పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న బంగ్లా క్రికెటర్!
బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెటర్, ఆఫ్-స్పిన్నర్ మొహమ్మద్ నయీమ్ హసన్ పోలీసుల చేతిలో చావుదెబ్బలు తినడం సంచలనం కలిగించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తాను క్రికెటర్ అని చెప్పినప్పటికీ పోలీసులు వినకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని బంగ్లా క్రికెటర్ వాపోయాడు. ఈ విషయం తెలుసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నయీమ్ హసన్‌పై దాడిని ఖండిస్తూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పోలీసు కమిషనర్ క్షమాపణ..కాగా క్రికెటర్ నయీమ్ హసన్‌పై పోలీసుల దాడి విషయాన్ని తెలుసుకున్న చట్టోగ్రామ్ మెట్రోపాలిటన్ పోలీస్ (సీఎంపీ) కమిషనర్ హసన్ మహమ్మద్ షౌకత్ అతడి నివాసానికి వెళ్లాడు. నయీమ్ హసన్‌ను వేధించారనే ఆరోపణలపై విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఘటనపై నయీమ్ హసన్‌కు క్షమాపణ చెప్పారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..బంగ్లాదేశ్‌లో జరిగే ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ముగించుకుని నయీమ్ హసన్ విమానంలో ఢాకా నుంచి చిట్టగాంగ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో ఇంటికి వెళ్తుండగా, శుక్రవారం రాత్రి సుమారు 11:25 గంటల సమయంలో లంకన్ బజార్ ఫ్లైఓవర్ కింద పోలీసులు ఆయన ప్రయాణిస్తున్న ఆటోను ఆపారు. ఆ తర్వాత నయీమ్ హసన్‌ను ఆటో నుంచి బలవంతంగా దించి పోలీసు వాహనం ఎక్కించారు. తాను క్రికెటర్‌ను అని చెప్పినప్పటికీ మాట వినిపించుకోకుండా తనపై దౌర్జన్యంగా దాడి చేశారని నయీమ్ హసన్ తెలిపాడు. అతడు మాట్లాడుతూ..‘వారు డ్రైవర్ నుంచి పత్రాలు తీసుకున్నారు. అవసరమైతే నా బ్యాగ్ కూడా తనిఖీ చేసుకోమని నేను వారితో చెప్పాను. కానీ వారు నా గొంతు పట్టుకుని.. 'కారు ఎక్కు' అంటూ వారి వాహనంలోకి తీసుకెళ్లారు. ఎందుకు నా గొంతు పట్టుకున్నారు? అని నేను ప్రశ్నించగా, వారు నన్ను బయటకు తోసేసి, కొట్టి, అసభ్యకరంగా తిట్టారు. నేను దేశం తరఫున టెస్ట్ మ్యాచ్‌లు ఆడే జాతీయ క్రికెటర్‌ను అని చెప్పినా మొదట వినిపించుకోలేదు. ఆ తర్వాత నేను బోర్డుకు సమాచారం అందించడం, వాళ్లకు పై అధికారుల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో వదిలేశారు’ అని నయీమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఇక త్వరలో జింబాబ్వేతో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టులో నయీమ్ హసన్‌కు చోటు దక్కింది. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2018లో బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మొహమ్మద్ నయీమ్ హసన్ 14 టెస్టుల్లో 235 పరుగులు చేయడంతో పాటు తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో 48 వికెట్లు పడగొట్టాడు.చదవండి: సెమీస్‌లో ముగిసిన పీవీ సింధు పోరాటం