breaking news
The National Party
-
పార్టీ పేరు మారుద్దామా!
తెలుగుదేశం పేరు మార్పుపై చర్చ..నిర్ణయం వాయిదా విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేతలను టార్గెట్‌గా విచారణలు విజయవాడ బ్యూరో: తెలుగుదేశం పార్టీ పేరు మార్చడంపై ఆ పార్టీ నేతల సమావేశం తర్జనభర్జన పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. పేరు మార్చినంత మాత్రాన జాతీయపార్టీగా గుర్తింపు రాదన్న విషయం గమనించి తాత్కాలికంగా నిర్ణయాన్ని వాయిదా వేశారు.జాతీయ పార్టీగా గుర్తింపు ఇప్పట్లో సాధ్యం కాదని, 2019 ఎన్నికల నాటికి విస్తరించి జాతీయ పార్టీగా గుర్తింపు వచ్చినప్పటికీ పేరు మార్చాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఏపీ, తెలంగాణలతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఒడి శా, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని బాబు సూచించారు. బీఎస్పీ లాంటి పార్టీ జాతీయ పార్టీగా చలామణి అవుతున్నా ఒకటి, రెండు రాష్ట్రాలకే పరిమితమైందని చెబుతూ పేరు మార్చాల్సిన అవసరం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. టీడీపీ జాతీయ, తెలంగాణ, ఏపీ రాష్ట్ర కమిటీలను అసెంబ్లీ సమావేశాల తర్వాత నియమించాలని నిర్ణయించారు. సమావేశంలో కళా వెంకట్రావు మాట్లాడుతూ లోకేశ్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించాల్సిందిగా కోరారు. విమర్శలు చేసే వారిని లక్ష్యంగా టీడీపీతోపాటు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న వారిని టార్గెట్ చేయాలని సమావేశం నిర్ణయించినట్టు పార్టీ నేతలు తెలిపారు. ప్రభుత్వంపైనా, చంద్రబాబుపైన విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను వదిలిపెట్టొద్దని ఎమ్మెల్యేలు చెప్పగా అవసరాన్ని బట్టి విచారణలు చేయిద్దామని చంద్రబాబు సమాధానమిచ్చారు.సినీనటుడు పవన్ కల్యాణ్‌పై దూకుడుగా వెళ్లవద్దని సహచర నేతలకు చంద్రబాబు హితబోధ చేశారు.తాను పవన్‌తో మాట్లాడతానని చెప్పారు. టార్గెట్ విపక్షం శాసనసభ వర్షాకాల సమావేశాల్లో విపక్ష వైఎస్సార్సీపీ, ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పని చేయాల్సిందిగా చంద్రబాబు సూచించారు. రాజధానికి భూసేకరణ, ఓటుకు కోట్లు కేసు, ప్రత్యేక హోదా, నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి, కడప నారాయణ విద్యా సంస్థల్లో ఇద్దరు బాలికల ఆత్మహత్య అంశాలపై ప్రతిపక్షం నిలదీసే అవకాశం ఉన్నందున జగన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగాలని చెప్పారు. ఈ నెల 25న ప్రధాని నరేంద్రమోదీని కలిసి ప్రత్యేకహోదా, రాష్ట్రానికి నిధుల విడుదల గురించి కోరనున్నామని చంద్రబాబు నేతలకు చెప్పారు. -
టీడీపీని జాతీయ పార్టీగా చేద్దాం
పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయం హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చే విషయంలో అవసరమైన ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని పరిశీలించడానికి సీనియర్ నేతలతో కమిటీ వేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయించింది. ఈ కమిటీలో యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, రావుల చంద్రశేఖరరెడ్డిలతో పాటు మరికొందరికి స్థానం దక్కనుంది. వచ్చే మహానాడులోగా ఈ కమిటీ విధివిధానాలను రూపొందించి పొలిట్‌బ్యూరో ముందు ఉం చుతుంది. వచ్చే ఏడాది జూన్ 27 నుంచి 29 వర కూ జరిగే మహానాడులోగా రెండు రాష్ట్రాల్లో స మావేశాలు నిర్వహించి కమిటీలను వేస్తారు. త రువాత పార్టీ జాతీయ కమిటీని నియమిస్తారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ గైర్హాజరు.. శనివారం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పొలిట్‌బ్యూరో సమావేశం ఎన్టీఆర్ భవన్లో జరిగింది. పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమావేశానికి రాలేదు.. నందమూరి హరి కృష్ణ హాజరయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి చంద్రబాబు చేసిన కృషిని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సమైక్య, తెలంగాణ ఉద్యమాల సమయంలో నేతలు ఆందోళన చెందటంతో పాటు తనను కూడా ఆందోళనలోకి నెట్టారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా పార్టీ అధికారంలోకి రావాలన్నారు. పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు వేసిన కమిటీనే జాతీయ కార్యవర్గంగా మార్చారు.