breaking news
North Waziristan
-
పాక్‌లో ఆత్మహుతి దాడి: ఇద్దరు భద్రత సిబ్బంది మృతి
ఉత్తర వజీరిస్థాన్‌లోని బన్ను మీర్ అలీ రహదారిలో ష్వా చెక్‌పోస్ట్ వద్ద ఈ రోజు ఉదయం ఆత్మాహుతి జరిపిన దాడిలో ఇద్దరు భద్రత సిబ్బంది మరణించారని స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది. ఆ ఘటనలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని, పోలీసులు వెంటనే స్పందించి స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి తన వాహనాన్ని చెక్‌పోస్ట్ వద్ద పేల్చేయడంతో ఆ ఘటన చోటు చేసుకుందని చెప్పింది. ఆ ఘటనకు తామే బాధ్యులమని అన్సరుల్ ముజాహిదీన్ ప్రకటించిందని వివరించింది. అయితే భద్రత సిబ్బంది స్థానికంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిపింది. పాకిస్థాన్‌లోని తాలిబాన్‌కు గట్టి పట్టున్న ప్రాంతం వజీరిస్థాన్. అలాగే ఖైబర్ పక్త్వా ప్రావెన్స్లోని స్వాబి జిల్లాలో భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మరణించారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. స్వాబిలోని నతియన్ పోలీస్ చెక్‌పోస్ట్‌పై దాదాపు డజన్ మంది తీవ్రవాదులు ముకుమ్మడి దాడి చేశారు. దాంతో వెంటనే అప్రమత్తమైన భద్రత సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. దాంతో నలుగురు వ్యక్తులు మరణించారు. -
ఎన్కౌంటర్లో తొమ్మిది మంది తీవ్రవాదుల హతం
పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతమైన ఉత్తర వజీరిస్థాన్‌లో నిన్న రాత్రి భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది తీవ్రవాదులు మరణించారని స్థానిక మీడియా మంగళవారం ఇక్కడ వెల్లడించింది. ఆర్మీ చెక్ పోస్ట్‌పై తీవ్రవాదులు ఆకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఆర్మీ సిబ్బంది వెంటనే తెరుకుని కాల్పులు జరిపిందని వివరించింది. అయితే ఆ ఘటనలో ఆర్మీ సిబ్బందికి ఎటువంటి గాయాలైనట్లు సమాచారం అందలేదని పేర్కొంది. అలాగే దక్షిణ వజీరిస్థాన్‌లో ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న కాన్వాయిని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు మందు పాతర పేల్చారు. ఆ దుర్ఘటనలో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రెండు ఘటనలకు తామే బాధ్యులమని ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని స్థానిక మీడియా పేర్కొంది.