Marital bond
-
మోహం క్షణికం శిక్ష జీవితాంతం
ఒక ఊరిలో భర్త హతమయ్యాడు. మరో నగరంలో భార్య కడతేరిపోయింది. రెంటిలోనూ జీవిత భాగస్వాములే నిందితులు. తెలుగు రాష్ట్రాల్లో వైవాహిక బంధం వివాహేతర ఆకర్షణల వల్ల వార్తలకెక్కుతోంది. దంపతులు నేరస్తులుగా మారుతున్నారు. జీవన భాగస్వామి నచ్చకపోతే చట్టం ముందు, సమాజం ముందు విడిపోయే దారులుండగా హింస ఎందుకు? నిపుణుల అభిప్రాయాలతో కథనం...ఆ ఫోను పాము అని ఆమె తెలుసుకోలేదు. ఆ ఫోన్ ఆమెకు ఎవరినో పరిచయం చేసింది. మరెవరికో దగ్గర చేసింది. ఆ ఫోన్ ఆమెను గంటలు గంటలు తనను తానే మర్చిపోయేలా చేసింది. ఇది శాశ్వతం చేసుకోవాలనుకుందామె. భర్త ఇందుకు ముల్లులా కనిపించడం మొదలు పెట్టాడు. నిజానికి వాళ్లిద్దరికీ గొడవలు లేవు. కాని కొత్త ఆకర్షణ వల్ల పాత బంధం విసుగు పుట్టిస్తోంది. ఆమె ఎవరినీ సలహా అడగలేదు. పర్యవసానాలు ఆలోచించలేదు. ప్రత్యామ్నాయాలు వెతకలేదు. చివరకిప్పుడు నిందితురాలిగా మిగిలింది.అతను ఆమెకు భార్యగా ఏ లోటూ రానివ్వలేదు. కాని అతనికి భార్యతోపాటు మరో బంధం కావాలనిపించింది. అయితే కొత్త బంధంలో ఉన్న ఆమెకు పాత బంధం తెంపుకుంటేగాని అభద్రత పోదు. భర్తకు పాత బంధాన్ని ఎలా తెంపుకోవాలో తెలియదు. ఆమెతో విడిపోవడంలో రిస్కు ఉందని ఆమెనే లేకుండా చేసి మరింత పెద్దరిస్కు తెచ్చుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మూడుముళ్ల బంధం మూడు మూరల తాడుగా మారి ప్రాణాలు తీస్తోంది. పోలీసు గణాంకాల ప్రకారం గత రెండేళ్లలో వైవాహికేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన హత్యలు పెరిగాయి. అయితే... చట్టం ముందు, సమాజం ముందు విడిపోయే దారులుండగా హింసను ఆశ్రయించే దుస్థితి ఎందుకొస్తోంది?వివాహేతర సంబంధం నేరమా?సుప్రీంకోర్టు 2018లోనే ఐ.పి.సి. 497 సెక్షన్ ను కొట్టేసింది. అంటే వివాహేతర సంబంధం ఇప్పుడు ‘నేరం’ కాదు. ‘సివిల్ తప్పిదం’ మాత్రమే. భార్య, భర్త విడాకులకు దీన్ని కారణంగా చూపొచ్చు, కానీ శిక్ష ఉండదు. సమస్య ఇక్కడే మొదలవుతోంది. ‘చట్టం నన్నేమీ చేయదు’ అనే ధీమా ఒకవైపు, ‘నా పరువు పోయింది’ అనే కక్ష మరోవైపు ఈ రెండూ వివాహబంధాన్ని అడకత్తెరలో పెట్టాయి. విడిపోవాలనుకుంటే విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ వీటన్నింటికీ ఫ్యామిలీ కోర్టులున్నాయి. కానీ కోపం, పరువు, పగ ముందు బుర్ర ఇంకా చిన్నదై నేరాన్ని ప్రేరేపిస్తోంది.మూడో వ్యక్తి మాత్రమే కారణమా?వైవాహిక బంధాల్లో హత్యలకు ‘మూడో వ్యక్తి’ మాత్రమే కారణమై ఉండదు. వెతికి చూడాలే కాని, మూలాలు కనిపిస్తాయి.ఎ) సంభాషణ కరువు: మొబైల్ లో ఆరు గంటలు మాట్లాడే భార్యాభర్తలు ముఖాముఖి ఆరు నిమిషాలు మాట్లాడరు. దాంతో అపార్థాలు పేరుకుపోయి అగాధంగా మారుతున్నాయి. ఆ) ఆర్థిక అసమానతలు భార్య ఎక్కువ సంపాదిస్తున్నా, భర్త నిరుద్యోగిగా ఉన్నా ‘ఈగో’ దెబ్బ తిని బయట వ్యక్తి వైపు ఆకర్షణ పెరుగుతోంది. ఇ) సోషల్ మీడియా వల: రీల్స్‌లో కనిపించే ‘పర్ఫెక్ట్ కపుల్’ని చూసి, తమ బంధా న్ని చిన్నచూపు చూస్తున్నారు. కొత్త పరిచయాలు ఒక్క క్లిక్ దూరంలో దొరుకుతున్నాయి. ఈ) పరువు భయం: ‘విడాకులు తీసుకుంటే ఊరేమంటుందో’ అనే భయం, ‘చంపేస్తే పోలీసులే కదా’ అనే తెగింపుగా మారుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన.నేరమే శరణ్యమా? కానే కాదు. కోపంలో, ఆవేశంలో, కళ్లు కానరాని మోహంలో తీసుకునే నిర్ణయం జీవితాంతం జైలుగోడల మధ్య కుళ్లబెడుతుంది. దానికి బదులుగా మ్యూచువల్ కన్సెంట్‌తో ఆరునెలల్లో విడిపోవచ్చు. మోసం చేసిన భాగస్వామి నుంచి భరణం, పిల్లల బాధ్యత, ఆస్తిలో వాటా కోరే హక్కు చట్టం కల్పించింది. మానసిక, శారీరక హింస ఉంటే వెంటనే ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ప్రతి జిల్లా కోర్టులో ఉచిత కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఒకసారి మాట్లాడితే 70 శాతం కేసులు కోర్టు దాకా రావు.సమాజం ఏం చేయాలి?ఇది కేవలం పోలీసు, కోర్టుల సమస్య కాదు. మనందరి సమస్య. అందువల్ల సమాజం మొత్తం కొన్ని మెరుగుదలలను చేసుకోవాలి. ∙పెళ్లికి ముందు కౌన్సెలింగ్‌ను తప్పనిసరి చేయాలి. పెళ్లి తర్వాత ‘సర్దుకుపో’ అని కాకుండా ‘మాట్లాడుకోండి’ అని నేర్పాలి ∙9వ తరగతి నుంచే ‘రిలేషన్ షిప్ ఎథిక్స్’, ‘లీగల్ లెసన్స్’ పాఠ్యాంశంగా పెట్టాలి ∙మీడియా సంచలనం కోసం ఇలాంటి హత్య వివరాలు రాయడం కంటే ‘హెల్ప్‌లైన్ నంబర్లు’, ‘ఉచిత న్యాయ సలహా’ నంబర్లు ప్రమోట్ చేయాలి ∙ప్రభుత్వం ప్రతి మండలంలో ‘కుటుంబ పరిష్కార కేంద్రం’ పెట్టి లాయర్, సైకాలజిస్ట్, పోలీస్ ఒకే దగ్గర అందుబాటులో ఉంచాలి.బంధం నచ్చకపోతే. .. దంపతులు నేరస్తులుగా మారితే రేపు పిల్లలు జైల్లో ఉన్న తల్లిదండ్రులను సిగ్గుతో తలుచుకోవాలి. విడిపోవడానికి చట్టపరమైన దారి ఉందనీ, చంపితే కోర్టు ఉరిశిక్ష వేస్తుందనీ మర్చిపోవద్దు. బంధం నచ్చకపోతే తెంచుకోవాలి. హింసను ఆశ్రయించరాదు. ఎందుకంటే మోహం క్షణికం, శిక్ష జీవితకాలం. కుటుంబ న్యాయవ్యవస్థ ఉండాలివివాహేతర సంబంధాలలో జరిగే నేరాలకు ప్రధాన కారణాలు ఆవేశం, సామాజిక అపకీర్తి భయం, ఆర్థిక వివాదాలు... మన దేశంలో విడాకుల కేసులలో జరిగే ఆలస్యం, భావోద్వేగ నియంత్రణ లోపం, వివాహంపై ఉన్న సామాజిక ఒత్తిడి... ఇవన్నీ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. నివారణకు వేగవంతమైన కుటుంబ న్యాయవ్యవస్థ, కౌన్సెలింగ్, చట్టపరమైన అవగాహన, మానసిక స్థైర్యం కలిగించటం ఎంత అవసరమో ముందస్తు ప్రణాళికతో చేసే హత్యలకు త్వరితగతిన కఠిన శిక్షలు అంతే అవసరం. విఫలమైన వివాహాన్ని అవమానంగా కాకుండా చట్టబద్ధంగా విడిపోవడాన్ని సమాజం సహజం గా అంగీకరించాలి. అలా చేస్తే చంపడం కంటే చట్టపరంగా విడిపోవటం సులభమని గ్రహిస్తారు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిఆలోచనల్లో వైపరీత్యం వస్తుందివైవాహిక బంధాలలో పరస్పర గౌరవం, కమ్యూనికేషన్ లోపించినప్పుడు వ్యక్తులు ఎమోషనల్ సపోర్ట్ కోసం బయట వెతుకుతుంటారు. బంధంలోకి వెళతారు. అయితే ఆ వైవాహికేతర బంధం బయటపడుతుందనే తీవ్రమైన భయం, పరువు పోతుందనే ఆందోళన వారిలో తీవ్ర ఒత్తిడిని, క్యాట్ అండ్ మౌస్ మానసిక స్థితిని కలగజేస్తాయి. ముఖ్యంగా ఆలోచనా వైకల్యం చోటు చేసుకుంటుంది. తమ బంధానికి అడ్డుగా ఉన్న వ్యక్తిని తొలగిస్తేనే తాము ప్రశాంతంగా జీవించగలమనే ఒక భ్రమ లేదా విపరీతమైన ఆలోచన మెదడులో స్థిరపడిపోతుంది. నేరం చేసిన తర్వాత దొరకకుండా తప్పించుకోవచ్చనే అతి నమ్మకం కూడా ఇందుకు కారణం. ఇవి తీవ్రమైన మానసిక ఆరోగ్య సంక్షోభానికి సంకేతాలు. కుటుంబ వ్యవస్థలో కౌన్సిలింగ్, ఎమోషనల్ కంట్రోల్‌పై అవగాహన పెంచడం తక్షణ అవసరం. – విశేష్, సైకాలజిస్ట్పంచుకునేవారు లేకపోవడం వల్లే...వివాహేతర సంబంధాలను వయసుల వారీగా చూద్దాం... 25 నుంచి 35 సంవత్సరాల వయసువారు నచ్చకపోతే విడాకులకు వెళ్లిపోతున్నారు. అదే 35–45 మధ్యలో ఉన్నవారిలో పిల్లల బాధ్యతలు, ఖర్చులు ఎక్కువ కావడం వల్ల భర్త సంపాదనలో కూరుకుపోయి భార్యకు టైమ్ ఇవ్వలేడు. దాంతో గృహిణి మనసులో శూన్యం ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరికి ఎవరైనా బయటి వ్యక్తి పరిచయం అవడం, పొగడటం, మానసికంగా దగ్గరవడంతో అటువైపు అట్రాక్ట్ అవుతారు. ఇలాంటి కేసుల్లో కలిసి బతకాలనే ఆలోచనతో అడ్డుగా ఉన్నవారిని తొలగించుకోవాలనుకుంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఆనందించాల్సిన విషయాలకు సరైన ప్రాధాన్యత కల్పిస్తే వివాహేతర సంబంధాలు అనే సమస్య ఉండదు. – డా.సునీతా ప్రసాద్, సైకాలజిస్ట్ – కె. -
సరదాల వేళ... తలుపులతో జాగ్రత్త!
వాషింగ్టన్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ను ఆయన భార్య ముఖంపై చేతులు వేసి తోసేస్తున్న వీడియో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడం తెలిసిందే. దానిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తాజాగా స్పందించారు. శుక్రవారం మీడియా భేటీ సందర్భంగా విలేకరులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘‘అది అధ్యక్ష దంపతుల నడుమ సరదా సన్నివేశం మాత్రమే. మాక్రాన్‌తో మాట్లాడాను. వారి మధ్య సమస్యేమీ లేదు. అంతా బానే ఉంది’’అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఓ దేశాధినేతగా వైవాహిక బంధానికి సంబంధించి మరో దేశాధ్యక్షునికి మీరిచ్చే సలహా ఏమిటని ప్రశ్నించగా, ‘‘సరదాల వేళ తలుపులు మూసున్నదీ, లేనిదీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి చాలు. అంతకంటే మరేమీ అక్కర్లేదు’’అంటూ బదులిచ్చి నవ్వులు పూయించారు. -
మన బంధం.. గట్టిదే!
సాక్షి, అమరావతి: దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వైవాహిక జీవితం, బంధాలు, బంధుత్వాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ఇందుకు నిదర్శనం.. పెళ్లయిన వారు ఎక్కువగా ఉన్న రాష్ట్రం దేశవ్యాప్తంగా ఏపీ కావడమే. దేశంలో వివాహ వయస్సు దాటిన వారిలో పెళ్లయిన వారు 45.2% ఉండగా.. ఏపీలోనే అత్యధికంగా 52.4 % మంది ఉండగా, పెళ్లి కాని వారు మాత్రం 42.9 % ఉన్నారు. ఈ వివరాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన శ్యాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ం (ఎస్ఆర్ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్–2020 తెలియజేస్తోంది. మరోవైపు దేశ వ్యాప్తంగా పెళ్లయిన వారు 45.2 శాతం, పెళ్లి కాని వారు 51.6, పెళ్లయి కూడా వివిధ కారణాలతో ఒంటరిగా ఉంటున్న వారు 3.2 % మంది ఉన్నారు. తెలంగాణలో పెళ్లయిన వారు 48.6, పెళ్లి కాని వారు 47.4 శాతం ఉన్నారు. పెళ్లి కాని ప్రసాద్‌ల నెలవు బిహార్! పెళ్లి కాని వారు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా బిహార్ నిలిచింది. ఈ రాష్ట్రంలో పెళ్లికాని వారు 59.3, పెళ్లయిన వారు 39.1, విడాకులు తీసుకోవడం, భాగస్వామి మరణించడం, ఇతర కారణాలతో ఒంటరిగా ఉన్న వారు 1.6 %గా ఉన్నారు. బిహార్ తర్వాత అత్యధికంగా పెళ్లి కాని వారు ఉత్తరప్రదేశ్ (57.2 %)లో ఉన్నారు. దేశంతో పాటు, రాష్ట్రంలోను పెళ్లి కాని వారిలో ఎక్కువగా పురుషులే ఉంటున్నారు. దేశంలో పెళ్లి కాని పురుషులు 56.7, స్త్రీలు 46.2 %గా ఉన్నారు. రాష్ట్రంలో పురుషులు 48.3, స్త్రీలు 37.5 % మంది ఉన్నారు. దేశంలోనే అత్యధికంగా బిహార్‌లో పెళ్లికాని పురుషులు 63.5 శాతం ఉన్నారు. అత్యధికంగా పెళ్లి కాని స్త్రీలు ఉన్న రాష్ట్రంగా కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ నిలిచింది. ఇక్కడ పెళ్లి కాని స్త్రీలు 54.5 % ఉన్నారు. తెలంగాణలో పెళ్లి కాని వారు 47.4 % ఉండగా.. వీరిలో పురుషుల వాటా 53.1 %గా ఉంది. -
భార్య.. భర్త.. మూడు తగవులు
వాదన మొదలెట్టినవాళ్లు దానిని ముగించడం కూడా తెలుసుకొని ఉండాలి. తెగే దాకా లాగితే తాడే కాదు వైవాహిక బంధం కూడా తెగుతుంది. బయట కరోనా ఉంది. ఆ అశాంతి సరిపోనట్టుగా ఇంట్లో మనశ్శాంతి కరువు చేసుకుంటామా? అసలు ఇంట్లో తగువు ఎందుకు? తగువు రేపుతున్న మూడు కారణాలు ఏమిటి? చూద్దాం. పని మనుషులు ఇంకా పూర్తిగా రావడం లేదు. వాళ్లు వస్తామన్నా భయం వల్ల వద్దంటున్నవాళ్లే ఎక్కువ. ఆఫీసులకు పూర్తిగా వెళుతున్నవాళ్లు తక్కువ. వ్యాపారాలు, పనులు ఇంతకు ముందంత సేపు చేస్తున్నవాళ్లూ తక్కువ. ఏతావాతా ఇంట్లో భార్యాభర్తలు ఎక్కువ సేపు ఉండక తప్పని పరిస్థితి కరోనా వల్ల వచ్చింది. ఇది మరికొంత కాలం ఉంటుంది. కాని మరోవైపు ఇంట్లో తగాదాలు పెరిగిపోతున్నాయి. పోలీసులకు ఫోన్ల వరకు వెళుతున్నాయి. కేసులు పెట్టే వరకూ పెద్దవవుతున్నాయి. దీనిని ఆపలేమా? పుదుకొట్టయి చెప్పిన సంగతి తమిళనాడులో కరోనా ఉద్ధృతిగా ఉంది. లాక్డౌన్ ప్రత్యక్షంగా పరోక్షంగా సాగుతూ ఉంది. అక్కడ మార్చి నెలాఖరు నుంచి మే 31 వరకు దాదాపు 14 వేల గృహహింస ఫిర్యాదులు అందాయి. ఫోన్ల ద్వారా, ఈ మెయిల్స్ ద్వారా, స్టేషన్‌కు వచ్చి మొర పెట్టుకోవడం ద్వారా వచ్చిన ఫిర్యాదులు ఇవి. గృహహింస ఆ రాష్ట్రంలో చిన్న ఊళ్లలో పట్టణాలలో ఎక్కువగా ఉంటే చెన్నై సిటీలో తక్కువగా ఉండటం గమనార్హం. చిన్న ఊళ్లలో కూడా కేవలం లక్ష జనాభా ఉన్న ‘పుదుకొటై్ట’ అనే ఊరిలో 1400 గృహహింస ఫిర్యాదులు అందాయి. ఈ మొత్తం కేసులను పోలీసులు పరిశీలించగా మూడు కారణాలు తగవును రేపుతున్నాయని తేలింది. అవి 1. ఇంటి పని విభజన 2. భాగస్వామిపై అనుమానం 3. ఆర్థిక సమస్యలు. ఈ విషయాల్లో కీచులాడుకోవడం ఈ రాష్ట్రంలోనే కాదు బహుశా దేశమంతా జరుగుతూ ఉండొచ్చు. ఈ మూడు కారణాలతో మన ఇంట్లో కూడా పేచీ ఏమైనా మొదలయ్యిందా చెక్ చేసుకోవాలి. ఇంటి పని ఇంటి పని భారం ప్రధానంగా గృహిణి మీద ఉంటుంది. ఆమె గృహిణి అయినా ఉద్యోగిని అయినా ఇంటి పని ఆమెదే అనే ధోరణి భర్తకు ఉంటుంది. మామూలు రోజుల్లో పని మనుషుల వల్ల, బయట తిండి తెచ్చుకోవడం వల్ల, వారూ వీరూ వచ్చి సాయ పడుతూ ఉండటం వల్ల ఈ భారం గృహిణికి అంతో ఇంతో తగ్గేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భర్త, పిల్లలు అన్ని వేళలా ఇంట్లో ఉండటం వల్ల పని పెరిగింది. ఈ పని చేసి చేసి ఇళ్లల్లో స్త్రీలకు విసుగు చిరాకు పెరిగి భర్తను నిలదియ్యాల్సి వస్తోంది. భర్త ఇంటి పనిని పంచుకుంటే సరేసరి. లేకుంటే ఈ తగాదా పెరిగి పెద్దదైపోతోంది. ఇంట్లోని పెద్దలిద్దరూ ఇంటి పని ఎంత ఉందో అది ఎంత శ్రమను కలిగిస్తుందో బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం. పని పెంచుకోవడం, ఎదిగిన పిల్లలు ఉంటే వారు చేయదగ్గ పనిని పంచి ఇవ్వడం ఇంకా ముఖ్యం. ఒక టైమ్‌టేబుల్ వేసుకొని రోజుకు ఏ టైమ్‌లో ఎవరు ఏ పని చేయాలో రాసుకుంటే చాలామటుకు గొడవ రాకుండా ఉంటుంది. ఉదాహరణకు ఉదయాన్నే లేచి చెత్తబుట్ట బయటపెట్టే పని భర్తది అని అనుకుంటే భార్యకు సగం ఓదార్పుగా ఉంటుంది. మొక్కలకు నీళ్లు పోయడం, పిల్లలను నిద్ర లేపడం, భార్య వంట చేసినా పిల్లలకు టిఫిన్ పెట్టే పని భర్త చూడటం.. ఇలా ఎవరికి ఏది సౌకర్యమో చేసుకోకపోతే ఇల్లు రచ్చలోకి పడే ప్రమాదం ఉంది. పని అంతా భార్య చేయాలని అనుకోవడం ఎలా సరి కాదో పని అంతా భర్త చేయాలని అనుకోవడం కూడా సరి కాదని తెలుసుకోవడం కూడా ముఖ్యమే. అనుమానం పెనుభూతం లాక్డౌన్ సమయంలో ఫోన్‌తో కాలక్షేపం కుటుంబాలలో కలత రేపుతున్నదంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాని ఇది నిజం. భర్త ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటే భార్య ఫోన్లో మునిగినా, భార్య ఇంటి పని చేసుకుంటూ ఉంటే భర్త ఫోన్లో మునిగినా, ఇద్దరికీ ఏ పని లేని సమయంలో అర్ధరాత్రి వరకూ ఫోన్ చూస్తూ ఉన్నా, చాటింగ్ చేస్తూ ఉన్నా అది ఎంత అయినవారితోనో, బంధువులతోనో, మిత్రులతోనో అయినప్పటికీ అనుమానాలు వచ్చేస్తుండటం తాజా స్థితి. సాధారణ రోజుల్లోని ప్రైవసీ ఇప్పుడు లేకపోవడం వల్ల ఇరువురూ చేస్తున్న పని అనుక్షణం కనపడుతూ ఉండటం వల్ల ఈ తగాదాలు వస్తున్నాయి. ఎదుటి పక్షానికి సందేహం కలిగించే సంభాషణలు, ఫోన్ సమయాలు పరిహరించుకోవడమే దీనికి పరిష్కారం. మాట్లాడే అవసరం ఉన్న మాటలు శషబిషలు లేకుండా పబ్లిక్‌గా మాట్లాడటం కూడా ఒక పరిష్కారం. ఫోన్లలోని కాలక్షేపం వీడియోలు చూసేటట్టయితే అదేదో ఇద్దరం చూద్దాం రా అని పిలిచి పక్కన కూచోపెట్టుకోవడం కూడా పరిష్కారమే. మన చేతులు మనవిగా ఉంటూ అవి ఫోన్‌ని కాకుండా భార్య చేతులనో భర్త చేతులనో పట్టుకుంటూ ఉంటే ఇంట్లో మనశ్శాంతి గ్యారంటీ. డబ్బు పెద్ద జబ్బు కరోనా శరీర కష్టాన్నే కాకుండా డబ్బు కష్టాన్ని కూడా తెచ్చి పెట్టింది. ఉద్యోగాలు పోవడం, సగం జీతాలు రావడం, వ్యాపారాలు సరిగ్గా జరక్కపోవడం ఇవన్నీ ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టాయి. సంపాదించలేకపోతున్నానన్న బాధ భర్తకు, సంపాదించింది చాలట్లేదన్న ఫ్రస్ట్రేషన్ భార్యకు ఉంటే ఇక ఇల్లు ప్రమాదంలో పడినట్టే. ఈ విషయంలో మాత్రం భార్య, భర్త సంపూర్ణంగా సహకరించుకోవాలి. సర్దుబాట్లు చేసుకోవాలి. భ్రమల్లో ఉండకుండా వాస్తవిక అంచనాలతో ఇంటి భవిష్యత్తును ప్లాన్ చేసుకోవాలి. డబ్బు ఉన్నది/కావాల్సినది అనే విషయం ఇరువురూ ట్రాన్స్పరెన్సీని పాటిస్తే చాలా వరకు సమస్య తీరినట్టే. డబ్బు లేదు కదా అని మనసును కష్టపెట్టే మాటలు మొదలెడితే అవి లోతైన గాయం చేస్తాయి. పాజిటివ్‌గా మాట్లాడటం, పరస్పరం సహకరిస్తున్నట్టుగా మాట్లాడుకోవడం ఇంటిని చాలా చాలా ప్రశాంతతతో ఉంచుతుంది. కష్టం వస్తే ఏముందిలే ప్రేమైతే ఉంది కదా అని అనిపించేలా చేస్తుంది. ఇల్లు తయారు కావడానికి ఏళ్లు పడుతుంది. ఛిద్రం చేసుకోవడానికి క్షణం పట్టదు. ఆరోగ్యాన్ని కరోనా నుంచి కాపాడుకుంటున్నట్టుగానే ఇంటిని స్పర్థల నుంచి, తగవుల నుంచి కాపాడుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
'కొత్త' కాపురం
మూడు ముళ్ల బంధానికి మున్నెన్నడూ లేని కష్టమొచ్చింది. జీవితకాలం కొనసాగాల్సిన వైవాహిక బంధం బలహీనమైపోతోంది. ఏ గొడవొచ్చినా పరిష్కరించే కుటుంబ పెద్దలు కరువయ్యారు. ఒకప్పటిలాగా గుట్టుగా సాగాల్సిన సంసారం మూణ్ణాళ్లకే వీధిన పడుతోంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి దాంపత్య జీవితం దారి తప్పుతోంది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని జీవిత కాలం కలిసిమెలసి ఉండాల్సిన దంపతులు విడిపోతున్నారు. అనుమానం, అవగాహనా లేమి, ఒకరిపై మరొకరికి ప్రేమ లేకపోవడం, వివాహేతర సంబంధాలకు తోడు.. సెల్ఫోన్లు, ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్‌లు సైతం కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఏ కారణం వల్ల జంటలు విడిపోయినా అది తప్పని వైవాహిక జీవితపు గొప్పదనాన్ని చాటిచెప్పుతూ.. భార్యాభర్తలు పరస్పర అవగాహన, ప్రేమ కలిగి ఉండాలని.. అనుమానాలను దూరం పెట్టాలని, సర్దుకొని పోతేనే సంసారం సాగుతుందని తెలియజెప్పి వారి బంధం బలంగా ఉండేందుకు కృషి చేస్తోంది ‘కుటుంబ సలహా కేంద్రం’.. మీ బంధం బలహీనమైతే దానికి బలమైన పునాదులు వేసేందుకు రెడీగా ‘కుటుంబ సలహా కేంద్రం’ ఉందన్న విషయాన్ని మరవొద్దని చెబుతోంది. గజ్వేల్‌రూరల్: డిగ్రీ చదువుకున్న సిద్దిపేటకు చెందిన అమ్మాయికి.. ఇంటర్ చదువుకున్న దుబ్బాక మండలానికి చెందిన అబ్బాయితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత అమ్మాయిని బీఎడ్టోపాటు పీజీ కూడా చదివించాడు. మూడేళ్ల వరకు ఆ దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఈ సమయంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. భర్త తనను పట్టించుకోవడం లేదని.. అలనా పాలనా చూడడం లేదని ఆమె పేర్కొంటుండగా... భార్యపై అనుమానంతో వారిద్దరూ దూరమయ్యారు. వారికి ఏడాదిన్నర పాప ఉంది. విడిపోయిన భార్యాభర్తలు కోర్టులో కేసులు పెట్టుకోవడం, కోర్టు, లాయర్లు, మధ్యవర్తుల వద్ద పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సలహా కేంద్రం కౌన్సిలర్లు దూరమైన ఆ జంటకు, వారి కుటుంబసభ్యులకు మూడు నెలల క్రితం వివాహబంధంపై కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఈ జంట వేరు కాపురం పెట్టి ప్రస్తుతం సిద్దిపేటలో నివాసముంటోంది. ఇలాంటివే మరెన్నో చిన్న చిన్న కారణాలు.. స్పర్థలు.. మాట పట్టింపులతో దూరమవుతున్న జంటలను కలుపుతోంది గజ్వేల్‌లోని కుటుంబ సలహా కేంద్రం. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇక్కడికి వస్తున్న అనేక జంటలకు ఈ కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాలను నిలబెడుతున్నారు. మన జీవితంలో టీవీలు, సెల్‌ఫోన్, ఇంటర్నెట్ల వినియోగం ఓ భాగమైపోయింది. వీటి వినియోగం వల్ల మేలు జరుగుతున్నప్పటికీ అనర్థాలు సైతం అదే స్థాయిలో ఉంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీటి వ్యామోహంలో చదువుకున్న యువత, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థికంగా ఎదగాలనే ఆకాంక్షతోపాటు జల్సాలకు అలవాటు పడి కుటుంబ సభ్యుల్లో ప్రేమానురాగాలు తగ్గి క్షణికావేశంలో... విచక్షణ కోల్పోయి చేసే పనుల వల్ల ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటాయి. మూడు ముళ్లు.. ఏడడుగులు.. భాజా బజంత్రీలు, వేద మంత్రాల సాక్షిగా ఏకమై అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా నిలవాల్సిన భార్యాభర్తలు చిన్నపాటి మనస్పర్థలు, అపర్థాలు, అపోహలతో వారి దాంపత్య జీవితం ముణ్నాళ్ల ముచ్చటగా మార్చుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణం భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కరువై సఖ్యత లేకపోవడమే. దాంపత్య జీవితానికి బీటలు గ్రామాల్లో, పట్టణాల్లో గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి... అన్నాదమ్ములు, భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్య తలెత్తినా ఇంటి పెద్ద పరిష్కరించేవారు. కానీ ఇప్పుడు పెళ్లయిన కొన్నాళ్లకే ఉమ్మడి కుటుంబంలో ఇమడలేక భార్యాభర్తలు వేరుపడి వైయక్తిక కుటుంబంగా మారుతున్నారు. అలా వేరుగా వచ్చిన భార్యాభర్తల్లో మనస్పర్థలు, అవగాహన లోపంతో చిన్నపాటి సమస్యలకు కూడా పెద్దగా ఫీలవుతూ సతమతమవుతున్నారు. దీంతో విడిపోవడం దాకా నిర్ణయం తీసేసుకుంటూ జీవితాలను దారి మళ్లించుకుంటున్నారు. పెరిగిపోతున్న ‘ఇగో’యిజం చదువుకున్న యువతలో అహం పెరిగిపోయి జల్సాలకు అలవాటు పడడం.. చదువు, సంపాదనలో తానేం తక్కువా అన్నట్లు వ్యవహరించడం... సెల్‌ఫోన్, ఇంటర్నెట్, ఇల్లీగల్ కాంటాక్టŠస్(వివాహేతర లైంగిక సంబంధాలు), మద్యపానం వంటివాటి మత్తులో ఎంతో మం ది తమ జీవి తాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, క్షణికావేశం వల్ల తలెత్తే అనర్థాలు ఎం తో దూరం తీసుకెళ్తున్నాయి. దీంతో వా రి పిల్లలు అనాథలు గా మారి తల్లిదండ్రుల ప్రేమకు దూరమవుతున్నారు.ఇలాంటి వారిని కౌ న్సెలింగ్ ద్వారా ఏకం చేసేందుకు కృషి చేస్తోంది ‘కుటుంబ సలహా కేంద్రం’... చిన్న సమస్యలతో భార్యాభర్తల మధ్య విద్వేషాలు పెరిగి దాంపత్య జీవితానికి దూరమవుతున్న వారికి కుటుంబ సలహా కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి వారిని ఏకం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహిళా శిశు సంక్షేమశాఖ, సాంఘీక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల ఆధారంగా కుటుంబ సలహా కేంద్రాలు కొనసాగుతున్నాయి. దీని ఆధ్వర్యంలో ఉమెన్, మేల్ కౌన్సిలర్లు మనస్పర్థలతో విడిపోయిన జంటలను ఏకం చేసేందుకు కౌన్సెలింగ్ ఇస్తుంటారు. గజ్వేల్‌లోని కుటుంబ సలహా కేంద్రం పరిష్కరించిన కేసులు మహిళా శిశు సంక్షేమశాఖ, సాంఘీక సంక్షేమ మండలి సహకారం తో గజ్వేల్ పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు సమీపంలో ‘విజన్ ఎన్జీఓ స్వచ్ఛంద సంస్థ’ ఆధ్వర్యంలో 2012లో కుటుంబ సలహా కేంద్రం ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా 40 కుటుంబ సలహా కేంద్రాలు ఉండగా.... గజ్వేల్‌లో ఉన్న ఈ కేంద్రం ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 516 కేసులను పరిష్కరించారు. అయితే ప్రస్తుత ç2017లో ఇప్పటి వరకు 68 కేసులు పరిష్కరించినట్లు నిర్వాహకుడు కైలాష్ పేర్కొన్నారు. గ్రామైక్య సంఘాలు, పోలీసుల సహకారంతో.. గ్రామైక్య సంఘాలు, పోలీసుల ద్వారా ఈ సెంటర్లలో ఎంఎస్‌డబ్ల్యూ చేసిన కౌన్సిలర్లతో దూరమవుతున్న జంటలకు కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. ఇటీవలి కాలంలో మనస్పర్థలు, అపనమ్మకాలు, సెల్‌ఫోన్, ఇల్లీగల్ కాంటాక్ట్స్, వరకట్నం వేధింపుల వంటి సమస్యలతో దూరమవుతున్న జంటలు ఎక్కువగా ఉంటున్నాయని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఏకం చేస్తున్నామని చెబుతున్నారు. క్షణికావేశంలో మాటామాట పెరిగి తీసుకున్న నిర్ణయాలతో భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడం వల్ల వారి పిల్లలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదముందని చెబుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నా, ఎవరో ఒకరు (వివాహేతర సంబంధం)ఇతరులతో వెళ్లిపోవడం వల్ల పిల్లలు వారి ప్రేమను కోల్పోవడంతో పాటు అనాథలుగా మారుతున్నారు. దూరమవుతున్న జంటలకు పెద్దల సమక్షంలో పంచాయితీలు, పోలీసు కేసుల వరకు వెళ్లినటువంటి వారికి ఈ కేంద్రాలలో కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం వల్ల అయ్యే ఖర్చు, కోల్పోతున్న జీవితం, భార్యాభర్తల బంధం, విడిపోవడానికి గల కారణాలను తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ కేంద్రాలకు వచ్చే కేసులలో ఎక్కువ ఒకటీ రెండుసార్ల కౌన్సెలింగ్‌తోనే పరిష్కారం అవుతున్నట్లు గజ్వేల్ కుటుంబ సలహా కేంద్రం, విజన్ సంస్థ నిర్వాహకుడు కైలాష్ తెలిపారు. అంతేగాకుండా గ్రామీణ ప్రజలకు, మహిళా సంఘాలలో సమావేశాలు నిర్వహిస్తూ కుటుంబ సలహా కేంద్రం ఉన్నట్లు తెలపడంతోపాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. విభేదాలకు కారణాలు.. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, అనుమానాలకు తావివ్వడం, ఇతరుల మాటలు నమ్మి మోసపోవడం, కట్న కానుకల విషయంలో తగాదాలు, ఆధిక్యత కోసం పోటీ పడటం, నిరక్షరాస్యత, అవగాహన లోపం, మూఢనమ్మకాలు, అపోహలు, ఆచార వ్యవహా రాలు, వివాహేతర సంబంధాలతో తలె త్తే వివాదాల కారణంగా జం టలు దూరమవుతున్నా యి. అలా కా కుండా భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు, అనుమానాలకు తావులేనప్పుడే దాంపత్య బం ధం నూరేళ్లు కొనసాగుతుంది. చిచ్చు పెట్టిన సెల్‌ఫోన్.. అమ్మాయిది వర్గల్ మండలంలోని ఓ గ్రామం. ఆమె 10వ తరగతి వరకు చదువుకుంది. గజ్వేల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న అబ్బాయితో పెళ్లైంది. వీరు రెండేళ్లు బాగానే ఉన్నారు. భర్త స్నేహితుడొకరు ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. దీంతో భర్తకు అనుమానం కలిగింది. భార్య కాల్ లిస్ట్ చెక్ చేసి ఆమె తన స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు గుర్తించాడు. అనుమానానికి మరింత బలం చేకూరి గొడవలు తలెత్తాయి. దీంతో అమ్మాయిపై చేయి చేసుకున్నాడు. ఆమె చనిపోతానని బెదిరిస్తూ ఇంట్లో నుంచి చుట్టాల ఇంటికి వెళ్లిపోయింది. దీంతో అతడు అత్తామామలకు సమాచారం అందించాడు. వారు అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లారు. భార్యను తీసుకువెళ్లడానికి భర్త రాగా పెద్ద మనుషుల మధ్య మాట్లాడిన తర్వాతే పంపిస్తామని అత్తింటివారు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఓ సారి అతడిని బావమరుదులు కొట్టడంతో విభేదాలు తలెత్తాయి. గ్రామ మహిళా సంఘాల ద్వారా సమాచారం అందుకున్న గజ్వేల్‌లోని కుటుంబ సలహా కేంద్రం ప్రతినిధులు 15 రోజుల వ్యవధిలో రెండు కుటుంబాలవారిని వేర్వేరుగా పిలిపించారు. పెళ్లి.. జీవితం అంటే ఏమిటి.. భార్యాభర్తల మధ్య వచ్చిన తగాదాలకు కారణాలను తెలియజేశారు. నీ స్నేహితుడే దీనికి కారణం.. నిన్నే మోసం చేయాలని చూశాడని, తప్పు నీవైపునే ఉంది కాబట్టి.. పీడకలలా మరచిపోవాలని సూచనలివ్వడంతోపాటు కౌన్సెలింగ్ నిర్వహించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. 6 నెలలుగా వీరు పటాన్‌చెరులోని ఓ ప్రాంతంలో వేరు కాపురం పెట్టి బాగానే ఉంటున్నారు. మానసిక వేధింపులతో... తొగుట మండలానికి చెందిన అబ్బాయికి గజ్వేల్ మండలానికి చెందిన అమ్మాయితో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి పిల్లలు లేరు. అబ్బాయి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత అమ్మాయిని మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అమ్మాయి పుట్టింటికి వెళ్లిపోయింది. అబ్బాయి తల్లిదండ్రులు వెళ్లినా అమ్మాయిని పంపించలేదు. ఈ విషయం కుటుంబ సలహా కేంద్రానికి అందడంతో రెండు కుటుంబాల సభ్యులను పిలిపించారు. ఈ సందర్భంలో అబ్బాయి మానసిక ప్రవర్తన బాగా లేదని, అమ్మాయికి అతడి నుంచి ప్రాణహాని ఉందనే అనుమానం ఆందోళన కలిగిస్తోందని ఆమె తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రెండు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో అబ్బాయి డిప్రెషన్‌కు గురయ్యాడని, ఆసుపత్రిలో చికిత్స చేయించాలని సూచించారు. అతడికి చికిత్స పూర్తయిన తర్వాత అమ్మాయిని పంపించేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. రెండు నెలల ట్రీట్మెంట్ తర్వాత అబ్బాయిలో కొంత మార్పు వచ్చింది. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో ఈ జంటను కలిపారు. ఈ జంట మూడు నెలలుగా వేరుగా ఉంటోంది. భార్యాభర్తలిద్దరూ సమానమే బండికి రెండు చక్రాలు ఎలానో... భార్యాభర్తలనేది కూడా అలానే కలిసుండాలి. మా వద్దకు వచ్చే జంటలకు విడిపోవడం వల్ల కలిగే నష్టాలు, కలిసుండడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తున్నాం. భార్యాభర్తల బంధంపై కౌన్సెలింగ్ ఇస్తున్నాం. జల్సాలకు అలవాటు పడి, వివాహేతర సంబంధాలతో ఎక్కువగా దూరమవుతున్నారు. వారిలో మార్పును తీసుకువస్తూ ఒక్కటయ్యే విధంగా కుటుంబ సలహా కేంద్రం ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. – కైలాష్, కుటుంబ సలహా కేంద్రం నిర్వాహకుడు, క్షణికావేశంతో దూరమవుతున్నారు భార్యాభర్తలు చిన్న సమస్యకు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో అనర్థాలు జరుగుతాయి. అలా కాకుండా ఒకరిపై మరొకరికి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. జీవితం ఎంతో విలువైనది. అపోహలు, విభేదాలకు తావులేకుండా భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అదే విధంగా గృహ హింస, వరకట్న నిరోధక చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. – రాధ, కౌన్సిలర్ -
మా సమస్యలు మాకున్నాయ్!
వైవాహిక బంధాన్ని కాపాడుకోవడం భార్యాభర్తల్లిద్దరి చేతుల్లో ఉంటుంది. ఒకరి లోపాలను మరొకరు ఇష్టపడాలి. లేదా నచ్చే పద్ధతిలో చెప్పి, మార్చుకోవాలి. ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తూ హాలీవుడ్ నటి, దర్శకురాలు ఏంజెలినా జోలీ తీసిన చిత్రం ‘బై ది సీ’. ఈ చిత్రంలో ఏంజెలినా, ఆమె భర్త బ్రాడ్ పిట్ భార్యాభర్తలుగా నటించారు. వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఓ భార్య, భర్త ఏం చేశారనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. రియల్ లైఫ్‌లో తనకూ, బ్రాడ్కూ మధ్య సమస్యలున్నాయంటూ -‘‘ఏ కాపురంలో అయినా అలకలు, కలతలు ఉంటాయి. అవి విడిపోవడానికి కారణం కాకూడదు. అంత దూరం వెళ్లనివ్వకుండానే సమస్యలను పరిష్కరించుకోవాలి. మా మధ్య పొరపొచ్ఛాలు వచ్చినప్పుడు మేం కూర్చుని మాట్లాడుకుంటాం. ఏ విషయాన్నీ తెగేదాకా లాగం. మా సమస్యలను సినిమాలో పెట్టలేదు. సినిమాలో చూపించినవి వేరు’’ అని ఏంజెలినా చెప్పారు. బ్రాడ్ పిట్, ఏంజెలినా పదేళ్ల తర్వాత ఈ చిత్రం కోసం మళ్లీ జత కట్టారు. -
మంచి వైవాహిక బంధంతోనే గుండె పదిలం
కొత్త పరిశోధన వివాహబంధం విచ్ఛిన్నమై విడాకులకు దారితీసిన వారిలో అత్యధికులు గుండెజబ్బుల బారిన పడతారని చెబుతున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. హార్ట్‌బ్రేక్ కాస్తా హార్ట్ ఎటాక్‌కు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధక బృందం 15,827 మంది 45 నుంచి 80 ఏళ్ల మధ్య వయసులోని స్త్రీ, పురుషులను ఎంపిక చేసుకొని ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. వారిని కూలంకషంగా ప్రశ్నించడంతో పాటు ప్రతి రెండేళ్లకోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. పద్దెనిమిదేళ్ల పాటు సాగిన ఈ అధ్యయనంలో తేలిన అంశం ఏమిటంటే... ఒకసారి విడాకులకు దారితీసిన అనేకుల్లో అది గుండెమీద ప్రతికూల ప్రభావం చూపిందనీ, అదే సమయంలో ఆ విడాకులు పొందినవారికి మళ్లీ మంచి పార్ట్నర్ లభించడం జరిగితే వాళ్ల గుండె ఆరోగ్యం మెరుగుపడిందనే విషయాన్ని ఆ అధ్యయనవేత్తలు ‘సర్క్యులేషన్: కార్డియోవాస్క్యులార్ క్వాలిటీ ఔట్‌కమ్స్’ అనే జర్నల్‌లో పొందుపరిచారు.


