డ్రగ్స్ కలకలంపై మహీంద్రా వర్సిటీ వీసీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లి మహీంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. వర్సిటీ విద్యార్థుల నుంచి కిలోకిపైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు స్టూడెంట్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ పరిణామంపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. యజులు మెదురి తాజాగా స్పందించారు.మహేంద్రా యూనివర్సిటీలో క్రమశిక్షణ, నిజాయితీ, చట్టాలను గౌరవించే విధంగా అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామని తెలిపారాయన. ఇటీవల నగరవ్యాప్తంగా జరుగుతున్న మత్తు పదార్థాలకు సంబంధించిన దర్యాప్తులో కొంతమంది విద్యార్థుల పేర్లు రావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. ‘‘మత్తు పదార్థాల వినియోగం, పంపిణీ చేయడాన్ని ఖండిస్తున్నాం. మహీంద్రా యూనివర్సిటీలో చట్టాన్ని ఉల్లంఘించే లేదంటే విద్యార్థుల శ్రేయస్సును హానిచేసే ఏ చర్యలనైనా ఉపేక్షించేది లేదు. .. నియమాలను ఉల్లంఘించిన వారు దోషులుగా తేలితే, విశ్వవిద్యాలయ నిబంధనలు, చట్టప్రకారం కఠినమైన శిక్షలు తప్పవు’’ అని హెచ్చరించారు. ఈ క్రమంలో 50 మందిని పోలీసులు విచారించారన్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. డ్రగ్స్ ఆరోపణలతో 50 మంది విద్యార్థులను పోలీసులు ప్రశ్నించిన మాట వాస్తవమేనని, అందులో ఏడుగురు మాత్రమే మహీంద్రా వర్సిటీకి చెందిన వాళ్లు ఉన్నారని స్పష్టత ఇచ్చారాయన. ప్రతి విద్యార్థి అభివృద్ధి చెందేలా సురక్షితమైన, నిబద్ధతతో కూడిన క్యాంపస్ వాతావరణాన్ని కొనసాగించేందుకు మహీంద్రా యూనివర్సిటీ తరఫున మేము కృషి చేస్తున్నాం. ఒక ఉన్నత విద్యాసంస్థగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధానాలు, కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తాం. విద్యార్థులు బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకుని, మహేంద్రా యూనివర్సిటీ విలువలను కాపాడాలి అని విజ్ఞప్తి చేశారాయన.