ఢిల్లీలో కూలిన బహుళ అంతస్తుల భవనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని శక్తి విహార్ ప్రాంతంలో శనివారం బహుళ అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా, 11 మంది క్షతగాత్రులయ్యారు. ముస్తఫాబాద్లోని 20 ఏళ్లనాటి నాలుగంతస్తుల భవనం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కూలి, శిథిలాల దిబ్బగా మారిపోయింది. శిథిలాల కింద పడి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆ భవన యజమాని తెహ్సీన్, ఆయన కుమారుడు, కోడలు, వారి ఆరేళ్లలోపు ముగ్గురు పిల్లలు, తెహ్సీన్ మరో కోడలు ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కొందరిని డిశ్చార్జి చేశారు. వీరిలో తెహ్సీన్ మరో కుమారుడు చాంద్ కూడా ఉన్నారు. తెహ్సీన్ భార్య సహా 9 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన సమయంలో ఆ భవనంలో 22 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. ప్రమాదకరమైన ఘటన ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలను ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ మొహ్సెన్ షాహిదీ పర్యవేక్షించారు. భవనాలు ఇలా ఆకస్మికంగా కూలడాన్ని సాంకేతికంగా తాము ‘పాన్కేక్ కొల్లాప్స్’గా పిలుస్తుంటామన్నారు. ‘ఇది ప్రమాదకరమైంది. ఇలాంటి సమయాల్లో బాధితులు ప్రాణాలతో బయటపడేందుకు అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ, సహాయక చర్యలు చురుగ్గా కొనసాగిస్తున్నాం’అని చెప్పారు. ఇరుకైన ప్రాంతం కావడంతో శిథిలాలను జాగ్రత్తగా తొలగించాల్సి వచ్చిందని వివరించారు. బాధితులందరినీ ముందుగా గురు తేజ్ బహదూర్ ఆస్పత్రికి తరలించామన్నారు. నిర్మాణ పనులే కారణమా? గ్రౌండ్ ఫ్లోర్లో కొత్తగా మూడు దుకాణాల నిర్మాణం కోసం చేపట్టిన పనులే ప్రమాదానికి కారణం కావచ్చని పోలీసులు తెలిపారు. కొన్నేళ్లుగా మురుగు నీరు భవనం గోడల్లోకి చొరబడుతుండటం వల్ల పగుళ్లతో బలహీనపడి ప్రమాదానికి దారి తీసినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిసరాల్లో భూమి కంపించిందన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రమాదకరమైన స్థితిలో ఇటువంటి నాలుగైదు భవనాలున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. భవనం కుప్పకూలి పలువురు మృతి చెందడంపై సీఎం రేఖా గుప్తా విచారం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.