విమానాశ్రయ భూసేకరణకు గ్రీన్‌సిగ్నల్
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు భూసేకరణ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ సోమవారం జీవో విడుదల చేసింది. ప్రభుత్వ కార్యదర్శి ఎం.టీ.కృష్ణబాబు జీఓఆర్టీ నంబర్ 233 (తేదీ 4-11-2013) ప్రకారం భూసేకరణకు ఆదేశాలిచ్చారు.
జీఓ విడుదలైన 40 రోజులలోగా కేసరపల్లిలో ఆర్ఎస్ నంబర్ 224/5లో 121.97 ఎకరాల భూమిని సేకరించాలని పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు అవసరమైన రూ. 280 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో మంజూరు చేసింది. మొత్తం 491.92 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. మొదటిదశలో కేసరపల్లిలో భూసేకరణ చేయాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది.
భూసేకరణ అయ్యాక మౌలిక వసతుల కల్పనకు ఎయిర్పోర్ట్ అథారిటీ సన్నాహాలు చేస్తోంది. ఎయిర్‌పోర్టులో ఆధునిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనంలో 50 మంది కూర్చునే వీలుంది. ఈ భవనాన్ని 300 మంది కూర్చోవటానికి వీలుగా విస్తరిస్తారు. రిఫ్రెషర్ సెంటర్ ఏర్పాటు, రెస్టారెంట్, పుస్తక విక్రయ కేంద్రాలు, టిక్కెట్ విక్రయ కౌంటర్లను పెంచుతారు.
పెరుగనున్న సర్వీసులు ...
గన్నవరం విమానాశ్రయంలో సర్వీసుల సంఖ్య కూడా పెరగనుంది. ప్రస్తుతం గన్నవరం, న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాలకు రెగ్యులర్‌గా సర్వీసులు నడుస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం కొత్తగా ఎయిర్ కోస్తా కూడా సర్వీసులను ప్రారంభించింది. రానున్న రెండు నెలల్లో మరికొన్ని విమాన సంస్థలు కొత్తగా తమ సర్వీసులను నడిపేందుకు సర్వే జరుపుతున్నాయి.