
టీడీపీని జాతీయ పార్టీగా చేద్దాం
తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చే విషయంలో అవసరమైన ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని
పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చే విషయంలో అవసరమైన ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని పరిశీలించడానికి సీనియర్ నేతలతో కమిటీ వేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయించింది. ఈ కమిటీలో యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, రావుల చంద్రశేఖరరెడ్డిలతో పాటు మరికొందరికి స్థానం దక్కనుంది. వచ్చే మహానాడులోగా ఈ కమిటీ విధివిధానాలను రూపొందించి పొలిట్‌బ్యూరో ముందు ఉం చుతుంది. వచ్చే ఏడాది జూన్ 27 నుంచి 29 వర కూ జరిగే మహానాడులోగా రెండు రాష్ట్రాల్లో స మావేశాలు నిర్వహించి కమిటీలను వేస్తారు. త రువాత పార్టీ జాతీయ కమిటీని నియమిస్తారు.
తలసాని శ్రీనివాస్‌యాదవ్ గైర్హాజరు..
శనివారం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పొలిట్‌బ్యూరో సమావేశం ఎన్‌టీఆర్ భవన్‌లో జరిగింది. పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమావేశానికి రాలేదు.. నందమూరి హరి కృష్ణ హాజరయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి చంద్రబాబు చేసిన కృషిని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సమైక్య, తెలంగాణ ఉద్యమాల సమయంలో నేతలు ఆందోళన చెందటంతో పాటు తనను కూడా ఆందోళనలోకి నెట్టారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా పార్టీ అధికారంలోకి రావాలన్నారు. పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు వేసిన కమిటీనే జాతీయ కార్యవర్గంగా మార్చారు.