breaking news
Ministers tour
-
పబ్లిసిటీ కోసం పంటను తొక్కేశారు!
బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రంలో సోమవారం రాత్రి వర్షం బాగా కురిసింది. అయినా కూడా రాష్ట్ర మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్ యామినీబాల, వందలాది మంది టీడీపీ నాయకులు, వారికి తోడుగా అధికారులు రెయిన్‌గన్ పనితీరును పరిశీలించడానికి వచ్చారు. మంచి పదును అయిన వేరుశనగ పంట పొలంలో రెయిన్‌గన్‌ను పరిశీలించారు. వచ్చినోళ్లంతా పంటను తొక్కేయడంతో బాధిత రైతు వెంకటేష్ లబోదిబోమన్నారు. -
గంటా పిలిచారు... వచ్చారు.. వెళ్లారు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : మంత్రి గంటా శ్రీనివాసరావు పిలిచారు. వచ్చాం ..వెళ్లాం అన్న చందంగా మంత్రుల పర్యటన జిల్లాలో సాగింది. ఒకేసారి ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులు జిల్లాకు వచ్చారంటే ఓ మంచి అభివృద్ధి పథకం ప్రకటనలో, కనీసం హామీ అయినా దక్కుతుందన్న జిల్లా ప్రజలకు నిరాశే ఎదురయింది. దీనికి భిన్నంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి వెళ్లిపోయారు. ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు మాత్రం స్వైన్‌ఫ్లూపై సమీక్షించి, డీఎంఈతో తనిఖీలు నిర్వహించనున్నట్లు ప్రకటించి వెళ్లారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తన స్వగ్రామమైన కామేపల్లిలో ‘బడిలో బస’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం బుధవారం ఉదయానికల్లా వివిధ మార్గాల్లో ఎనిమిది మంది మంత్రులు ఒంగోలు చేరుకొని ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ ఇంటికి అల్పాహార విందుకు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి జాతీయ రహదారిపై ఉన్న వల్లూరమ్మ దేవస్థానంలో గత ప్రభుత్వ కాలంలో మంజూరై నిర్మాణాలు పూర్తి చేసుకున్న రెండు ప్రాకార మండపాలు, షాపింగ్ కాంప్లెక్సులను ప్రారంభించారు. అనంతరం కె బిట్రగుంటలో ఎన్టీఆర్ సుజలస్రవంతి కార్యక్రమంతోపాటు కామేపల్లి గ్రామంలో పోలేరమ్మ గుడికి రూ.40 లక్షలతో మండపం, రూ.25 లక్షలతో ప్రహరీ ముఖ ద్వారం, రూ.23 లక్షలతో గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మాణం, కామేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌ను రూ.2 కోట్ల 36 లక్షలతో మోడల్ స్కూల్‌గా మార్చటానికి శంకుస్థాపనలు చేశారు. గ్రామంలో రూ.1 కోటి 32 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన సిమెంటు రోడ్లు, రామచంద్రాపురం నల్లవాగు మీద రెండున్నర కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి గంటాతోపాటు మంత్రులు ప్రారంభించారు. మంత్రి శిద్దా రాఘవరావు, పల్లె రఘునాధరెడ్డిలు చాగల్లు వద్ద జాతీయ రహదారిపై దగ్ధమైన బస్సును పరిశీలించి విచారణకు ఆదేశించారు. మరోవైపు కందుకూరులో మాజీ ఎమ్మెల్యే, కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి దివి శివరామ్, అతని వ్యతిరేక వర్గం మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. దివి శివరామ్ ఇచ్చిన అల్పాహార విందుకు వ్యతిరేక వర్గం దూరంగా ఉంది. -
వచ్చామా.. తిరిగామా.. వెళ్లామా!
అంతకు ముందు కాలనీలకు.. పేటలకు.. బస్తీలకు ఓ ఎమ్మెల్యే వస్తున్నారంటే చాలా హడావుడి కనిపించేది. రోడ్ల వెంబడి బ్లీచింగ్ చల్లేవారు. తోరణాలు.. పూలమాలలు.. స్వాగత సత్కారాలు గట్రా నడిచేవి. ఎందుకంటే ఆ ఏరి యాకి ఎమ్మెల్యే స్థాయి నాయకుడు వచ్చాడంటే కచ్చితంగాఅభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలో లేదా శంకుస్థాపనలో పెద్దఎత్తున జరిగేవి. ఒక్కోసారి ఇలాంటివి జరగకపోయినా అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని చూసి వెంటనే సదరు నేతలు అక్కడి పనులకు సంబంధించి హామీలిచ్చేవారు. కొన్నాళ్లకో.. చాన్నాళ్లకో మొత్తం మీద చాలావరకు పనులు చేసేవారు. మరి మంత్రులే వస్తే.. ఏకంగా ఉప ముఖ్యమంత్రే వస్తే.. ఇప్పుడిదంతా ఎందుకంటే సమైక్యాంధ్రప్రదేశ్ విభజనతో సీమాంధ్ర 13 జిల్లాలతో ఓ రాష్ట్రంగా మిగిలిన తర్వాత కొలువుదీరిన కొత్త మంత్రులు ఎక్కడికక్కడ గిరాగిరా తిరుగుతున్నారు. ఎటుచూసినా అక్కడో మంత్రి పర్యటన.. ఇక్కడో మంత్రి టూరు. కానీ.. ఆ ప్రాంతాలకు ఏం జరుగుతోంది. అక్కడి జనానికి ఏం ఒరుగుతోంది. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. మన జిల్లాలో మాత్రం ఇప్పటివరకు ‘ఇదిగో ఈ రెండు నెలల్లో ఇది చేశాం’ అని ఎవరూ ఏమీ చెప్పుకోలేని పరిస్థితే ఉంది. కొత్తగా వేల, వందలాది కోట్ల రూపాయల ప్రాజెక్టుల ప్రకటనల గురించి ఇప్పుడెవరూ మాట్లాడటం లేదు. కనీసం బాధితులకు, క్షతగాత్రులకు మంత్రులిచ్చిన హామీల అమలుకు కూడా దిక్కులేని పరిస్థితి నెలకొంటోంది. రెండు వారాల కిందట ఆకివీడు శివారు ధర్మాపురంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఘట నా స్థలంలోనే ఒక మహిళ.. చికిత్స పొందూతూ మరో మహిళ మృతి చెందారు. వీరి కుటుంబాల పరామర్శకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేల బృందం ఆదుకుంటామని హామీలిచ్చింది. క్షతగాత్రుల పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చేర్పించి చదివిస్తామని మంత్రులు వాగ్దానాలు చేశారు. ఆనక ఎవరూ పట్టిం చుకోలేదు. చివరకు ఓ క్షతగాత్రుడు గత సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ‘సార్.. మమ్మల్ని, మా పిల్లల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ కలెక్టర్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. కలెక్టర్ కాటమనేని భాస్కర్ వెంటనే స్పందించి ఆ పిల్లలను నగరంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో అప్పగించారు. ఇక్కడ విషయమేమిటంటే.. స్వయంగా ఉపముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు వెళ్లి ఇచ్చిన హామీలు కూడా నెరవేరని స్థితిలో బాధితులు ఏలూరు వచ్చి ప్రజావాణిలో కలెక్టర్‌కు మొరపెట్టుకోవడం. ఒకరిద్దరి బాధితులకు సంబంధించిన సహాయ కార్యక్రమాలపైనే పాలకుల స్పందన ఇలా ఉండటం ఒకింత విమర్శలకు తావి చ్చింది. ఇదొక్క ఘటనే కాదు.. జిల్లాలో ఇటీవల మంత్రులు వెళ్లి అక్కడి జనానికి ఇస్తున్న చిన్నపాటి హామీలు కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇచ్చిన హామీలు పరిష్కారమయ్యాయో లేదోనన్న పరిశీలన ఇప్పటివరకు ఏ నేత కూడా చేస్తున్న దాఖలాలు లేవు. ఏదో వచ్చామా.. తిరిగామా.. వెళ్లామా.. అన్న తీరు కాకుండా మా గోడు కాస్త పట్టించుకోండంటూ సామాన్య జనం వేడుకుంటున్నారు. వింటున్నారా పాలకులూ! కావూరి ఎక్కడ? రెండుసార్లు ఎంపీగా గెలిపించిన పశ్చిమగోదావరి జిల్లా ప్రజలను, ముఖ్యంగా ఏలూరు వాసులను ఎప్పటికీ మరచిపోలేను.. అంటూ మొన్నటివరకు బీరాలు పలికిన కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు ఇప్పుడెక్కడున్నారు.. కనీసం మచ్చు కు కూడా కానరావడం లేదు. కృష్ణా జిల్లాకు చెందిన ఆయనకు వరుసగా రెండుసార్లు 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా ఇక్కడి ప్రజలు పట్టం కట్టా రు. రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిన తొలినాళ్లలో సమైక్య ఉద్యమ సారధిగా హడావుడి చేసిన ఆయన కేంద్రమంత్రి తాయిలం దక్కగానే ప్లేటు ఫిరాయించడం, చివరివరకు పదవిని అనుభవించి ఎన్నికల సమయం వచ్చేసరికి కాంగ్రెస్‌ను కాదనుకుని బయటకు వచ్చేయడం అందరికీ తెలిసినవే. రాష్ట్ర విభజనకు ఆమోద ముద్ర వేసిందని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన అదే విభజన అంశానికి మద్దతిచ్చిన బీజేపీలో చేరడం కేవలం ఆయన వ్యాపార ప్రయోజనాల కోసమే అన్నది బహిరంగ రహస్యం. సరే.. ఆయన ప్రయోజనాలు, పార్టీల మార్పిడి ఎలా ఉన్నా పదేళ్లు ఆదరించిన ఏలూరుకు ఇటీవలికాలంలో పూర్తిగా రావడం మానేశారు. చివరకు నగరంలోని మోతేవారి తోటలో ఎన్నో ఏళ్లుగా ఉన్న క్యాంపు కార్యాలయాన్ని రెండు నెలల కిందటే ఖాళీ చేసేశారు. ఇప్పుడు ఎటూ ఆయన ప్రజాప్రతినిధి కాదు కాబట్టి జనం కొత్త పాలకులపైనే ఆశగా చూస్తున్నారు. మరి పదేళ్ల పాటు కావూరినే నమ్ముకుని హల్చల్ చేసిన క్యాడర్ పరిస్థితి ఏమిటో? దుందుడుకు ఎమ్మెల్యేకి సీఎం క్లాస్ గెలిచేవరకే పార్టీలు.. రాజకీయాలు.. ఒక్కసారి గెలిచిన తర్వాత ఆ ప్రాంతానికి ప్రజాప్రతినిధి. అంటే ఎన్నికల్లో తనకు ఓటేసిన వారికి, వేయని వారి కూడా తానే ఎమ్మెల్యే. ఈ కనీస స్పృహ కూడా లేని ఒకాయన ఎమ్మెల్యే అయిన తర్వాత వేరే పార్టీ వాళ్లు కనిపిస్తే చాలు ఎగబడి, కలబడి గొడవ చేస్తున్నారట. అంతే కాదు అధికారులను కూడా నోటికొచ్చినంత మాట్లాడేస్తున్నారట. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదరు నేతకు గట్టిగా క్లాస్ పీకారట. ‘జాగ్రత్త.. ఆఫీసర్స్‌తో ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావ్ అని తెలిసింది. మరోసారి ఇలాంటివి నా దృష్టికొస్తే ఊరుకోను’ అని గట్టిగానే మందలించారట. మరి ఇప్పటికైనా సదరు నేతలో మార్పు వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందా.. ఏమో చూద్దాం! - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు