
గాజాలో 12 అంతస్తుల భవనంపై బాంబులు
గాజా సిటీ: గాజా నగరంలోని బహుళ అంతస్తుల భవనాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెరతీసింది. హమాస్‌కు పట్టున్న ఈ నగరాన్ని స్వాధీనం చేసుకునే లక్ష్యంతో ఇప్పటికే వేలాదిగా ఆర్మీని రంగంలోకి దించడం తెల్సిందే. శుక్రవారం రిమాల్ ప్రాంతంలోని 12 అంతస్తుల ముస్తాహా టవర్‌పై ఫైటర్ జెట్లు రెండు సార్లు దాడి చేశాయి. దీంతో, పెను విస్ఫోటనంతో భవనం నేలమ ట్టమైంది. చుట్టూ శిథిలాలు, దుమ్మూధూళితో నిండిపోయింది.
భవనం చుట్టుపక్కల టెంట్లలో ఉన్న వారంతా ఉన్న ఒక్క నీడా కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. హమాస్‌తో జరుగుతున్న పోరులో ఇప్పటికే పలుమార్లు బాంబులు పడటంతో టవర్ పైభాగం దెబ్బతింది. నేరుగా దాడికి దిగడం ఇదే మొదటిసారి. ముందస్తు హెచ్చరికలతో బయటకు పరుగులు తీస్తూ వస్తున్న జనాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ అడ్డుకుందని ప్రత్యక్ష సాకు‡్ష్యలు పేర్కొన్నారు.
దాడితో భవనంలోని వారెందరు ప్రాణాలు కోల్పోయిందీ తెలియరాలేదు. అంతకుముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్.. ‘గాజాలో నరకానికి తలుపులు తెరుచుకున్నాయి. ఇక ఇవి తెరిచే ఉంటాయి. ఇది ఆరంభం మాత్రమే’అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ తర్వాత కొద్దిసేపటికే టవర్‌పై దాడి చోటుచేసుకుంది. ఈ టవర్‌ను హమాస్ నిఘాకు వాడుకుంటోదని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
గాజాపై పూర్తి నియంత్రణకు ముందుకు కదులుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ చుట్టుపక్కలున్న ఇలాంటి బహుళ అంతస్తుల భవనాలను లక్ష్యంగా చేసుకోవడం పాలస్తీనియన్లను మరింత భయభ్రాంతులకు గురి చేయడమేనని అంటున్నారు.
గాజా నగరాన్ని యుద్ధ జోన్‌గా ప్రకటించిన ఇజ్రాయెల్ ఆర్మీ..ఇందులోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా పరిగణిస్తోంది. హమాస్‌కు ప్రాబల్యముండే ఈ ప్రాంతాలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇలా ఉండగా, శుక్రవారం గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఏడుగురు చిన్నారులు సహా 44 మంది చనిపోయినట్లు అల్ జజీరా పేర్కొంది.