినాడ వెళ్లడంతో ఇంట్లో అతడు ఒకడే ఉన్నాడు. మంగళవారం రాత్రి సురేష్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన ఇంటి యజమాని... సురేష్ కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అరకిలో బంగారు ఆభరణాలు చోరీ
-
అరకిలో బంగారు ఆభరణాలు చోరీ
హైదరాబాద్ : పాత బోయినపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. రాజేష్ కుమార్ అనే నగల వ్యాపారి ఇంటి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి సుమారు అర కిలో బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఓ శుభకార్యం నిమిత్తం రాజేష్ కుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లినపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోని వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఇంట్లో దాచిన నగలు మాయమయ్యాయి. రాజేష్‌కు ఓ జ్యువెలరీ షాపు ఉంది. ప్రతీ రోజూ నగలను ఇంటిలో దాచి వెళ్తుండటం గమనించి ఈ పనికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనాస్థలానికి డాగ్‌స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్ బృందాలను తెప్పించి ఆధారాలు సేకరిస్తోన్నారు. -
పాటతోనే కిక్కు
పేరు: ఆనెం సాయిరాం చదువు: బీఎస్సీ, ఎంబీఏ వదులుకున్న ఉద్యోగం: ‘ధనుష్ ఇన్ఫోటెక్’ సేల్స్ విభాగం జాతీయ అధిపతి జీతభత్యాలు: నెలకు దాదాపు లక్ష రూపాయల నికర వేతనం. ఇతర సౌకర్యాలు, ప్రోత్సాహకాలు ఎందుకు వదిలేశాడంటే..: జేబు శాటిస్ఫాక్షన్ ఉన్నా, జాబులో కిక్కు లేదు. పైగా అభిరుచులకు ఆటంకంగా మారింది. అందుకే మూడేళ్ల కిందటే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశాడు. అభిరుచులు: సంగీతం, సేవా కార్యక్రమాలు ఉద్యోగం వదిలేశాక: తెలుగులో ‘భజనామృతం’, ‘హరోం హర’ భక్తి ఆల్బంల విడుదల. హిందీలో ‘హరిఓం తత్సత్’ విడుదలకు సిద్ధంగా ఉంది. అభిరుచి మేరకు ఒకవైపు స్వరార్చనలో, మరోవైపు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవడం కోసం ఆకర్షణీయమైన కెరీర్‌ను సైతం తృణప్రాయంగా విడిచిపెట్టేసిన ఆనెం సాయిరాం పుట్టిపెరిగింది ఒడిశాలోని బరంపురంలో. చదువు సంధ్యలన్నీ అక్కడే సాగాయి. స్కూల్ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో విరివిగా పాడేవాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగపర్వంలో చాలా చోట్ల తిరిగాడు. ఉద్యోగ బాధ్యతల కారణంగా కొంతకాలం సంగీతానికి దూరమయ్యాడు. బెంగళూరులో పనిచేస్తుండగా పరిచయమైన ప్రముఖ గాయకుడు టీవీ హరిహరన్ ప్రోత్సాహంతో స్వరసాధనను మళ్లీ ప్రారంభించాడు. ఉద్యోగంలో భాగంగానే 2003లో హైదరాబాద్ చేరుకున్నాడు. అయినా, పూర్తిగా సంగీతానికి సమయం కేటాయించలేకపోతున్నాననే అసంతప్తి ఉండేది. అలాగే, సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని ఉన్నా, ఉద్యోగ బాధ్యతలతో సమయం చిక్కేది కాదు. పాత బోయిన్‌పల్లిలో స్థిరపడ్డ సాయిరాం... పూర్తి సమయం సంగీతానికి, సేవా కార్యక్రమాలకే అంకితం చేయాలనుకున్నాడు. అంతే... ఉద్యోగాన్ని వదిలేశాడు. సాయిరాం భజన మండలిని నెలకొల్పి, మనసుకు నచ్చిన విధంగా సంగీతంలో మునిగి తేలుతున్నాడు. భజన కార్యక్రమాలు, కచేరీలు, ఆల్బంల ద్వారా వచ్చిన ఆదాయంతో అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. భార్య యెర్ని (ఈశ్వరి) కూడా గాయని కావడంతో ఆమెతో పాటు మరికొందరు కొత్త గాయకులను కలుపుకొని ఇప్పటికే రెండు ఆల్బంలు విడుదల చేసి స్వరకల్పనలో సత్తా నిరూపించుకున్నాడు. తాజాగా హిందీలో ‘హరిఓం తత్సత్’ పేరిట మూడో ఆల్బం రూపొందిస్తున్నాడు. బహు భాషల్లో ఆల్బంలు రూపొందించడంతో పాటు కొత్త కళాకారులను ప్రోత్సహించడమే తన లక్ష్యమని సాయిరాం చెబుతున్నాడు. - పన్యాల జగన్నాథదాసు


