మోహం క్షణికం శిక్ష జీవితాంతం | Rising Crimes Due to Extramarital Affairs | Sakshi
Sakshi News home page

మోహం క్షణికం శిక్ష జీవితాంతం

May 30 2026 6:13 AM | Updated on May 30 2026 6:13 AM

Rising Crimes Due to Extramarital Affairs

మూడు ముళ్ళు

ఒక ఊరిలో భర్త హతమయ్యాడు. మరో నగరంలో భార్య కడతేరిపోయింది. రెంటిలోనూ జీవిత భాగస్వాములే నిందితులు. తెలుగు రాష్ట్రాల్లో వైవాహిక బంధం వివాహేతర ఆకర్షణల వల్ల వార్తలకెక్కుతోంది. దంపతులు నేరస్తులుగా మారుతున్నారు. జీవన భాగస్వామి నచ్చకపోతే చట్టం ముందు, సమాజం ముందు విడిపోయే దారులుండగా హింస ఎందుకు? నిపుణుల అభిప్రాయాలతో కథనం...

ఆ ఫోను పాము అని ఆమె తెలుసుకోలేదు. ఆ ఫోన్‌ ఆమెకు ఎవరినో పరిచయం చేసింది. మరెవరికో దగ్గర చేసింది. ఆ ఫోన్‌ ఆమెను గంటలు గంటలు తనను తానే మర్చిపోయేలా చేసింది. ఇది శాశ్వతం చేసుకోవాలనుకుందామె. భర్త ఇందుకు ముల్లులా కనిపించడం మొదలు పెట్టాడు. నిజానికి వాళ్లిద్దరికీ గొడవలు లేవు. కాని కొత్త ఆకర్షణ వల్ల పాత బంధం విసుగు పుట్టిస్తోంది. ఆమె ఎవరినీ సలహా అడగలేదు. పర్యవసానాలు ఆలోచించలేదు. ప్రత్యామ్నాయాలు వెతకలేదు. చివరకిప్పుడు నిందితురాలిగా మిగిలింది.

అతను ఆమెకు భార్యగా ఏ లోటూ రానివ్వలేదు. కాని అతనికి భార్యతోపాటు మరో బంధం కావాలనిపించింది. అయితే కొత్త బంధంలో ఉన్న ఆమెకు పాత బంధం తెంపుకుంటేగాని అభద్రత పోదు. భర్తకు పాత బంధాన్ని ఎలా తెంపుకోవాలో తెలియదు. ఆమెతో విడిపోవడంలో రిస్కు ఉందని ఆమెనే లేకుండా చేసి మరింత పెద్దరిస్కు తెచ్చుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మూడుముళ్ల బంధం మూడు మూరల తాడుగా మారి ప్రాణాలు తీస్తోంది. పోలీసు గణాంకాల ప్రకారం గత రెండేళ్లలో వైవాహికేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన హత్యలు పెరిగాయి. అయితే... చట్టం ముందు, సమాజం ముందు విడిపోయే దారులుండగా హింసను ఆశ్రయించే దుస్థితి ఎందుకొస్తోంది?

వివాహేతర  సంబంధం నేరమా?
సుప్రీంకోర్టు 2018లోనే ఐ.పి.సి. 497 సెక్షన్ ను కొట్టేసింది. అంటే వివాహేతర సంబంధం ఇప్పుడు ‘నేరం’ కాదు. ‘సివిల్‌ తప్పిదం’ మాత్రమే. భార్య, భర్త విడాకులకు దీన్ని కారణంగా చూపొచ్చు, కానీ శిక్ష ఉండదు. సమస్య ఇక్కడే మొదలవుతోంది. ‘చట్టం నన్నేమీ చేయదు’ అనే ధీమా ఒకవైపు, ‘నా పరువు పోయింది’ అనే కక్ష మరోవైపు ఈ రెండూ వివాహబంధాన్ని అడకత్తెరలో పెట్టాయి. విడిపోవాలనుకుంటే విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ వీటన్నింటికీ ఫ్యామిలీ కోర్టులున్నాయి. కానీ కోపం, పరువు, పగ ముందు బుర్ర ఇంకా చిన్నదై నేరాన్ని ప్రేరేపిస్తోంది.

మూడో వ్యక్తి మాత్రమే కారణమా?
వైవాహిక బంధాల్లో హత్యలకు ‘మూడో వ్యక్తి’ మాత్రమే కారణమై ఉండదు. వెతికి చూడాలే కాని, మూలాలు కనిపిస్తాయి.
ఎ) సంభాషణ కరువు: మొబైల్‌ లో ఆరు గంటలు మాట్లాడే భార్యాభర్తలు ముఖాముఖి ఆరు నిమిషాలు మాట్లాడరు. దాంతో అపార్థాలు పేరుకుపోయి అగాధంగా మారుతున్నాయి. 
ఆ) ఆర్థిక అసమానతలు భార్య ఎక్కువ సంపాదిస్తున్నా, భర్త నిరుద్యోగిగా ఉన్నా ‘ఈగో’ దెబ్బ తిని బయట వ్యక్తి వైపు ఆకర్షణ పెరుగుతోంది. 
ఇ) సోషల్‌ మీడియా వల: రీల్స్‌లో కనిపించే ‘పర్ఫెక్ట్‌ కపుల్‌’ని చూసి, తమ బంధా న్ని చిన్నచూపు చూస్తున్నారు. కొత్త పరిచయాలు ఒక్క క్లిక్‌ దూరంలో దొరుకుతున్నాయి. 
ఈ) పరువు భయం: ‘విడాకులు తీసుకుంటే ఊరేమంటుందో’ అనే భయం, ‘చంపేస్తే పోలీసులే కదా’ అనే తెగింపుగా మారుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన.

నేరమే శరణ్యమా? 
కానే కాదు. కోపంలో, ఆవేశంలో, కళ్లు కానరాని మోహంలో తీసుకునే నిర్ణయం జీవితాంతం జైలుగోడల మధ్య కుళ్లబెడుతుంది. దానికి బదులుగా మ్యూచువల్‌ కన్సెంట్‌తో ఆరునెలల్లో విడిపోవచ్చు. మోసం చేసిన భాగస్వామి నుంచి భరణం, పిల్లల బాధ్యత, ఆస్తిలో వాటా కోరే హక్కు చట్టం కల్పించింది. మానసిక, శారీరక హింస ఉంటే వెంటనే ప్రొటెక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకోవచ్చు. ప్రతి జిల్లా కోర్టులో ఉచిత కౌన్సెలింగ్‌ సెంటర్లు ఉన్నాయి. ఒకసారి మాట్లాడితే 70 శాతం కేసులు కోర్టు దాకా రావు.

సమాజం ఏం చేయాలి?
ఇది కేవలం పోలీసు, కోర్టుల సమస్య కాదు. మనందరి సమస్య. అందువల్ల సమాజం మొత్తం కొన్ని మెరుగుదలలను చేసుకోవాలి. ∙పెళ్లికి ముందు కౌన్సెలింగ్‌ను తప్పనిసరి చేయాలి. పెళ్లి తర్వాత ‘సర్దుకుపో’ అని కాకుండా ‘మాట్లాడుకోండి’ అని నేర్పాలి ∙9వ తరగతి నుంచే ‘రిలేషన్ షిప్‌ ఎథిక్స్‌’, ‘లీగల్‌ లెసన్స్‌’ పాఠ్యాంశంగా పెట్టాలి ∙మీడియా సంచలనం కోసం ఇలాంటి హత్య వివరాలు రాయడం కంటే ‘హెల్ప్‌లైన్‌ నంబర్లు’, ‘ఉచిత న్యాయ సలహా’ నంబర్లు ప్రమోట్‌ చేయాలి ∙ప్రభుత్వం ప్రతి మండలంలో ‘కుటుంబ పరిష్కార కేంద్రం’ పెట్టి లాయర్, సైకాలజిస్ట్, పోలీస్‌ ఒకే దగ్గర అందుబాటులో ఉంచాలి.

బంధం నచ్చకపోతే. .. దంపతులు నేరస్తులుగా మారితే రేపు పిల్లలు జైల్లో ఉన్న తల్లిదండ్రులను సిగ్గుతో తలుచుకోవాలి.  విడిపోవడానికి చట్టపరమైన దారి ఉందనీ, చంపితే కోర్టు ఉరిశిక్ష వేస్తుందనీ మర్చిపోవద్దు. బంధం నచ్చకపోతే తెంచుకోవాలి. హింసను ఆశ్రయించరాదు. ఎందుకంటే మోహం క్షణికం, శిక్ష జీవితకాలం. 

కుటుంబ న్యాయవ్యవస్థ ఉండాలి
వివాహేతర సంబంధాలలో జరిగే నేరాలకు ప్రధాన కారణాలు ఆవేశం, సామాజిక అపకీర్తి భయం, ఆర్థిక వివాదాలు... మన దేశంలో విడాకుల కేసులలో జరిగే ఆలస్యం, భావోద్వేగ నియంత్రణ లోపం, వివాహంపై ఉన్న సామాజిక ఒత్తిడి... ఇవన్నీ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. నివారణకు వేగవంతమైన కుటుంబ న్యాయవ్యవస్థ, కౌన్సెలింగ్, చట్టపరమైన అవగాహన, మానసిక స్థైర్యం కలిగించటం ఎంత అవసరమో ముందస్తు ప్రణాళికతో చేసే హత్యలకు త్వరితగతిన కఠిన శిక్షలు అంతే అవసరం. విఫలమైన వివాహాన్ని అవమానంగా కాకుండా చట్టబద్ధంగా విడిపోవడాన్ని సమాజం సహజం గా అంగీకరించాలి. అలా చేస్తే చంపడం కంటే చట్టపరంగా విడిపోవటం సులభమని గ్రహిస్తారు.
– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది

ఆలోచనల్లో వైపరీత్యం వస్తుంది
వైవాహిక బంధాలలో పరస్పర గౌరవం, కమ్యూనికేషన్‌ లోపించినప్పుడు వ్యక్తులు ఎమోషనల్‌ సపోర్ట్‌ కోసం బయట వెతుకుతుంటారు. బంధంలోకి వెళతారు. అయితే ఆ వైవాహికేతర బంధం బయటపడుతుందనే తీవ్రమైన భయం, పరువు పోతుందనే ఆందోళన వారిలో తీవ్ర ఒత్తిడిని, క్యాట్‌ అండ్‌ మౌస్‌ మానసిక స్థితిని కలగజేస్తాయి. ముఖ్యంగా ఆలోచనా వైకల్యం చోటు చేసుకుంటుంది. తమ బంధానికి అడ్డుగా ఉన్న వ్యక్తిని తొలగిస్తేనే తాము ప్రశాంతంగా జీవించగలమనే ఒక భ్రమ లేదా విపరీతమైన ఆలోచన మెదడులో స్థిరపడిపోతుంది. నేరం చేసిన తర్వాత దొరకకుండా తప్పించుకోవచ్చనే అతి నమ్మకం కూడా ఇందుకు కారణం. ఇవి తీవ్రమైన మానసిక ఆరోగ్య సంక్షోభానికి సంకేతాలు. కుటుంబ వ్యవస్థలో కౌన్సిలింగ్, ఎమోషనల్‌ కంట్రోల్‌పై అవగాహన పెంచడం తక్షణ అవసరం.    
– విశేష్, సైకాలజిస్ట్‌

పంచుకునేవారు లేకపోవడం వల్లే...
వివాహేతర సంబంధాలను వయసుల వారీగా చూద్దాం... 25 నుంచి 35 సంవత్సరాల వయసువారు నచ్చకపోతే విడాకులకు వెళ్లిపోతున్నారు. అదే 35–45 మధ్యలో ఉన్నవారిలో పిల్లల బాధ్యతలు, ఖర్చులు ఎక్కువ కావడం వల్ల భర్త సంపాదనలో కూరుకుపోయి భార్యకు టైమ్‌ ఇవ్వలేడు. దాంతో గృహిణి మనసులో శూన్యం ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరికి ఎవరైనా బయటి వ్యక్తి పరిచయం అవడం, పొగడటం, మానసికంగా దగ్గరవడంతో అటువైపు అట్రాక్ట్‌ అవుతారు. ఇలాంటి కేసుల్లో  కలిసి బతకాలనే ఆలోచనతో అడ్డుగా ఉన్నవారిని తొలగించుకోవాలనుకుంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఆనందించాల్సిన విషయాలకు సరైన ప్రాధాన్యత కల్పిస్తే వివాహేతర సంబంధాలు అనే సమస్య ఉండదు. 
– డా.సునీతా ప్రసాద్, సైకాలజిస్ట్‌

 – కె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement